ఆదివారం, 12 జులై 2026E-PAPER
మ్యాగజైన్స్

విద్వేష వివాదాలు, నిరంకుశ చట్టాలు

1 గంట క్రితం

uapa
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 12, 2026, 05:45 పూర్వాహ్నం | 5 నిమిషాల చదవడం

ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణలలో ఆ మాటకొస్తే అసలు దక్షిణ భారతంలోనే బిజెపి ప్రధాన శక్తి కాదుగనక దాని గురించి వామపక్షాలు ఎందుకు ఎక్కువగా కేంద్రీకరిస్తాయని కొందరు తేలిగ్గా మాట్లాడుతుంటారు. ఇక్కడ అంతగా లేని మతతత్వ పార్టీ గురించి మాట్లాడుతూ ప్రాంతీయ పార్టీలను, వాటి ప్రభావాన్ని ఉపేక్షిస్తాయని ఆరోపిస్తుంటారు. వారికంటే వీరు మెరుగు, వీరి కంటే వారు మెరుగు గనక అటో ఇటో చేరిపోవడం మంచిదని ఉచిత సలహాలు గుప్పిస్తుంటారు. ఇవన్నీ ఎంత అవాస్తవికమైనవో, ఆధార రహితమైనవో ఈ వారంలో పరిణామాలు నిరూపించాయి. కుల, మతాలు, ప్రాంతాల వారీ వివాదాల చర్చలు ఒక్కసారిగా తెలుగు నాట వేడెక్కిపోతున్నాయి. అంతర్వేది, రామతీర్థం ఘటనల నాటి కంటే ... ఇంకా చెప్పాలంటే తిరుపతి లడ్డూ వివాదం నాటి కంటే ఇప్పుడు మత చర్చల తాకిడి తీవ్రంగా వుంటున్నది. ప్రాంతీయ జాతీయ పార్టీల మధ్యన అటూ ఇటుగా అప్రకటిత స్నేహ సంబంధాలు అందరికీ తెలిసిపోతున్నాయి. మీడియా, సోషల్‌ మీడియాలు ఉమ్మడిగానే వుంటున్నాయి గనక ఈ అరెస్టులు హైదరాబాదులో జరిగినా ఎ.పి లోనూ సెగ పుట్టిస్తున్నాయి. కొన్ని సమావేశాలు, చర్చలు, మౌలిక రాజకీయాంశాల్లోకి పోకుండా ఇరు రాష్ట్రాల భాషా శైలిలో తేడాలు లేదా నదీజలాల పంపిణీలో విభేదాల వంటి వాటిపై వివాదాలు పెంచే దిశలో సాగుతున్నాయి. ఎ.పి లో నేరుగా కూటమి ప్రభుత్వం గనక మత రాజకీయాలకు బాహాటంగా వత్తాసు లభిస్తుంటే తెలంగాణలో కూడా సాఫ్ట్‌ హిందూత్వ వంటి దానికి ప్రోత్సాహం పెరుగుతున్నది. ఇన్నిటి మధ్యనా చాప కింద నీరులా బిజెపి ప్రభావం విస్తరించేందుకు పాచికలు వేస్తున్నది. టార్గెట్‌ తెలంగాణ, ఆపరేషన్‌ ఆంధ్ర ప్రదేశ్‌ అన్నట్లు లేదా టార్గెట్‌ ఆంధ్ర ప్రదేశ్‌, ఆపరేషన్‌ తెలంగాణ అన్నట్టు ఉభయత్రా ప్రహసనం నడుస్తున్నది.

