-‘అనంత’లో భారీ ర్యాలీ
ప్రజాశక్తి- అనంతపురం కలెక్టరేట్ : మహిళలు, చిన్నారులపై జరుగుతున్న హత్యలు, అత్యాచారాలు, అఘాయిత్యాలను అరికట్టేందుకు ప్రతి ఒక్కరూ ముందుకు వచ్చినప్పుడే సమాజానికి రక్షణ ఉంటుందని పలువురు వక్తలు, ప్రజాసంఘాల నాయకులు పేర్కొన్నారు. డ్రగ్స్, మద్యానికి యువత దూరంగా ఉండాలని, మహిళలు, విద్యార్థినులపై దాడులను అరికట్టాలని కోరుతూ, అనంతపురం జిల్లా రాప్తాడు ఘటన బాధితురాలికి సంఘీభావం తెలుపుతూ ఎస్‌ఎఫ్‌ఐ, ఐద్వా, డివైఎఫ్‌ఐ, ఐలు, డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ (డిఎల్ఎస్ఎ) సంయుక్త ఆధ్వర్యాన అనంతపురంలో విద్యార్థులతో కలిసి శుక్రవారం అవగాహన ర్యాలీ జరిగింది. ఆర్ట్స్ కళాశాల వద్ద నుంచి వందలాది మంది విద్యార్థునులతో సప్తగిరి సర్కిల్ వరకూ సాగింది. అనంతరం అక్కడ మానవహారంగా ఏర్పడి నిరసన తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన అనంతపురం జిల్లా న్యాయసాధికార సేవా సంస్థ జడ్జి రాజశేఖర్ మాట్లాడుతూ మహిళలు, బాలికల భద్రత అందరి బాధ్యతని తెలిపారు. న్యాయసేవాధికార సేవా సంస్థ ద్వారా చట్టాలు, హక్కులపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. రాప్తాడు ఘటనను సుమోటోగా తీసుకుని విచారణ చేస్తున్నట్లు తెలిపారు. ఇలాంటి ఘటనలు భవిష్యత్తులో జరగకుండా ప్రతి ఒక్కరూ మహిళలు, బాలికలకు రక్షణగా నిలవాల్సిన అవసరం ఉందన్నారు. ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర కార్యదర్శి ప్రసన్నకుమార్, ఐద్వా రాష్ట్ర కార్యదర్శి సావిత్రమ్మ, ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి ఓతూరు పరమేష్ మాట్లాడుతూ రాప్తాడు ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థినిపై ఉన్మాది దాడి అత్యంత విషాదకరమైన సంఘటన్నారు. రాష్ట్రంలో మహిళలు, చిన్నారులపై ఇటువంటి ఘటనలు జరగడానికి ప్రధాన కారణం గంజాయి, మద్యం, మాదక ద్రవ్యాలేనని పేర్కొన్నారు. డ్రగ్స్, గంజాయి, ర్యాంగింగ్ తదితర వాటికి వ్యతిరేకంగా రాష్ట్ర ప్రభుత్వాలు అవగాహన, చైతన్య కార్యక్రమాలు చేపట్టాలని కోరారు. ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు పద్మజ, ఎస్ఎఫ్ఐ నాయకులు తరిమెల గిరి, బంగి శివ, భీమేష్, ఐద్వా నాయకులు గీత, తులసి, ఇమం భీ, శైలజ, కుమారి తదితరులు పాల్గొన్నారు.







కామెంట్‌లు (0)