బుధవారం, 23 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Edition‘ఫ్రీహోల్డ్‌’ నిషేధం ఎత్తివేత ఎవరి ప్రయోజనాల కోసం?

45 నిమిషాల క్రితం

f 1.jpg
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 23, 2026, 05:33 పూర్వాహ్నం | 5 నిమిషాల చదవడం

చట్టబద్ధంగా అమ్మకాలు, కొనుగోళ్లు చేయడానికి హక్కులు లేని నిషేధిత భూములకు, జిరాయతీ (ప్రైవేట్‌) భూములతో సమానంగా భూ యజమానికి అన్ని హక్కులు కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జీవో ఎం.ఎస్‌.నెంబర్‌ 588 విడుదల చేసింది. ఫ్రీహోల్డ్‌ నిషేధం ఎత్తివేసిన భూములపై ఇక నుండి ప్రభుత్వానికి ఎటువంటి హక్కు లేదు. ఆ భూములను ప్రైవేటు భూములుగానే పరిగణిస్తారు. గతంలో లాగా ఇది ప్రభుత్వం ఇచ్చిన (అసైన్మెంట్‌) భూమి కాబట్టి అమ్మ రాదు, వేరొకరు కొనరాదనడానికి వీలు లేదు. 20 ఏళ్ల తర్వాత ప్రైవేట్‌ భూముల లాగే చట్టరీత్యా రిజిస్ట్రేషన్లు కూడా జరుగుతాయి.

విభజిత ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ లెక్కల ఆధారంగా సుమారు 26 లక్షల మంది పేదలకు 31 లక్షల 50 వేల ఎకరాలకు పైగా భూములు అసైన్‌ చేసినట్లు వివిధ సందర్భాల్లో ప్రభుత్వాలు ప్రకటించాయి. ప్రస్తుతం 14 భాగాలుగా 14,36,660 లక్షల ఎకరాల భూములను గుర్తించి ఇందులో 9,08,472 లక్షల ఎకరాలను ఫ్రీహోల్డ్‌ నిషేధం ఎత్తివేస్తూ జీవో ఇచ్చింది. మిగిలిన 5,28,188 లక్షల ఎకరాలను వివిధ కారణాలతో నిషేధంలోనే ఉంచింది.

ఫ్రీహోల్డ్‌ నిషేధం నుండి ఎత్తివేసిన భూములలో సింహభాగం అసైన్డ్‌ భూములే ఉన్నాయి. ఇందులో పొరపాటున నిషేధిత జాబితాలో ఉన్న జిరాయితీ భూములు కూడా ఉన్నాయి. అయితే అవి కేవలం 5,422 ఎకరాలు మాత్రమేనని ప్రభుత్వం ఇచ్చిన జీవోలో తెలిపింది.

ఫ్రీహోల్డ్‌ నిషేధం అంటే...?

