ఆదివారం, 20 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

బీపీని తగ్గించే ప్లాంక్‌ వ్యాయామం!

1 గంట క్రితం

tips
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 20, 2026, 04:30 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

రోజుకు ఒక నిమిషం పాటు ప్లాంక్‌ వ్యాయామం చేస్తే రక్తపోటును నియంత్రించడంలో కొంత ప్రయోజనం కలుగుతుందని నిపుణులు చెబుతున్నారు. ప్లాంక్‌ అంటే నేలపై మోచేతులు లేదా అరచేతులు, పాదాల ఆధారంగా శరీరాన్ని పైకి ఎత్తి, తల నుంచి మడమల వరకు ఒకే సరళ రేఖలో ఉంచి కొంతసేపు కదలకుండా ఉండే వ్యాయామం. ఈ సమయంలో పొత్తికడుపు, భుజాలు, వెన్ను, పిరుదులు వంటి అనేక కండరాలను బిగించి ఉంచుతారు. 60 సెకన్ల పాటు ఈ స్థితిలో ఉండడం వల్ల కండరాల్లో ఒత్తిడి పెరుగుతుంది. వ్యాయామం ముగిసిన తర్వాత రక్తప్రసరణ మెరుగుపడి రక్తనాళాల పనితీరుపై ప్రభావం చూపిస్తుంది. ఇలాంటి ఐసోమెట్రిక్‌ వ్యాయామాలను క్రమం తప్పకుండా చేస్తే విశ్రాంతి సమయంలో ఉండే రక్తపోటు కొంత తగ్గే అవకాశం ఉంటుందని పరిశోధనలు చెబుతున్నాయి.

అయితే మొదటి రోజే 60 సెకన్ల పాటు ప్లాంక్‌ చేయాల్సిన అవసరం లేదు. ప్రారంభంలో 20 నుంచి 30 సెకన్ల పాటు చేసి, క్రమంగా సమయాన్ని 60 సెకన్లకు పెంచుకోవచ్చు. ప్లాంక్‌ చేసేటప్పుడు వెన్నెముకను నిటారుగా ఉంచి, పొత్తికడుపు కండరాలను బిగించి, శ్వాసను సక్రమంగా తీసుకోవాలి. శ్వాసను బిగబట్టి ఉంచకూడదు. వారానికి 3 నుంచి 4 సార్లు ఐసోమెట్రిక్‌ వ్యాయామాలు చేయడం ద్వారా ప్రయోజనం పొందవచ్చు.

అయితే ప్లాంక్‌ వంటి ఐసోమెట్రిక్‌ వ్యాయామాలు చేస్తున్న సమయంలో రక్తపోటు తాత్కాలికంగా గణనీయంగా పెరగవచ్చు. అందువల్ల ఎక్కువ సమయం పాటు ప్లాంక్‌ చేయకూడదు. రక్తపోటు సమస్య ఉన్నవారు ప్రత్యేకంగా జాగ్రత్త వహించాలి. ఈ వ్యాయామంతోపాటు సమతుల్య ఆహారం, ఏరోబిక్‌ వ్యాయామాలు, తగిన నిద్ర, ఆరోగ్యకరమైన జీవనశైలిని పాటించాలి. వైద్యుడి సలహా తీసుకుని ఈ వ్యాయామం చేయడం మంచిది.



ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్