బుధవారం, 28 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionనాల్గవసారి లూలా చారిత్రాత్మక విజయం

1 గంట క్రితం

lula wins.jpg
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 28, 2026, 05:29 పూర్వాహ్నం | 5 నిమిషాల చదవడం

ఆదివారం నాడు జరిగిన బ్రెజిల్‌ అధ్యక్ష ఎన్నికల తుది పోరులో వామపక్ష, ప్రజాతంత్ర కూటమి నేత లూలా డా సిల్వా (80) నాల్గవసారి చారిత్రాత్మక విజయం సాధించారు. అన్నీ సజావుగా ఉంటే డిసెంబరు 18వ తేదీన ఎన్నికను నిర్ధారిస్తూ అధికారిక పత్రాలు జారీ అవుతాయి. జనవరి ఐదున పదవీ స్వీకారం చేస్తారు. ఫిబ్రవరి ఒకటి నుంచి కొత్త పార్లమెంటు ప్రారంభం అవుతుంది. ప్రజాస్వామ్య పునరుద్ధరణ తరువాత అక్కడ జరిగిన ఏడు ఎన్నికల్లో ఆరుసార్లు వామపక్షం నెగ్గింది. లూలాకు 51.75 శాతం, ప్రత్యర్ధి ఫ్లావియో బోల్సనారోకు 48.25 శాతం చొప్పున ఓట్లు రాగా లూలా మెజారిటీ 45 లక్షలు దాటింది. అక్కడి రాజ్యాంగం ప్రకారం 50 శాతం పైగా ఓట్లు ఎవరికీ రాకపోతే ప్రథమ, ద్వితీయ స్థానాల్లో ఉన్న అభ్యర్ధులతో రెండవసారి ఎన్నికలు నిర్వహిస్తారు. తొలి దఫా ఓటింగ్‌లో బోల్సనారోకు 47.03, లూలాకు 45.16 శాతాల చొప్పున ఓట్లు వచ్చాయి. మిగిలినవి ఇతరులకు వచ్చాయి. రెండవ దఫాలో లూలా కోటీ పది లక్షల ఓట్లను అదనంగా పొందాడు. బ్రెజిల్‌ పతాకాన్ని ముద్దాడుతున్న అభ్యర్ధి కావాలో అమెరికా పతాకాన్ని ముద్దాడుతున్న వ్యక్తి కావాలో తేల్చుకోవాలని రెండవ దఫా ఎన్నికల ప్రచారంలో లూలా కోరాడు. మితవాదాన్ని వ్యతిరేకించే వారందరూ లూలాకు మద్దతు ఇచ్చారు. ఈ విజయం నయా ఫాసిస్టు ట్రంప్‌నకు కూడా ఓటమే అని... కూటమిలో భాగమైన బ్రెజిల్‌ కమ్యూనిస్టు పార్టీ (పి.సి.డి.ఓ.బి) పత్రిక వెర్మెలో వ్యాఖ్యానించింది. బోల్సనారోకు మద్దతు ఇవ్వటమేగాక సామాజిక మాధ్యమ వేదికలైన ఇన్‌స్టాగ్రామ్‌, ఫేస్‌బుక్‌, వాట్సప్‌ యాజమాన్య కంపెనీ మెటా లూలాకు వ్యతిరేకంగా పని చేసింది. అమెరికా జోక్యం, ఇతర కుట్రలను బ్రెజిలియన్‌ ఓటర్లు జయప్రదంగా తిప్పికొట్టారు. దక్షిణ లేదా లాటిన్‌ అమెరికా లోని పన్నెండు దేశాల్లో ఇప్పుడు ఏడు చోట్ల మితవాదులు పాగా వేశారు. ఆ ఖండంలో పెద్దదైన బ్రెజిల్‌ వారిని అడ్డుకుంది.

