- సుబ్రమణ్యం
''అత్యధిక సర్క్యులేషన్ గల దినపత్రిక''ను చేత్తో పుచ్చుకుని ఎప్పటిలాగే మా పక్కింటి రత్తయ్యగారు కాఫీ టైముకి వేంచేసేడు.
''ఏంటి సార్ విశేషాలు?'' అని నేను కూడా ఎప్పటిలాగే కబుర్లు మొదలుపెట్టేను.
'' మనం అర్జెంటుగా పొదుపు చర్యలు పాటించాలని ఢిల్లీ నుండి మోడీగారు, అమరావతి నుండి చంద్రబాబు గారు పిలుపిచ్చేరు.'' అన్నాడు రత్తయ్య.
''ఇప్పుడు పొదుపు పాటించాల్సినంత కొంపలు మునిగిపోయే పరిస్థితి ఏమొచ్చిందట?'' అంటూ నా సతీమణి రెండు కప్పుల్తో కాఫీ పట్టుకొచ్చి అందిస్తూ అడిగింది.
రత్తయ్య గారు ముందు కాఫీ కప్పుకేసి చూసి అది నిండుగానే ఉండడం చూసి రిలాక్సయ్యేడు. ''ఆ పొదుపు గురించి ఆమెకి ఇంకా తెలియలేదు లెండి, రేపటి నుంచీ మొదలుపెడుతుంది'' అని నేను అనేసరికి కాస్తంత బెంగ పెట్టుకున్నాడు.
''ఇంతకీ ఆ పొదుపు ఎందుకో చెప్పారు కాదు'' అని ఆమె రెట్టించింది. దాంతో రత్తయ్యకి వివరణ ఇవ్వక తప్పలేదు.
రూపాయి విలువ పడిపోతోందట. దానిక్కారణం మాత్రం మోడీ-చంద్రబాబు విధానాలు కారణం కాదట. అమెరికాతో కడు మూర్ఖంగా ఇరాన్ యుద్ధానికి తలపడడమేనట. అందువలన మనం దిగుమతి చేసుకునే ముడిచమురు ధర పెరిగిపోతోందట. ఇలా దిగుమతులు పెరిగిపోయి ఎగుమతులు తగ్గిపోయినందువలన రూపాయి మారకం విలువ పడిపోతోందట. దానిని ఆపాలంటే దిగుమతులను తగ్గించకపోయినా, ఎగుమతులను మాత్రం బాగా పెంచాలట. ఎగుమతులు పెరగాలంటే మనం వాటిని వాడడం తగ్గించేయాలట. అలా వాడకాలని తగ్గించేసి మనం నిజమైన దేశభక్తులమని రుజువు చేసుకోవాలట. అలా గనుక చేయకపోతే మనల్ని పాకిస్థాన్ ఏజంట్లుగానో, చైనా ఏజంట్లుగానో లెక్కగట్టే ముప్పు ఉందట. --ఇదీ రత్తయ్య గారి సందేశం.
ఖాళీ చేసిన కాఫీ కప్పుల్ని లోపలికి తీసుకుపోతూ నా సతీమణి ''బాగానే వుంది వరస! మొన్నటికి మొన్ననేమో ఎక్కువమంది పిల్లల్ని కనడమే నిజమైన దేశభక్తి అని చెప్పేరు, ఇవాళేమో ఖర్చులు తగ్గించేయాలంటున్నారు? ఈ గవర్నమెంటుది అంతా తిరకాసు వ్యవహారంలాగుందే !'' అని రుసరుసలాడింది. రత్తయ్య గారు చల్లగా జారుకున్నాడు.
