రాష్ట్రంలో 13,354 గ్రామ పంచాయతీలు, 123 నగర, మున్సిపల్, 662 మండల ప్రజా పరిషత్తులకు ఎన్నికలు జరగనున్నాయి. రాష్ట్రంలోని ఓటర్లందరూ పాల్గొనే ఈ ఎన్నికల ప్రక్రియలో గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి ప్రతిపక్ష పార్టీలపై రాష్ట్ర వ్యాప్తంగా అధికార తెలుగుదేశం కూటమి భౌతిక దాడులకు, దౌర్జన్యాలకు దిగింది. అనేక చోట్ల నామినేషన్ పత్రాలు చించివేయడం, నామినేషన్లు కూడా వేయనీయకుండా ఘర్షణలకు పాల్పడటం వంటివి చోటుచేసుకున్నాయి. వీటన్నింటినీ నిరోధించాల్సిన పోలీస్, అధికార యంత్రాంగం, ఎలక్షన్ కమిషన్ వ్యవస్థలన్నీ అధికార పార్టీ చేతుల్లో కీలుబొమ్మలుగా మారాయి. చివరికి సుప్రీంకోర్టు జోక్యంతో నోటిఫికేషన్ షెడ్యూల్‌ను సవరించి అరకొర చర్యలు తీసుకోవాల్సి వచ్చింది.
సుపరిపాలన, స్వపరిపాలన, గ్రామ స్వరాజ్యం, ప్రజల భాగస్వామ్యంతో ప్రజా ప్రణాళికలు రూపొందించటం, అమలు చేయటం, మౌలిక సదుపాయాలు, పౌర సేవలు కల్పించటం, అధికార వికేంద్రీకరణ, హేతుబద్ధమైన పన్నుల విధానమనే ఉన్నత ఆశయాల ప్రాతిపదికన స్థానిక సంస్థల లక్ష్యాలు రూపొందించబడ్డాయి. ప్రతి ఐదేళ్లకొకసారి క్రమం తప్పకుండా పట్టణ, గ్రామ, స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించటం, ఎస్సీ, ఎస్టీ, బలహీన వర్గాలు, మహిళలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్లు అమలు చేయటం, గ్రామసభలు, వార్డు కమిటీలు, వార్డు సభలు నిర్వహించటం, జిల్లా ప్రణాళికా, పట్టణాభివృద్ధి సంస్థలు వంటివి ఏర్పాటు కూడా వికేంద్రీకరణలో ముఖ్యమైనవి. ఈ విధులన్నిటిని నిర్వర్తించటానికి అవసరమైన ఆర్థిక వనరుల ఏర్పాటుకు రాష్ట్ర స్థాయిల్లో ప్రతి ఐదేళ్లకొకసారి క్రమం తప్పకుండా ఆర్థిక సంఘాలను నియమించాలని రాజ్యాంగంలో పేర్కొనబడింది. స్థానిక సంస్థల అధికారాలు, విధులకు సంబంధించి ఎప్పటికప్పుడు రాష్ట్ర ఆర్థిక సంఘం సిఫార్సులు, వాటి పరిధిలో వివిధ రకాల పన్నులు, పన్నేతర వనరుల ద్వారా ఆదాయాలు సమీకరించుకునేందుకు వివిధ రకాల పన్నుల బదలాయింపులను సిఫార్సులు చేయాలని కూడా రాజ్యాంగం ఆదేశించింది. ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వ పన్నుల ఆదాయంలో స్థానిక సంస్థలకు న్యాయబద్ధమైన వాటా, గ్రాంట్లు, ప్రత్యేక అభివృద్ధి నిధులు తదితర రూపాల్లో ఎంతెంత బదిలీ చేయాలో ఆర్థిక సంఘం సిఫార్సులు చేయాలి. ఇది రాజ్యాంగబద్ధ వ్యవస్థ. అలాగే దీనిని సెమీ జ్యుడీషియరీ వ్యవస్థగా కూడా పేర్కొనొచ్చు.
