విద్యార్థుల ఆందోళన.. ఆస్తుల ధ్వంసం
గ్యాంగ్‌రేప్ జరిగిందంటూ వదంతులు.. ఫిర్యాదు రాలేదన్న పోలీసులు
ఫగ్వారా : పంజాబ్‌లోని లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ (ఎల్‌పీయూ)లో శనివారం రాత్రి తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఓ విద్యార్థినిపై సామూహిక అత్యాచారం జరిగిందని, ఆమె ఆత్మహత్య చేసుకుందని సామాజిక మాధ్యమాల్లో ప్రచారం కావడంతో సుమారు 2 వేల మంది విద్యార్థులు ఆందోళనకు దిగారు. గర్ల్స్ హాస్టల్ వద్ద ప్రారంభమైన నిరసన తీవ్రరూపం దాల్చడంతో యూనివర్సిటీ ఆస్తులను ధ్వంసం చేశారు. కొన్ని భవనాల వద్ద నిప్పు పెట్టారు. హైవేను దిగ్బంధించడంతో కొంతసేపు రాకపోకలు నిలిచిపోయాయి.
అత్యాచారంపై ఫిర్యాదు లేదు:ఎస్‌ఎస్పీ గౌరవ్ తూరా
క్యాంపస్‌లోని వ్యవసాయ విభాగం సమీపంలో నాలుగైదు రోజుల క్రితం ఓ మహిళ ఆత్మహత్య చేసుకున్నట్లు తమకు సమాచారం ఉందని కపుర్తలా ఎస్‌ఎస్పీ గౌరవ్ తూరా తెలిపారు. అయితే ఆమె మృతికి అత్యాచార ఆరోపణలకు సంబంధం ఉన్నట్లు ఎలాంటి ఫిర్యాదు అందలేదన్నారు. అత్యాచారం జరిగిందన్న వాదనలకు ఇప్పటివరకు ఆధారాలు లభించలేదని స్పష్టం చేశారు.

వదంతులు నమ్మొద్దు : ఎల్‌పీయూ రిజిస్ట్రార్ డాక్టర్ మోనికా గులాటీ
యూనివర్సిటీలో అత్యాచారం జరిగిందన్న ప్రచారాన్ని ఎల్‌పీయూ రిజిస్ట్రార్ డాక్టర్ మోనికా గులాటీ ఖండించారు. సామాజిక మాధ్యమాల్లో తప్పుడు, నిరాధార సమాచారాన్ని వ్యాప్తి చేస్తున్నారని తెలిపారు. విద్యార్థులు, తల్లిదండ్రులు వదంతులను నమ్మకుండా అధికారిక సమాచారాన్ని మాత్రమే అనుసరించాలని కోరారు. పోలీసులు రంగంలోకి దిగి ఆందోళనను అదుపులోకి తెచ్చారు. హైవేపై రాకపోకలను పునరుద్ధరించారు. విద్యార్థులు, యూనివర్సిటీ యాజమాన్యం మధ్య చర్చలు కొనసాగుతున్నాయి.







కామెంట్‌లు (0)