అత్యంత పారదర్శకంగా, స్వతంత్రంగా మెలగాల్సిన ఎన్నికల సంఘం ఇప్పుడు అభాసుపాలైనట్టుగా ఇంతకుముందెన్నడూ జరగలేదు. ప్రతిపక్షాల నుంచి ఎన్ని అభ్యంతరాలు, ఆక్షేపణలు వచ్చినా ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ చీమ కుట్టినట్టు కూడా చలించలేదు. అధికార బిజెపి కనుసన్నల్లో నడవటం, దాని ఎజెండాను అమలు చేయటమే లక్ష్యంగా పెట్టుకున్నట్టుగా ఈ అధికారి రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉంటూ, ఏకపక్షంగా వ్యవహరించటం గతంలోనే తీవ్ర విమర్శలకు తావిచ్చింది. బీహార్‌లో ఎస్‌ఐఆర్ అమలు పేరిట సాగించిన అవకతవకల నేపథ్యంలో ఏకంగా పార్లమెంటులో అభిశంసన కూడా ఎదుర్కోవాల్సి వచ్చింది. అయినప్పటికీ ఆయన ఆ పదవిలో భద్రంగా ఎలా కొనసాగుతున్నాడో, దాని వెనుక ఎంతటి బలమైన దన్ను పనిచేస్తున్నదో ఇండియన్ ఎక్స్‌ప్రెస్ తాజా పరిశోధన తేటతెల్లం చేసింది. తోటి సభ్యులు ఇద్దరూ ఎన్ని అభ్యంతరాలు చెప్పినా తన ఎజెండాను ఆయన ఏకపక్షంగా సాగించుకుపోతున్న తీరు... ఎన్నికల కమిషన్ స్వతంత్రతను, స్వచ్ఛతను, పారదర్శకతనూ నేలమట్టం చేసింది. అందుకనే ఈ సంస్థను ఇంతగా భ్రష్టు పట్టించిన జ్ఞానేష్ కుమార్ తక్షణం ఆ పదవిలోంచి వైదొలగాలన్న ప్రతిపక్షాల డిమాండు సమంజసం, ప్రజాస్వామ్య పరిరక్షణకు చాలా అవసరం.
ఎన్నికల కమిషన్ చేయాల్సిన పనేమిటి? దేశంలోని అర్హులందరికీ ఓటుహక్కు కల్పించి, స్వేచ్ఛగా పోలింగులో పాల్గొనేలా చేయటం. ప్రతి ఒక్క ఓటూ ప్రజాస్వామ్యబద్ధంగా వినియోగంలోకి వచ్చేలా చూడటం. ఏ పార్టీ అవకతవకలకు పాల్పడినా, నిబంధనలను అతిక్రమించినా రాగద్వేషాలకు అతీతంగా అడ్డుకోవటం. కానీ, జ్ఞానేష్ కుమార్ సారథ్యంలోని ఎన్నికల సంఘం అక్షరాలా దీనికి భిన్నంగా నడిచిన వైనాలు అనేకం. ప్రతిపక్ష పార్టీల పట్ల కఠినంగానూ, అధికార బిజెపి పట్ల అత్యంత విధేయంగానూ వ్యవహరిస్తూ, గత సార్వత్రిక ఎన్నికల సమయానికే సంస్థ విలువను పాతాళంలో పాతర వేసింది. బిజెపి తన ఎజెండాలో భాగంగా తలకెత్తుకున్న మతాధారిత పౌరసత్వ బిల్లును దేశ ప్రజానీకం అడ్డుకోవటంతో దొడ్డిదారిన ఆ బాధ్యతను ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్) పేరిట ఎన్నికల సంఘం నెత్తికెత్తుకుంది. విపక్షాల అభ్యంతరాలకు ఇంతమాత్రం కూడా విలువ ఇవ్వకుండా ఇష్టానుసారం ఓటరు జాబితాల సవరణకు పూనుకుంది. ఈ ప్రక్రియ ద్వారా తలెత్తే పర్యవసానాలను, పరిధి దాటుతున్న అంశాలను తోటి సభ్యులు సుఖ్‌బీర్ సింగ్ సందు, వివేక్ జోషి ప్రస్తావించినా, అభ్యంతరం పెట్టినా జ్ఞానేష్ కుమార్ పరిగణనలోకి తీసుకోకపోవటం అత్యంత దారుణం. గడిచిన 10 నెలల్లో కనీసం 14 సార్లు ఈ సభ్యులు ఇద్దరూ తమ భిన్నాభిప్రాయాలను ప్రకటించినట్టు మినిట్స్‌లో నమోదైంది. దేశవ్యాప్తంగా ఆందోళనకు కారణమైన ఎస్‌ఐఆర్‌పైనా, ఓటర్ల తొలగింపు, కొత్త ఓటర్ల చేర్పు నిబంధనలు, ఓటర్ల డేటాబేస్ నిర్వహణ, రాష్ట్ర ఎన్నికల సంఘాల హక్కులు తదితర అంశాలపై వారు తమ అభిప్రాయాలను స్పష్టంగానే ప్రకటించారు. ఓటర్ల డేటాబేస్‌ను ఢిల్లీలో కేంద్రీకరించే ప్రయత్నంపైనా అభ్యంతరం వ్యక్తం చేశారు. రాష్ట్ర ఎన్నికల అధికారులకు పూర్తి స్థాయి యాక్సెస్ లేకపోవడంపైనా ప్రశ్నలు లేవనెత్తారు. ఈ కారణంగానే గోవాలో రాష్ట్ర అధికారులు అర్హులుగా ధ్రువీకరించిన 97 మంది ఓటర్ల పేర్లు తుది జాబితాలో చేరలేదని ‘ఇండియన్ ఎక్స్‌ప్రెస్’ వెల్లడించింది. ఎన్నికల సంఘం రాజ్యాంగబద్ధ సంస్థ. రాజ్యాంగం ప్రకారం ముగ్గురు కమిషనర్లు సమాన స్థాయి వారే. ఇద్దరు కమిషనర్లు కాదన్న విషయాలపై సిఇసి నిర్ణయాలు చేస్తూ ముందుకు పోవడం పచ్చి నిరంకుశ చర్య. ఈ పోకడ అత్యంత ప్రమాదకరం.