స్వాతంత్య్రం తర్వాత వామపక్ష పార్టీలు, ప్రజా ఉద్యమాల ఫలితంగా... ప్రభుత్వాలు భూమి లేని పేదలకు విభజిత ఆంధ్రప్రదేశ్‌లో సుమారు 31 లక్షల 50 వేల ఎకరాలు ఇచ్చినట్లు... ప్రభుత్వ లెక్కలు తెలియజేస్తున్నాయి. ప్రభుత్వం ఇచ్చిన అసైన్డ్‌ భూములు తరతరాలుగా అనుభవించాలి తప్ప చట్టబద్ధంగా ఎటువంటి అమ్మకాలు కొనుగోళ్లు చేయడానికి వీలు లేదని 1977లో భూ బదలాయింపు నిషేధం విధిస్తూ రాష్ట్ర ప్రభుత్వం 9/77 అసైన్డ్‌ చట్టం చేసింది. దీనినే పి.ఓ.టి యాక్ట్‌ అని కూడా అంటారు. గత వై.సి.పి ప్రభుత్వం 2023లో ఈ అసైన్డ్‌ చట్టాన్ని సవరిస్తూ అసైన్డ్‌ భూములు పొందిన పేదలు 20 సంవత్సరాలు దాటిన తర్వాత పట్టా భూములతో సమానంగా అమ్మకాలు కొనుగోళ్లు చేసుకోవచ్చని ఆర్డినెన్స్‌ తెచ్చింది. ఆర్డినెన్స్‌ చట్టంగా మార్చి అమలు చేసేలోగా క్రమబద్ధీకరణ ఆగిపోయింది. అయినా తమ హయాంలో 13 లక్షల ఎకరాల అసైన్డ్‌ భూములకు విముక్తి కల్పించి దళితులను, పేదలను కోటీశ్వరులను చేశామని ఆనాడు వైసిపి గొప్పగా చెప్పుకుంది. తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత గత వైసిపి తెచ్చిన ఆర్డినెన్స్‌ ప్రకారంగా ఫ్రీహోల్డ్‌ కల్పించిన భూములలో సుమారుగా 7 లక్షల ఎకరాలకు పైగా వై.సి.పి నాయకులే అక్రమంగా పొందారు. కాబట్టి ఈ భూములను ఎటువంటి అమ్మకాలు, కొనుగోళ్లు చేయరాదంటూ నిషేధం విధించింది. అంతేకాకుండా ఈ భూములపై ప్రజాభిప్రాయం తీసుకోవడానికి, అసైన్డ్‌ భూములను గుర్తించడానికి నెల రోజులు పాటు గ్రామసభలు నిర్వహించింది. కాని అక్రమంగా అసైన్డ్‌ భూములు పొందిన ఒక్కరి పేరు కూడా వెల్లడించలేదు. అనర్హుల నుండి భూమి తీసుకోలేదు. పేదలకు ఒక్క ఎకరం కూడా ఇవ్వలేదు. పైగా ఈ భూములపై రెండు సంవత్సరాలుగా కసరత్తు చేసి మరీ సెప్టెంబర్‌ 15న 588 జీవో విడుదల చేసింది.

మన రాష్ట్రంలో సుమారు 31,50,000 ఎకరాల అసైన్డ్‌ భూములున్నట్లు లెక్కలు చెబుతుంటే కేవలం 14,36,660 ఎకరాలను మాత్రమే ప్రభుత్వం గుర్తించింది. మిగిలిన సుమారు 17 లక్షల ఎకరాల సంగతేంటి? ఆ భూములు ఏమైనట్లు? అభివృద్ధి అనే ముద్దు పేరుతో పెట్టుబడిదారులు కార్పొరేటక్లు కట్ట పెట్టారా? లేదా పట్టణాలకు దగ్గరలో ఉన్న విలువైన భూములను భూ బ్యాంకులలో ఏర్పాటు చేసి దాచి పెట్టారా? లేదా సంపన్నులు, భూస్వాములు పలుకుబడి, కలిగిన రాజకీయ నాయకుల చేతుల్లో ఉన్నాయా? ప్రభుత్వం ఈ భూముల వివరాలు ఎందుకు బహిరంగపర్చలేదు. దీనిపై ప్రతి ఒక్కరికి అనుమానం రాక తప్పదు.

అసైన్డ్‌ భూముల అమ్మకాలు, కొనుగోళ్లు ఎవరికి లాభం?

అసైన్డ్‌ భూములను అమ్మకాలు కొనుగోళ్లు చేసుకోవచ్చన్న ప్రభుత్వ నిర్ణయాన్ని... సిపిఎం మినహా...అన్ని పార్టీలు, సంస్థలు, వ్యక్తులు స్వాగతిస్తున్నారు. కానీ అసైన్డ్‌ చట్టం ఇంత పగడ్బందీగా ఉన్నప్పటికీ మన రాష్ట్రంలో సుమారు 13 లక్షల ఎకరాలకు పైగా... వివిధ రకాల పేర్లతో అధికారం, ధన బలంతో...దళితులు, పేదల నుండి అనర్హుల చేతిల్లోకి వెళ్లాయని కోనేరు రంగారావు భూ కమిటీ, రాష్ట్ర ప్రభుత్వాలే బహిరంగంగా వెల్లడించాయి. ఈ భూములన్నిటిని తిరిగి అర్హులైన పేదలకు ఇవ్వాలని భూకమిటీ, ప్రభుత్వాలు కూడా చెబుతున్నాయి. పేదల భూములకు రక్షణ కవచంగా అసైన్డు చట్టం ఉన్నప్పటికీ దళితులు, పేదల నుండి భూమిని పెత్తందారులు లాగేసుకున్నారు. ఇక ప్రభుత్వమే ఈ భూములు అమ్ముకోవచ్చని చెబితే ఈ రాష్ట్రంలో దళితుల చేతిలో ఒక్క సెంటు భూమి మిగలదు. ఫ్రీహోల్డ్‌ పై ఉన్న నిషేధాన్ని ఎత్తివేయడం వల్ల ఇప్పటికే అక్రమంగా, దౌర్జన్యంగా ఆక్రమించుకున్న పెత్తందారులకు, రాజకీయ నాయకులకు ఉపయోగం తప్ప పేదలకు జరిగే మేలు నామమాత్రమే.

