గురువారం, 12 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionద్వైపాక్షిక పరిష్కారం

12 గంటల క్రితం

ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ  నడుమ పొడసూపుతున్న జల వివాదాలను పరిష్కరించాల్సిన కేంద్ర బిజెపి ప్రభుత్వం,
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 12, 2026, 05:53 పూర్వాహ్నం | 3 నిమిషాల చదవడం

ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ నడుమ పొడసూపుతున్న జల వివాదాలను పరిష్కరించాల్సిన కేంద్ర బిజెపి ప్రభుత్వం, తెలుగు రాష్ట్రాల మధ్య మరిన్ని వివాదాలకు ఆజ్యం పోసి తద్వారా ఇరువురినీ తన గుప్పెట్లో పెట్టుకొనేందుకు తహ తహలాడటం అభ్యంతరకరం. రాజ్యాంగం నిర్దేశించిన సమాఖ్య స్ఫూర్తికి విఘాతం. రెండు రాష్ట్రాల పరిధిలోని ప్రాజెక్టులు, ఆయకట్టు, అనుమతులు, డిజైన్లు, ఇతర సాంకేతిక వివరాలు అందజేయాలంటూ తాజాగా జలశక్తి మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలోని కృష్ణా నదీ నిర్వహణ బోర్డు (కెఆర్‌ఎంబి) ఆంధ్రా, తెలంగాణ ప్రభుత్వాలకు నోటీసులు జారీ చేయడం వెనుక ఇద్దరిపై ఆధిపత్యం వహించాలన్న కేంద్రం వక్ర బుద్ధి కనిపిస్తుంది. రాష్ట్ర విభజన జరిగి పన్నెండేళ్లు దాటిపోయింది. ఈ కాలమంతా కేంద్రంలో అధికారంలో ఉన్న మోడీ ప్రభుత్వం విభజన చట్టానికి వీసమెత్తయినా విలువ ఇవ్వలేదు సరికదా తూట్లు పొడిచింది. నదీ జలాల వివాద పరిష్కారానికి కేంద్ర జలశక్తి మంత్రి అధ్యక్షునిగా ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సభ్యులుగా ఎపెక్స్‌ ‌కౌన్సిల్‌‌ విభజన చట్టంలో పొందుపర్చబడింది. కాగా పుష్కర కాలంలో ఎపెక్స్‌ ‌కౌన్సిల్‌ ‌జరిగినవి రెండే. చివరి సమావేశం 2020 అక్టోబర్‌‌లో జరిగింది. మొదటి భేటీకి చంద్రబాబు, రెండవ సమావేశానికి జగన్మోహన్‌‌రెడ్డి ఎ.పి తరఫున హాజరు కాగా, రెండు తడవలూ కెసిఆర్‌ ‌పాల్గొన్నారు. ఎవరి వాదనలు, అభ్యంతరాలు ఏం వినిపించినా సమస్య అయితే పరిష్కారం కాలేదు.

కృష్ణా వివాదాలపై ఏర్పాటు చేసిన మొదటి ట్రిబ్యునల్‌ (బచావత్‌) ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌‌కు కేటాయించిన 811 టిఎంసి లలో తాత్కాలిక ప్రాతిపదికన 66:34 నిష్పత్తిలో ఎ.పి కి 512 టిఎంసి, తెలంగాణకు 299 టిఎంసి ల వంతున పరస్పర ఒడంబడిక కుదిరింది. ఎ.పి కి అనుకూలమైన నిర్ణయమని, తమ రాష్ట్రంలో నదీ పరీవాహక ప్రాంతం 70 శాతం ఉందని, కనీసం 50:50 నిష్పత్తిలో నీటిని పంపిణీ చేయాలని తెలంగాణ ప్రభుత్వం అభ్యంతరం వ్యక్తం చేయగా, 66:34 ఫార్ములాను ఎ.పి. ఆమోదించిన నేపథ్యంలో రెండు రాష్ట్రాల మధ్య వివాదాన్ని తన చేతుల్లోకి తీసుకున్న కేంద్ర సర్కార్‌ 2021 జులైలో కృష్ణా, గోదావరి ప్రాజెక్టులన్నింటి నియంత్రణనూ తన పరిధిలోకి తెచ్చుకుంటూ నోటిఫికేషన్‌ ఇచ్చి పిట్ట పోరు పిట్ట పోరు పిల్లి తీర్చిన మాదిరి పెద్దరికం చేసింది. కృష్ణా వివాద రెండవ ట్రిబ్యునల్‌ (‌బ్రిజేష్‌ కుమార్‌) ‌గడువును 2027 జులై వరకు పొడిగించడంతో పాటు, ఉమ్మడి ఎ.పి కేటాయింపులనే ఆంధ్రా, తెలంగాణ మధ్య పున:పంపిణీ చేయాలని, మహారాష్ట్ర, కర్ణాటక కేటాయింపుల జోలికి పోవద్దని విధి, విధానాల్లో నిర్దేశించింది. ఎ.పి, తెలంగాణ రెండూ ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నాయి. నాలుగు రాష్ట్రాల మధ్య పున:పంపిణీ కాకుండా, విడిపోయిన రెండు తెలుగు రాష్ట్రాల మధ్య బిజెపి సర్కార్‌ పంచాయితీ పెట్టి తమాషా చూడటం దారుణం.

