బుధవారం, 28 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionపెరుగుతున్న ధరలు, భారమవుతున్న బతుకులు

1 గంట క్రితం

price hike.jpg
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 28, 2026, 05:19 పూర్వాహ్నం | 4 నిమిషాల చదవడం

​నెలాఖరున జీతం పడిందన్న మెసేజ్ చూసి ఆనందించే రోజులు పోయాయి. ఇప్పుడు ఆ మెసేజ్ వచ్చిన గంటలోపే పాల బిల్లు, గ్యాస్, అద్దె, పిల్లల ఫీజులు లెక్కేసుకుని నిట్టూర్చడమే మిగిలింది. జీతం మాత్రం అదే. కొనుగోలుశక్తి ప్రతి నెలా తగ్గిపోతోంది. సామాన్య ప్రజానీకం, మధ్యతరగతి భాషలో పరిస్థితి ఏమీ కొనేటట్టు లేదు. ఏమీ తినేటట్టు లేదు. ఇది ఎవరో ఊహించి చెబుతున్న మాట కాదు. కేంద్ర ఆర్థిక శాఖ ఆర్థిక వ్యవహారాల విభాగం తాజా నెలవారీ సమీక్షలో, వాతావరణం, భౌగోళిక రాజకీయాలు, యుద్ధ వాతావరణం, ద్రవ్య విధానం అనే ఒత్తిళ్లు కలిసి ధరల ముప్పును పెంచుతున్నాయని అంగీకరించింది. ముంచుకొస్తున్న పర్యావరణ మార్పులతో బలమైన ఎల్‌నినో రబీ పంటను దెబ్బ తీయవచ్చు. నిరంతరం మారుతున్న అంతర్జాతీయ యుద్ధ పరిస్థితులతో ముడి చమురు ధరల పెరుగుదల, అమెరికా ఫెడరల్ బ్యాంకు సెప్టెంబరులో చేసిన వడ్డీ పెంపు, దిగుమతి చేసుకొనే వస్తువుల ద్రవ్యోల్బణాన్ని ఇంకా పెంచవచ్చు. రష్యా చమురు కొనే దేశాలపై 100 శాతం వరకు సుంకాలు విధించే అధికారాన్ని అమెరికా అధ్యక్షుడికి ఇచ్చే కొత్త చట్టం కూడా అనిశ్చితిని పెంచింది.

రష్యా ఇచ్చిన రాయితీల వలన ప్రజలు కొన్న పెట్రోల్, డీజిల్ ధరలు ఎందుకు తగ్గలేదు. గత సంవత్సర కాలంలో లీటర్ పెట్రోలు, డీజిల్ ధరలు దాదాపు రూ.ఎనిమిదిన్నర, వంట గ్యాస్ సిలిండర్ రూ.89, లీటర్ పాలు రెండు రూపాయలు పెరిగాయి. బియ్యం ధర రోజుకొక తీరుగా పెరుగుతోంది. కిలో కందిపప్పు, మినప పప్పు, పెసర పప్పు, శనగ పప్పు ధరలు రూ. 10 నుంచి రూ.16 వరకు పెరిగాయి. వంట నూనెలు, కూరగాయల ధరలు అంతు లేకుండా పెరుగుతున్నాయి. ఉల్లిపాయల ధరలు గత 20 రోజుల లోనే 150 శాతం పెరిగాయి. కుటుంబ, నెల జీతాలను బట్టి జనాభాలో అత్యధిక శాతంగా ఉన్న సామాన్య, మధ్యతరగతి కుటుంబాలను ఈ శారాఘాతం కోలుకోలేని దెబ్బతీస్తున్నది. పేద, మధ్యతరగతి బడ్జెట్‌లో సింహభాగం తిండి, వంట నూనెలు, కూరగాయలు, రవాణా, మందులకే పోతుంది, ఇవే ఎక్కువగా పెరిగేవి. పేదవాడి జీవితంపై అది ఎంతో ప్రభావం చూపిస్తుంది. అసంఘటిత రంగంలో, కాంట్రాక్టు ఉద్యోగాల్లో, చిన్న ప్రైవేటు సంస్థల్లో జీతాల పెంపు దాదాపు మర్చిపోయిన మాట.

