సోమవారం, 26 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionఆశాకిరణం..

1 గంట క్రితం

లూలా కొత్తఫొటోలు image 5
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 27, 2026, 04:02 పూర్వాహ్నం | 3 నిమిషాల చదవడం

బ్రెజిల్‌ అధ్యక్ష‍ుడిగా నాలుగోసారి లూలా సాధించిన చారిత్రాత్మక విజయం లాటిన్‌ అమెరికా దేశాలకే కాదు బహుళ ధ్రువ ప్రపంచానికి ఆశాకిరణం. హోరాహోరీ పోరులో పచ్చిమితవాద బోల్సనారో లిబరల్‌ పార్టీ (పిఎల్‌)ని, అమెరికా కుట్రలను, సోషల్‌ మీడియా దుష్ప్రచారాన్ని మట్టికరిపించి, ప్రగతిశీల శక్తులకు పట్టంకట్టిన బ్రెజిలియన్లకు జేజేలు. ప్రజాస్వామ్యం, జాతీయ సార్వభౌమత్వం, సామాజిక సంక్ష‍ేమం, ప్రగతిశీల రాజకీయాల పట్ల మొగ్గుచూపుతూ మరోసారి వర్కర్స్‌ పార్టీ (పిటి) అధికార పగ్గాలు చేపట్టనుంది. ప్రత్యర్థి ప్లావియో బోల్సనారో కంటే 22 లక్ష‍ల ఓట్లు వెనుకబడిన లూయిజ్‌ ఇనాసియో లాలూ డా సిల్వా ఆదివారం నాటి తుది ఫలితాల్లో ప్రత్యర్థికంటే 44 లక్ష‍లకుపైగా ఓట్లు అధికంగా సాధించి 51.7 శాతం ఓటింగ్‌తో ఘన విజయాన్ని అందుకున్నారు. సైనిక నియంతృత్వ పాలన అనంతరం 1985లో ప్రజాస్వామ్యం పునరుద్ధరించబడిన తరువాత జరిగిన తొమ్మిది ఎన్నికల్లో మొదటి విడతలో రెండోస్థానంలో నిలిచి, తుది ఫలితాల్లో విజయాన్ని అందుకున్నది లూలా ఒక్కరే. బ్రెజిల్‌ కమ్యూనిస్టు పార్టీ, గ్రీన్‌ పార్టీలతో కూడిన ‘బ్రెజిల్‌ ఆఫ్‌ హోప్‌ ఫెడరేషన్‌’ అనే విస్తృత కూటమి మద్దతుతోనే ఇది సాధ్యమైంది.

బ్రెజిల్‌ను తన పెరటితోటగా మార్చుకోవాలని, అక్కడి వనరులన్నింటినీ దోచుకోవాలనుకున్న అమెరికాకు, దాని మద్దతుతో విజయం సాధించాలనుకున్న పచ్చి మితవాది ప్లావియో బోల్సనారోకు ఈ ఫలితాలు చెంపపెట్టు. వచ్చే నెలలో అమెరికా కాంగ్రెస్‌ ఎన్నికల ముందు వచ్చిన ఈ ఫలితం ట్రంప్‌నకు శరాఘాతమే. నాడు జైర్‌ బోల్సనారో మాదిరిగానే ఆయన తనయుడు ప్లావియో కూడా ఫలితాలను రద్దు చేయాలంటుండటం బరితెగింపే.

సంక్ష‍ేమ పథకాలకు, కార్మిక సంక్ష‍ేమానికి కోతలు పెట్టడం, అమెరికా సామ్రాజ్యవాద శక్తులతో అంటకాగి సర్వం దోచిపెట్టడం, అమెజాన్‌ అడవుల్లో 45 వేల చదరపు కిలోమీటర్ల అడవులను నాశనం చేయడం, కోవిడ్‌ 19 మహమ్మారిని ఫ్లూతో పోల్చుతూ 70 లక్ష‍లకుపైగా మరణాలకు కారణం కావడం, సైన్యం రాజకీయ ప్రాతను విస్తరించడానికి రాజ్యాంగాన్ని సవరించడం, తమ డిమాండ్లను పాటించని న్యాయమూర్తులను అభిశంసించడం సహా సమస్త అరిష్టాలకు కారణభూతుడు జైర్‌ బోల్సనారో. నాటి పాలనను నేటికీ పేదలు ఈసడిస్తూనే ఉన్నారు.

