ఉత్పత్తయిన సరుకులో 50 శాతం కూడా కొనని వైనం
గత ఏడాదితో పోలిస్తే ధర కూడా భారీగా దిగ్గోత
తీవ్ర ఆందోళనలో రైతులు
ప్రజాశక్తి- గుంటూరు జిల్లా ప్రతినిధి : పొగాకు కొనుగోలులో మందగమనం కొనసాగుతోంది. ఫిబ్రవరి చివరి వారంలో కొనుగోలు ప్రారంభమైంది. ఉత్పత్తి అయిన పొగాకులో సెప్టెంబరు నెల 25వ తేదీ నాటికి సగం కూడా కొనుగోలు జరగలేదు. దీంతో, పొగాకు రైతులు తీవ్ర ఆవేదనతో ఉన్నారు. 2025-26 సంవత్సరంలో 142 మిలియన్ కిలోల పొగాకు ఉత్పత్తికి బోర్డు అనుమతి ఇచ్చింది. అయితే, 235 మిలియన్ కిలోలు ఉత్పత్తి అయినట్లు అంచనా వేసింది. ఉమ్మడి ప్రకాశం, నెల్లూరు, ఉభయ గోదావరి జిల్లాల్లో మొత్తం 16 వేలం కేంద్రాల ద్వారా ఫిబ్రవరిలో కొనుగోలు ప్రారంభమైంది. ఏటా పొగాకు సాగు సెప్టెంబరు రెండో వారం నుంచి ప్రారంభించి నవంబరు మొదటి వారంలోగా పూర్తి చేస్తారు. జనవరి చివరి కల్లా దిగుబడి రావడం ప్రారంభం అవుతుంది. మార్చిలో కొనుగోలు ప్రారంభమైంది. సెలవు రోజులు మినహాయించి వేలం జరిగిన 150 రోజుల్లో ఇప్పటి వరకు 113 మిలియన్ కిలోలు మాత్రమే రైతుల నుంచి వ్యాపారులు కొనుగోలు చేశారు. పశ్చిమ గోదావరి జిల్లాలో గత ఏడాది జూన్ లో కిలో పొగాకును రూ.450కు కొనుగోలు చేయడంతో ఈ ఏడాది కూడా ఇదే రీతిలో ధరలు వస్తాయని ఆశించిన రైతులు ఎక్కువగా సాగు చేశారు. ఏప్రిల్ మొదటి వారం నుంచి మార్కెట్ మందగమనంగా ప్రారంభమైంది.
కిలో సగటు ధర గత ఏడాది రూ.249... *ఈ ఏడాది రూ.213
ఈ ఏడాది ఇప్పటి వరకూ కిలోకు సగటు ధర రూ.213 లభించిందని పొగాకు బోర్డు అధికారులు చెప్తున్నా, కొన్ని వెరైటీలకు రూ.180 నుంచి రూ.190 మించి ధర లభించలేదు. గత సీజన్లో సగటు ధర రూ.249 వరకు ధర లభించింది. రైతుల వద్ద ఇంకా దాదాపు 122 మిలియన్ కిలోల నిల్వలు ఉన్నాయి. వీటిని రానున్న రెండు నెలల్లో కొనుగోలు చేయగలమని భావిస్తున్నట్టు పొగాకు బోర్డు చైర్మన్ సి.హెచ్.యశ్వంత్ తెలిపారు. మార్చి నుంచి జూన్ వరకు కేవలం 20 మిలియన్ కిలోలు మాత్రమే కొనుగోలు చేయగా ఎపి రైతు సంఘం ఆధ్వర్యంలో రైతులు పెద్ద ఎత్తున ఆందోళన చేయడం, పొగాకు బోర్డు ముట్టడించడం తదితర చర్యల వల్ల దిగొచ్చిన ప్రభుత్వం కొంతమేరకు కొనుగోలు ప్రక్రియను వేగిరపర్చింది. అయినా, ఆశించిన స్థాయిలో కొనుగోలు జరగలేదు. గతేడాది ఇదే సమయానికి దాదాపు 90 శాతం కొనుగోలు జరిగింది. మరో నాలుగు నెలల్లో కొత్త సీజన్ ప్రారంభం కానుంది. మిగిలిన పొగాకు ఎప్పటికి కొనుగోలు చేస్తారన్నదీ మిలియన్ డాలర్ల ప్రశ్నగా మిగిలింది. కాగా, రానున్న సీజన్లో రాష్ర్టంలో వర్జినీయా పొగాకు ఉత్పత్తి లక్ష్యాన్ని పొగాకు బోర్డు భారీగా కుదించింది. 2026-27లో ఉత్పత్తి లక్ష్యం కేవలం 81 మిలియన్ కిలోలుగా నిర్దేశించింది.






కామెంట్‌లు (0)