ఆపరేషన్ కవరప్.. కుంభకోణం దాచివేత. ఇప్పుడు అయోధ్య రాముడికి అదే పెద్ద తల నొప్పిగా తయారైంది. తన నగలు, విరాళాలు పోతే పోయాయని ఎలాగో సరిపెట్టుకుందాం అనుకున్నా సంఘపరివార్ భక్తులు ఒక్క పట్టాన వదలిపెట్టడం లేదు. ‘బ్రోచేవారెవరురా...’ అంటూ తమను ఈ గండం నుంచి గట్టెక్కించే పని కూడా ఆయననే చూసిపెట్టమంటున్నారట. భారీ కుంభకోణం బద్దలైనా పెదవి విప్పని మౌన ముని నరేంద్ర మోడీ లాగే దేశ ప్రజలు కూడా నోరు మూసుకోవాలని ఉపదేశిస్తున్నారు. ఏదో చిన్నపాటి చౌర్యానికే ప్రతిపక్షాలు గొడవ చేస్తున్నాయి చూడండని ఎదురు దాడికి పాల్పడుతున్నాయి. అయోధ్య ట్రస్టు కూడా ఏదో పైపై చర్యలతో సరిపెట్టేందుకు హడావుడి పడుతున్నది. ఆరెస్సెస్ అధినేత మోహన్ భగవత్‌ను ఈ విషయమై ప్రశ్నిస్తే రామరామ అని ముక్తసరిగా ముగించారు యు.పి ముఖ్యమంత్రి ఆదిత్యనాథ్ తాను సిట్ వేసి దొంగలను అరికడితే తమపైనే ఆరోపణలు చేస్తున్నారని ఆగ్రహిస్తున్నారు. బిజెపి జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ కూడా యు.పి లో ప్రచారం చేసి వస్తూ అయోధ్య చోరీ వల్ల యు.పి లో మన విజయావకాశాలు తగ్గకుండా చూసుకోవాలని ఎన్నికల సుభాషితాలే గుప్పించి వదిలారు. వీరందరిని మించిన ప్రబుద్ధుడు ఎస్.గురుమూర్తి. పరివార్ ప్రియతమ వ్యాఖ్యాత, వ్యవహార నిపుణుడు. ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌లో ఎప్పుడూ సంఘ్ వాదనలే చేస్తుంటారు. ఈ రెండు రోజులలో రెండు భాగాలుగా రాసిన వ్యాసాలలో గురుమూర్తి అయోధ్యలో చిన్న దొంగతనాన్ని పెద్దదిగా చూపి ఎన్నికల్లో లబ్ధి పొందాలని ప్రతిపక్ష సమాజ్ వాది పార్టీ, కాంగ్రెస్ వంటివి పథకాలు వేస్తున్నాయని ధ్వజమెత్తారు. 1992 నుంచి విహెచ్‌పి నాయకత్వంలో రామజన్మభూమి ట్రస్టు నడిపిన హిందూత్వ ఉద్యమాన్ని ఆయన ఏకరువు పెడుతూ బిజెపి అప్రమత్తంగా లేకపోతే ప్రజలలో విముఖత వచ్చే ప్రమాదముంటుందని అంగీకరించారు. ఇంతకూ మాజీ ముఖ్యమంత్రి అఖిలేశ్ యాదవ్...టీనూ అనే ఆటో డ్రైవర్ ద్వారా ఈ కూపీ లాగారట. ఇతను యాదవ్‌ను కావాలనే చేర్చి అల్లుకుపోయేలా చేశారట. వరుసగా ఫోన్‌లు చేసి తెలుసుకునేవారట. అయోధ్య తర్వాత వరుసగా ఇతర ప్రసిద్ధ యాత్రా స్థలాల్లో కూడా సందేహాలు పెరగడం కొసమెరుపు. ఎ.పి లో కూడా కీలక ఆలయాలకు భక్తులు పెరిగారు గానీ వసూళ్లు తగ్గాయని కొన్ని లెక్కలు విడుదలవుతున్నాయి. రాముడే చూసుకోవాలిక!
- ఫీచర్స్ అండ్ పాలిటిక్స్







కామెంట్‌లు (0)