‘మహిళలు మూస పద్ధతులను విచ్ఛిన్నం చేసి ప్రపంచవ్యాప్తంగా తమదైన ముద్ర వేస్తున్న తరుణంలో, పురుష-స్త్రీ సమానత్వం సమస్యపై ఇంకా చర్చించడం విషాదకరం. నేటి ప్రపంచంలోని విషాదాలలో ఇది ఒకటి’ అంటారు సినీ నటి తాప్సీ ఒక ఇంటర్వ్యూలో. స్త్రీలకు సృజన, మేధో శక్తులు ఉన్నాయనే విషయాన్ని సౌకర్యవంతంగా మరిచిన ఈ సమాజంలో మహిళల పరిస్థితి ఇంటా బయటా అంతులేని వివక్ష, అభద్రతా భావంతో ఊగిసలాడుతోంది. ఒకవైపు శాస్త్ర సాంకేతిక రంగాల్లో, అంతరిక్ష పరిశోధనల్లో మహిళలు తమ ప్రతిభను చాటుకుంటున్నా, మరోవైపు సమాజంలోనూ, ఉపాధి రంగంలోనూ వారికి దక్కాల్సిన ప్రాధాన్యత, సమానత్వం ప్రశ్నార్థకంగానే మిగిలిపోతున్నాయి. "సంధి సమానము స్త్రీలకు పురుషుల తోడన్" అంటూ స్త్రీలకు, పురుషులకు సమానమైన హక్కులు, హోదా ఉండాలనే లింగ సమానత్వ భావన గురించి గురజాడ చెబుతారు. క్షేత్ర స్థాయిలో ఆచరణాత్మక మార్పు రానంతవరకు 'బేటీ బచావో - బేటీ పఢావో' వంటి నినాదాల వల్ల పైసా ఉపయోగం లేదు; ఇవన్నీ కాగితాలపై అక్షరాలుగానే మిగిలిపోతాయి. స్త్రీని శక్తిమంతురాలిగా కీర్తించే ఈ సమాజమే ఆమెకు అవకాశాల దగ్గర అడ్డుగా నిలుస్తోంది. సమానత్వం అనేది మహిళలకు ఇచ్చే అదనపు సౌకర్యం కాదు; తోటి మనిషిగా దక్కాల్సిన హక్కు. మహిళల హక్కులను కాపాడటం నుంచి సమానంగా నిలబెట్టడం వరకు సమాజపు ఆలోచన మారాలి. పూజించే సంస్కృతి నుంచి భాగస్వామిగా గుర్తించే సంస్కృతికి ప్రయాణం మొదలుకావాలి. ఉద్యోగం, వేతనం, ఆస్తి, నిర్ణయాధికారం, రాజకీయ ప్రాతినిధ్యం వంటి హక్కుల దగ్గరకు వచ్చేసరికి ఆమెకు ఇంకా ఎన్నో గోడలు. ఈ వైరుధ్యాన్ని ఇటీవల వెలువడిన రెండు కీలక పరిణామాలు కళ్ళకు కట్టినట్లు చూపుతున్నాయి. ‘మహిళ అనే ఒక్క కారణంతో ఉద్యోగం నిరాకరించడం తీవ్రమైన వివక్షేనని, అది స్త్రీత్వానికే భంగం కలిగించడమని’ సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐఓసి) వంటి ప్రభుత్వ రంగ సంస్థలు కూడా "మహిళలు రాత్రి వేళల్లో పని చేయలేరు, సిలిండర్లు ఎత్తలేరు" అనే సాకులతో ఉద్యోగం నిరాకరించడాన్ని అత్యున్నత నాయస్థానం తీవ్రంగా తప్పుపట్టింది. "ప్రతి ఇంట్లో రోజూ సిలిండర్లను వినియోగించేది వారే అయినప్పుడు, ఆ పని చేయడం వారికి ఏమాత్రం కష్టం కాదు" అని ధర్మాసనం చేసిన వ్యాఖ్య సమాజంలో పేరుకుపోయిన పాత చింతకాయ భావజాలంపై విసిరిన చురక!
