ప్రపంచ జనాభాలో సుమారు 92 శాతం మంది స్వయంగా లేదా కుటుంబ సభ్యుల ద్వారానో క్యాన్సర్‌ను ఎదుర్కోబోతున్నారన్న ప్రపంచ ఆరోగ్య సంస్థ ( డబ్ల్యూహెచ్‌ఒ), అంతర్జాతీయ క్యాన్సర్ పరిశోధన సంస్థ (ఐఎఆర్‌సి) సంయుక్తంగా విడుదల చేసిన తాజా నివేదిక అత్యంత ఆందోళనకరం. క్యాన్సర్ కేవలం ఒక వ్యాధి కాదు, అది ప్రపంచ ఆరోగ్య, ఆర్థిక వ్యవస్థలను, కుటుంబాలను త్రీవంగా కుదిపేయనున్న ఒక సామాజిక సంక్షోభమని ఈ నివేదిక హెచ్చరిక చేసింది. 2024లో ప్రపంచవ్యాప్తంగా రెండు కోట్ల 60 లక్షలకు పైగా కొత్తగా కేసులు నమోదు కావడం, దాదాపు 97 లక్షల మంది మరణిచండం ద్వారా క్యాన్సర్ ఎంత వేగంగా విస్తరిస్తుందో స్పష్టం అవుతుంది. ఇందులో అత్యంత ఆందోళనకరమైన అంశం ఏమంటే, మరణించిన వారిలో 48 లక్షల మందికి పైగా 30-69 సంవత్సరాల మధ్య వయస్సు వారు కావడం. అంటే, కుటుంబాలకు ఆధారంగా ఉన్నవారు ఈ వ్యాధికి గురవుతున్నారు. ప్రతి తొమ్మిది మంది పురుషుల్లో ఒకరు, ప్రతి 13 మంది స్త్రీలలో ఒకరు 75 ఏళ్లు నిండకముందే క్యాన్సర్‌తో ప్రాణాలు కోల్పోతున్నారని ఈ నివేదిక తెలిపింది. పురుషుల్లో ఎక్కువ మంది ఊపిరితిత్తుల క్యాన్సర్, ప్రోస్టేట్ క్యాన్సర్ కు, మహిళల్లో అత్యధికులు రొమ్ము క్యాన్సర్ కు గురవుతున్నారు. ఏటా నాలుగు లక్షల మంది పిల్లలు, యుక్తవయస్కులు క్యాన్సర్ బారిన పడుతుండటం, వారిలో అధిక శాతం పేద, మధ్య ఆదాయ దేశాలకు చెందినవారే కావడం మరో బాధాకరమైన వాస్తవం.
అయితే, క్యాన్సర్ ప్రభావం రోగికి మాత్రమే పరిమితం కాదు. 2020లో క్యాన్సర్ మరణాల కారణంగా ప్రపంచవ్యాప్తంగా దాదాపు 24.5 లక్షల మంది పిల్లలు తల్లిదండ్రుల్లో ఒకరిని కోల్పోయి అనాథలుగా మారారు. వీరిలో సగం మంది మన ఆసియా ఖండంలోనే ఉన్నారు. అలాగే, క్యాన్సర్ బాధితుల్లో కనీసం 45 శాతం మంది తీవ్ర ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఆరోగ్య బీమా సదుపాయాలు ఉన్న దేశాల్లో సైతం, చికిత్స ఖర్చులు కుటుంబాలను దివాలా అంచుకు నెట్టివేస్తున్నాయని నివేదిక స్పష్టం చేసింది. అధిక ఆదాయ దేశాల్లో రొమ్ము క్యాన్సర్ బాధితుల్లో 85 శాతానికి పైగా కనీసం ఐదేళ్లు జీవించగలుగుతుంటే, తక్కువ ఆదాయ దేశాల్లో 45 శాతం మంది మ్రాతమే అలా జీవించగలుగుతున్నారు. పిల్లల విషయంలో ఈ అంతరం మరింత ఎక్కువగా ఉంది. ప్రపంచ జనాభాలో దాదాపు 47 శాతం మందికి ప్రాథమిక వ్యాధి నిర్ధారణ సేవలు అందుబాటులో లేవు.
