మంగళవారం, 29 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionఉద్యోగిపై లాఠీ..

49 నిమిషాల క్రితం

వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 29, 2026, 05:51 పూర్వాహ్నం | 2 నిమిషాల చదవడం

తమ పెండింగ్‌ ‌సమస్యల పరిష్కారం కోసం ఆదివారం చేపట్టిన గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల ‘చలో విజయవాడ’ ఉద్రిక్తం కావడానికి ప్రభుత్వ నిరంకుశ ధోరణే కారణం. ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య వారధిలా పని చేస్తున్న క్షేత్ర స్థాయి ఉద్యోగులు రెండేళ్లుగా తమ డిమాండ్లు నెరవేర్చాలని పలుమార్లు ప్రభుత్వానికి విన్నవించినా ప్రభుత్వం చెవికెక్కించుకోకపోవడంతో గత్యంతరం లేక తమ గోడు వెళ్లబోసుకొనేందుకు విజయవాడలో ఈ నెల 27న శాంతియుత ఆందోళనకు పిలుపునిచ్చారు. ఈ నెల 23 లోపు డిమాండ్లపై స్పందించకపోతే, 24 నుంచి ప్రత్యక్ష కార్యాచరణకు దిగుతామని పది రోజుల ముందుగానే శాఖ డైరెక్టర్‌‌కు నోటీసులిచ్చారు. చివరి నిమిషంలో మంత్రితో ఒకసారి, డైరెక్టర్‌‌తో రెండవ సారి జరిగిన భేటీలో ప్రభుత్వం మొండి వైఖరిని కొనసాగించింది. చలో విజయవాడ ఆకస్మికం కాదని ఈ పరిణామాలతో అర్థమవుతుంది. కాగా తమ గోసను ప్రభుత్వానికి వినిపించేందుకు యత్నించిన ఉద్యోగులపై పోలీసులతో ప్రభుత్వం జరిపించిన దమనకాండ అభ్యంతరకరమైనది. ప్రజాస్వామ్యవాదులు ఖండించాలి.

ఉద్యోగుల ధర్నాకు ఏవో సాకులు చెప్పి పోలీసులు అనుమతి నిరాకరించారు. పోలీస్‌ ‌యాక్ట్‌‌లోని సెక్షన్‌ 30 ‌వంటి నిషేధాజ్ఞలు జారీ చేశారు. బెజవాడకు బయలుదేరకుండా ఊళ్లల్లో అటకాయించారు. ఆదివారం సెలవు అయినా హెడ్‌‌క్టార్టర్‌‌లో ఉండాలని బెదిరిస్తూ తాఖీదులిచ్చారు. సంఘ నాయకులను సస్పెండ్‌ ‌చేశారు. ఆంక్షలన్నీ అధిగమించి విజయవాడ చేరుకున్న ఉద్యోగులను ఎక్కడికక్కడ అడ్డుకున్నారు. లాఠీలతో చెదరగొట్టారు. మహిళలన్న విచక్షణ కూడా లేకుండా దౌర్జన్యంగా ఈడ్చిపారేశారు. లాఠీలు ఝుళిపించారు. దూరప్రాంత పోలీస్‌ ‌స్టేషన్లకు వందలాది మందిని తరలించి రాత్రి వరకు నిర్బంధించారు. అక్రమ కేసులు బనాయించారు. అన్నపానీయాలకు, చివరికి కాలకృత్యాలకు సైతం వెళ్లనీకుండా కర్కశం ప్రదర్శించారు. అనారోగ్యం పాలైన వారిని మందులు తెచ్చుకోడానికీ అనుమతించలేదు. ఉద్యోగులేమీ ఉగ్రవాదులు, సంఘ విద్రోహశక్తులు, గంజాయి బ్యాచ్‌‌లు కాదు. తమ న్యాయమైన కోర్కెలు తీర్చాలని అడగడం ప్రభుత్వానికి నేరంగా కనిపించే క్రూరత్వానికి ఒడిగట్టింది. నోషనల్‌ ఇంక్రిమెంట్లు, ప్రమోషన్లు, పే ఫిక్సేషన్‌, జూనియర్‌ అసిస్టెంట్‌ ‌హోదా కల్పన, ‌డిప్యూటేషన్ల రద్దు, వెట్టి చాకిరీ నుంచి విముక్తి, ఒక డిపార్టుమెంట్‌ అధికారుల కిందే పని, పైస్థాయి ఒత్తిళ్లతో మరణించిన, ఆత్మహత్యలు చేసుకున్న ఉద్యోగులకు న్యాయం, వేధించిన అధికారులపై చర్యలు, జాయింట్‌ ‌స్టాఫ్‌ ‌కౌన్సిల్‌‌లో తమ సంఘాల భాగస్వామ్యం... ఇవీ సచివాలయ ఉద్యోగులు కోరుతున్నవి. ఇవేమీ గొంతెమ్మ కోర్కెలు కావు. ప్రభుత్వం పరిష్కరించాల్సిన కనీస సమస్యలు.