1992లో భారత ప్రభుత్వం 73, 74వ రాజ్యాంగ సవరణల ద్వారా గ్రామీణ పట్టణ స్థానిక సంస్థలకు కొన్ని అధికారాలు, విధులు, పన్ను విధింపు హక్కులు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆదాయాల్లో కొంత భాగం స్థానిక సంస్థలకు బదిలీ చేసేలా రాజ్యాంగంలోని ఆర్టికల్ 243-జి, 243-ఎక్స్ ద్వారా చట్ట బద్దత కల్పించారు. షెడ్యుల్ 11లో 29 అధికారాలు గ్రామ పంచాయితీలకు, షెడ్యుల్ 12లో 18 అధికారాలు పట్టణ స్థానిక సంస్థలకు పొందుపర్చారు. ఈ రాజ్యాంగ సవరణకు అనుగుణంగా ఆంధ్రప్రదేశ్‌లో పంచాయతీరాజ్, మున్సిపల్ చట్టాలు అమలులోకి వచ్చాయి. మూడంచెల స్థానిక ప్రభుత్వ వ్యవస్థ ఏర్పడి కొనసాగుతున్నది. స్థూలంగా స్థానిక సంస్థలనేవి రాజ్యంగబద్ధంగా ఏర్పడిన పరిపాలనా వ్యవస్థలు. ఇవి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల అంగాలు కాదు. కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం వలే స్థానిక ప్రభుత్వాలు ఇవి. వీటికి కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మాదిరిగా కొన్ని అధికారాలు, విధులు, నిధులు, స్వయం పరిపాలనకు రాజ్యాంగ బద్ధత కల్పించబడ్డాయి. కేంద్ర, రాష్ట్రాల దయాదాక్షిణ్యంపై ఆధారపడేవి కాదు. వీటి పరిస్థితి రాష్ట్రంలో అత్యంత దయనీయంగా ఉంది.
ఐదవ షెడ్యూల్డ్ ప్రాంతాల్లోని గిరిజన గ్రామ పంచాయితీల మౌలిక సదుపాయాలు, పౌరసేవలు అత్యంత ఘోరంగా ఉన్నాయి. గిరిజనులకు స్వపరిపాలన, వీరి సంస్కృతి, సాంప్రదాయాల పరిరక్షణ, సహజ వనరులపై స్వయం నిర్ణయాధికారం మొదలగు వాటిపై గిరిజన గ్రామాలకు అనేక హక్కులు కల్పించబడ్డాయి. పెసా చట్టం ప్రకారం 5వ షెడ్యూల్లోని గిరిజన పంచాయితీలకు రాజ్యాంగంలోని 9వ విభాగంలోని నిబంధనలు వర్తించవు. ఈ ప్రాంతాల్లో ఉన్న ఖనిజ వనరులపై గ్రామ పంచాయితీలు, గ్రామ సభల ఆమోదం లేకుండా ప్రభుత్వాలు ఎలాంటి నిర్ణయం చేయకూడదు. అలాగే మైనర్ అటవీ ఉత్పత్తులపై కూడా వీరికి సర్వాధికారాలు కల్పించబడ్డాయి. కాని వీటన్నింటిని ప్రభుత్వాలు ఉల్లంఘిస్తున్నాయి. దేశంలోని వివిధ రాష్ట్రాల్లో స్థానిక సంస్థలకు విధులు, నిధులు, నిర్వహణ, ఆర్థిక వనరుల బదిలీలలో కేరళ అగ్ర భాగాన వుంది. ఆంధ్రప్రదేశ్ అత్యంత దిగువ స్థాయిలో వుంది. నిధుల బదలాయింపులో 14వ స్థానంలో, నిర్వహణలో 19వ స్థానం, విధుల బదాలాయింపులో 12 స్థానంలో ఈ రాష్ట్రం ఉంది.
గ్రామ పంచాయతీల పనితీరు, అభివృద్ధి కార్యక్రమాలపై ''పంచాయితీల అభివృద్ధి సూచీ'' పేర కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన నివేదిక ప్రకారం పేదరిక నిర్మూలన, మెరుగైన జీవనోపాధి కల్పన, ఆరోగ్య సేవల లభ్యత, మంచి నీటి సదుపాయం, పారిశుధ్యం, మౌలిక సదుపాయాల అందుబాటు, సామాజిక న్యాయం, సుపరిపాలన ప్రమాణాల్లో 13,354 గ్రామ పంచాయతీలలో ఏ ఒక్కటి కూడా ''ఏ ప్లస్'' గ్రేడ్ సాధించలేదు. 591 (4.42 శాతం) పంచాయితీలు ''ఏ'' గ్రేడుకు ఎంపికయ్యాయి. మిగిలినవన్నీ బి, సి గ్రేడ్లలో ఉన్నాయి. ఇవి కనీస స్థాయిలో కూడా పౌరులకు సదుపాయాలు కల్పించలేక పోతున్నాయి.
