గురువారం, 17 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionమరో విభజన వ్యూహం

8 గంటల క్రితం

ucc
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 17, 2026, 05:58 పూర్వాహ్నం | 3 నిమిషాల చదవడం

లోక్‌సభ ఎన్నికలకు ముందే ఎన్‌‌డిఎ పాలిత రాష్ట్రాల్లో ఏకరూప పౌర స్మృతి (యుసిసి)ని అమలు చేస్తామంటూ కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా ప్రకటించడాన్ని మరో విభజన వ్యూహంలో భాగంగానే చూడాలి. ఈ తరహా రాజకీయాల పట్ల దేశవ్యాప్తంగా వ్యతిరేకత వ్యక్తమవుతున్నప్పటికీ ఆర్‌ఎస్‌ఎస్‌ ‌నేతృత్వంలోని సంఘ్‌‌పరివార్‌ మాత్రం మత విద్వేష మార్గంలోనే మరింత తీవ్రంగా ప్రజలను విభజించడానికి సిద్ధమౌతున్నట్లు ఈ నిర్ణయం స్పష్టం చేస్తోంది. అయోధ్య రామమందిర నిర్మాణం, కాశ్మీర్‌కు సంబంధించిన 370వ అధికరణ రద్దు వంటి అంశాలతోపాటు, సంఘ్ పరివార్ చాలాకాలంగా ముందుకు తెస్తున్న హిందుత్వ ఎజెండాలో యుసిసి కూడా ఒక భాగం. గత లోక్‌సభ ఎన్నికల సమయంలోనే బిజెపి తన మేనిఫెస్టోలో యుసిసిని అమలు చేస్తామని ప్రకటించింది. 400కు పైగా సీట్లు సాధించి అధికారంలోకి వస్తామనే అంచనాతో అప్పట్లో బిజెపి ఈ అంశాన్ని ప్రకటించినప్పటికీ సాధారణ మెజారిటీకి కూడా చేరుకోలేక పోవడంతో తాత్కాలికంగా పక్కన పెట్టింది. జెన్‌‌ జీ ఉద్యమం నుండి యువత దృష్టి మళ్ళించడానికి రిజర్వేషన్ల సమస్యను ఎగదోయడంతో పాటు, త్వరలో పలు రాష్ట్రాలలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలు, ఆ తరువాత జరిగే లోక్‌‌సభ ఎన్నికల్లో లబ్ధి పొందడమే లక్ష్యంగా మళ్లీ మరోసారి మత విద్వేష విభజన ఎజెండాను ముందుకు తీసుకువచ్చింది. దీనికోసం ఎన్‌‌డిఎ పాలిత రాష్ట్రాలను పావులుగా చేసుకుంటోంది. 2025 జనవరిలో బిజెపి అధికారంలో ఉన్న ఉత్తరాఖండ్‌‌లో తొలిసారిగా యుసిసిని అమలు చేశారు. బిజెపి అధికారంలో ఉన్న గుజరాత్‌, అసోం, మధ్యప్రదేశ్‌ శాసనసభలు కూడా ఇప్పటికే ఈ చట్టాన్ని ఆమోదించాయి. మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్‌, ఛత్తీస్‌గఢ్‌, రాజస్థాన్‌ రాష్ట్రాల్లో ప్రస్తుతం బిల్లు రూపొందించే ప్రక్రియ జరుగుతున్నట్లు వార్తలు వస్తున్నాయి.