తమ దేశాన్ని అమెరికాకు పెరటి తోట కానివ్వబోమని బ్రెజిల్‌ కార్మికవర్గం, యువత, విద్యార్థులు రెండవ దఫా ఎన్నికలకు ముందు శపథం చేశారు. '' వీధుల్లో, ఆన్‌లైన్లో లూలాతో విద్యార్థులు'' అనే నినాదంతో నేషనల్‌ విద్యార్థి యూనియన్‌ దేశవ్యాపితంగా ప్రచారం చేసింది. కమ్యూనిస్టు పార్టీ అనుబంధ సోషలిస్టు యూత్‌ ఈ ప్రయత్నాలకు వెన్నెముకగా నిలిచింది. కార్మిక సంఘాల వారు, సామాజిక కార్యకర్తలతో పాటు కళాకారులు, మేధావులు రంగంలోకి దిగారు. రెండవ దఫా ఎన్నికలకు ముందు దేశవ్యాపితంగా జరిగిన ప్రదర్శనల్లో కోటీ యాభై లక్షల మంది పాల్గొన్నారు. సావోపాలో నగరంలో జరిగిన సభకు ఇరవై లక్షల మందికి పైగా వచ్చారని అంచనా. ‘లూలా సైన్యం’ పేరుతో ఏర్పాటు చేసిన వాట్సాప్‌ గ్రూప్‌లో కొద్ది రోజుల్లోనే కోటీ ఎనిమిది లక్షల మంది చేరారు. ఎన్నికల రోజున ఓటర్లు పోలింగ్‌ బూత్‌లకు రాకుండా అడ్డుకొనేందుకు మితవాదులు అనేక ఆటంకాలను కలిగించారు. వారు ఆధిపత్యం వహిస్తున్న ఐదు రాష్ట్రాలు, మేయర్లుగా ఉన్న సావోపాలో, సాల్వడార్‌ తదితర ప్రాంతాల్లో ప్రజా రవాణా బస్సుల నిలిపివేత చర్యలకు పాల్పడ్డారు. కోర్టులు జోక్యం చేసుకొని పూర్తి స్థాయిలో నడపాలని ఆదేశించాల్సి వచ్చింది. సాల్వడార్‌ నగరంలో బస్సులన్నింటినీ నిలిపివేయటంతో రవాణా అధికారిని అరెస్టు చేయాలని స్థానిక కోర్టు ఆదేశించింది. భారీ వర్షాల కారణంగా బస్సులను నిలిపివేసినట్లు బోల్సనారో సమర్ధించాడు. పోలింగ్‌ వ్యవధిని రెండు గంటలపాటు పొడిగించాలని సుప్రీం కోర్టు ఆదేశించింది. ఈ చర్యను ట్రంప్‌ కుమారుడు విమర్శించి తన అక్కసును వెళ్లగక్కాడు. ఈ ఆటంకాలేవీ లూలా విజయాన్ని అడ్డుకోలేకపోయాయి. ఈ పరిణామం ఒక్క దక్షిణ అమెరికాలోనే కాదు, యావత్‌ ప్రపంచం మీద ప్రభావం చూపుతుంది. అమెరికా, ట్రంప్‌ కుట్రలను ఎదుర్కోవటంపైనే లూలా తన ప్రచారాన్ని కేంద్రీకరించాడు.

ప్రత్యక్ష ఎన్నికల విధానం 1989లో ప్రారంభమైంది. ఇప్పటి వరకు లూలా తప్ప ఎవరూ నాలుగుసార్లు గెలవలేదు. తాను గెలిస్తే బ్రిక్స్‌ కూటమిలో బ్రెజిల్‌ పాత్రను సమీక్షిస్తానని, అమెరికాతో సంబంధాలను మెరుగు పరుచుకుంటానని బోల్సనారో ఓటర్లకు వాగ్దానం చేశాడు. ఇప్పుడు ఆ ప్రమాదం తప్పింది. ఉపాధ్యక్షుడిగా ఎన్నికైన అక్‌మిన్‌ గతంలో ఒక రాష్ట్ర గవర్నర్‌గా పనిచేశాడు. వాణిజ్య, పారిశ్రామిక వర్గాలతో సంబంధాలు ఉన్నాయి. తాజా ఎన్నికల్లో వారిలో కొందరు లూలా మద్దతుదారులుగా మారేందుకు ప్రయత్నించి కొంత మేరకు సఫలీకృతం అయ్యారు.