రాజ్యాంగబద్ధ రాష్ట్ర ఆర్థిక సంఘాన్ని కూడా పాలకులు ఒక ఫార్సులా మార్చేశారు. రాష్ట్ర 7వ ఆర్థిక సంఘం సిఫార్సులు అమలులో ఉండాలి. కానీ ఈ పక్రియకు గండి కొట్టి, గత 4, 5 ఆర్థిక సంఘాల సిఫార్సులు ఉనికిలో లేకుండా చేశాయి. గత 15 ఏళ్ల నుండి రాష్ట్ర ఆర్థిక సంఘం సిఫార్సుల నుండి ఒక్క రూపాయి కూడా స్థానిక సంస్థలకు విడుదల కాలేదు. ఆఖరుకు గ్రామ పంచాయతీలకు రూ.25, మండల ప్రజా పరిషత్తులకు రూ.50, జిల్లా ప్రజా పరిషత్‌లకు రూ.25, పట్టణాలకు రూ.50 చొప్పున జనాభా ప్రాతిపదికన ఇవ్వాల్సిన తలసరి గ్రాంటు ఇవ్వడం లేదు. రాష్ట్ర బడ్జెట్ నుండి స్థానిక సంస్థలకు గ్రాంట్లు, అభివృద్ధి నిధులు లేవు. జిఎస్టీతో మున్సిపల్ సంస్థల పరిధిలోని వినోదపు పన్ను, ప్రకటనల పన్నును ఏకపక్షంగా జిఎస్టీలోకి లాగేసుకున్నారు. కనీసం దానికి నష్ట పరిహారం కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇవ్వడం లేదు. నిధులను స్థానిక సంస్థలకు బదిలీ చేయకపోగా వీటి సొంత పన్నులు, పన్నేతర ఆదాయాలను కూడా రాష్ట్ర ఖజానాకు మళ్లిస్తున్నారు. సి.ఎఫ్.ఎం.ఎస్ ద్వారా స్థానిక సంస్థల ఆస్తి పన్ను, నీటి చార్జీలు, బిల్డింగ్ ప్లాన్ అనుమతుల ఫీజులు, రిజిస్ట్రేషన్ల సర్ చార్జీ, ట్రేడ్ లైసెన్స్ ఫీజులు ఇలా అన్నింటినీ రాష్ట్ర ప్రభుత్వం తన ఖాతాకి మళ్లించుకుంటోంది. వృత్తి పన్ను రాష్ట్ర ఖజానాలోకి బదిలీ చేసుకున్నది. రాష్ట్ర ప్రభుత్వ నియంతృత్వ ఆర్థిక చర్యలతో స్థానిక సంస్థలు పూర్తిగా నిర్వీర్యమై, ఉత్సవ విగ్రహాలుగా మారాయి.
