బుధవారం, 28 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

కొంటేనే గుక్కెడు నీళ్లు

1 గంట క్రితం

image-1791131526483-85bed4eb-d001-433c-bc20-5b29fa85e78e-900x504
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 28, 2026, 05:53 పూర్వాహ్నం | 3 నిమిషాల చదవడం

దాహమైతే గొంతు తడుపుకునే గుక్కెడు నీళ్లనూ ప్రజలు తమ జేబుల్లో డబ్బులు పెట్టి కొనుక్కోవాల్సిన అనివార్యతను కల్పిస్తోంది రాష్ట్రంలోని టిడిపి కూటమి ప్రభుత్వం. కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ‘జల్‌ ‌జీవన్‌ ‌మిషన్‌’ 2.0 అమలులో భాగంగా గ్రామీణుల తాగు నీటికి పైసా వసూల్‌ను ‌తప్పనిసరి చేస్తూ సోమవారం జిఓ నెం.160 జారీ చేసింది. గ్రామీణుల తాగునీటి సరఫరా కోసం ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్న మార్గదర్శకాల అంతస్సారం తాగునీటి ప్రైవేటీకరణ. ఇక ప్రభుత్వం ప్రజలకు రక్షిత మంచి నీటిని ఉచితంగా ఇవ్వదు. వాడుకున్న నీటిని మీటర్లతో కొలిచి యూజర్‌ ‌చార్జీలు వసూలు చేస్తుంది. నీటి సరఫరాకు అయ్యే ప్రతి పైసానూ వినియోగదారుల నుంచి ముక్కుపిండి లాగుతుంది. నీటి పథకాలన్నింటికీ మీటర్లు బిగించి లెక్కలు తీస్తుంది. నీటి పథకాల ఏర్పాటుకయ్యే మూల ధన వ్యయంలోనూ ప్రజలు తమ వాటాగా కొంత మొత్తం భరించాలి. అటవీ, కొండ ప్రాంతాలు, 50 శాతం కంటే ఎక్కువ ఎస్‌‌సి, ఎస్‌‌టి జనాభా ఉన్న గ్రామ ప్రజలు మూల ధన వ్యయంలో 5 శాతం, తతిమ్మా ప్రజలు 10 శాతం తమ వాటాగా చెల్లించాలి. నీటి సరఫరాకయ్యే విద్యుత్‌ ‌చార్జీలు, మరమ్మతులు, సిబ్బంది జీతాలు, మౌలిక సదుపాయాలు... ప్రజలే భరించాలి. అందుకు గ్రామ నీటి సరఫరా మండలి పూచీ పడాలి. ఇటువంటి ఎన్నెన్నో దుర్మార్గమైన అంశాలు 160 జిఓలో పేర్కొనబడ్డాయి.

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఉపాధి రహిత చర్యలతో గ్రామీణం తీవ్ర ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న ఈ సమయంలో తాగు నీటిని వెల కట్టి అమ్మబూనడం ‘డబుల్‌ ఇంజిన్‌’ ‌సర్కార్‌ పల్లె ప్రజలపై ఎక్కుపెట్టిన డబుల్‌ ‌దుర్మార్గం. రాష్ట్రంలో జిల్లా, మండల పరిషత్‌, పంచాయతీలకు ఎన్నికలు జరుగుతున్న వేళ గ్రామీణ ప్రజానీకంపై నీటి బాంబు కూటమి ప్రభుత్వ బరితెగింపు. జనానికి అన్యాయం జరిగితే సహించను, నిలదీసి ప్రశ్నిస్తానన్న ఉప ముఖ్యమంత్రి పవన్‌ ‌కళ్యాణ్‌ ‌నిర్వహిస్తున్న పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి ‌శాఖ నుంచి వెలువడిన ఉత్తర్వులు ఆయన చెప్పిన మాటలు, చేసిన బాసల డొల్లతనాన్ని ఎత్తి చూపుతున్నాయి. రాష్ట్రంలో స్వచ్ఛమైన తాగునీరు ఇప్పటికీ 50 శాతానికి మించి గ్రామాలకు అందట్లేదని ప్రభుత్వ గణాంకాలే వెల్లడిస్తున్నాయి. నిర్వహణ లేక ఉన్న పథకాలు నిరుపయోగమవుతున్నాయి.