పవన్‌ హెచ్చరికలు

మతాన్ని, నాయకులను ఇష్టానుసారం దూషిస్తే సహించేది లేదని ఉప ముఖ్యమంత్రి, సనాతన సేనాని పవన్‌ కల్యాణ్‌ తీవ్ర హెచ్చరిక చేయడంతో ప్రభుత్వ వైఖరిలో మార్పు ప్రస్ఫుటమైంది. నారా లోకేశ్‌ ప్రకటించిన రెడ్‌ బుక్‌ చర్చ కొత్త మలుపు తిరిగింది. కెవిఆర్‌, ప్రశ్న రావణ్‌ అనే ఇద్దరు యూ ట్యూబర్ల అరెస్టుతో ఇది మరింత తీవ్ర రూపం దాల్చింది. చాలా చోట్ల వారిపై వరుస కేసులు నమోదైనాయి. రావణ్‌ను నాలుగు సార్లు కోర్టులో హాజరుపర్చినా బెయిలుతో బయిటకు వచ్చారు. అయిదోసారి అతన్ని ‘ఉపా’ చట్టం కింద మరోచోట అరెస్టు చేయడంతో కోర్టు కస్టడీకి పంపించింది. తన అసలు పేరు జోసఫ్‌ అనీ, అతను హిందూ మతాన్ని, కూటమి నాయకులనూ కించపర్చడానికే ఇవన్నీ చేస్తున్నాడనీ ఫిర్యాదులతో మొదలై తర్వాత మావోయిస్టు భావజాల ప్రచారకుడనీ ఆ పైన అసభ్య వీడియోలు దొరికాయనీ ప్రభుత్వ వర్గాలు సైతం ఆరోపించాయి. తను గతంలో మీతోనే వున్నాడని వైసిపి వాదన. కొన్ని క్రైస్తవ ప్రచార సభల వీడియోలు కూడా విడుదలైనాయి. అయితే రాధా మనోహర్‌ దాస్‌ వంటి వారికి జవాబుగానే ఇవి మాట్లాడామని, వారిని ఎందుకు ఉపేక్షిస్తున్నారని ఇటు వైపు వారు ప్రశ్నలు వదిలారు. ఈ కేసులు కోర్టుల ముందుకు పోవడం న్యాయమూర్తులు తమవైన వ్యాఖ్యానాలతో సంబంధిత చట్టాల ప్రకారం ఉత్తర్వులు ఇస్తూ వస్తున్నారు. అసలు యూట్యూబర్లు జర్నలిస్టులా వీరికి హక్కులేమిటి? ఎవరు ఎవరి వెనక వున్నారు? అంటూ నిజాలు, అబద్ధాలు, ఆరోపణలు, అభూత కల్పనలూ మేళవించి ఏది వాస్తవమో ఏది కల్పితమో తెలుసుకోలేనంత దారుణంగా రాజకీయ, మీడియా రంగాలు వేడెక్కిపోతున్నాయి. కేంద్ర రాష్ట్రాల పాలక పార్టీల ప్రభుత్వాల నేతల తిట్ల పురాణాలు, పోటా పోటీ సవాళ్లు వీటికి తోడై నిజమైన రాజకీయ విషయాలు తెర వెనక్కు పోయాయి.

అందరిపై దాడి..హక్కులకు ముప్పు

ప్రొఫెసర్‌ కె.నాగేశ్వర్‌పై జనసేన కేసుల నాటి నుంచి ఈ ధోరణులు రగులుతూ వున్నాయి తప్ప తగ్గడం లేదు. ఇలాంటి నిర్బంధ చర్యలు మంచివి కావని చెప్పిన ప్రకాశ్‌ రాజ్‌ వంటి వారిని కూడా పెద్ద నిందితుడుగా దూషించడం, అరెస్టు చేయాలనడం, సినిమాల నుంచి బహిష్కరించాలనడం వైసిపి కుట్రలతో, నిధులతో, క్రైస్తవ ప్రచారాలతో ముడిపెట్టి చూపడం పరిపాటి అయింది. ఎన్‌ఐఎ రంగ ప్రవేశం చేసి విజయవాడలో ముస్లిం తీవ్రవాదులపై సోదాలంటూ హడావుడి మొదలుపెట్టింది. దీనికి ముందు ప్రధానంగా నడుస్తున్న సాయికృష్ణ లాకప్‌ డెత్‌ వంటివి వెనక్కు పోయాయి. దేని నిజానిజాలేమిటన్నది నిష్పాక్షిక దర్యాప్తులలో, విచారణలో మాత్రమే తేలాల్సి వుంటుంది. అది ఏ మేరకు సాధ్యమన్నది ఒకటైతే ముందస్తుగా కులమత ముద్రలతో విష ప్రచారం చేయడం, ప్రభుత్వాలు పోలీసులు కఠోర చట్టాలతో దాడి చేయడం వాంఛనీయం కాదు. రాజ్యాంగం ప్రసాదించిన హక్కులు, చట్టాలు ఏ ఒక్కరికో ఒక్క సందర్భానికో పరిమితం కాదు. ఎవరో ఏదో దుర్వినియోగం చేశారని ఆరోపిస్తూ నిరంకుశ చర్యలకు పాల్పడితే అప్పుడు వాటి ఉనికికే ముప్పు వస్తుంది. కారణాలు ఏం చెప్పినప్పటికీ దేశమంతటా ముందు నుంచి వ్యతిరేకిస్తున్న ‘ఉపా’ వంటి వాటిని-అది కూడా ఒకటికి నాలుగు సార్లు కోర్టులు విడుదల చేసిన తర్వాత ప్రయోగించడం సమర్థనీయం కాబోదు. భాష పరంగా, పరువు నష్టం పరంగా, మత వివాదాల నిరోధం పరంగా చర్యలు తీసుకోవడానికి చాలా అవకాశాలున్నాయి. దానికి బదులుగా ఒకవైపున బెదిరింపులు, మరో వైపున అప్రజాస్వామిక చట్టాలను ప్రయోగించడమంటే అది విమర్శల నోరు నొక్కే ప్రయత్నం అవుతుంది. దేశవ్యాపితంగా కూడా మీడియా, సోషల్‌ మీడియాలపై, పత్రికలపై, విమర్శకులపై నిర్బంధ ఘటనలు రోజూ చూస్తున్నాం. కొందరు ఇంకా జైళ్లలోనే మగ్గుతున్నారు. ఎ.పి లోనే సోషల్‌ మీడియాపై రెండు వేలకు పైగా కేసులు, 14 వందలకు పైగా అరెస్టులు అంటున్నారు.