వాగ్దానాల విషయానికి వస్తే జీవన వ్యయాన్ని తగ్గిస్తానని, పేదల కోసం నగదు పంపిణీ పథకాన్ని విస్తరిస్తానని, వారాంతంలో ప్రజా రవాణా వ్యవస్థలో ఉచితంగా ప్రయాణించే అంశాన్ని పరిశీలిస్తామని, గృహస్తుల రుణ భారం తగ్గింపు, సామాజిక మాధ్యమ కంపెనీలను నియంత్రిస్తానని లూలా చెప్పాడు. అల్పాదాయ వర్గాల పిల్లలు స్కూళ్లకు వెళ్లేందుకు, కాలేజీల్లో చదువుకొనేందుకు అవసరమైన పథకాలను రూపొందిస్తామని చెప్పాడు. కాన్సర్‌ చికిత్సతో సహా అందరికీ ఆరోగ్య పథకాన్ని వర్తింప చేయటంతో పాటు వృద్ధులు, మహిళలకు అనుకూలమైన పథకాలు అమలు చేస్తామని, నేరాలను అదుపు చేసి కార్మికులకు భద్రత, నేరగాళ్లకు జైలు ప్రాప్తి కల్పిస్తామన్నాడు. దేశానికి పన్నులు చెల్లించకుండా తప్పించుకొనే బడా ఐ.టి కంపెనీలు తమకు అవసరం లేదని, చైనా లేదా అమెరికా కృత్రిమ మేథ మీద ఆధారపడకుండా స్వంతంగా అభివృద్ధి చేసే విధానాన్ని అనుసరిస్తామని చెప్పాడు. గెలిచిన వారిని అందరూ అంగీకరించరని అయితే ఒకసారి ఎన్నికైన తరువాత ప్రతి ఒక్కరికి పాలన అందుబాటులో ఉంటుందన్నాడు. లూలాకు తొలి పరీక్ష 2027 బడ్జెట్‌ రూపంలో ఎదురుకానుంది. ద్రవ్యోల్బణ లక్ష్యం 4.5 శాతం కాగా అక్టోబరు 19న కేంద్ర బ్యాంకు వెల్లడించిన వివరాల మేరకు 5.22 శాతం ఉంది. ప్రభుత్వ రుణం జిడిపిలో 93 శాతం ఉంది. అమెరికాకు వ్యతిరేకంగా ఒక సైద్ధాంతిక వాహనంగా ఉన్న బ్రిక్స్‌ కూటమి నుంచి తప్పుకొనే అంశాన్ని పరిశీలిస్తానని బోల్సనారో చెప్పాడు. ఈ కూటమి, దానితో జత కట్టిన దేశాలపై పది శాతం అపరాధ పన్ను విధిస్తానని డోనాల్డ్‌ ట్రంప్‌ గతంలోనే ప్రకటించిన సంగతి తెలిసిందే. ఎన్నికలకు ముందు బ్రెజిల్‌పై 50 శాతం విధిస్తానంటూ ఓటర్లను ప్రభావితం చేసేందుకు చూశాడు. ఇరాన్‌తో సహా మరికొన్ని దేశాలు అమెరికా బెదిరింపులను ఖాతరు చేయకుండా బ్రిక్స్‌లో చేరేందుకు నిర్ణయించిన విషయం తెలిసిందే. ఇరాన్‌పై దాడిని ఖండించటం, ఇతర అంశాల్లో అమెరికాను పేరు పెట్టి విమర్శించకుండా అధ్యక్ష స్థానంలో ఉన్న మన దేశం అడ్డుపడింది. వచ్చే ఏడాది అధ్యక్ష స్థానానికి చైనా ఎన్నికైంది. ‘ప్రియమైన స్నేహితుడికి హృదయ పూర్వక అభినందనలు’ అంటూ నరేంద్ర మోడీ లూలాకు సందేశం పంపారు. రెండు దేశాల మధ్య ప్రస్తుతం 15 బిలియన్‌ డాలర్ల మేర ఉన్న వాణిజ్య లావాదేవీలను 2030 నాటికి 30 బిలియన్లకు పెంచాలని ఉభయ దేశాలూ ఆకాంక్షించాయి. అపురూప విలువైన ఖనిజాలు కలిగిన దేశాలలో రెండవదిగా బ్రెజిల్‌ ఉన్నప్పటికీ వాటిని వెలికి తీయటంలో ఒక శాతం కంటే తక్కువగా ఉంది. అమెరికా గతంలో ఒక ఒప్పందం చేసుకుంది. మన దేశం చైనా మీద ఆధారపడకుండా బ్రెజిల్‌ నుంచి దిగుమతి చేసుకోవాలని చూస్తోంది. తాను గెలిస్తే ఆ ఖనిజాలను అమెరికాకు అప్పగిస్తానని ఓడిపోయిన బోల్సనారో అంతకు ముందు చెప్పాడు. ఉక్రోషంతో ఉన్న ట్రంప్‌ ఏ విధంగా స్పందిస్తాడో చూడాల్సి ఉంది.

