కార్పొరేట్లకు, కమలనాథులకు ఏర్పడ్డ బలమైన బంధానికి బిజెపి ఖాతాల్లోకి పారుతున్న విరాళాల వెల్లువ ఒక తిరుగులేని సాక్ష్యం. ఇటీవల జరిగిన ఐదు రాష్ట్రాల ఎన్నికల కాలానికి సంబంధించి బిజెపి కేంద్ర కార్యాలయానికి రూ.1,472.8 కోట్ల మేర నిధులు వచ్చినట్టు తాజాగా వెల్లడైన లెక్కలు చెబుతున్నాయి. అదే సమయంలో కాంగ్రెస్‌కు అందిన విరాళాలు రూ.207.17 కోట్లు. అస్సాంలో రూ.96.3 కోట్లు, తమిళనాడులో రూ.51.6 కోట్లు, పుదుచ్చేరిలో రూ.11.9 కోట్లు ఖర్చు చేసినట్టు బిజెపి అధికారికంగా చెబుతోంది. లెక్కలకెక్కని, లెక్కలు చెప్పని ధన ప్రవాహం ఎంతుంటుందో అంచనా వేయొచ్చు. రాజకీయాల్లో డబ్బు ఎవరి చేతిలో ఎంతగా కేంద్రీకృతమవుతుందో, ఎన్నికల పోరులో ఆర్థిక శక్తి ఎంతటి అసమానతను సృష్టిస్తుందో ఇది స్పష్టం చేస్తోంది. కార్పొరేట్ల ప్రయోజనాలకు అనుగుణంగా పనిచేసే బిజెపి... వారి నుంచి తిరిగి పొందుతున్న ప్రతిఫలానికి ఈ విరాళాల లెక్క ఒక కొండ గుర్తు. 2024-25లో ఎలక్టోరల్ బాండ్ల ద్వారా అన్ని రాజకీయ పార్టీలకు రూ.3,826.35 కోట్లు చేరితే - అందులో రూ.3,157.65 కోట్లు, అంటే 82.52 శాతం బిజెపికే వెళ్లాయి. కాంగ్రెస్‌కు రూ.298.78 కోట్లు, తృణమూల్ కాంగ్రెస్‌కు రూ.102 కోట్లు రాగా, మిగిలిన 19 పార్టీలు కలిపి రూ.267.92 కోట్లు జమయ్యాయి. ఈ నిధుల్లో 228 కార్పొరేట్, వ్యాపార సంస్థలు రూ.3,636.82 కోట్లు అందించాయి. పాలకవర్గ పార్టీల నిధుల వ్యవస్థలో కార్పొరేట్ ధనం ఎంతటి పాత్ర పోషిస్తోందో ఈ లెక్క చెబుతోంది. అదే విధంగా కార్పొరేట్ల ప్రయోజనాలకు ఆయా పార్టీలు ఎంతగా అంకితమవుతాయో, ప్రభావితమవుతాయో కూడా ఈ విరాళాలే వెల్లడిస్తాయి. సిపిఎం దాఖలు చేసిన కేసులో 2024లో సుప్రీంకోర్టు ఎన్నికల బాండ్ల పథకాన్ని రద్దు చేసినప్పుడు... రాజకీయ విరాళాల్లో పారదర్శకత, ప్రజల హక్కు, కార్పొరేట్ నిధుల ప్రభావం వంటి అంశాలపై తీవ్రమైన ప్రశ్నలు లేవనెత్తింది. వాటికి ఇంతవరకూ కేంద్రం నుండి తగిన సమాధానమూ లేదు, సవరించుకున్న వైనమూ లేదు. బాండ్ల మార్గం రద్దయినా పెద్ద మొత్తాల నిధుల ప్రవాహం ఆగలేదు. అధికారాన్ని దక్కించుకోవడానికి ఉన్మాద భావజాలాన్ని రెచ్చగొట్టే బిజెపికి ఇలా అపరిమితంగా వచ్చిపడే కార్పొరేట్ విరాళాలతో అది ఎన్నికల తీరును దారుణంగా మార్చేసింది! కోట్లు కురిపించి పోల్ మేనేజ్‌మెంటు చేయడం దగ్గర నుంచి గెలుపొందిన ప్రత్యర్థులను తమవైపు తిప్పుకోవటం వరకూ అధికార వ్యవస్థలను, ఆర్థిక బలాన్ని ఇష్టానుసారం వినియోగిస్తూ ఉంది. ఇది ప్రజాస్వామ్యానికి పెను ప్రమాదం! దేశ ప్రయోజనాలకు తీవ్ర నష్టం. కాగా, గుజరాత్‌లో