విమర్శిస్తే నిందలేనా?

విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ప్రమాదంలో ప్రశ్నలడిగిన కార్మిక సంఘాల నేతలపైన, కమ్యూనిస్టు నాయకులపైన కూడా పవన్‌, లోకేశ్‌లు ఎదురు దాడితో విరుచుకు పడ్డారు. తీరా చూస్తే ఇప్పటికి నెల రోజులు గడిచినా గట్టిగా చేసిందేమీ లేదు. హడావుడి మొత్తం ఆర్సెలార్‌ మిట్టల్‌, భోగాపురం ఎయిర్‌ పోర్ట్‌, డేటా సెంటర్ల పైనే వుంది. వాటిపై రౌండ్‌ టేబుళ్లు, నిరసనలు చేసేవారందరూ అభివృద్ధిని అడ్డుకునేవారేనా? భోగాపురంలో మంత్రి కింజరాపు రామ్మోహన్‌ నాయుడిని స్వయంగా తెలుగుదేశం నాయకులు నిలదీయడం నిజం కాదా? విశాఖలో బిజెపి, జనసేన నాయకులు ఆక్షేపణలు తెల్పడం, కేసులెయ్యడం, ఆఖరుకు స్పీకర్‌ కూడా విచారణ కోరడం నిజం కాదా? వీరందరినీ ఎవరితో ముడి పెడతారు? రుషికొండపై అంత రభస చేసిన వారు రెండేళ్లయినా ఎందుకు తేల్చలేదు? కేంద్ర రాష్ట్రాలు పాలుపంచుకుంటున్న పోలవరం, అమరావతిలో సమస్యలకు పరిష్కారమెప్పుడు? తెలంగాణలో గత, ప్రస్తుత ప్రభుత్వాల విధాన నిర్ణయంతో ముడిపడివున్న మెట్రో కాళేశ్వరం వంటి వాటిపై చర్యలేమిటి? తిరుపతి లడ్డూపై అంత రభస చేసిన వారు అయోధ్య రాముడి సొమ్ములే అపహరించారనే దానిపై మౌనం దాల్చడమేమిటి? గతంలో ఇదే విమర్శకులు కొందరు అప్పటి పాలకులపై పోరాడలేదా? రఘురామ కృష్ణంరాజు అరెస్టుపై సుప్రీంకోర్టు జోక్యం చేసుకోలేదా? కనుక హక్కులు ఎవరివైనా ఎప్పుడైనా ప్రజాస్వామిక దృక్పథం ఒకటే విధంగా వుంటుంది. ఇప్పుడు ఆకివీడులో రఘురామ కృష్ణంరాజు వంటి వారి చర్యలపై దళిత రిజర్వేషన్‌ను స్థానిక వివాదంగా మార్చినా చర్చిలపై దండెత్తుతున్నా కూటమి అధికారికంగా స్పందించలేదు కానీ ఆయనకు వ్యతిరేకంగా మాట్లాడిన వారిపై చర్యలు తీసుకుంటున్నది. హిందూత్వ సంస్థలు ఆయననూ పవన్‌ కల్యాణ్‌ను తమ కోసం నిలిచేవాళ్లుగా చెప్పుకుంటున్నారు. ప్రధాని మోడీతో అనుకూలంగా వుండాలన్న తాపత్రయంతోనే ఇప్పుడు వైసిపి నేతలు హడావుడిగా విడగొట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. విజయసాయి రెడ్డి వంటి వారు ఏకంగా ఉరి తీయాలంటున్నారు.

