ఆదివారం, 20 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

విద్యార్థులకు ప్రశ్నించే స్వేచ్ఛ ఉండాలి

1 గంట క్రితం

keralam
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 20, 2026, 05:00 పూర్వాహ్నం | 4 నిమిషాల చదవడం

- కేరళ మాజీ విద్యాశాఖా మంత్రి ఆర్. బిందు

విద్య, వైద్య రంగాల్లో దేశంలోనే కేరళ రాష్ట్రం గుర్తింపు పొందింది. గత వామపక్ష ప్రభుత్వ హయాంలో తీవ్ర పేదరికం నుంచి బయటపడేసిన కేరళను.. ఇప్పుడు అధికారంలో ఉన్న యూడీఎఫ్‌ మళ్లీ ప్రజల్ని పేదరికంలోకి నెట్టేస్తోందని రాష్ట్ర మాజీ విద్యాశాఖా మంత్రి ఆర్. బిందు ఆవేదన వ్యక్తం చేశారు. విజయవాడలో ఇటీవల జరిగిన ఐద్వా కేంద్ర కమిటీ సమావేశాలకు హాజరైన ఆమె ప్రస్తుతం కేరళలోని పరిస్థితులపై 'ప్రజాశక్తి'తో మాట్లాడారు.

కేరళలో విద్యా వ్యవస్థ ఎలా ఉంది?

కేరళ విద్యా వ్యవస్థ దేశంలో ప్రత్యేక గుర్తింపు పొందడానికి కారణం ప్రభుత్వ విద్యా వ్యవస్థను బలోపేతం చేయడమే. ఎల్‌డిఎఫ్‌ ప్రభుత్వ హయాంలో ఉన్నప్పుడు ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలను పెంచాం. తరగతి గదులను ఆధునీకరించాం. సాంకేతిక పరిజ్ఞానాన్ని తీసుకువచ్చాం. పేద, మధ్యతరగతి కుటుంబాల పిల్లలు కూడా నాణ్యమైన విద్య పొందేలా ప్రభుత్వ విద్యా సంస్థలను బలోపేతం చేశాం. మేం రూపొందించిన విద్యా విధానానికి కేంద్ర విధానానికి స్పష్టమైన తేడా ఉంది. కేరళ సామాజిక పరిస్థితులకు, ఇక్కడి ప్రజల అవసరాలకు అనుగుణంగా విద్యా వ్యవస్థను రూపొందించాలనేది మా విధానం. విద్యను కేవలం ఉద్యోగం పొందే సాధనంగా కాకుండా, శాస్త్రీయ దృక్పథం, లౌకిక భావన, ప్రజాస్వామ్య విలువలను పెంపొందించే సాధనంగా చూశాం.

ఇప్పుడు విశ్వవిద్యాలయాల పాలన విషయంలో ఆందోళన కలిగించే పరిణామాలు కనిపిస్తున్నాయి. వైస్‌ ఛాన్సలర్ల నియామకం నుంచి అకడమిక్‌, పరిపాలనా వ్యవస్థల వరకు రాజకీయ జోక్యం పెరుగుతోంది. ఆర్‌ఎస్‌ఎస్‌ చీఫ్‌ మోహన్‌ భగవత్‌ పాల్గొన్న కార్యక్రమానికి కేరళకు చెందిన కొందరు విశ్వవిద్యాలయాల వైస్‌ ఛాన్సలర్లు హాజరుకావడం కూడా వివాదానికి దారితీసింది. విశ్వవిద్యాలయాల్లో విద్యార్థులకు ప్రశ్నించే, విమర్శించే, తమ అభిప్రాయాలను వ్యక్తం చేసే స్వేచ్ఛ ఉండాలి. శ్రీ శంకరాచార్య సంస్కృత విశ్వవిద్యాలయంలో విద్యార్థులు మౌలిక సదుపాయాలు, క్యాంపస్‌ సమస్యలపై ‘లైట్స్‌ ఆర్‌ డెడ్‌’ పేరుతో నాటకం ప్రదర్శించారు. ఆ నాటకంపై యాజమాన్యం తీవ్రంగా స్పందించడం, విద్యార్థులపై బహిష్కరణ చర్యలు తీసుకోవడం ఆందోళన కలిగించే విషయం. అలాగే, అత్యవసర పరిస్థితి నాటి నిర్బంధం, హింసను స్నేహలతారెడ్డి పాత్ర ద్వారా ప్రదర్శించిన నాటకంలోని ఒక సన్నివేశాన్ని వక్రీకరించి ప్రచారం చేయడం కూడా ఆందోళన కలిగించే విషయం. ఆ నాటకంలో నటించిన యువతిపై మతోన్మాద శక్తులు సోషల్‌ మీడియాలో ట్రోలింగ్‌ చేశాయి. ఒక కళాకారిణి తన పాత్ర ద్వారా చారిత్రక ఘటనను వ్యక్తం చేస్తే, దానిపై వ్యక్తిగత దాడులు, ట్రోలింగ్‌కు పాల్పడటం సరికాదు. కానీ, కాంగ్రెస్‌, ఆర్‌ఎస్‌ఎస్‌ నేతృత్వంలో దాడులు సాగుతున్నాయి.