వెలుగులోకి వచ్చిన గుర్తింపు లేని రిజిస్టర్డ్ రాజకీయ పార్టీల వ్యవహారం ఎన్నికల నిధుల వ్యవస్థలోని మరో చీకటి కోణాన్ని ముందుకు తెచ్చింది. కాగితాలకే పరిమితమైన ఆరు అనామక పార్టీలు 2023-24లో సుమారు రూ.1,700 కోట్ల విరాళాలు పొందటం ఆశ్చర్యకరం. ఆ పార్టీలన్నీ కలిపి 2024 లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థుల సంఖ్య కేవలం 15. మరి ఈ అనామక పార్టీలకు ఇన్ని నిధులు ఎలా సమకూరాయి? దాని వెనుక ఉన్న ప్రయోజనాలేమిటి? అనే ప్రశ్నలకు సమాధానాలు రావాల్సి ఉంది. ప్రజల మధ్య పనిచేస్తూ, ఉద్యమాలు నిర్వహిస్తున్న సిపిఎం కార్పొరేట్ సంస్థల విరాళాలను తీసుకోరాదని నిర్ణయించింది. పరిమిత వనరులతో పోటీ చేసే వామపక్ష పార్టీలకు ఒకవైపు నిధుల కొరత, మరోవైపు భారీ మొత్తాలు వెచ్చించగల పార్టీలకు అపారమైన ఆర్థిక శక్తి ఉండటం సమాన రాజకీయ పోటీకి విరుద్ధం. ఎన్నికలంటే ప్రజలతో చర్చ, విధానాలపై వాదన, ప్రత్యామ్నాయాల ప్రతిపాదన కావాలి. కానీ డబ్బు, మీడియా, ప్రచార యంత్రాంగం, భారీ సభలు, డిజిటల్ ప్రచారం అన్నీ ఒకే రాజకీయ శక్తి చేతుల్లో కేంద్రీకృతమైతే ప్రజాస్వామ్యానికి అర్థం లేకుండా పోతుంది. అందుకే ఎన్నికల సంస్కరణలు తేవాల్సిన అవసరం చాలా ఉంది. కార్పొరేట్ విరాళాలు, పెద్ద మొత్తాల నిధులపై ఆధారపడే పరిస్థితి నుంచి బయటకు రావాలంటే ఎన్నికలకు ప్రజా నిధుల వ్యవస్థను ఏర్పాటు చేయాలి. ఎన్నికల సంఘమే దీనికి కేంద్ర సంస్థగా ఉండాలి. ప్రచార సామగ్రి, సమావేశాలకు ప్రభుత్వ స్థలాలు, ముద్రణ, ప్రయాణం వంటి అవసరాలను అది సమకూర్చాలి. అదే సమయంలో కార్పొరేట్ విరాళాలకు కఠిన పరిమితులు, ప్రతి విరాళానికి పూర్తి పారదర్శకత, పార్టీల ఆదాయ–వ్యయాల తక్షణ బహిరంగ ప్రకటన, ఎన్నికల సమయంలో పార్టీలు చేసే ఖర్చుపై పరిమితి, ఉల్లంఘనలకు కఠిన చర్యలు ఉండాలి. ఎన్నికల్లో ఎవరి వద్ద ఎంత డబ్బుంది అన్నది కాదు, ప్రజలకు ఎవరి విధానం నచ్చింది అన్నదే నిర్ణయాత్మకం కావాలి. భారీగా విరాళాలు ఇచ్చే కార్పొరేట్ సంస్థలు ఆయా పార్టీల ప్రభుత్వాల నుంచి దొడ్డిదోవల్లో ప్రయోజనాలు పొందటాన్ని నివారించాలి. ఎన్నికల కమిషన్ వంటి స్వతంత్ర వ్యవస్థలు అధికార పార్టీ చేతిలో ఆటబొమ్మలుగా మారిపోయిన వర్తమానంలో ఇలాంటి సంస్కరణలను ఆశించలేం కానీ, భవిష్యత్తులోనైనా ఎన్నికలు న్యాయబద్ధంగా జరగాలంటే మార్పులు కచ్చితంగా అవసరం. అందుకు పౌరులు, మేధావులు నిరంతర కృషి ద్వారా సమాజంలో చైతన్యం తీసుకురావాలి. ప్రజల ఓటును డబ్బు నుంచి, ప్రలోభాల నుంచి, ప్రచార మాయాజాలం నుంచి విముక్తం చేయడం ఇప్పుడు అత్యవసరమైన కర్తవ్యం.







కామెంట్‌లు (0)