చుక్కల భూములంటే...?

మన రాష్ట్రంలో 1860లో సర్వే సెటిల్మెంట్‌, 1916లో రీసర్వే సెటిల్మెంట్‌ జరిగింది. దీనినే ఆర్‌ఎస్‌ఆర్‌ లేదా రీసెటిల్‌మెంటరీ రిజిస్టర్‌ అంటారు. ఆర్‌.ఎస్‌.ఆర్‌ లో 9‌వ నెంబర్‌ కాలమ్‌లో పట్టాదారు పేరు, 12/13లో లో అనుభవిస్తున్న వారి పేరు రాయాలి. ఇందులో భూ యజమాని అయితే యజమాని పేరు, ప్రభుత్వ భూములు అయితే ప్రభుత్వ భూమని ఉంటుంది. ఇవి రెండూ కాదని తేలితే అనుమానాస్పద భూమని ‌మూడు చుక్కలు పెట్టారు. వీటినే చుక్కల భూములు (డాట్‌ ల్యాండ్‌) అంటారు. వీటిని జిరాయితీ భూమి, అసైన్డ్‌ చేసిన భూమి, ప్రభుత్వం కొన్ని సంస్థలకు లేదా ప్రభుత్వ శాఖలకు ఇచ్చిన భూమి అని 3 రకాలుగా విభజించారు. రిజిస్ట్రేషన్‌ చట్టంలోని సెక్షన్‌ 22 ‘ఎ’ ప్రకారం ఈ చుక్కల భూములను రిజిస్టర్‌ చేయకూడదు. ఈ విషయమై కొంతమంది రైతులు కోర్టుకు కూడా వెళ్లారు. 2014లో చుక్కల భూములపై హైకోర్టు స్పష్టమైన తీర్పు చెప్పింది. చుక్కలు ఉన్నంత మాత్రాన అవి ప్రభుత్వ భూములు కావు. ప్రభుత్వ భూములైతే ప్రభుత్వ భూమి అని రాయకుండా చుక్కలు ఎందుకు పెట్టారని హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. చుక్కల భూముల పరిష్కారానికి ఒక ఉన్నత కమిటీని నియమించి సమస్య పరిష్కరించమని హైకోర్టు ప్రభుత్వానికి సూచించింది. కానీ కమిటీ వేయలేదు. 2017లో చుక్కల భూములను క్రమబద్ధీకరించడానికి 2017లో ఎ.పి డాట్‌ ల్యాండ్‌ యాక్ట్‌ తెచ్చింది. విభజిత ఆంధ్రప్రదేశ్‌లో సుమారు 24 లక్షల ఎకరాల చుక్కల భూములున్నట్లు నాటి టిడిపి ప్రభుత్వ హయాంలో ఉప ముఖ్యమంత్రి, రెవెన్యూ శాఖను నిర్వహిస్తున్న కె.ఇ.కృష్ణమూర్తి వెల్లడించారు. అంతేకాకుండా ఈ భూములను క్రమబద్దీకరించడానికి 2018 జూన్‌ 15 నుండి జులై 30 వరకు గ్రామసభలు నిర్వహించి పది జిల్లాలలో కేవలం 2,55,594 ఎకరాలు గుర్తించినట్లు చెప్పారు. మరి అదే తెలుగుదేశం ప్రభుత్వం వివిధ రకాల భూములు14,36,660 ఎకరాలు నిషేధంలో ఉన్నట్లు ఈమధ్య ప్రకటించింది. వీటితోపాటు రాష్ట్రంలోని 2 లక్షల 75 వేల ఎకరాలు మిగులు భూములను పేదలకు పంచకుండా నేటికీ అక్రమంగా, కోర్టుల ద్వారా భూస్వాములే అనుభవిస్తున్నారు. భూ స్వాముల జోలికి వెళ్ళలేదు. ప్రభుత్వం ఎవరి పక్షమో దీనిని బట్టే విదితమవుతుంది.