బీహార్, పశ్చిమ బెంగాల్ తదితర రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ముందు చేపట్టిన ఓటర్ల సవరణ తీవ్ర విమర్శలకు గురైంది. బెంగాల్‌లో ఎస్‌ఐఆర్‌కు సంబంధించి 37 వేలకు పైగా అప్పీళ్లు ట్రిబ్యునళ్ల ముందు ఇంకా పెండింగ్‌లో ఉన్నాయి. ఎన్నికల కమిషన్ చాలా యాంత్రికంగా వ్యవహరించటం వల్లే ఇలా జరిగిందని సుప్రీంకోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసింది. పౌరుల ఓటు హక్కును రక్షించటం అనే తన మౌలిక బాధ్యతకు విరుద్ధంగా ఎన్నికల సంఘం ప్రవర్తించటం వెనక కారణం... బిజెపి పౌరసత్వ సవరణ ఎజెండాకు అనుగుణంగా తన నడకను సవరించుకోవటమే! మాకు ఏమాత్రం తేడా అనిపించినా ఓటు తొలగిస్తాం, మీరు నిరూపించుకోండి అని పౌరుల మీదికి నెట్టేయటం పూర్తిగా బాధ్యతారాహిత్యమే! ఇప్పటికీ ఎన్నికల కమిషన్ ఏకగ్రీవ నిర్ణయాలే తీసుకుందని జ్ఞానేష్ కుమార్ సమర్థనలకు దిగటం విడ్డూరంగా ఉంది. మెజారిటీకి అనుగుణంగా నిర్ణయాలు చేయాల్సిన ఎన్నికల సంఘాన్ని ఆయన ఇంత ఏకపక్షంగా నడపటం వెనుక ఎవరున్నారన్నది పెద్ద ప్రశ్న. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని ఎంపిక కమిటీ నుంచి మినహాయించిన వ్యవహారం మొదలుకొని ఇప్పుడు జ్ఞానేష్ కుమార్ నడిపిస్తున్న ఏకపక్ష సన్నాహకం దాకా ఇందులో బిజెపి పక్షపాత ఎజెండా చాలా స్పష్టంగా కనిపిస్తోంది. జ్ఞానేష్ కుమార్ తక్షణం ఆ పదవి నుంచి వైదొలగటంతో పాటు ఎస్‌ఐఆర్‌ను రద్దు చేయాలని, ఎన్నికల సంఘాన్ని సమూలంగా సంస్కరించాలని సిపిఎం డిమాండు చేసింది. సిపిఐ, సిపిఐ(ఎంఎల్)-లిబరేషన్, ఆర్‌ఎస్‌పి, ఫార్వర్డ్ బ్లాక్ కూడా ఇదే డిమాండ్ చేశాయి. 48 గంటల్లో జ్ఞానేష్ కుమార్ తన పదవి నుంచి వైదొలగాలని కాక్రోచ్ జనతా పార్టీ డిమాండ్ చేసింది. లేకుంటే జంతర్ మంతర్ వద్ద ఆందోళన ప్రారంభిస్తామని హెచ్చరించింది. కాంగ్రెస్ మొదలుకొని ప్రతిపక్షాలన్నీ ఈ అంశంపై పార్లమెంటులో ఆందోళనకు సిద్ధం అవుతున్నాయి. మోడీ ప్రభుత్వం అడ్డగోలు సమర్థనలకు దిగకుండా తక్షణం జ్ఞానేష్ కుమార్ ని పదవి నుంచి తొలగించాలి. ఎన్నికల సంఘాన్ని సంస్కరించి, తన తప్పులను సరిదిద్దుకోవాలి.







కామెంట్‌లు (0)