మరో వైపు కేంద్ర బిజెపి ప్రభుత్వం అమలు చేస్తున్న నయా ఉదార విధానాలను రాష్ట్రంలో వేగంగా అమలు చేస్తున్నది. ఈ ప్రమాదకర ప్రైవేటీకరణ విధానాలకు స్థానిక సంస్థలను ఒక ప్రయోగశాలగా మార్చేశారు. గతంలో ఆస్తి విలువ ఆధారిత పన్ను విధానాన్ని రాష్ట్రంలో వైసిపి ప్రభుత్వం అమలులోకి తెచ్చింది. ఇదే విధానాన్ని తెలుగుదేశం కూటమి అమలు చేస్తూ ప్రతి ఏడాది 15 శాతం ఆస్తి పన్ను పెంచుతున్నది. ఆస్తి పన్నే ప్రధాన ఆదాయ వనరుగా పెంచుకోవాలనే కేంద్ర ఆదేశాలను అమలు చేస్తున్నది. స్మార్ట్ సిటీ, స్వచ్ఛ భారత్, అమృత్, అర్బన్ ఛాలెంజ్ ఫండ్ ఇలాంటి కేంద్ర పథకాల షరతులన్నింటినీ రాష్ట్రం దూకుడుగా అమలుచేస్తున్నది. మంచి నీరు, వీధి లైట్లు, పారిశుధ్యం, రోడ్లు, పార్కులు, మార్కెట్లు, షాపింగ్ కాంప్లెక్స్‌లు, క్రీడా మైదానాలు, ఖాళీ స్థలాలు ఇలా అన్ని మౌలిక సదుపాయాలు, పౌరసేవలను ప్రైవేట్ సంస్థలకు పిపిపి పేర బదిలీ చేస్తున్నారు. టిడిపి కూటమి ప్రభుత్వం జిఓ 673 విడుదల చేసింది. గ్రామ పంచాయతీలను జిల్లా యూనిట్‌గా, మున్సిపాలిటీలను 5 సర్కిళ్లుగా విభజించి రాష్ట్ర ప్రభుత్వమే అన్నింటిని ప్రైవేట్ సంస్థలకు కట్టబెడుతున్నది. ఈ సంస్థలకు లాభాలు, పెట్టుబడులు గ్యారంటీ చేయటానికి మున్సిపల్ బడ్జెట్ అకౌంట్ల ఆదాయాలను ప్రత్యేక ఎస్క్రో అకౌంట్లు ఏర్పాటు చేసి దారి మళ్లిస్తున్నారు. ప్రజలపై రకరకాల పన్నుల విధింపునకు సిద్ధమయ్యారు.
ఈ నేపథ్యంలో రాష్ట్రంలో స్థానిక ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ సంస్కరణలకు ఆద్యులు చంద్రబాబు నాయుడు. కాంగ్రెస్, వైసిపి అధికారంలో ఉన్నపుడు వీటిని అమలు చేశాయి. జనసేన పూర్తిగా బిజెపి విష కౌగిలిలో చిక్కుకున్నది. మొదటినుండి సిపిఐ(ఎం) ఇతర వామపక్షాలు ఈ ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా పోరాడుతున్నవి. కేరళను దేశానికి ప్రత్యామ్నాయ అభివృద్ధి మోడల్‌గా సృష్టించాయి.
స్థానిక సంస్థలు అభివృద్ధి కావాలంటే కేంద్ర రాష్ట్రాలు నయా ఉదారవాద పంథా విడనాడాలి. స్థానిక సంస్థల వ్యవస్థను పటిష్ట మైన ఆర్థికశక్తి కేంద్రాలుగా పన్నుల ఒడంబడికలను ప్రజాస్వామ్యీకరించాలి. రాజ్యాంగ బద్ధంగా నిర్దేశించిన ఆర్థిక బదిలీలను ఎలాంటి షరతులు లేకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు బదిలీ చేయాలి. ఈ ఆర్థిక బదిలీల, గ్రాంట్లు ప్రభుత్వాల దయాదాక్షిణ్యాలుగా కాకుండా హక్కుగా చూడాలి. పట్టణ సంస్థల ప్రస్తుత సొంత పన్ను ఆదాయ పరిధిని విస్తృతం చేయాలి. ఇప్పటికే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వసూలు చేస్తున్న ఆదాయ పన్ను, జిఎస్టీ వంటి వాటిల్లో స్థానికంగా కొంత భాగాన్ని కేటాయించాలి. అప్పుడే స్థానిక సంస్థల వనరుల సామర్థ్యాన్ని, సమానత్వాన్ని సాధించటానికి తోడ్పడుతుంది. దీర్ఘకాలిక ప్రణాళికలు రూపొందించుకొని అమలు చేసుకోవటానికి అవకాశం లభిస్తుంది. స్థానిక సంస్థలు అభివృద్ధి చెందడడమే కాకుండా జాతి శ్రేయస్సు, అభివృద్ధికి పునాదులు వేస్తాయి.

వ్యాసకర్త సెల్:డా. బి. గంగారావు
9490098792







కామెంట్లు (0)