సంజ్ఞ లేదా సంకేత భాష చెవిటి వారికి చదువు నేర్చుకోవడానికి, సమాచార వితరణకు, అభిప్రాయాలను వ్యక్తం చేయడానికి, ప్రత్యేకతను చాటుకోవడానికి, సమ్మిళిత అభివృద్ధికి మహా వరంగా మారింది. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 300 వరకు “సంజ్ఞ భాషలు” ఉన్నాయి. వీటికి ప్రత్యేక పదకోశం, విలక్షణ వ్యాకరణం ఉంటాయి. సంజ్ఞ భాష వ్యక్తీకరణకు ముఖ కవళికలు, బాడీ లాంగ్వేజ్‌లు ప్రధానమైనవి. వీటిని నేర్చుకోవడం ద్వారా వినికిడి లోపం వున్న వారి సమస్యలు అర్థం చేసుకోవడంతో పాటు వారి పట్ల సహానుభూతి పెరుగుతుంది. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 7.2 కోట్ల మంది చెవిటి వారున్నారు. సహజ సిద్ధమైన సంజ్ఞ భాషల పట్ల సాధారణ ప్రజల్లో అవగాహన చాలా తక్కువగా కనిపిస్తుంది. ప్రజలతో మమేకం కావడం, ప్రయాణాలు చేయడం, విద్యాభ్యాసం, కమ్యూనికేషన్ చేయడం, సమావేశాలకు హాజరు కావడం లాంటి సందర్భాలలో చెవిటి వారు సంకేత భాష ఉపయోగిస్తారు. వీరు తోటి సమాజంతో మమేకం కావడానికి సంజ్ఞ భాష ఓ అద్భుత వరంగా మారింది. వినికిడిలోపం కలిగిన యువతకు సంజ్ఞ భాష ప్రాధాన్యతను వివరిస్తూ, వారికి ఈ భాషను నేర్పాలి. అంతర్జాతీయ సంజ్ఞ భాషల దినం-2026 ఇతివృత్తంగా “వినికిడి లోపంగల వారి మానవ హక్కులను పరిరక్షిద్దాం” అనే అంశాన్ని ప్రచారం చేస్తున్నారు. ఈ వేదికల్లో అవగాహన కల్పించడం, నిపుణుల ప్రసంగాలు ఏర్పాటు చేయడం, సంజ్ఞ భాష గురించి తెలుసుకోవడం, సైన్ లాంగ్వేజ్ క్లబ్బులు ఏర్పాటు చేయడం లాంటివి నిర్వహిస్తారు. అన్ని అవయవాలు చక్కగా ఉన్నవారందరం సంజ్ఞ భాషలోని మౌలిక అంశాలను నేర్చుకొని, వారితో సరదాగా మాట్లాడదాం. మీకు తోడుగా మేమున్నామన్న ధైర్యాన్ని అందిద్దాం.
(23 సెప్టెంబర్ అంతర్జాతీయ సంజ్ఞ భాషల దినోత్సవం)
- డా. బి.ఎం. రెడ్డి,
సెల్: 9949700037







కామెంట్‌లు (0)