విద్యుత్ పంపిణీ రంగంలోకి ప్రైవేటు కంపెనీ ప్రవేశానికి హర్యానా రాష్ట్ర విద్యుత్ నియంత్రణ కమిషన్ తీసుకున్న నిర్ణయం అక్కడి విద్యుత్ ఉద్యోగులు, ఇంజనీర్ల సమ్మెకు దారితీసింది. గురుగ్రామ్, నుహ్ రెవెన్యూ జిల్లాల్లో 25 సంవత్సరాల పాటు విద్యుత్ పంపిణీ చేసేందుకు ‘లెవన్ పవర్ ప్రైవేట్ లిమిటెడ్’కు 2026 అక్టోబరు 19న లైసెన్స్ మంజూరైంది. ఇప్పటికే ప్రభుత్వ రంగంలోని ‘దక్షిణ హర్యానా బిజిలీ వితరణ్ నిగమ్ లిమిటెడ్’ (డి.హెచ్.బి.వి.ఎన్.ఎల్) సేవలందిస్తున్న ప్రాంతాల్లోనే ఈ కొత్త కంపెనీ కూడా తన నెట్‌వర్క్‌ను నిర్మించనుంది. హర్యానాలో ఇది తొలి సమాంతర పంపిణీ లైసెన్స్ కావడం గమనార్హం.
ఈ నిర్ణయాన్ని ''వినియోగదారులకు ఎంపిక కల్పించడం'', ''పోటీ వల్ల సేవ మెరుగుపడటం'' అనే ఆకర్షణీయమైన మాటలతో సమర్థిస్తున్నారు. లెవన్ పవర్ కంపెనీ, 2026-27 నుంచి 2030-31 వరకు దాదాపు రూ.4,717 కోట్ల పెట్టుబడి పెట్టి, 80 శాతం విద్యుత్తును పునరుత్పాదక వనరుల నుంచి కొనుగోలు చేస్తామని ప్రతిపాదించింది. వినియోగదారులు సరఫరాదారును మార్చుకోవచ్చు అన్న క్లాజు ప్రకారం ప్రభుత్వ రంగంలో ఇప్పటి వరకు ఉన్న పంపిణీ వ్యవస్థను ప్రైవేటు రంగంలోకి మార్చే విధానం ఆరంభమైంది.
ఎలక్ట్రిసిటీ చట్టం-2003 లోని సెక్షన్ 14 ప్రకారం ఒకే ప్రాంతంలో ఒకటి కంటే ఎక్కువ పంపిణీ లైసెన్సీలు ఉండేందుకు అవకాశముంది కనుక రెగ్యులేటరీ కమిషన్ లైసెన్స్ ఇచ్చింది. కానీ విద్యుత్ పంపిణీ సాధారణ వ్యాపారం కాదు. ప్రతి ఇంటికి, రైతుకు, చిన్న దుకాణానికి, పరిశ్రమకు నిరంతర సరఫరా అందించడం ప్రజా బాధ్యత. దాన్ని లాభాల ఆధారంగా నడిచే సంస్థకు అప్పగించినప్పుడు సేవా హామీ, ధరల భారం, ఉద్యోగ భద్రత, ప్రభుత్వ ఆస్తుల వినియోగం వంటి ప్రశ్నలకు స్పష్టమైన జవాబులు అవసరం.
లైసెన్స్ మంజూరు దశలోనే టారిఫ్, క్రాస్ సబ్సిడీ, అదనపు సర్‌చార్జీ, పాత డిస్కమ్ ఆస్తుల వినియోగం, నిలిచిపోయే ఖర్చులపై పూర్తి నిర్ణయం తీసుకోలేదని ఉత్తర్వు సారాంశం చెబుతోంది. రెగ్యులేటరీ కమిషన్ ఈ అంశాలను తరువాతి ఎ.ఆర్.ఆర్, టారిఫ్ తదితర విచారణల్లో పరిశీలించవచ్చని పేర్కొంది. అంటే లైసెన్స్ ఇచ్చే సమయంలోనే ఈ పరిణామాల ఆర్థిక ప్రభావం పూర్తిగా తేలలేదు. కానీ రేపు వినియోగదారులు కొత్త కంపెనీకి మారిన తర్వాత ప్రభుత్వ డిస్కమ్ అప్పులు, ఇప్పటికే నిర్మించిన సబ్‌స్టేషన్లు, లైన్లు, ఉద్యోగుల జీతాలు, తక్కువ ఆదాయం వచ్చే ప్రాంతాల సేవా వ్యయం ఎవరి నెత్తిన పడతాయి? ఈ ప్రశ్నను ''తర్వాత చూద్దాం'' అని వాయిదా వేయడం కుదరదు.
లాభదాయక ప్రాంతాల ఎంపికపై ప్రశ్నలు
ఐదేళ్లలో దశలవారీగా నెట్‌వర్క్ నిర్మిస్తానని, నుహ్ జిల్లాను కూడా మొదటి దశ నుంచే చేర్చుతానని కంపెనీ చెప్పింది. అందువల్ల 'లాభదాయక ప్రాంతాలనే ఎంచుకుంటుంది'. గురుగ్రామ్‌లో పారిశ్రామిక, వాణిజ్య, అధిక ఆదాయ వినియోగదారుల వాటా ఎక్కువగా ఉండగా, నుహ్‌లో ఆదాయ స్థాయి, సరఫరా ఖర్చులు, నష్టాల పరిస్థితి భిన్నంగా ఉంటుంది.
ప్రభుత్వ డిస్కమ్ ఎందుకు బలహీనపడింది?
