గురువారం, 24 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Edition‘గ్రాసం’ కూడా కరువే!

1 రోజు క్రితం

goats.jpg
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 23, 2026, 05:15 పూర్వాహ్నం | 3 నిమిషాల చదవడం

రాష్ట్రంలో గత రెండు దశాబ్దాలుగా ఏనాడూ లేనంత తీవ్రమైన కరువు నెలకొన్నది. డెల్టా సహా రాష్ట్రం మొత్తం కరువు కోరల్లో చిక్కుకున్నది. ఈ ఏడాది ఎల్-నినో కారణంగా తీవ్రమైన వర్షాభావం ఏర్పడవచ్చని వాతావరణ నిపుణులు హెచ్చరించినా దీనిని ఎదుర్కోవడానికి ముందస్తు చర్యలు తీసుకోవడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా విఫలమయ్యాయి. రాష్ట్రంలో రాయలసీమ, ఉమ్మడి ప్రకాశం జిల్లాలలో గొర్రెలు, మేకలు, పశువులకు మేత లేదు. నీళ్లు లేవు. కరువు రాయలసీమ రైతు బతుకును వెక్కిరిస్తున్నది. పొలంలో పంట లేదు. చేతిలో డబ్బు లేదు. ఏళ్ల తరబడి కుటుంబ సభ్యుల్లా భావించి సాకిన గొర్రెలు, మేకలు, పశువులు కళ్ళ ముందే ఇతరులకు అమ్ముకోవాల్సిన దుస్థితి ఏర్పడింది. తమ జీవనాధారమైన జీవాలు తరలిపోతుంటే కన్నీరే దిక్కైంది.

గత మూడు నెలలుగా చినుకు జాడ లేదు. సాధారణ వర్షపాతంలో 30 శాతం కూడా నమోదుగాక పచ్చి మేత లేకుండా పోయింది. ఎండు గడ్డి కూడా దొరకని పరిస్థితి నెలకొన్నది. దీంతో కర్నూలు, అనంతపురం, చిత్తూరు, మార్కాపురం ప్రాంతాల్లోని సంతలకు తమ గొర్రెలు, మేకలు, పశువులను పెద్ద సంఖ్యలో తరలిస్తున్నామని గొర్రెలు మేకల పెంపకందారులు, రైతులు చెబుతున్నారు. వారి ఆవేదనకు సంతలలో జరుగుతున్న అమ్మకాలు అద్దం పడుతున్నాయి. అమ్ముడైన జీవాలు తెలంగాణ, కర్ణాటక, కేరళ రాష్ట్రాలకు తరలిపోతున్నాయి. కరువు పరిస్థితులను పరిగణలోకి తీసుకొని ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాల్సిన ప్రభుత్వాలు ఆ దిశగా ఎటువంటి చర్యలూ తీసుకోలేదు.

సంతలకు, కబేళాలకు మూగజీవాలు

రాయలసీమ, ఉమ్మడి ప్రకాశం జిల్లాలు పంటల సాగుకు నోచుకోలేదు. అరకొర వర్షాలతో కొన్ని చోట్ల మొక్కుబడిగా పంటలు సాగు చేసినా 40 శాతానికి మించి లేదు. కడప, మార్కాపురం లాంటి జిల్లాల్లో 20 శాతం కూడా పంటలు సాగు కాలేదు. కంది, పత్తి, వేరుశనగ, ఆముదం పంటలు నిలువునా ఎండిపోయాయి. కృష్ణా జలాలు వస్తాయని నమ్ముకొని కొంతమేర సాగు చేసిన వరి పంట కూడా ఎండుతున్నది. దీంతో పశువులకు గ్రాసం దొరికే పరిస్థితి లేదు. లక్షలాది పశువులు, కోట్లాది గొర్రెలు మేకల వంటి మూగజీవాలు గ్రాసం కోసం అల్లాడిపోతున్నాయి. పశువుకి రోజుకు 5 కిలోల ఎండుగడ్డి లేదా 15 కిలోల పచ్చిగడ్డి, జీవాలకు 5 నుండి 10 కేజీల పచ్చి గడ్డి అవసరం అవుతుంది. వర్షాభావ పరిస్థితుల్లో ఆ స్థాయిలో గ్రాసం అందుబాటులో లేదు. దీంతో గొర్రెల కాపర్లు, రైతులు తమ జీవాలను సంతలకు తెచ్చి తెగనమ్ముకుంటున్నారు. తక్కువ ధరలకే విక్రయించి నష్టపోతున్నారు. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు, పత్తికొండ...అనంతపురం జిల్లా కదిరి, గోరంట్ల ఇతర ప్రాంతాల్లోని సంతలకు పశువులు వేలాదిగా తరలివస్తున్నాయి. రెండు నెలలుగా పశువులు, జీవాల విక్రయాలు పెరిగాయని సంతల నిర్వాహకులు చెబుతున్నారు. కొన్ని పశువులను ఇతర రాష్ట్రాల కబేళాలకు ఎగుమతి చేస్తున్నారు. ​