బ్రిజేష్‌ ‌కుమార్‌ ‌ట్రిబ్యునల్‌ను 2004లో ఏర్పాటు చేయగా 2013లో అది ఇచ్చిన తుది నివేదికలో ఉమ్మడి ఎ.పి కి అన్యాయం చేసిందన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తమైంది. దిగువ రాష్ట్రమైన ఎ.పి కి వరద జలాలపై బచావత్‌ ‌పూర్తి హక్కులివ్వగా, బ్రిజేష్‌ ‌కుమార్‌ వాటిలోనూ ఎగువ రాష్ట్రాలకు వాటా కల్పించారు. నీటి లభ్యతను 75 నుంచి 65కు కుదించారు. అప్పట్లో ఎ.పి సరైన వాదనలు చేయలేదన్న విమర్శలు వచ్చాయి. కాగా బ్రిజేష్‌ నిర్ణయాలు తమకు నష్టం కలిగిస్తాయని సుప్రీం కోర్టులో ఎ.పి సవాల్‌ ‌చేసిన కారణంగా ఫైనల్‌ ‌నోటిఫికేషన్‌ నిలిచిపోయింది. విభజనానంతరం ఎ.పి, తెలంగాణ మధ్య నెలకొన్న వివాదాన్ని తనకనుకూలంగా మార్చుకున్న మోడీ ప్రభుత్వం తెలుగు రాష్ట్రాల మధ్య కొత్త తంపులకు కారణమైంది. బ్రిజేష్‌ తీర్పు తమకనుకూలం కనుక త్వరగా నోటిఫై చేయాలని కర్ణాటక న్యాయస్థానం తలుపు తట్టింది. బ్రిజేష్‌ ‌అవార్డు అమల్లోకొస్తే ఆల్మట్టి ఎత్తు పెరుగుతుంది. అందుకు కర్ణాటక నిశ్శబ్దంగా అన్ని ఏర్పాట్లూ చేసుకుంటూ పోతోంది. ఇప్పటికే పలు ప్రాజెక్టులను ఆ రాష్ట్రం చేపట్టింది. మామూలు రోజుల్లోనే దిగువకు నీరు రావడం గగనమవుతోంది. అవన్నీ జరిగితే ఎల్‌‌నినో వంటి సంవత్సరాల్లో చుక్క నీరు కిందికి రాదు. భవిష్యత్తు విపత్తుపై రెండు తెలుగు రాష్ట్రాలూ దృష్టి సారించాల్సి ఉంది. తమలో తాము తగవులు పడకుండా రెండు రాష్ట్రాలూ ద్వైపాక్షికంగా సామరస్య పూర్వకంగా సమస్యను తమలో తాము పరిష్కరించుకోవాలి. కాచుక్కూర్చున్న కేంద్రం చేతుల్లో పెట్టకుండా జాగ్రత్త పడాలి. అదే రెండు తెలుగు రాష్ట్రాల ప్రజల ప్రయోజనాలకు రక్ష.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్