కూటమి ప్రభుత్వం వచ్చీరాగానే సచివాలయ ఉద్యోగుల విషయంలో చేపట్టిన చర్యలతో తమ పట్ల ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తోందన్న భావన వారిలో నాటుకుంది. గత ప్రభుత్వం 1.34 లక్షల మందిని శాశ్వత ప్రాతిపదికన సచివాలయాలలో నియమించగా హేతుబద్ధీకరణ పేరిట దాదాపు 30 వేల మందిని ఇతర శాఖలకు పంపారు. సచివాలయ ఉద్యోగులను కనీసం ఉద్యోగులుగా పరిగణించడం లేదు. ప్రభుత్వంలో మిగతా ఉద్యోగులతో సమానంగా చూడట్లేదు. ప్రభుత్వ వివక్షాపూరిత ధోరణిని ఉద్యోగులు ప్రశ్నిస్తున్నారు. ప్రతి నెలా ఇంటింటికి సామాజిక భద్రతా పింఛన్లు మొదలుకొని సమస్త ప్రభుత్వ పథకాలను ప్రజల వద్దకు చేర్చడంలో కీలకంగా పని చేస్తున్నది సచివాలయ ఉద్యోగులే. కూటమి ప్రభుత్వం వచ్చాక తన ముద్ర కోసం స్వర్ణ గ్రామ, స్వర్ణ వార్డు సచివాలయాలుగా పేరు మార్చింది. గ్రామాలు, పట్టణాలను బంగారు మయం చేయడమన్న అర్థం పేరులో స్ఫురిస్తుంది. క్షేత్ర స్థాయి బంగారమైనప్పుడే ప్రభుత్వ లక్ష్యం స్వర్ణాంధ్ర సాకారమవుతుంది. అందుకు ఇరుసుగా పని చేస్తున్న సచివాలయ ఉద్యోగులపై నిరంకుశ చర్యలు ప్రభుత్వానికి తగనిపని. చలో సందర్భంలో, అనంతరం మంత్రి, డైరెక్టర్‌, సిఎంఒ నుంచి స్పష్టమైన హామీ లేకుండా వెలువడిన అహేతుక స్పందన ఆక్షేపణీయం. అనుమానాలతో కూడిన పురపాలక శాఖ జిఒ మరిన్ని ప్రశ్నలు లేవనెత్తుతోంది. ఇప్పటికైనా ప్రభుత్వం సచివాలయ ఉద్యోగ సంఘాలతో చర్చలు జరిపి సమస్యలు పరిష్కరించాలి. భవిష్యత్తు ఆందోళనలను నివారించాలి. అప్పుడే ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన ‘ఎంప్లాయి ఫ్రెండ్లీ’ వాగ్దానానికి విలువ.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్