గురువారం, 10 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

ఇస్రోకు ప్రైవేటీకరణ ముప్పు

1 గంట క్రితం

isro
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 10, 2026, 05:45 పూర్వాహ్నం | 3 నిమిషాల చదవడం

నేల, నీళ్లు, భూగర్భానికి ముప్పుగా మారిన ప్రైవేటీకరణ రక్కసి ఇప్పుడు అంతరిక్షానికీ ఎగబాకుతోంది. ఇప్పటికే ఎయిర్‌ ఇండియాను దిగమింగిన కార్పొరేట్‌ ‌రాబందుల కళ్లు ఇప్పుడు భారత అంతరిక్ష సంస్థ (ఇస్రో)పై పడ్డాయి. ప్రజల సొమ్ముతో, ఆరు దశాబ్దాలకు పైగా వేలాది మంది శాస్త్రవేత్తలు, సాంకేతిక నిపుణులు, కార్మికుల అంకితభావంతో నిర్మితమైన ఈ సంస్థ దేశ శాస్త్ర సాంకేతిక స్వావలంబనకు ప్రతీక. 1962లో కేరళలోని తుంబలో తడబడుతూ మొదలైన ఇస్రో ప్రయాణం నేడు ప్రపంచంలోనే ప్రముఖ అంతరిక్ష శక్తిగా మనదేశాన్ని నిలబెట్టింది. సైకిళ్ల మీద నమూనా రాకెట్లను తరలించిన దశ నుండి బాహుబలి సైజు ఉపగ్రహాలను ప్రయోగించే స్థితికి చేరింది. నిప్పులు చెరుగుకుంటూ రాకెట్లు నింగిలోకి దూసుకుపోవడం వెనుక ఇస్రోలోని ప్రతి ఒక్కరి కృషితో పాటు, దేశ ప్రజలు చేసిన త్యాగాలు ఉన్నాయి. ఫలితంగా దేశ ఆర్థిక వ్యవస్థను, ప్రజల దైనందిన జీవితాన్ని నేరుగా ప్రభావితం చేసే అనేక రంగాల్లోకి ఉపగ్రహ సాంకేతికతను ఇస్రో తీసుకువచ్చింది. దేశ భద్రతకు, ప్రజా సేవలకు అవసరమైన ఉపగ్రహాలను నిర్దిష్ట కక్ష్యల్లోకి చేర్చే ప్రయోగ వాహనాలను మన దేశంలోనే రూపకల్పన చేసి, తయారు చేసుకునే సామర్థ్యాన్ని సాధించింది. దేశ శాస్త్ర–సాంకేతిక స్వావలంబనకు నిలువెత్తు నిదర్శనంగా నిలిచింది. ఇంత ప్రతిష్టాత్మక సంస్థను నరేంద్ర మోడీ నేతృత్వంలోని బిజెపి ప్రభుత్వం ప్రైవేటు రంగానికి అప్పగించనుందంటూ వస్తున్న వార్తలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. తక్కువ భూ కక్ష్యలోకి ఉపగ్రహాలను పంపేందుకు అభివృద్ధి చేసిన ఎస్‌ఎస్‌ఎల్‌వికి సంబంధించిన తయారీ, ప్రయోగ సౌకర్యాలను ప్రైవేటు భాగస్వామ్యానికి అనుమతించడం, తమిళనాడులోని తూత్తుకుడి ప్రాంతంలో ఈ తరహా ప్రయోగాల కోసం ప్రభుత్వ నిధులతో పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తుండటం వంటి పరిణామాలు ఇప్పటికే చోటుచేసుకున్నాయి. ఇటీవల విక్రమ్-1 రాకెట్ విజయవంతమైన ప్రయోగానికి లభించిన విస్తృత ప్రచారం కూడా ప్రైవేటు అంతరిక్ష రంగానికి ఇస్తున్న కొత్త ప్రాధాన్యానికి ఒక సంకేతంగా చూడవచ్చు. శ్రీహరికోటలోని ఇస్రో ప్రయోగ సౌకర్యాలను ఉపయోగించుకునే ఈ ప్రయోగం జరిగింది. స్వయంగా ప్రధానమంత్రి ఈ సంస్థను అభినందించారు. అదే సమయంలో ఇస్రో చేసిన ‘పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్ ’(పిఎస్‌ఎల్‌వి)కు చెందిన రెండు ప్రయోగాలు వరుసగా విఫలం కావడం చర్చనీయాంశంగా మారింది. ఈ వైఫల్యాల వెనుక ఒక వ్యూహం ప్రకారం చేసిన కుట్ర ఉందన్న అనుమానాలకు ఆధారాలు లేకపోయినప్పటికీ పూర్తిగా విస్మరించలేం.