కాన్సర్‌, ఎయిడ్స్‌ ‌వంటి మహమ్మారుల కంటే రక్షిత తాగునీరు అందక కలుషిత నీటితో చనిపోతున్న, అస్వస్థులై ఆస్పత్రుల పాలవుతున్న ఉదంతాలు ఎన్నో రెట్లు అధికం. కిడ్నీ జబ్బులకు నిలయాలైన ఉద్దానం, ఎ.కొండూరు, ఫ్లోరైడ్ బాధిత మార్కాపురం... చెప్పుకుంటూ పోతే ఎన్నో ప్రాంతాల ప్రజానీకం శాశ్వత రక్షిత తాగునీటి సదుపాయాలు లేక అల్లాడుతున్నారు. ప్రభుత్వం తన స్వంత ఖర్చులతో మంచి నీరందిస్తుందని ఎదురు చూస్తుండగా, నీళ్లు కొనుక్కోవాలంటున్న సర్కారీ సందేశం ప్రజల గుండెల్లో గునపాలు గుచ్చింది. వ్యతిరేకత వ్యక్తమవుతుందన్న బెంగతో సోమవారం జారీ చేసిన జిఓ 160ని మంగళవారం వెబ్‌‌సైట్‌ ‌నుంచి తొలగించడం మరో చోద్యం.

రాష్ట్రంలో టిడిపి కూటమి అధికారంలోకి వచ్చీ రాగానే స్వర్ణాంధ్ర 2047 ప్రకటించింది. మోడీ ప్రభుత్వ వికసిత భారత్‌ 2047కు అనుకరణగా చెప్పింది. ఇద్దరి లక్ష్యాలూ కార్పొరేటీకరణ, ప్రైవేటీకరణ ఇరుసుగా తయారైనవి. గ్రామీణ ప్రాంతాల్లో ప్రభుత్వ నీటి అమ్మకం వాటిలో భాగం. ఇప్పటికే పట్టణాల్లో మౌలిక సదుపాయాల ప్రైవేటీకరణకు 673, 74 ఉత్తర్వులొచ్చాయి. వాటర్‌ ‌పాలసీని ప్రకటిస్తామని చంద్రబాబు ప్రభుత్వం వెల్లడించింది. సాగునీటితో పాటు తాగునీటి ప్రైవేటీకరణ ఎజెండాగా ఆ విధానం తయారవుతోంది. గతంలోని సాగునీటి వినియోగ సంఘాల వ్యవస్థ, జన్మభూమి మాదిరిగా గ్రామీణ ప్రాంతాల్లో తాగునీటి పథకాల నిర్వహణ కనిపిస్తుంది. పేరుకే ప్రజల యాజమాన్యం. పెత్తనం ప్రైవేటు సంస్థల చేతుల్లోకి వెళుతుంది. పారదర్శకత, జవాబుదారీతనం, డిజిటల్‌, నాణ్యమైన ప్రమాణాలు, స్వచ్ఛమైన, అవాంతరాల్లేని నీటి సరఫరా... ఇవన్నీ చక్కెర పూసిన విషపు గుళికల వంటివి. వాటిని ప్రజలతో మింగించాలన్నది ప్రభుత్వ ఆలోచన. రక్షిత తాగునీరు పొందడం పౌరుల ప్రాథమిక హక్కు. ప్రజలకు తాగునీటిని అందించాల్సిన బాధ్యత నుంచి ప్రభుత్వం వైదొలగడం దారుణం. స్థానిక ఎన్నికల్లో ఓట్ల కోసం వచ్చే కూటమి పార్టీల నేతలను ప్రజలు నిలదీయాలి. నీటి అమ్మకానికి ఉద్దేశించిన జిఓ 160ను ప్రభుత్వం ఉపసంహరించుకునేలా ఒత్తిడి చేయాలి.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్