అసైన్డ్‌ భూముల బదలాయింపును, అమ్మకాలను నిషేధిస్తూ 1977లో చట్టం చేశారు. 2023లో వైసిపి ప్రభుత్వ హయాంలో ఇళ్ళ స్థలాలు 10 సంవత్సరాల తర్వాత సాగు భూములు 20 సంవత్సరాల తర్వాత అమ్ముకోవచ్చని సవరణ చేశారు. సెప్టెంబర్‌ 15, 2025న కూటమి ప్రభుత్వం జివో నెంబర్‌ 588 ద్వారా 2023లో చేసిన చట్ట సవరణకు అనుగుణంగా ఆదేశాలు జారీ చేసింది. 1923లో జారీ చేసిన జీవో నెంబర్‌ 596కు ఇది కొనసాగింపు.

అసైన్డ్‌ చట్టం సవరించిన వెంటనే పేదల చేతుల్లో ఉన్న అసైన్డ్‌ భూములను సైతం ఆన్‌లైన్‌లో హక్కుదారులను తొలగించి చుక్కలు పెట్టి నిషేధిత జాబితాలో ఉంచినట్లు అనేక చోట్ల పేదలు గగ్గోలు పెట్టారు. దీనిని రాష్ట్ర ప్రభుత్వం కూడా గుర్తించి 596 జీవోలో తహసీల్దారులను హెచ్చరిస్తూ వెంటనే నిషేధిత జాబితా నుండి తీసేసి నిజమైన పేదల పేర్లు చేర్చమని ఆదేశించింది. అయినా రాష్ట్రంలో నేటికీ చుక్కల భూముల సమస్య పూర్తిగా పరిష్కారం కాలేదు. 7,85,500 ఎకరాల భూమికి చుక్కలు తీసేసి ఫ్రీహోల్డ్‌ చేస్తూ ఇప్పుడు జీవో ఇచ్చింది.

రాష్ట్ర ప్రభుత్వం అసైన్డ్‌ చట్టాన్ని సవరించి ఫ్రీహోల్డ్‌ చేయడం ద్వారా పేదలకు జరిగే లాభం కంటే అనర్హులకు జరిగే లాభమే ఎక్కువ. ఎందుకంటే ఇప్పటికే రాష్ట్రంలో లక్షలాది ఎకరాలు పేదల చేతుల్లో నుండి అనర్హుల చేతిలోకి వెళ్ళాయి. అనేక రకాలుగా పెద్దలు రెగ్యులర్‌ చేసుకున్నప్పటికీ నేటికీ 2,87,153 లక్షల ఎకరాలు రెగ్యులర్‌ చేయకుండా ఆపేశారు. తెలుగు దేశం, వైసిపి నాయకులు పరస్పర దూషణలు చేసుకుంటున్నా ఒక్క అనర్హుడి పేరు కూడా బయటికి పెట్టలేదు, అంటే వీరిద్దరి మధ్య భూస్వాముల పట్ల, అక్రమంగా పొందిన పెత్తందారుల పట్ల ఉన్న ప్రేమ అర్థమవుతుంది.

లక్షల కుటుంబాలతో ముడిపడి ఉన్న సమస్యకు సంబంధించి నిర్ణయాలు చేసేటప్పుడు రాష్ట్ర ప్రభుత్వం వివిధ రాజకీయ పార్టీలు, రైతు, వ్యవసాయ కార్మిక సంఘాల, అసైన్డ్‌ కమిటీల అభిప్రాయం తీసుకోవాలి. ఐదెకరాల లోపు భూములున్న రైతులకు ప్రభుత్వం ఫ్రీహోల్డ్‌ కల్పించాలి. అసైన్డ్‌ భూమి కోల్పోయిన ప్రతి పేదవాడికి భూమి తిరిగి దక్కేలా చూడాలి. అన్ని హక్కులు వున్న జిరాయితీ భూములుగల సన్న, చిన్నకారు రైతుల ఇబ్బందులను పరిష్కరించాలి. ​

v venkatewarlu.jpg

వ్యాసకర్త : వి. వెంకటేశ్వర్లు

వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శి
సెల్‌‌: 9490098980 )


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్