​ధరలు పెరుగుతున్నాయి, ఆదాయాలెక్కడ ?

ఉపాధి విషయంలో ప్రభుత్వ నివేదికే ఒక చేదు నిజం చెప్పింది. అమెరికాతో వాణిజ్య అనిశ్చితి, సుంకాల ఒత్తిడి, చమురు ధరల అస్థిరత, ప్రపంచ కృత్రిమ మేధ పోటీలో భారత్‌కు పెట్టుబడులను ఆకర్షించడం కష్టమవుతోందని అంగీకరించింది. పెట్టుబడి లేకపోతే కొత్త ఉద్యోగాలు ఎక్కడినుంచి వస్తాయి? సరఫరా షాక్‌ల వల్ల వచ్చే ద్రవ్యోల్బణం, వృద్ధిని కూడా అడ్డుకుంటుందని నివేదిక చెప్పింది. అంటే ధరలు పెరుగుతూ, ఉద్యోగాలు జీవనోపాధి తగ్గే ప్రమాదం ముంచుకొస్తోంది. ధరలు పెరిగినా వేతనాలు, ఉద్యోగాలు, ఉపాధి, ఆదాయం కూడా పెరిగితే ఇబ్బంది ఉండదు. అసలు సమస్య అక్కడే ఉంది. ప్రభుత్వ ఉపాధి సర్వే (పి.ఎల్‌.ఎఫ్‌.ఎస్‌) ప్రకారం ఏప్రిల్–జూన్ మధ్య దేశంలో నిరుద్యోగం 5.4 శాతం ఉంది. పట్టణ యువతలో నిరుద్యోగులు 6.8 శాతం. 15–29 ఏళ్ల యువతలో ఇది 15.9 శాతం. ఈ సర్వే మొదలైనప్పటి నుంచి ఇదే అత్యధికం. మహిళలలో నిరుద్యోగం 19.6 శాతం.​

రిజర్వ్ బ్యాంక్ (ఆర్‌‌బిఐ) కూడా ఈ ప్రమాదాన్ని గుర్తించింది. అక్టోబరు 7న రెపో రేటును 5.25 నుంచి 5.50 శాతానికి పెంచింది. రెపో రేటు అంటే ఆర్‌బిఐ బ్యాంకులకు ఇచ్చే అప్పుపై వడ్డీ. అది పెరిగితే బ్యాంకులు ఇచ్చే రుణాల వడ్డీలూ పెరుగుతాయి. ఇకపై వడ్డీ రేట్లు తగ్గే అవకాశం లేదని, పెంచడమో లేదా యథాతథంగా ఉంచడమో మాత్రమే జరుగుతుందని ఆర్‌బిఐ స్పష్టం చేసింది. నిత్యావసర వస్తువుల ధరలు అన్నీ పెరుగుతూనే ఉన్నాయని, ముఖ్యంగా చక్కెర, ఉల్లి ధరలలో ప్రత్యేక పెరుగుదల ఉందని ఒప్పుకుంది. ఈ ఆర్థిక సంవత్సరం సగటు ధరల పెరుగుదల 5.2 శాతం ఉంటుందని, అక్టోబరు–డిసెంబరులో 6 శాతానికి చేరవచ్చని అంచనా వేసింది. అదే సమయంలో జూన్ త్రైమాసికంలో దేశవృద్ధి 7.8 శాతం ఉండొచ్చని అంచనా వేసింది. ఆర్థిక వ్యవస్థ పరుగెడుతోందని ప్రభుత్వం చెప్తోంది. కాని ధరలు అంతకంటే వేగంతో పెరుగుతున్నాయి.