హర్యానా రెగ్యులేటరీ కమిషన్ తన నిర్ణయానికి గల కారణాల్లో కొత్త కనెక్షన్లు, లోడ్ పెంపు అభ్యర్థనల్లో ఉన్న పెండింగ్‌ను కూడా ప్రస్తావించింది. రెండు ప్రభుత్వ పంపిణీ సంస్థల పరిధిలో 2025లో సుమారు 1.29 లక్షల దరఖాస్తులు, 2,413 మెగావాట్లకు సంబంధించిన అభ్యర్థనలు పెండింగ్‌లో ఉన్నాయని వార్తా కథనాలు నివేదించాయి. ఈ ఆలస్యం వినియోగదారులకు నిజమైన సమస్య. కానీ ప్రభుత్వ డిస్కమ్ పని తీరు మెరుగుపరచాల్సిన బాధ్యతను ప్రైవేటు కంపెనీకి ప్రవేశ ద్వారంగా మార్చడం ఒక్కటే పరిష్కారమా? సిబ్బంది ఖాళీలను భర్తీ చేయడం, పెట్టుబడులు పెంచడం, నిర్వహణ మెరుగుపరచడం, సమయ పాలనను కట్టుదిట్టం చేయడం ప్రభుత్వ బాధ్యత. ఆ బాధ్యతను నిర్వర్తించకుండా ప్రభుత్వ సంస్థను బలహీనపరిచి, అదే సమస్యను ప్రైవేటీకరణకు అనుకూల వాదనగా చూపితే, చివరికి లాభం ఎవరికో స్పష్టమే.
ప్రభుత్వ సంస్థలు దశాబ్దాలుగా నిర్మించిన పంపిణీ వ్యవస్థల పక్కనే మరో నెట్‌వర్క్ రావడం వల్ల లైన్లు, సబ్‌స్టేషన్లు, మీటర్లు వంటి మౌలిక వసతుల పునరావృతం జరగవచ్చు. కొత్త నిర్మాణానికి చట్టం అనుమతించిందని మాత్రమే చెప్తే సరిపోదు. ఆ ఖర్చు చివరకు టారిఫ్ లేదా ప్రజా నిధులపై పడుతుందా? లేదా? అన్నది కూడా స్పష్టంచేయాలి.
ఈ పరిణామంపై విద్యుత్ ఇంజనీర్లు, ఉద్యోగ సంఘాలు, రైతు సంఘాలు, రాజకీయ పక్షాలు అభ్యంతరాలు చెప్పినా బిజెపి ప్రభుత్వం పట్టించుకోలేదు. వారి ప్రధాన ఆందోళనలు ఉద్యోగ భద్రత, ప్రభుత్వ డిస్కమ్ ఆదాయం, క్రాస్ సబ్సిడీ, భవిష్యత్తులో వినియోగదారులపై పడే ఖర్చుల చుట్టూ ఉన్నాయి.
విద్యుత్ రంగ సంస్కరణల పేరుతో దేశమంతటా ప్రభుత్వ రంగ సంస్థల పాత్రను తగ్గించి, లాభదాయకమైన వినియోగదారులపై ప్రైవేటు కంపెనీల దృష్టి కేంద్రీకృతమయ్యే పరిస్థితులు ఏర్పడితే, సామాజిక బాధ్యత మాత్రం ప్రభుత్వ డిస్కమ్‌లకే మిగులుతుంది. గ్రామీణ ప్రాంతాలు, వ్యవసాయం, చిన్న వినియోగదారులు, తక్కువ ఆదాయ కుటుంబాలకు విద్యుత్ అందించే బాధ్యతను లాభనష్టాల లెక్కలకే వదిలేయకూడదు.
ఆంధ్రప్రదేశ్‌కు ఓ హెచ్చరిక
హర్యానా ఉత్తర్వు ఆంధ్రప్రదేశ్‌కు కూడా ఒక హెచ్చరిక. భవిష్యత్తులో ఇలాంటి లైసెన్స్ దరఖాస్తులు వస్తే, వాటిని కేవలం ''పోటీ'' లేదా ''వినియోగదారుల ఎంపిక'' అనే నినాదాలపై కాకుండా, ప్రభుత్వ డిస్కమ్‌పై ఆర్థిక ప్రభావం, ఉద్యోగుల భవిష్యత్తు, గ్రామీణ, పట్టణ సరఫరా సమానత్వం, టారిఫ్ భారం, ప్రభుత్వ ఆస్తుల వినియోగం, సేవల నిరంతరత వంటి అంశాలపై బహిరంగంగా చర్చించాలి. టిడిపి కూటమి ప్రభుత్వం దూకుడు చూస్తుంటే హర్యానా లాంటి పరిస్థితులు ఎ.పి లో రావటానికి ఎంతో కాలం పట్టదని భావించాల్సి వస్తుంది. ఇప్పటికే డేటా సెంటర్లకు, వ్యవసాయ రంగానికి ప్రత్యేక డిస్కమ్‌లను ప్రకటించిన కూటమి ప్రభుత్వం లాభదాయక ప్రాంతాలను ప్రైవేటు డిస్కంలకు అప్పగించవచ్చు. విద్యుత్ ప్రజల హక్కు. దాని పంపిణీ వ్యవస్థ ప్రజా బాధ్యత. ఆ వ్యవస్థను లాభాల మార్కెట్‌కు అప్పగించే ప్రతి నిర్ణయాన్నీ ప్రజలు వ్యతిరేకించాలి.

కందారపు మురళి
వ్యాసకర్త సెల్: 94900 98840







కామెంట్‌లు (0)