గాదె సాయికృష్ణను పోలీసులే కొట్టి చంపేసారని ఎట్టకేలకు సిట్ అధికారులు తేల్చేశారు. పోలీసు స్టేషన్‌లో ఉండాల్సిన సాయికృష్ణను పాతభవనంలో నిర్బంధించి, తీవ్ర చిత్రహింసలకు గురిచేసి, చనిపోయిన తర్వాత శవాన్ని కాల్చి, ఎముకలు కూడా లేకుండా చేశారని సిట్ రిమాండ్ రిపోర్టులో తెలిపింది. సాక్ష్యాలు కనిపించకుండా చేయడం కోసం పోలీసు స్టేషన్‌లో సిసి కెమెరాలు, డిజిటల్ సాక్ష్యాలు, రికార్టులు అన్నీ మాయం చేశారట. కొడుకు ఆచూకి కోసం కోర్టుకు వెళ్లిన తల్లికి రియల్ ఎస్టెట్ వ్యాపారి ద్వారా డబ్బు ఆశ చూపారని తెలిపిన సిట్ రిపోర్టు తీవ్ర ఆందోళనకరం. ఇదేదో ఒక ప్రత్యేక ఘటన కాదు. పోలీసుల పనితీరు తీవ్ర విమర్శలు ఎదుర్కొంటుండడం ఏడాదికేడాది పెరిగిపోతుంది. జరుగుతున్న ఘటనలను పరిశీలిస్తే స్థూలంగా మూడు కారణాలు కనిపిస్తున్నాయి. ఒకటి రాజకీయ ఒత్తిళ్లు, రెండు అక్రమ సంపాదన, మూడు పాత భూస్వామ్య భావజాలంతో కూడిన అహంకారం.
కార్మిక, విద్యార్థి, రైతు, సామాజిక సమస్యలపై ఆందోళనలు చేసినందుకు వందలమంది మీద గత ప్రభుత్వం, ఈ ప్రభుత్వం అనేక అక్రమ కేసులు పెట్టింది. అక్రమ భూ సేకరణను ప్రశ్నించాడనే కోపంతో అనకాపల్లి జిల్లా రైతు నాయకుడు ఎం అప్పలరాజుపై పిడి యాక్టు కింద అరెస్టు చేసి జైల్లో పెట్టింది. భూమి కోసం పోరాడుతున్న కూలీలపై నెల్లూరు, కడప జిల్లాల్లో రౌడీషీట్‌లు ఓపెన్ చేసింది. అనేక జిల్లాల్లో ఇలాంటి కేసులు పెరిగిపోతున్నాయి. రాజకీయ ప్రత్యర్థులమీద, వారి కుటుంబ సభ్యుల మీద తప్పుడు కేసులు పెట్టి రాజకీయంగా లొంగదీసుకోవడం, లేదా బలహీనం చేయడానికి పోలీసులను దుర్వినియోగం చేస్తున్న ఘటనలు అనేకం జరుగుతున్నాయి. పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడు లో గ్రామ దేవత ఆలయానికి సంబంధించి వివాదాన్ని రగిల్చింది డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు. కాగా పోలీసు కేసులకు, చిత్రహింసలకు గురైంది దళిత యువకులు. రాజకీయ అనుబంధాలను బట్టి బాధితులపైనే ఎదురు కేసులు పెట్టిన ఘటనలు అనేకం ఈ కాలంలో వెలుగులోకి వచ్చాయి. పల్నాడు జిల్లా దాచేపల్లికి చెందిన ఉప్పుతల హరికృష్ణ అనే దళిత యువకుడిపై ఒక హత్యాయత్నం కేసును అక్రమంగా బనాయించి, పోలీస్ కస్టడీలో తీవ్రంగా హింసించారు. నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలానికి చెందిన దళిత రైతు గాలి జూపాల్, తన పేరుతో తప్పుడు పత్రాలు సృష్టించి కొందరు ధాన్యం కొనుగోళ్లలో అక్రమాలకు పాల్పడ్డారని పోలీసులకు ఫిర్యాదు చేస్తే, తిరిగి ఆయనపైనే తప్పుడు కేసులు బనాయించారు. కోనసీమ జిల్లా రావులపాలెం లో డా. బి.ఆర్. అంబేద్కర్ చిత్రపటాలను అవమానించిన వారిపై చర్యలు తీసుకోవాలని కోరిన దళిత యువకులపైనే పోలీసులు రివర్స్‌లో తప్పుడు కేసులు పెట్టారని ఆరోపణలు వచ్చాయి.