అప్రమత్తత అవసరం

బూతులు, మత పరమైన దుర్భాషలు ఏవి ఎప్పుడు ఎవరు చేసినా సమర్థనీయం కాదు. ఎవరు అధికారంలో వున్నా వ్యక్తిగతంగా నాయకులను, మహిళలను, దళిత వర్గాలను కించపర్చడం తప్పు. వాటిపై చర్య తీసుకోవడానికి వున్న చట్టాలు సరిపోతాయి తప్ప నిరంకుశ చట్టాలను తవ్వి తీయనవసరం లేదు. మామూలు చట్టాలు ఆలస్యమవుతున్నాయి గనక, నిలవడం లేదు గనక ‘ఉపా’ వంటివి రుద్దుతామనడం సరికాదు. రాజకీయ కక్ష సాధింపులు ఎప్పుడూ అనుమతించరానివి. ఈ విషయాలలో ఒకే విధమైన ప్రమాణాలు పాటించాలి గానీ మతాన్ని బట్టి, మనుషులను బట్టి, పార్టీలను బట్టి మార్చకూడదు. అసలు కులమతాలను పోటాపోటీగా పెట్టి విద్వేషాలు పెంచడం, రెచ్చగొట్టడం అనుమతించరానిది. అయితే తమది సనాతనమంటూ మతాలపై, దేవుళ్లపై అసలు ఎవరూ ఏమీ మాట్లాడరాదనడం కూడా నిలిచేది కాదు. సనాతనం అనడంలోనే ఒక రాజకీయ భావజాలాన్ని సమర్థించినట్టు స్పష్టమవుతుంది. భారత దేశంలో భిన్న మతాలు, విశ్వాసాలు వున్నాయి. ఇదే రావణ్‌ అన్న పేరే తప్పయినట్టు పోలీసులు చెప్పడం ఆశ్చర్యం కలిగిస్తుంది. దక్షిణ భారతంలో రావణుడు, బలి వంటి వారిపై భిన్నాభిప్రాయాలున్నాయి. దైవ పాత్రలకు పెట్టింది పేరైన ఎన్టీఆర్‌ స్వయంగా రావణుడిపై అభిమానమేమిటో ఒక వ్యాసమే రాశారు. ఇప్పుడు దానవీరశూర కర్ణ తప్పంటే చెల్లుతుందా? బిజెపి, ఆరెస్సెస్‌ ల అధికారిక భావజాలంగా వున్న హిందూత్వను భుజాన వేసుకున్న కూటమి లౌకిక సంప్రదాయాలు గల ఎ.పి వంటి చోట్ల యథాతథంగా అనుసరించాలనుకోవడం కుదిరే పని కాదు. బిజెపి తదుపరి లక్ష్యంగా ప్రకటించిన తెలంగాణలోనూ ఈ ముసుగులో ఉద్రిక్తతలు, వివాదాలు పెంచడం సరైంది కాదు. త్వరలోనే సున్నితమైన హైదరాబాద్‌ సహా ఎన్నికలు జరగబోతున్నాయి. ఎ.పి లోనూ స్థానిక ఎన్నికలు రాబోతున్నాయి. కనక మరింత అప్రమత్తత అవసరం. మీడియా సంస్థలు కూడా వీటిని ఎన్నడూ ఆమోదించలేదు. అదే సమయంలో విడిపోయిన మీడియా, సోషల్‌ మీడియాకు సంబంధించిన వారు కూడా బాధ్యతాయుతంగా సంయమనంతో మెలగవలసి వుంటుంది. విధానపరమైన అంశాలను వదలి వివాదాలకు పెద్ద పీట వేయడం వల్ల లాభం కన్నా చర్చ పక్కదోవ పట్టే ప్రమాదమే ఎక్కువని గ్రహించాలి. ఈ భావావరణాన్ని కాపాడుకోవడానికి బాధ్యతగా వ్యవహరించాలి. ప్రజా సమస్యలు, సామ్రాజ్యవాద ఆధిపత్యాలు, కుల వివక్ష వంటి వాటిపై పోరాటానికి ప్రాధాన్యత నివ్వాలి. ప్రజాస్వామ్య లౌకిక విలువల సంరక్షణకు పాటుపడాలి. ప్రజలు కూడా దేనికి ఎంత ప్రాధాన్యతనివ్వాలి? దేన్ని ఎంత విశ్వసించాలి? అనే విచక్షణ పెంచుకోవాలి. ఎ.ఐ యుగంలో ఇది మరింత అవసరం.

- తెలకపల్లి రవి

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్