ధరలకు కళ్ళెం వేయాల్సింది ప్రభుత్వం కాదా?

పెట్రోల్, డీజిల్ ధరలపై కేంద్ర, రాష్ట్ర పన్నుల భారం తగ్గిస్తే రవాణా ఖర్చు తగ్గి, నిత్యావసరాల ధరలన్నీ దిగివస్తాయి. ఆహార పదార్థాల ధరల నియంత్రణకు బఫర్ నిల్వలు, ప్రజా పంపిణీ వ్యవస్థ బలోపేతం, బియ్యం, గోధుమలు, పప్పులు, నూనెలకు చౌకగా సరఫరా వంటివి చెయ్యాలి. నిత్యావసర వస్తువులను అత్యధిక స్థాయిలో నిల్వ చేసి, కృత్రిమ కొరతను సృష్టించే బ్లాక్ మార్కెట్ కార్యకలాపాలను సమర్థవంతంగా నియంత్రించాలి. తగినంత మొత్తంలో సరఫరా చర్యలు చేపట్టాలి. రైతులకు గిట్టుబాటు ధరలు చెల్లించి నేరుగా ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా ప్రజలకు సరఫరా చెయ్యాలి. ఎల్‌నినో ముప్పు ఉన్నవేళ రైతుకు మద్దతు ధర, పంట బీమా అంతే అవసరం. కనీస వేతనాలను ధరల సూచీకి అనుసంధానించాలి.

కాంట్రాక్టు కార్మికులకు సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి. గ్రామీణ ఉపాధి పథకానికి నిధులను, పని దినాలను పెంచి, పట్టణ ప్రాంతాలకూ అలాంటి హామీ విస్తరించాలి. చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు చౌకగా రుణాలను ఏర్పాటు చెయ్యాలి. ఎక్కువ మందికి ఉపాధి కల్పించే వస్త్రాలు, ఆహార శుద్ధి, నిర్మాణం, ఆరోగ్యం, విద్యారంగాల్లో ప్రభుత్వ పెట్టుబడి పెంచాలి. ప్రభుత్వ ఖాళీ పోస్టులను భర్తీ చేయాలి. సంపన్నులపై వారసత్వ, సంస్థ పన్నులు విధించటం ద్వారా ప్రభుత్వ ఆదాయ వనరులు పెంచుకోవాలి. ఆ నిధులను సంక్షేమానికి మళ్ళించాలి. గుత్తాధిపత్యాలు, కార్టెల్ ధరలపై కఠిన చర్యలు తీసుకోవాలి. వడ్డీ రేట్లు వేగంగా పెరుగుతున్నాయి. రేట్లను పెంచుకుంటూ పోతే గృహ, వాహన రుణాల వాయిదాలు పెరిగి సామాన్యుడిపై రెట్టింపు భారం పడుతుంది. ధరల అదుపు కోసం సరఫరా పెంచే వైపు చర్యలకు ప్రాధాన్యం ఇవ్వాలి. ఆర్థిక వ్యవస్థ ఎంత వేగంగా పరిగెడుతోందన్నది కాదు, ఆ పరుగులో సామాన్యుడు ఎక్కడ ఉన్నాడన్నదే అసలు ప్రశ్న. ధరలు ఆకాశానికి, వేతనాలు నేలకు అంటుతుంటే ఆ వృద్ధికి అర్థమే లేదు. ఇప్పుడు కావాల్సింది నివేదికల్లో హెచ్చరికలు కాదు, వంటింట్లో ఉపశమనం. ఎందుకంటే దేశం బలం జిడిపి గ్రాఫ్‌లో కాదు, ప్రతి ఇంటి పొయ్యి వెలిగే విధంగా ఉండాలి.

p venkata ramayya befi all india vice president.jpg

వ్యాసకర్త -పి. వెంకటరామయ్య

సెల్‌: 9553533815 /​


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్