సాయికృష్ణ కేసులో కృష్ణలంక సిఐ చేసిన అక్రమాలకు రియల్ ఎస్టేట్ వ్యాపారితో ఉన్న బంధం ఎంత బలమైందో సిట్ రిపోర్టు తెలిపింది. గంజాయి మత్తులో వుండి కానిస్టేబుల్ పై తిరగబడ్డారని (అడిగిన లంచం ఇవ్వనందున అని బాధితుల ఆరోపణ) తెనాలి ఐతానగర్‌కు చెందిన ముగ్గురు యువకులను పోలీసులు నడిరోడ్డుపై ఊరేగించి, మూడు కూడళ్ళల్లో విచక్షణారహితంగా కొట్టారు. అద్దంకి మండలంలో శంకవరప్పాడు గ్రామం వద్ద ఇద్దరు ఎస్‌ఐలు గంజాయి కారుతో ప్రజలకు పట్టుబడ్డారు. బల్లికురువ ఎస్‌ఐ, నాగరాజు, సంతమాగులూరు ఎస్‌ఐ నాగమల్లేశ్వరరావులు ఆ కారులో వున్నట్లు వీడియోలు వచ్చాయి. మరి వారిని ఇలాగే శిక్షించారా? చట్టం దృష్టిలో అందరూ సమానులు కాదా!
సాయికృష్ణ కేసు చర్చ జరుగుతున్నప్పుడే పేరుపోగు క్రాంతికుమార్ సెల్పీ వీడియో వెలుగు లోకి వచ్చింది. విజయవాడ లబ్బీపేటలో టాక్సీ డ్రైవర్‌గా వున్న ఈయనపై గతంలో ఉన్న రౌడీషీట్ కేసును ఆధారం చేసుకుని పోలీసులు పెడుతున్న చిత్రహింసలను భరించలేక చని పోతున్నానని ఆ వీడియోలో మాట్లాడి విష గుళికలతో ఆత్మహత్య చేసుకున్నాడు. గుంటూరు జిల్లా తాడికొండలో పోలీసులు ముగ్గురు దళిత యువకులను పోలీసులు స్టేషన్‌కు తీసుకవెళ్లి విచక్షణారహితంగా కొట్టారు. పోలీసుల వేధింపులు తాళలేక అనారోగ్యానికి గురైన చీకిటి గోపి అనే యువకుడు చనిపోయాడు. బాపట్ల జిల్లా చీరాలలోని రామ్‌నగర్ ప్రాంతంలో ఓ ఇంటి బయట వున్న వృద్ధ ఎస్టీ మహిళను రెండో పట్టణ పోలీసు స్టేషన్ సిఐ శశికుమార్ ఎంత అసభ్యంగా మాట్లాడారో చూసి రాష్ట్రం విస్తుపోయింది. ఈ ఘటనలన్నీ పాలనా, న్యాయ, కార్యనిర్వాహక ప్రముఖులం దరూ కొలవైవున్న రాష్ట్ర రాజధాని చుట్టుపక్కల జరిగినవే. కొందరు పోలీసులు ఇంత యదేచ్ఛగా ఎలా బరితెగించ గలుగుతున్నారు? ఏమిటీ వీరి ధైర్యం? చట్టం ఏమి చేయదనా, చేసినా ఏమి కాదనా?
నెల్లూరు జిల్లా గూడూరు రూరల్ పోలీస్ స్టేషన్‌లో పొలయ్య అనే దళిత దినసరి కూలీని పోలీసులు తీవ్రంగా కొట్టడంతో ఆసుపత్రి పాలయ్యాడు. కేసు విచారణలో వైద్య నివేదికలను పరిశీలించిన హైకోర్టు సంబంధిత పోలీసు అధికారులు కోర్టుకు స్వయంగా హాజరుకావాలని హెచ్చరించింది. కర్నూలు జిల్లా కౌతాళం మండలం బదినేహాల్ గ్రామానికి చెందిన మాల గంగమ్మ తన కొడుకు ఆచూకి కోసం పోలీసుస్టేషన్‌కు వెళితే ఆమెను ఆదోని డిఎస్పీ కార్యాలయంలో బంధించి తీవ్ర చిత్రహింసలు పెట్టారు. దీంతో ఆమె ఆరోగ్యం క్షీణించడంతో కర్నూలులోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో పోలీసులు చేర్చారు. ఆ తర్వాత ఆమె చనిపోయింది. ఈ దారుణంపై గంగమ్మ కూతురు హైకోర్టుకు వెళ్ళి విన్నవించుకోవలసిన పరిస్థితి వచ్చింది. రాజకీయ ఒత్తిళ్లకు లొంగిపోతున్నారని ఏపీ హైకోర్టు పలు సందర్భాల్లో పోలీసులను తీవ్రంగా మందలించింది. ఒత్తిళ్లను తట్టుకోలేకపోతే ఉద్యోగాలకు రాజీనామా చేయాలని కూడా కోర్టు వ్యాఖ్యానించింది.