మరోవైపు, వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ (డబ్ల్యు.ఇ.ఎఫ్) విడుదల చేసిన ‘గ్లోబల్ జెండర్ గ్యాప్ రిపోర్ట్ 2026’ మన దేశంలో ఉన్న అసమానతల తీవ్రతను స్పష్టం చేస్తోంది. ప్రపంచంలోని 145 దేశాల జాబితాలో భారత్ 131వ స్థానంలో నిలవడం తీవ్ర పరిణామం. గ్లోబల్ యావరేజ్ 69.2 శాతంతో పోలిస్తే, అత్యధిక జనాభా కలిగిన మన దేశంలో లింగ సమానత్వ శాతం కేవలం 64.5 శాతంగానే ఉండటం గమనార్హం. ప్రస్తుతం ఉన్న వేగంతో వెళ్తే సంపూర్ణ లింగ సమానత్వం సాధించడానికి మరో 120 ఏళ్లు పడుతుందని ఈ నివేదిక హెచ్చరిస్తోంది. చదువులో పురోగతి కనిపిస్తున్నప్పటికీ, ఉద్యోగ, ఆర్థిక, రాజకీయ భాగస్వామ్యంలో గత 20 ఏళ్లుగా ఆశించిన మార్పు రాలేదు. ఏఐ ఇంజనీర్లలో కూడా మహిళల సంఖ్య 20 శాతం కంటే తక్కువగా ఉండటం గమనార్హం. రాజకీయాల్లో, ప్రొఫెషనల్ హోదాల్లో సీనియర్ మేనేజర్లుగా మహిళల శాతం కేవలం 13.1 శాతానికే పరిమితం కావడం ఆందోళనకరం.
మహిళా సాధికారత అనేది కేవలం ప్రభుత్వాల దయాదాక్షిణ్యాల మీదో, కోర్టులు విధించే జరిమానాల మీదో ఆధారపడి సాధ్యమయ్యేది కాదు; అది సమాజంలో రావాల్సిన నైతిక మార్పు. ‘స్త్రీ ఏ పరిస్థితుల్లోనైనా ఆరాధ్యదేవత. తుచ్ఛ శారీరకమైన దృష్టితో స్త్రీని కొలిచి విలువ కట్తాం కాబట్టే మనమిలా అధోగతిలో వున్నాం’ అంటారు సాధు సుబ్రహ్మణ్యం శర్మ. స్త్రీని పూజనీయమైన 'దేవత' అని భ్రమల్లో ఉంచేకంటే, అన్ని రకాల హక్కులూ, అవకాశాలూ ఉన్న పరిపూర్ణమైన వ్యక్తిగా గుర్తించినప్పుడే అసలైన సమానత్వానికి పునాది పడుతుంది. ‘స్త్రీలకు శరీరం ఉంది వ్యాయామం కావాలి. స్త్రీకి హృదయం ఉంది. అనుభవం ఇవ్వాలి. స్త్రీలకు మెదడు ఉంది ఆలోచించనివ్వాలి’ అన్న చలం మాటల సారం ఇంకని దశలోనే ఇంకా ఈ సమాజం వుంది. మొత్తం జనాభాలో దాదాపు 48.46 శాతం మహిళలున్న దేశం సమానత్వ సూచీలో అట్టడుగున వుంటే, ఐస్‌లాండ్ వంటి చిన్న దేశం వరుసగా 17వ ఏడాది 93 శాతం సమానత్వంతో మొదటి స్థానంలో నిలిచింది. ఫిన్లాండ్, నార్వే, నమీబియా, యు.కె తదుపరి స్థానాల్లో ఉన్నాయి. అన్ని రంగాల్లోనూ మహిళలకు ఆటంకాలు లేని సమాన అవకాశాలు, రక్షణ, సరైన ప్రాతినిధ్యం లభించినప్పుడే డబ్ల్యు.ఇ.ఎఫ్ వంటి అంతర్జాతీయ సూచీల్లో భారత్ గౌరవప్రదమైన స్థానానికి చేరుకుంటుంది. లింగ సమానత్వం అనేది కేవలం సూచికలు, హక్కుల సమస్య మాత్రమే కాదు, అది ఆర్థిక ప్రగతికి అసలైన ప్రాతిపదిక. ‘స్త్రీల జీవన ప్రమాణాలు దేశ అభ్యున్నతికి కొలమానాలు’ అన్నారు నెహ్రూ. మాటల కోటలు దాటి, ఆచరణాత్మక సమానత్వం వైపు నడిచినప్పుడే ఈ దేశంలో మహిళా వికాసం పరిపూర్ణమవుతుంది.







కామెంట్‌లు (0)