+++
కాఫీ సేవనం ముగిసింది గనుక సంచీ పుచ్చుకుని రైతుబజారుకెళ్ళేను. కేజీ టమాటాలు రూ.32 అన్న బోర్డు ఉన్న దుకాణానికి వెళ్ళి అర కేజీ టమాటాలు తీసుకున్నాను. జేబులో పెద్ద నోట్లు ఉన్నాయి కాని చిల్లర కొంచెమే ఉంది. నేను ఫోన్ పే సదుపాయాన్ని వాడడం లేదు. నాకు దాని పాస్ వర్డ్ ఎప్పుడూ గుర్తుండదు. జేబులన్నీ తడిమి మొత్తానికి 15 రూపాయల చిల్లర ఉంటే టమాటాలు అమ్మిన ఆమెకి ఇచ్చేను.
ఆమె లెక్కెట్టుకుని ''ఉంకో రూపాయి నాకే ఒస్తాదండి'' అంది. ''రేపొచ్చినప్పుడు ఇచ్చేస్తానులే అమ్మా'' అన్నాను. ఆమె సరేనంది. నేను ఊరుకోవచ్చు కదా.
'' అయినా రూపాయికి ఇప్పుడు పెద్ద విలువ లేదుటమ్మా. పేపర్లో రాసేరు'' అన్నాను. అప్పుడామె ''అదేటండి? మరి రూపాయి విలువ పడిపోతే అప్పుడు నా టమాటాల విలువ పెరగాలి కదా? అదెందుకు పడిపోయింది? మొన్న నలభైకి అమ్మేను. ఇవ్వేళ రూ.32కే అమ్మాలన్నారు. మీ మాటే నిజం అయితే ఇవ్వేళ రూ.50 కి అమ్మాల గదా?'' అంది. నేను ఏం చెప్పాలో తోచక బుర్ర గోక్కుని ''రేపు ఇచ్చేస్తాలే తల్లీ'' అని బైట పడ్డాను. కాని ఆమె అడిగినదానికి నా దగ్గర సమాధానం లేదు.
చిన్నప్పుడు నేర్చుకున్న చదువంతా ఒకలా ఉంది. కాని ఇప్పుడు మరోలా జరుగుతోంది. అప్పుడేమో 'డిమాండ్-సప్లై సూత్రం ప్రకారం ధరలు డిసైడ్ అవుతాయి' అని నేర్చుకున్నాను, కాని ఇప్పుడంతా తిరకాసుగా కనపడుతోంది. కరెన్సీ మార్కెట్ లో రూపాయి విలువ పడిపోయిందని చెప్పి పెట్రోలు, గ్యాస్ ధరలని పెంచీసేరు. మరి అదే లాజిక్ రైతులు పండించే పంటలకి కూడా వర్తిస్తుంది కదా? వాటికి కూడా రేట్లు పెరగాలి కదా? అవెందుకు పడిపోతున్నాయి?
సాయంత్రం ఇంటికి తిరిగొచ్చిన మా అబ్బాయితో ఇదే అన్నాను. '' అదేంటి నాన్నా? రూపాయి విలువ పడిపోతే మరి నా జీతం పెరగాలి కదా? ఇప్పుడప్పుడే జీతాలు పెంచేది లేదని మా ఓనరు గట్టిగా చెప్పీసేడు. పైగా రేపటి నుంచీ రోజుకి 12 గంటలపాటు పని చేయాలట! అది కూడా ఇదే జీతానికి. ఏమిటీ అన్యాయం అనడిగితే చంద్రబాబు చెప్పేడు కదా అంటున్నాడు నాన్నా మా ఓనరు! అంతా తిరకాసులాగుంది'' అని వాడు వాపోయాడు.
ఆ సరికి వచ్చిన నా సతీమణి '' ఇంతకన్నా తిరకాసు ఇంకోటుంది తెలుసా? ఇలా రైతులకి, వర్కర్లకి అందరికీ వడ్డించడంలో ఘనాపాఠీలైన వాళ్ళనే మనం తెలిసి తెలిసి మళ్ళీ మళ్ళీ వోట్లేసి మరీ గెలిపిస్తున్నాం చూడండి! అదీ మీరు తెలుసుకోవలసిన అసలు తిరకాసు వ్యవహారం'' అని ఘాటుగా దులిపేసింది.
అవును మరి! అదీ తిరకాసే కదా!







కామెంట్‌లు (0)