ఈ ఘటనలన్నింటిలో పాత్రధారులు పోలీసులే అయినా... సూత్రధారులు పాలకులే అన్నది జగద్విదితం. గత ప్రభుత్వాలకంటే, ప్రజా ప్రతినిధుల కంటే మరింత మెరుగ్గా వుంటారనే ఆశతో ఐదేళ్ళ కాలానికి ఎన్నుకోబడిన పాలకులు తాము రాజరిక వారసులమని, పెట్టిన పెట్టుబడికి మించి దోచుకోవడం తమ హక్కు అని, తమను ఎవరూ ప్రశ్నించరాదని, చట్టాలన్నీ తమ చుట్టాలని భావిస్తున్న వారు అంతకంతకూ పెరిగిపోతున్నారు. అందుకు పోలీసు, రెవిన్యూ వ్యవస్థలను విచ్చలవిడిగా దుర్వినియోగం చేస్తున్నారు. గతంలో వైసీపీ ప్రభుత్వం ప్రత్యర్థి పార్టీల నాయకులతో పాటు, అనేకమందిని ఇలాగే వేధించింది. దాని ఫలితం ఇప్పుడు అనుభవిస్తుంది. ఆనాడు ప్రజాస్వామ్య హక్కులు, చట్టాల గురించి మాట్లాడిన నేటి అధికార పార్టీలు అదే దారిలో పోలీసు వ్యవస్థను దుర్వినియోగం చేస్తున్నాయి. మంచి పోస్టింగ్‌ల కోసం ఎమ్మెల్యేల చుట్టూ తిరిగే పరిస్థితి ఏడాదికేడాది పెరిగిపోతుంది. డిపార్ట్‌మెంట్ అధికారులు ఇవ్వాల్సిన ట్రాన్స్‌ఫర్‌లు, ప్రమోషన్‌లు, పనిష్‌మెంట్‌లు అధికార పార్టీల నేతలు నిర్ణయించే స్థాయికి వచ్చిన తర్వాత వ్యవస్థలు ప్రజావిశ్వాసాన్ని కోల్పోతాయి. అధికారపార్టీల నేతలు తమ స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం పోలీసులను సాధనాలుగా ఉపయోగించుకునే ధోరణి బలపడుతుంది. ఈ ఒత్తిళ్ళకు లొంగి అక్రమపద్ధతులకు పాల్పడిన అధికారులు గతంలో, ఇప్పుడు శిక్షలు అనుభవిస్తున్నారు. ఉపయోగించుకున్న రాజకీయ నాయకులు మాత్రం క్షేమంగా ఉన్నారు. పోలీసులతో పాటు అనేక శాఖల్లో చట్ట ప్రకారం పనిచేసే వారు సంవత్సరాలుగా లూప్ లైన్‌లోనే వుంటున్నారు. వ్యక్తిగత జీవితంలో ఎన్ని కష్టాలు వున్నా నిజాయితీగా వ్యవహరిస్తున్న పోలీసులు ఉన్నారు. డిఎస్పీ స్థాయి అధికారులు కొందరు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో, కాలేజీల్లో చదివిస్తున్నవారు ఉన్నారు. అయితే వీరి సంఖ్య రోజురోజుకు కుదించుకుపోతుంది. చట్టాన్ని నిష్పక్షపాతంగా అమలు చేయడం కోసం ఒత్తిళ్ళు, ఇబ్బందులు ఎదుర్కొన్నవారే చరిత్రలో నిలచి, ఆదర్శప్రాయులుగా ప్రజల గుండెల్లో ఉన్నారని యువ అధికారులు గుర్తించాలి.
- ఫీచర్స్ అండ్ పాలిటిక్స్







కామెంట్‌లు (0)