మన దేశంలో కూడా క్యాన్సర్ వ్యాధి వేగంగా విస్తరిస్తుంది. డబ్ల్యూహెచ్‌ఒ గ్లోబల్ స్టేటస్ రిపోర్ట్ ఆన్ క్యాన్సర్ 2026 ప్రకారం, 2024లో భారత్‌లో సుమారు 16 లక్షల కొత్త క్యాన్సర్ కేసులు, 9 లక్షల మరణాలు నమోదయ్యాయి. 2050 నాటికి ఏటా కొత్త కేసులు 28 లక్షలకు చేరుకోవచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రతి పదిమంది భారతీయుల్లో ఒకరు 75 ఏళ్లు నిండకముందే క్యాన్సర్ బారిన పడే ప్రమాదం ఉందని గ్లోబోకాన్ హెచ్చరిస్తోంది. అయితే, భారత్‌లో క్యాన్సర్ తీరుతెన్నులు పాశ్చాత్య దేశాల కంటే భిన్నంగా ఉండటం గమనార్హం. మహిళల్లో రొమ్ము క్యాన్సర్ అధికంగా ఉండగా, పురుషుల్లో పొగాకు వినియోగం కారణంగా నోటి క్యాన్సర్ ప్రధాన సమస్యగా ఉంది. గుట్కా, పాన్ మసాలాలు నిషేధించినట్లు ప్రభుత్వాలు చెప్పుకుంటున్న అవి విస్తారంగా అందుబాటులో వుంటున్నాయి. ప్రజల ఆరోగ్యం కాపాడే బాధ్యత తమది కాదన్నట్లుగా కేంద్ర ర్రాష్ట ప్రభుత్వాలు ఏటేటా బడ్జెట్‌లో నిధులకు కోతలు విధిస్తున్నాయి. కార్పొరేట్ కంపెనీలు వైద్యాన్ని పెద్ద వ్యాపారంగా మార్చేశారు. క్యాన్సర్ వ్యాధికి గురైన పేద, దిగువ మధ్యతరగతివారు లక్షల రూపాయలు ఖర్చుచేసి వైద్యం చేయించుకునే అవకాశాలు లేవు. అందుకనే ఈ వ్యాధికి గురైన పేదలు త్వరగా మరణించడం జరుగుతుంది. ప్రభుత్వాలు ప్రజారోగ్యాన్ని సంరక్షించే బాధ్యతను విస్మరిస్తే పర్యావసానాలు ఎంత ఘోరంగా ఉంటాయో కోవిడ్ మహమ్మారి తేటతెల్లం చేసింది. ఇప్పటికీ కోవిడ్ భయాలు వెంటాడుతున్నాయి. తాజాగా ఆంధ్రప్రదేశ్‌లో కడప ప్రాంతంలో కోవిడ్‌తో ఒక వ్యక్తి మరణించడం, మరికొందరిలో ఆ వ్యాది లక్షణాలు ఉండటం అందోళన కలిగిస్తుంది. అయినా పాలకులు కళ్లు తెరవకపోవడం అత్యంత విషాదం. దీనికి తోడు వేగవంతమైన పట్టణీకరణ, మారుతున్న ఆహారపు అలవాట్లు, శారీరక శ్రమ తగ్గిపోవడం, వాయు కాలుష్యం ఇవన్నీ కలిసి క్యాన్సర్ భారాన్ని పెంచుతున్నాయి. గ్రామీణ, పట్టణ ప్రాంతాల మధ్య ఆరోగ్య సేవల్లో అంతరాలు పెరుగుతున్నాయి. మెట్రో నగరాల్లో అందుబాటులో ఉన్న అత్యాధునిక చికిత్సలు సమీప గ్రామీణ జిల్లాలకు చేరడం లేదు. ఈ సంక్షోభాన్ని ఎదుర్కోవడానికి ప్రభుత్వ విధానాలు మారాలి. ఆరోగ్యం వ్యాపార సరుకు కాదు, అది భవిష్యత్ తరాల రక్షణగా గుర్తించాలి. మనుషుల ఆరోగ్యాన్ని కాపాడుకోలేని అభివృద్ధి లెక్కలు సమాజాన్ని పురోగతివైపు నడపలేవని పాలకులు గుర్తెరగాలి.







కామెంట్‌లు (0)