అయినప్పటికీ, తాము అధికారంలో 21 రాష్ర్టాలలోనూ యుసిసిని అమలులోకి తీసుకువస్తామన్న అమిత్‌‌షా ప్రకటన క్షేత్రస్థాయి వాస్తవ పరిస్థితులకు దూరంగా కనపడుతోంది. నాగాలాండ్‌, మేఘాలయ, సిక్కిం వంటి ఎన్‌డిఎ పాలిత ఈశాన్య రాష్ట్రాలు యుసిసికి అనుకూలంగా లేవు. బిజెపి పాలిత మణిపూర్‌, అరుణాచల్‌ ప్రదేశ్‌ రాష్ట్రాల్లోనూ దీనిపై వ్యతిరేకత బలంగా ఉంది. వచ్చే ఏడాది ప్రారంభంలో శాసనసభ ఎన్నికలకు వెళ్లనున్న ఉత్తరప్రదేశ్‌లోనూ ఈ దిశలో ఇప్పటిదాకా ఎటువంటి అడుగులు పడలేదని వార్తలు వస్తున్నాయి. అమిత్‌ ‌షా ప్రకటన వెలువడిన వెంటనే ఎన్‌‌డిఎలో కీలక భాగస్వామిగా ఉన్న జెడియు తీవ్రమైన అభ్యంతరాలు వ్యక్తం చేయడం కూడా గమనార్హం. దేశవ్యాప్తంగా విస్తృత ఏకాభిప్రాయం ఏర్పడిన తర్వాతే ఇటువంటి చట్టాన్ని అమలు చేయాలన్న తమ అధినేత నితీష్‌ కుమార్‌ వైఖరిని ఆ పార్టీ నాయకులు గుర్తుచేశారు. బీహార్‌లోనే మరో ఎన్‌డీఏ భాగస్వామి ఎల్‌జెపి (రామ్‌విలాస్‌) కూడా ముసాయిదా వచ్చిన తర్వాతే పరిశీలించి స్పందిస్తామని చెప్పింది. జమ్మూ కాశ్మీర్‌ ముఖ్యమంత్రి ఒమర్‌ అబ్దుల్లా యుసిసి వంటి దేశవ్యాప్త అంశాన్ని రాష్ట్రాల ద్వారా విడివిడిగా అమలు చేయించడాన్ని తప్పు పట్టారు. పార్లమెంటులో సమగ్రంగా చర్చించి ఎందుకు నిర్ణయం తీసుకోలేకపోతున్నారని ఆయన ప్రశ్నించారు. ఎన్‌డిఎ లోని మిత్రపక్షాలకే పూర్తి ఏకాభిప్రాయం లేని విషయాన్ని ఆయన ఎత్తి చూపారు. మహిళల హక్కుల పరిరక్షణ కోసం యుసిసిని అమలు పరుస్తున్నట్లు బిజెపి చేసిన ప్రకటన తీవ్ర వివాదాస్పదమైంది. వివాహం, విడాకులు, వారసత్వం, దత్తత వంటి అంశాల్లో అత్యంత సున్నితమైన మత, సామాజిక వర్గాల ప్రత్యేక హక్కులు, ఆచారాలు, జీవన విధానాలను ఎలా పరిరక్షిస్తారన్న ప్రశ్నకు కేంద్ర ప్రభుత్వం నుండి సమాధానం లేదు. మరోవైపు ఉత్తరాఖండ్‌లో యుసిసిని అమలు చేసినప్పటికీ, గిరిజనులను పూర్తిగా దాని పరిధి నుంచి మినహాయించారు. గుజరాత్‌, అసోం, మధ్యప్రదేశ్‌ రాష్ట్రాల్లోనూ ఇదే విధంగా చేశారు. దేశంలోని వైవిధ్యాన్ని పరిగణనలోకి తీసుకోకుండా ఒకే చట్టాన్ని అందరిపైనా ఒకే విధంగా అమలు చేయడం ఆచరణలో సాధ్యం కాదనడానికి ఇదే నిదర్శనం. దీంతో ముస్లింలు, క్రైస్తవులు సహా మైనారిటీలను లక్ష్యంగా చేసుకునే సంఘ్‌‌పరివార్‌ ఈ విద్వేష విభజన వ్యూహానికి దిగుతోందన్నది స్పష్టం! ఈ అంశాన్ని నిరంతరం చర్చలో ఉంచడం ద్వారా మెజార్టీ ప్రజానీకాన్ని రెచ్చగొట్టి ఎన్నికల్లో రాజకీయ ప్రయోజనం పొందడం కూడా బిజెపి వ్యూహంలో భాగమన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

మన రాష్ట్రంలో ఈ పరిణామానికి ప్రత్యేక ప్రాధాన్యం ఉంది. ఎన్‌‌టిఆర్‌ ‌నేతృత్వంలో సెక్యులర్‌ ‌విలువలకు పట్టం కట్టిన తెలుగుదేశం పార్టీ వాటిని పూర్తిగా పక్కన పడేసినట్లు సంకేతాలు వస్తుండటం ఆందోళనకరం! అమిత్‌‌షా ప్రకటనపై రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయడు పెదవి విప్పకపోగా, ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు మాత్రం హోం మంత్రి ఆదేశాలకు కట్టుబడి ఉంటామని ప్రకటించేశారు. తాము ఎన్‌‌డిఎ భాగస్వాములమన్న విషయాన్ని గుర్తు చేస్తూ ఆయన ఈ వ్యాఖ్య చేయడం గమనార్హం. ఒకప్పుడు లౌకిక విలువలపై వీరావేశంతో ఊగిపోయిన జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ ఇంకా పెదవి విప్పకపోయినప్పటికీ ఆయన ఎలా స్పందిస్తారన్నది అందరికీ తెలిసిందే! గతంలో యుసిసిని వ్యతిరేకిస్తున్నట్లు వైసిపి అధినేత జగన్మోహన్‌‌రెడ్డి ప్రకటించారు. నరేంద్ర మోడీ ప్రభుత్వం తీసుకుంటున్న అనేక నిర్ణయాలకు వైసిపి మద్దతు ప్రకటిస్తున్న నేపథ్యంలో ఆయన ఇప్పటికీ అదే వైఖరికి కట్టుబడి ఉంటారో లేదో చూడాల్సిందే! ఎన్‌‌డిఎలోనే కీలక భాగస్వామిగా ఉన్న జెడియు ఒకవైపు తీవ్రంగా వ్యతిరేకిస్తుండగా, మన రాష్ట్రంలో దానికి భిన్నమైన పరిస్థితి నెలకొనడం ఏ ప్రయోజనాల కోసమో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. మతతత్వ రాజకీయాలతో విభజించి లబ్ధి పొందాలన్న కుత్సిత వ్యూహాలకు వ్యతిరేకంగా ప్రజానీకం ఐక్యం కావాల్సిన తరుణమిది! రాజ్యాంగ వ్యతిరేకమైన ఈ చర్యను కుల, మతాలకు అతీతంగా ఐక్యంగా ప్రతిఘటించాలి.​

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్