- గరిష్టంగా 4.67 శాతం
- నిర్దోషులుగా 87 శాతం చలామణి
- ఏటికేడు గణనీయ స్థాయిలో కేసుల నమోదు
- సంవత్సరాల తరబడి సా..గుతున్న విచారణలు
- పిఒఎ యాక్ట్ నిర్వీర్యం
- బాధితులకు అందని సత్వర న్యాయం
ప్రజాశక్తి ప్రత్యేక ప్రతినిధి- అమరావతి: పోలీసుల దెబ్బలకు తాళలేక గుంటూరు జిల్లా తాడికొండ మండలం పొన్నెకల్లు గ్రామానికి చెందిన చీకటి గోపి జీవితం అర్థాంతరంగా ముగిసింది. తుళ్లూరు మండలం దొండపాడుకు చెందిన మేకల రమేష్ దొంగతనం నెపంపై మంగళగిరిలో హత్యకు గురయ్యాడు. మృతి చెందిన ఇద్దరూ దళిత యువకులు. రెండు దుర్ఘటనలూ ఎక్కడో మారుమూల జరగినవి కాదు. ముఖ్యమంత్రితో సహా యావత్ రాష్ట్ర పరిపాలనా కేంద్రం కొలువుదీరిన రాజధాని అమరావతి ప్రాంతంలో సంభవించినవి. కొంచెం వెనక్కి వెళితే రాజధానిగా వెలసిల్లుతున్న విజయవాడ నగర నడిబొడ్డులోని కృష్ణలంక పోలీసుల వేధింపులు తాళలేక దళిత యువకుడు క్రాంతి కుమార్ సెల్ఫీ వీడియో విడుదల చేసి మరీ ఆత్మహత్య చేసుకున్నాడు. దేశ రక్షణ కోసం అంకితమైన ఆర్మీ జవాన్ సొంతూరు నంద్యాల జిల్లా డోన్ మండలం చనుగొండ్ల గ్రామంలో కులం పేరిట ఇంటిపై దాడి చేసి ధ్వంసం చేశారు. రాష్ట్రంలో ఎస్‌సి, ఎస్‌టిలపై జరుగుతున్న అత్యాచారాల తీవ్రతకు ఈ సంఘటనలు అద్దంపడతాయి. ఇవి మచ్చుకు చెప్పిన ఘోరాలు. పరంపర జాబితా ఇంకా చాలానే ఉంటుంది. ఎస్‌సి, ఎస్‌టిలపై అత్యాచారాలు కొనసాగడానికి నేరాల్లో నిందితులుగా పేర్కొన్నవారికి శిక్షలు పడకపోవడమే ప్రధాన కారణంగా కనిపిస్తుంది. ఎస్‌సి, ఎస్‌టిల రక్షణ కోసం 1989లో వేధింపుల నిరోధం కోసం తెచ్చిన పిఒఎ యాక్ట్ అమలు పేలవంగా ఉంది. ఈ కఠోర సత్వం ముఖ్యమంత్రి ఈ నెల మొదటి వారంలో నిర్వహించిన సమీక్షలో వెల్లడైంది. ఎఫ్‌ఐఆర్, ఛార్జిషీట్‌ల దాఖలు, నిందితులను దోషులుగా నిరూపించే ప్రాసిక్యూషన్ ప్రక్రియ, శిక్షల నిర్ధారణ.. అన్ని దశల్లోనూ తీవ్ర జాప్యం జరుగుతోంది. 2023 నుంచి 2026 జూలై వరకు డేటా పరిశీలిస్తే బాధితులకు సత్వర న్యాయం అందని ద్రాక్షలాగానే ఉంది. ఈ మూడున్నరేళ్లల్లో పాతవి కొత్తవి కలుపుకొని 9,041 కేసులు విచారణలో ఉన్నాయి. ఇప్పటి వరకు 3,984 కేసులు పరిష్కరించినట్లు చెబుతున్నారు. శిక్షలు పడ్డది 161 కేసుల్లోనే. కోర్టుల్లో విచారణ పూర్తయిందంటున్న కేసుల్లో శిక్షలు పడ్డవి 4 శాతమే. 2023లో కనిష్టంగా 3.14 శాతం కేసుల్లోనే నిందితులకు శిక్షలు పడ్డాయి. ఏకంగా 3,142 కేసుల్లో నిందితులు నిర్దోషులై పోయారు. ఈ కేసులు 86 శాతం. ఇతర కారణాలు (రాజీ పడటం వంటివి) 673 కేసులున్నాయి.