ఎల్‌డిఎఫ్‌కు, యూడీఎఫ్‌కు తేడా ఏమిటి?

రెండు ప్రభుత్వాల మధ్య ప్రధాన తేడా విధానంలో ఉంటుంది. ఎల్‌డిఎఫ్‌ ప్రభుత్వం విద్యను సామాజిక బాధ్యతగా చూసింది. ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయడం, మౌలిక సదుపాయాలు కల్పించడం, పేద పిల్లలకు నాణ్యమైన విద్య అందించడం మా ప్రాధాన్యతగా ఉండేది. విద్యా రంగంలో నాలుగు సంవత్సరాల ప్రణాళికతో అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా మార్పులు తీసుకురావడానికి ప్రయత్నించాం. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చే ప్రతి విధానాన్ని యథాతథంగా అమలు చేయకుండా, కేరళ అవసరాలకు అనుగుణంగా రాష్ట్ర విధానాన్ని రూపొందించుకున్నాం. ఇప్పటి ప్రభుత్వ తీరు అందుకు భిన్నంగా కనిపిస్తోంది. కేంద్రం నుంచి నిధులు పొందడం అవసరమే అయినప్పటికీ, అందుకోసం రాష్ట్ర విద్యా విధానంలో రాజీ పడకూడదు. విద్యా రంగంలో రాష్ట్ర స్వయంప్రతిపత్తి, సామాజిక న్యాయం, లౌకిక విలువలను కాపాడాలి. విద్య అనేది మార్కెట్‌కు అప్పగించాల్సిన రంగం కాదు. అది సామాజిక బాధ్యత.

కుటుంబశ్రీ నిర్వహణ ఎలా ఉంది?

కుటుంబశ్రీ కేరళ మహిళల ఆర్థిక, సామాజిక సాధికారతకు ఒక గొప్ప నమూనా. స్వయం ఉపాధి, చిన్న వ్యాపారాలు, వ్యవసాయం, ఆహార కేంద్రాలు, హోటళ్లు వంటి అనేక రంగాల్లో మహిళలకు అవకాశాలు కల్పించింది. కుటుంబశ్రీ ద్వారా ఒక మహిళకు ఆదాయం లభిస్తే దాని ప్రభావం మొత్తం కుటుంబంపై పడుతుంది. జనకీయ హోటళ్లు కూడా ఈ కార్యక్రమంలో భాగమే. తక్కువ ధరకు సామాన్యులకు భోజనం అందించడంతో పాటు వేలాది మహిళలకు ఉపాధి కల్పించాయి. ఇప్పుడు అనేక ప్రాంతాల్లో ఈ హోటళ్లు ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నాయి. సబ్సిడీలు, ముడిసరుకుల ధరలు, స్థానిక సంస్థల నుంచి చెల్లింపులు వంటి సమస్యల కారణంగా కొన్ని హోటళ్లు మూతపడుతున్నాయి. ఇది వాటిపై ఆధారపడిన మహిళల ఉపాధిపైనా ప్రభావం చూపుతుంది. అందుకే కుటుంబశ్రీకి తగిన నిధులు, మార్కెట్‌ అవకాశాలు, మౌలిక సదుపాయాలు కల్పించాలి.

