బుధవారం, 23 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionప్రతీకార హత్యలు పరిష్కారం కాదు

50 నిమిషాల క్రితం

ప్రతీకారం.jpg
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 23, 2026, 05:25 పూర్వాహ్నం | 2 నిమిషాల చదవడం

నిజామాబాద్‌లో యూట్యూబర్‌ వైష్ణవిని ఆమె భర్త హరిబాబు హత్య చేయడం, ఆ తర్వాత వైష్ణవి సోదరుడు సంతోష్‌ బెయిల్‌పై వచ్చిన హరిబాబును హత్య చేయడం మీడియాలో సంచలనం కలిగించింది. ఇలా ప్రతీకారం తీర్చుకోవటాన్ని ఒక గొప్ప విషయంగా ఆ కుటుంబంలోని సభ్యులు మీడియా ముందు మాట్లాడుతున్నారు. తమకు అందరి సపోర్టు కావాలని కోరుతున్నారు. చట్టాల గురించి, వ్యవస్థల పనితీరు గురించి సరైన అవగాహన లేకపోవటం వల్లనే వారలా మాట్లాడుతున్నారని పలువురు న్యాయ నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు.

2026 మార్చిలో నాలుగు నెలల గర్భవతి అయిన వైష్ణవిని ఆమె భర్త హరిబాబు కత్తితో పొడిచి చంపాడని ఆరోపణలు వచ్చాయి. కట్నం కోసం హత్య చేశాడని వైష్ణవి కుటుంబ సభ్యులు తమ ఫిర్యాదులో పేర్కొన్నారు. పోలీసులు హరిబాబు, అతని తల్లి, ఇద్దరు సోదరులను అరెస్టు చేశారు. నిందితుడు జులైలో బెయిల్‌పై విడుదలయ్యాడు. సెప్టెంబర్‌ 17న నిజామాబాద్‌ రాజరాజేంద్ర చౌరస్తాలో మొక్కజొన్న కండెలు అమ్ముకుంటున్న హరిబాబుపై కారులో వచ్చిన దుండగులు కత్తులతో దాడి చేసి చంపారు. కొద్ది గంటల్లోనే వైష్ణవి సోదరుడు సంతోష్‌ సెల్ఫీ వీడియో విడుదల చేసి, తానే హరిబాబును చంపానని, చెల్లికి ప్రభుత్వం న్యాయం చేయకపోవడంతోనే ఈ నిర్ణయం తీసుకున్నానని ప్రకటించాడు.

సంతోష్‌ మాటల్లో న్యాయవ్యవస్థపై ఉన్న అసంతృప్తి స్పష్టంగా కనిపిస్తోంది. అరెస్టయిన నాలుగు నెలల్లోనే హరిబాబు బెయిల్‌పై బయటకు రావడం కుటుంబంలో న్యాయం దూరమవుతోందన్న భావనను పెంచి ఉండవచ్చు. మన దేశంలో నేరాలకు సంబంధించిన కేసులు దీర్ఘకాలం పెండింగ్‌లో ఉండటం కొత్త విషయం కాదు. అయితే న్యాయం ఆలస్యమవుతున్నదన్న భావన, నిందితుడు బయట తిరుగుతున్నాడన్న బాధ కలిసినప్పుడు బాధిత కుటుంబాల్లో చట్టంపై నమ్మకం దెబ్బతినే అవకాశం ఉంది. ఆ నేపథ్యంలోనే వ్యక్తిగత ప్రతీకారానికి సమర్థన వెతుక్కునే పరిస్థితి ఏర్పడుతుంది. సోషల్‌ మీడియాలో సంతోష్‌కు మద్దతుగా స్పందనలు రావడం ఈ సమస్యను మరింతగా ఎత్తి చూపుతోంది. ఒక నేరానికి మరో నేరంతో బదులు తీర్చుకోవడాన్ని సమర్థించే భావన సాధారణమైతే, చట్టబద్ధమైన న్యాయ ప్రక్రియకు బదులుగా వ్యక్తిగత తీర్పులకు సమాజం అలవాటు పడే ప్రమాదం ఉంది.

స్త్రీని కుటుంబంలో సమాన హక్కులు కలిగిన వ్యక్తిగా కాకుండా భర్త లేదా కుటుంబానికి చెందిన వ్యక్తిగా చూసే ధోరణి కొనసాగినంతకాలం గృహహింస రూపాలు మారినా సమస్య కొనసాగుతూనే ఉంటుంది. దీని మూలాలను గుర్తించి నివారణపై దృష్టి పెట్టాలి. ఇలాంటి ఘటనల్లో కేసుల విచారణను వేగవంతం చేయాలి. ప్రత్యేక మహిళా కోర్టులు, ఫాస్ట్‌ట్రాక్‌ విచారణ, సాక్షుల రక్షణ వంటి చర్యలు కేవలం ప్రకటనలుగా కాకుండా ఆచరణలో కనిపించాలి. బాధితులకు న్యాయం జరుగుతోందన్న నమ్మకం కనిపించకపోతే న్యాయ ప్రక్రియపై విశ్వాసం నిలవడం కష్టం. అలా అని సినిమాల తరహా పరిష్కారాలు, ప్రతీకారాలు సమస్యలను మరింత పెంచుతాయన్న వాస్తవిక అవగాహన ప్రజల్లో పెరగాలి. సోషల్‌ మీడియాలో లభించే బాధ్యతారహితమైన మద్దతు ఆచరణాత్మకంగా తోడుగా నిలబడదు. ప్రతీకార హత్య కూడా నేరమే కాబట్టి హరిబాబులాగానే సంతోష్‌ కూడా చట్టరీత్యా శిక్షార్హుడే అవుతాడు, అతడి కుటుంబం కూడా పరోక్షంగా ఏళ్ల తరబడి ఆ భారం, వేదన భరించాల్సి ఉంటుంది. న్యాయం ఆలస్యంపై ఆవేదన ఉండొచ్చు. కానీ ఆ ఆవేదన హత్యకు న్యాయబద్ధత ఇవ్వదు. న్యాయవ్యవస్థపై నమ్మకం కోల్పోయే పరిస్థితి రాకుండా కేసులు త్వరగా, పారదర్శకంగా పరిష్కరించడమే అసలు పరిష్కారం.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్