రూ.237.84 కోట్ల బ్యాంకు రుణాల కేసులో ఎఫ్‌ఐఆర్ రద్దుకు నిరాకరణ
ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : ఉండి ఎమ్మెల్యే, అసెంబ్లీ డిప్యూటీ స్పీకరు రఘురామ కృష్ణరాజుకు సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. రూ.237.84 కోట్ల బ్యాంకు రుణాల వ్యవహారంలో తనపై నమోదైన సిబిఐ ఎఫ్‌ఐఆర్‌ను రద్దు చేయాలంటూ ఆయన దాఖలు చేసిన పిటిషన్‌ను అత్యున్నత న్యాయస్థానం కొట్టివేసింది. ఈ కేసులో దర్యాప్తును కొనసాగించేందుకు సిబిఐకి మార్గం సుగమమైంది. రఘురామ కృష్ణరాజు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌ను సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ దీపాంకర్ దత్తా, జస్టిస్ శీల్ నాగుతో కూడిన ధర్మాసనం సోమవారం విచారించింది. ఆర్థిక నేరాల కేసులో దర్యాప్తు సాగుతున్న దశలో జోక్యం చేసుకోవడానికి నిరాకరించింది. గతంలో మద్రాస్ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను సమర్థించింది. దర్యాప్తు అధికారి 16 వారాల్లోగా విచారణ పూర్తి చేసి, చార్జిషీట్ దాఖలు చేయాలన్న ఆదేశాలను యథాతథంగా కొనసాగించింది.
ఇండ్ భారత్ పవర్ జెన్‌కామ్ లిమిటెడ్ పేరుతో విద్యుత్ ప్లాంట్ల ఏర్పాటుతో పాటు వ్యాపార అవసరాల కోసం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బిఐ) నేతృత్వంలోని బ్యాంకుల కన్సార్షియం నుంచి రూ.237.84 కోట్ల రుణాలు తీసుకున్నట్లు కేసు వివరాలు పేర్కొంటున్నాయి. ఈ నిధులను నిర్దేశిత ప్రాజెక్టులకు వినియోగించకుండా, నకిలీ కొనుగోలు పత్రాలు, తప్పుడు ఖాతాలతో గ్రూప్ కంపెనీలకు మళ్లించారని బ్యాంకులు ఫిర్యాదు చేశాయి. ఈ ఆరోపణలపై సిబిఐ.. రఘురామ కృష్ణరాజుతోపాటు కంపెనీకి చెందిన ఇతర డైరెక్టర్లపై కేసులు నమోదు చేసింది. కుట్ర, మోసం, ఫోర్జరీ, నకిలీ పత్రాల వినియోగం వంటి అభియోగాలతోపాటు అవినీతి నిరోధక చట్టం కింద కూడా కేసులు నమోదయ్యాయి. రఘురామ కృష్ణరాజుతోపాటు ఇండ్ భారత్ పవర్ జెన్‌కామ్ లిమిటెడ్ కంపెనీ డైరెక్టర్లు కనుమూరు ఇందిరా ప్రియదర్శిని, రమాదేవి, దుంపల మధుసూదన రెడ్డి, అంబేద్కర్ రాజ్‌కుమార్ గంటా, నారాయణ ప్రసాద్ తదితరులు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్లను కూడా అత్యున్నత న్యాయస్థానం కొట్టివేసింది.







కామెంట్‌లు (0)