ఈ ఏడాది మార్చి 25న పార్లమెంటులో సమర్పించిన శాఖపరమైన స్టాండింగ్‌ ‌కమిటీ సైతం ఈ విషయాన్ని ప్రస్తావించడం ఇస్రోకు పొంచి ఉన్న ముప్పునకు నిదర్శనం. అంతరిక్ష రంగంలోని సాంకేతికతలను వాటి వాణిజ్య సామర్థ్యంతో పోలిస్తే చాలా తక్కువ ధరలకు ప్రైవేటు సంస్థలకు బదిలీ చేస్తున్నారని ఈ కమిటీ పేర్కొంది. ఇస్రోకు చెందిన తొమ్మిది ఉద్యోగ సంఘాలు ఇటీవల సంస్థ చైర్మన్‌కు ఈ విషయమై తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తూ రాసిన లేఖ కలకలం రేపింది. పిఎస్‌ఎల్‌వి, ఎల్‌విఎం3, ఎస్‌ఎస్‌ఎల్‌వివంటి ప్రయోగ వాహనాల రూపకల్పన, అభివృద్ధి, తయారీ, పరీక్షలు, ప్రయోగ కార్యకలాపాలు భవిష్యత్తులో ఇస్రో ఆధ్వర్యంలోనే కొనసాగుతాయా, లేక ప్రైవేటు సంస్థలకు అప్పగిస్తారా అని ఆ లేఖలో సంఘాలు ప్రశ్నించాయి. ఇస్రోను కేవలం పరిశోధన సంస్థగా పరిమితం చేసి, ఇప్పటివరకు స్వయంగా నిర్వహించిన తయారీ, ప్రయోగ సంబంధిత బాధ్యతలను ప్రైవేటు రంగానికి అప్పగిస్తే సంస్థ భవిష్యత్ పాత్ర ఏమిటని కూడా ఆ సంఘాలు నిలదీశాయి. భవిష్యత్తులో కొత్త నియామకాలు ఉంటాయా? ప్రస్తుత ఉద్యోగుల కెరీర్ అవకాశాలు ఎలా ఉంటాయి? దేశానికి కీలకమైన సాంకేతిక పరిజ్ఞానం బదిలీపై ఎలాంటి నియంత్రణలు ఉంటాయి అనే ప్రశ్నలకూ ఉద్యోగులు ఈ లేఖలో సమాధానాలు కోరడం గమనార్హం.

ఉద్యోగుల ప్రశ్నలకు సమాధానమా అన్నట్లు ఇస్రోను ప్రభుత్వ ఆధీనంలోనే ఉంచుతామని చెబుతూనే, దాని సామర్థ్యాలను ప్రైవేటు సంస్థలకు విస్తృతంగా అందుబాటులోకి తీసుకువస్తామని, ప్రైవేటు ఉద్యోగులను నియమించుకుంటామంటూ ఇస్రో ఛైర్మన్‌ ‌ చెప్పిన మాటలు దేనికి సంకేతమో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ప్రజల పన్నుల సొమ్ముతో, దశాబ్దాల శాస్త్రీయ పరిశోధనతో అభివృద్ధి చేసిన సాంకేతిక పరిజ్ఞానం, మౌలిక వసతులు, ప్రయోగ సదుపాయాలు, శాస్త్రీయ నైపుణ్యం ప్రైవేటు సంస్థలకు ఏ ధరకు, ఏ నిబంధనలతో అప్పగిస్తున్నారన్నదే కీలక ప్రశ్న! ఒకవైపు విశ్వగురువునని చెప్పుకుంటూ, మరోవైపు ఉన్న కొద్దిపాటి వనరులను ప్రైవేటు కప్పగించడం ఎవరికి ఊడిగం చేయడమో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఒక రాకెట్ ఆకాశంలోకి ఎగిసినప్పుడు దానితో పాటు ఎగిసేది కొద్దిమంది కార్పొరేట్ల లాభాల కాంక్ష కాకూడదు! అది కోట్లాది భారతీయుల శాస్త్రీయ స్వప్నం. దానికి యజమానులు వారే! ఇస్రోను కాపాడటం అంటే కేవలం ఒక సంస్థను మాత్రమే కాపాడటం కాదు. దేశ శాస్త్ర స్వావలంబనను, ప్రజా సంపదను, భవిష్యత్ తరాల హక్కులను కాపాడటం! ఈ పోరాటంలో భాగస్వామలు కావడం ప్రతి ఒక్కరి బాధ్యత! ​

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్