2023లో లూలా పగ్గాలు స్వీకరించాక దారిద్ర్యాన్ని నిర్మూలించడానికి ప్రాధాన్యత ఇస్తూ సంక్ష‍ేమ చర్యలకు ప్రాధాన్యత ఇవ్వడం, కార్మికుల హక్కులు, ఆర్థిక భద్రతకు భరోసా ఇవ్వడం, విద్య, వైద్యం, పరిశ్రమలకు గణనీయంగా నిధులు పెంచడం ఆ కూటమి నిబద్ధతను చాటిచెప్పేవే. వారంలో పని గంటలు 44 నుంచి 40కి తగ్గించి రెండు రోజులు సెలవులు ప్రకటించడం, సెలవు దినాల్లో ఉచిత ప్రజారవాణా, 36 లక్ష‍ల మంది స్వయం ఉపాధిదారుల రుణాల రద్దు, ఇంధన పన్నుల తగ్గింపు, తక్కువ ఆదాయం ఉన్న వారికి బోల్సా ఫ్యామిలియా పథకం కొనసాగింపు తదితర చర్యలు సానుకూల ఫలితాలకు కారణం.

వెనిజులా అధ్యక్ష‍ుడు మదురో దంపతులను కిడ్నాప్‌ చేయడం, అక్కడి వనరులను యథేచ్ఛగా దోపిడీ చేయడం, బ్రెజిల్‌పై 50 శాతం సుంకాలు విధించడం, సుప్రీంకోర్టు న్యాయమూర్తిపై ఆంక్ష‍లు, బోల్సనారో పాలనలో యథేచ్ఛగా దోచుకోవడం... చూసిన బ్రెజిలియన్లు అమెరికా పెరటితోటగా మారనివ్వబోమంటూ చేసిన ప్రతిన ఫలితమే ఈ విజయం. అక్రమ మైనింగ్‌తో తమ బతుకులను నాశనం చేయడం, హింసకు పాల్పడం, వందలమంది చిన్నారుల మరణానికి కారణం కావడాన్ని గుర్తు చేసుకుంటూ ఆదివాసీలు ఎదురు తిరిగారు.

డాలర్‌ ఆధిపత్యాన్ని సవాల్‌ చేస్తూ, భారత్‌, చైనా, రష్యా తదితర మూడో ప్రపంచ దేశాలతో సంబంధాలు బలోపేతం చేసుకుంటూ, బ్రిక్స్‌లో కీలక భాగస్వామిగా పాత్ర పోషిస్తున్న లూలాకు మద్దతు ఇస్తేనే తమ దేశానికి, తమకు భద్రత అని అక్కడ జనం నమ్మారు. పచ్చిమితవాదాన్ని అమెరికా ప్రోత్సహించినా, ప్రత్యర్థులకు నిధులు కుమ్మరించినా, నిత్యం బెదిరింపులకు గురిచేసినా, ఆంక్ష‍లు విధించినా లొంగకుండా ఎదురొడ్డి నిలబడిన లూలా నాయకత్వంలోనే దేశ పురోగతి సాధ్యమనుకున్న ఫలితమే ఇది. మెటాతో కలిసి సోషల్‌ మీడియా ప్రచారాన్ని పరిమితం చేసినా తలొగ్గకుండా ‘లూలా ఆర్మీ’ వాట్సాప్‌ ఛానల్‌ ఓటు వేయని 3.3 కోట్ల మందికి చేరువై విజేతగా నిలిచింది. వీధుల్లోకి ఆయనకు మద్దతుగా వచ్చిన కోట్లాదిమంది ప్రజానీకం విజయమిది. ఈ ఫలితం భారత్‌ సహా విశ్వమంతా ప్రగతిశీలశక్తులకు, బహుళ ధ్రువ ప్రపంచానికి భరోసా.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్