క్రైం పరంపర
అట్రాసిటీ కేసుల్లో నిందితులకు-శిక్షలు పడకపోవడం, రాజీలు, ఒత్తిళ్లు, సరైన దర్యాప్తులు లేకపోవడం, కేసులు ఏళ్లతరబడి సాగడం వంటివి క్రైమ్ పెరగడానికి ప్రధాన కారణాలుగా సామాజిక విశ్లేషకులు తెలుపుతున్నారు. మూడున్నరేళ్లల్లో కేసులు తగ్గాయని ప్రభుత్వం వాదిస్తున్నప్పటికీ ధోరణిలో పెద్ద మార్పేమీ లేదు. 2023 నుంచి ప్రతి ఏటా 2 వేల నుంచి 2,500 వరకు అట్రాసిటీ కేసులు నమోదయ్యాయి. కేసుల దాకా రానివి చాలా ఉంటున్నాయి. ఈ ఏడాది జులై వరకు 810 నమోదయ్యాయి. కేసుల నమోదులో 501 కేసులతో అనంతపురం జిల్లా మొదటి స్థానంలో ఉంది. ఆ తర్వాతి స్థానాల్లో వరుసగా గుంటూరు (446), ప్రకాశం (430), కర్నూలు (424), నెల్లూరు (382) ఉన్నాయి. కేసుల దర్యాప్తులను పరిశీలిస్తే ఎఫ్‌ఐఆర్ దశలో 25 శాతం, ఛార్జిషీట్ దశలో 50 శాతం, నిందితులను నిర్ధారించే దశలో 25 శాతం ఉన్నాయి.
కోర్టుల్లో కేసుల పరిస్థితి
సంవత్సరం అప్పటికి డిస్పోజ్ శిక్షలు నిర్దోషత్వం
కేసులు అయినవి పడ్డవి
2023 8,953 1,241 39 (3.14%) 840 (67.68%)
2024 8,918 988 46 (4.65%) 865 (87.55%)
2025 9,904 1,190 50 (4.20%) 1,013(85.12%)
2026
(జూలై వరకు) 9,041 566 26 (4.59%) 433 (76.50%9)
నీరుకారుతున్న చట్టం
పిఒఎ చట్టం ప్రకారం అట్రాసిటి కేసుల పర్యవేక్షణకు రాష్ట్ర స్థాయిలో డిజిపి ర్యాంక్‌కు తక్కువ కాకుండా అధికారి నేతృత్వంలో ప్రత్యేక సెల్‌ను ఏర్పాటు చేయాలి. పోలీస్ దర్యాప్తులను, కోర్టుల్లో విచారణల వేగవంతానికి సెల్ పని చేయాలి. అట్రాసిటి కేసుల దర్యాప్తునకు ప్రత్యేక కోర్టులను ఏర్పాటు చేయాలి. ప్రస్తుతం రాష్ట్రంలో 14 ప్రత్యేక సెషన్ కోర్టులు, శ్రీకాకుళం జిల్లా లక్ష్మిపేటలో మరొక స్పెషల్ కోర్టు పని చేస్తున్నాయి. ఇన్ని ప్రత్యేక ఏర్పాట్లు ఉన్నప్పటికీ కేసుల్లో పురోగతి కనిపించట్లేదు. జస్టిస్ కొత్తపల్లి పున్నయ్య కమిషన్ సిఫారసులకనుగుణంగా 2001లో ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం అట్రాసిటీ కేసుల్లో బాధితులకు, వారి కుటుంబాలకు సహాయ పునరావాసాన్ని జిల్లా కలెక్టర్, నిర్దేశించిన అధికారులు సకాలంలో అందించాలి. పరిహారం రూ.85 వేల నుంచి 8.25 లక్షల వరకు ఉంది. ఇళ్లు లేని వారికి గృహ వసతి, ఇళ్ల స్థలం లేకపోతే జాగా, హత్య కేసుల్లో అయితే ఉద్యోగ, ఉపాధి కల్పించాలి. మూడున్నరేళ్లల్లో 178 మంది హత్యకు గురికాగా 154 కేసుల్లోనే ప్రభుత్వం నుంచి పరిహారం అందింది. ఉపాధి 62 కేసుల్లో, హౌసింగ్ లేక జాగా 17, వ్యవసాయ భూమి 7, పెన్షన్ సౌకర్యం 35, పిల్లలకు రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ 18, ఆహార సదుపాయం 40 కేసుల్లో అందించారు.







కామెంట్‌లు (0)