ఆదివారం నాటి పోలింగ్‌కు ముందు శుక్రవారం నాడు ఇద్దరు అభ్యర్ధులు ముఖాముఖీ టీవీ చర్చలో పాల్గొన్నారు. పరస్పరం విధానాల మీద ప్రశ్నలను సంధించారు. వ్యక్తిగతంగా లూలాను తొమ్మిది వేళ్ల వాడంటూ బోల్సనారో నోరు పారేసుకున్నాడు. ఒక లోహ పరిశ్రమలో కార్మికుడిగా జీవితం ప్రారంభించిన లూలా 17 సంవత్సరాల వయస్సులో రాత్రి షిప్టులో పని చేస్తుండగా యాజమాన్య నిర్లక్ష్యం కారణంగా జరిగిన ప్రమాదంలో ఎడమచేయి చిన్న వేలును కోల్పోయాడు. బోల్సనారోకు ఆకలి అంటే ఏమిటో తెలియదని... ఒక సాధారణ కార్మికుడిగా జీవితాన్ని ప్రారంభించి ‘వామపక్ష వర్కర్స్‌ పార్టీ’ నేతగా ఎదిగి మూడుసార్లు అధ్యక్షుడిగా గెలిచిన లూలా అన్నాడు. అర్జెంటీనా అధ్యక్షుడు జేవియర్‌ మిలెరు మాదిరి ప్రభుత్వ ఖర్చుకు కోత పెట్టే దమ్ముందా అని బోల్సనారోను ప్రశ్నించాడు. మీరు దేశాన్ని దివాలా తీయించారు గనుక తానూ అదే చేస్తానంటూ ప్రత్యర్ధి జవాబిచ్చాడు. బ్రెజిల్‌ కార్పొరేట్లు అదే కోరుతున్నాయి, అందుకే వారంతా బోల్సనారో వెనుక సమీకృతులయ్యారు. అర్జెంటీనాలో పొదుపు చర్యలను యాంత్రిక '' రంపపు కోత ''తో పోల్చారు. ఇటీవల ఐఎంఎఫ్‌ అధిపతి అదే మాదిరి ఖర్చు తగ్గించాలని ప్రతిపాదించిన సంగతి తెలిసిందే. అర్జెంటీనా రంపపు కోత పథకంలో ముఖ్యాంశాలు ఇలా ఉన్నాయి. మంత్రిత్వ శాఖలను 18 నుంచి ఎనిమిదికి తగ్గించారు. ప్రభుత్వ ఉద్యోగాలలో పది శాతం అంటే 40 వేల పోస్టులను రద్దు చేశారు. ప్రజా రవాణా, విద్యుత్‌, గ్యాస్‌, ఆహారం సబ్సిడీలను భారీగా తగ్గించారు. అద్దె నియంత్రణ చట్టాన్ని రద్దు చేశారు. పెట్టుబడి దారులకు అనుకూలంగా వ్యవసాయ ఉత్పత్తులపై ఎగుమతి పన్ను రద్దు, ద్రవ్యలోటు, 211 శాతంగా ఉన్న ద్రవ్యోల్బణాన్ని తగ్గించేందుకు కొత్తగా కరెన్సీ ముద్రణ నిలిపివేత వంటి చర్యలు ఉన్నాయి. ఇలాంటి వాటిని అమలు చేస్తానని బహిరంగంగా ప్రకటించటంతో బోల్సనారోకు జనాలు ఓటమి రుచి చూయించారు. లూలాను నాల్గవసారి గెలిపించి చర్రిత సృష్టించారు!

mkr

ఎం. కోటేశ్వరరావు

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్