అన్ని వైపులా కరువే... ​

కరువు తీవ్రతతో కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు, ఆలూరు, ఆదోని, మంత్రాలయం ప్రాంతాల నుండి నిత్యం పశువులు, జీవాలు తరలిపోతున్నాయి. నంద్యాల జిల్లాలో వరి సాగు లేకపోవడంతో గ్రాసం దొరికే పరిస్థితులు లేక రైతులు పశువులను విక్రయిస్తున్నారు. అనంతపురం జిల్లాలోనూ తీవ్రమైన కరువు పరిస్థితులు నెలకొని ఉన్నాయి. వేరుశనగ, కంది పంటలు ఎండిపోయాయి. బోర్ల కింద సాగుచేసిన వరి పంట ఎండిపోవడంతో లక్షలాది పశువులకు గ్రాసం దొరక్క సంతలకు తీసుకెళ్లి విక్రయిస్తున్నారు. ఉమ్మడి చిత్తూరు, ప్రకాశం జిల్లాల లోనూ ఇదే పరిస్థితి. మార్కాపురం జిల్లా పూర్తిగా కరువు బారినపడి పంటల సాగు లేకుండా పోయింది. బంగాళాఖాతంలో ఏర్పడిన తుఫాను ప్రభావంతో రాయలసీమ జిల్లాల్లో ఆదివారం గాలివాన సృష్టించిన బీభత్సం వలన ఎక్కువ నష్టమే జరిగింది.

ఆదుకోవాల్సిన ప్రభుత్వం చేస్తున్నదేమిటి?​

పశు సంపదలో, గొర్రెల మేకల పెంపకంలో మన రాష్ట్రం దేశంలోనే అగ్రభాగాన ఉన్నది. మాంసం ఎగుమతులలో కూడా ప్రధాన భూమిక పోషిస్తున్నది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ఎగుమతుల ద్వారా ఎంతో ఆదాయాన్ని సమకూరుస్తున్నది. గొర్రెల పెంపకందారులకు రైతులకు స్వయం పోషకంగా ఉంటుంది. అంతటి ప్రాధాన్యత కలిగిన జీవాలను రక్షించుకోవడానికి ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తున్నది. పైకి మాత్రం అన్నీ చేసేస్తున్నట్టు చెప్పుకుంటున్నది. గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు నిరంతర పర్యవేక్షణ చేపట్టాలని జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారులకు సమగ్ర మార్గదర్శకాలు జారీ చేసినట్లు, జిల్లా స్థాయిలో మాగుడు గడ్డి, సంపూర్ణ మిశ్రమ దాణా తయారీ సరఫరాకు పారిశ్రామిక ప్రోత్సాహకాలు అందిస్తున్నట్లు పేర్కొంటున్నదిన్నారు. కానీ కింది స్థాయికి వెళ్లి చూసినప్పుడు ప్రభుత్వ ఆచరణ గడప దాటడం లేదు. తక్షణమే కరువు మండలాలను ప్రకటించి సహాయక చర్యలు చేపట్టాలి. గ్రామ స్థాయి నుండి రాష్ట్ర స్థాయి దాకా తగినన్ని నిధులు కేటాయించాలి. పశువులకు, జీవాలకు ఉచితంగా మేత, దాణా సరఫరా చేయాలి. బీడు, వాగు, కొండ పోరంబోకు భూములలో మేత, నీటి లభ్యతను పెంచాలి. ఫారెస్ట్ భూములలో జీవాలను మేపుకోవడానికి అవకాశాలు కల్పించాలి. ఈ విషయమై ప్రాథమిక గొర్రెలు మేకల పెంపకందారుల సొసైటీలను, రైతు సంఘాలను భాగస్వాములు చేయాలి. అపుడే కరువు కాటుకు బలవుతున్న జీవాలను, పశు సంపదను రక్షించుకోగలం. గొర్రెలు మేకల పెంపకందారులకు, రైతులకు న్యాయం జరుగుతుంది. ఆ దిశగా ప్రభుత్వం కృషి చేయాల్సి వుంది. రైతు సంఘం, కౌలు రైతుల సంఘం, వ్యవసాయ కార్మిక సంఘం, వృత్తిదారుల సంఘాల ఆధ్వర్యంలో జరుగుతున్న కరువు పర్యటనలు, మండల కార్యాలయాల దగ్గర జరిగే ధర్నాలలో గొర్రెలు మేకల పెంపకందారులు పాల్గొని తమ డిమాండ్లను వినిపించాలి.

WhatsApp Image 2026-09-22 at 21.04.53.jpg

వ్యాసకర్త : పూసపాటి వెంకట్రావు

గొర్రెలు మేకల పెంపకందారుల సంఘం (జి.ఎం.పి.ఎస్) రాష్ట్ర కార్యదర్శి



ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్