ఎల్‌డిఎఫ్‌ ప్రభుత్వ హయాంలో విద్యుత్‌ సరఫరాను మెరుగుపరచడానికి దీర్ఘకాలిక చర్యలు తీసుకున్నాం. ఇప్పుడు విద్యుత్‌ కొరత, సరఫరా అంతరాయాలు వంటి సమస్యలు కనిపిస్తున్నాయి. వీటి ప్రభావం గృహాలకే పరిమితం కాకుండా పాఠశాలలు, ఆసుపత్రులు, చిన్న పరిశ్రమలు, వాణిజ్య సంస్థలపైనా పడుతుంది.

గిరిజన ప్రాంతాల్లో పరిస్థితి ఎలా ఉంది?

రాష్ట్రం విద్య, ఆరోగ్యం, మానవాభివృద్ధి సూచికల్లో ముందున్నప్పటికీ, గిరిజన ప్రాంతాల్లో ఇంకా భూమి, ఇళ్లు, విద్య, ఆరోగ్యం, ఉపాధి వంటి సమస్యలు ఉన్నాయి. ఎల్‌డిఎఫ్‌ ప్రభుత్వం గిరిజన కుటుంబాలకు భూమి, ఇళ్లు, విద్య, సామాజిక భద్రత వంటి అంశాల్లో ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టింది. గిరిజన విద్యార్థులు చదువును మధ్యలో ఆపకుండా ఉండేందుకు స్కాలర్‌షిప్‌లు, వసతి, ఇతర సహాయ కార్యక్రమాలు అందించాం. ఒక గిరిజన విద్యార్థి ఉన్నత విద్యలోకి రావడం అంటే ఒక కుటుంబం మాత్రమే కాదు, ఒక సమాజం ముందుకు రావడం. ఇప్పుడు గిరిజన విద్యార్థులకు అందుతున్న విద్యా సహాయంలో ఏదైనా కోత వస్తే దాని ప్రభావం నేరుగా వారి భవిష్యత్తుపై పడుతుంది. అందుకే ఎస్‌టి విద్యార్థుల స్కాలర్‌షిప్‌లు, హాస్టల్‌ సదుపాయాలు, విద్యా సహాయం నిరంతరంగా కొనసాగాలి. పేదలకు అందుబాటులో ఉండే ప్రభుత్వ వైద్యం కేరళ అభివృద్ధి నమూనాలో కీలకమైన భాగం. ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్యులు, నర్సులు, మందులు, పరికరాలు, మౌలిక సదుపాయాలు అందుబాటులో ఉండాలి. పిల్లలకు వ్యాక్సినేషన్‌ వంటి ప్రాథమిక ఆరోగ్య సేవల్లో ఎలాంటి లోటుపాట్లు రాకూడదు.

విద్య, వైద్యం, మహిళల ఉపాధి, గిరిజనుల అభివృద్ధి.. ఇవన్నీ పరస్పరం అనుసంధానమైన అంశాలు. ఒక పేద కుటుంబానికి మంచి ప్రభుత్వ పాఠశాల, అందుబాటులో ఉండే ప్రభుత్వ ఆసుపత్రి, మహిళకు ఉపాధి, పిల్లలకు స్కాలర్‌షిప్‌ లభిస్తే ఆ కుటుంబం పేదరికం నుంచి బయటపడుతుంది. కేరళ ఇప్పటివరకు సాధించిన అభివృద్ధి వెనుక ఉన్న బలం ఇదే. ఆ బలాన్ని బలహీనపరిచే విధానాలను మేం వ్యతిరేకిస్తాం.


సంభాషణ : భవాని

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్