మంగళవారం, 29 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionపిల్లలకూ గొంతుంది...

42 నిమిషాల క్రితం

students questioning.jpg
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 29, 2026, 05:10 పూర్వాహ్నం | 4 నిమిషాల చదవడం

జెన్ ఆల్ఫా పాఠశాల సౌకర్యాలపై ప్రశ్నిస్తే...పిల్లలకెందుకు? వాళ్ళు చదువుకోకుండా రోడ్డెక్కడం ఏంటి? అంటూ పెద్ద చర్చ జరుగుతున్నది. పిల్లలకు తమ అభిప్రాయాలను స్వేచ్ఛగా వ్యక్తం చేసే హక్కు లేదా? ఆ హక్కును అడ్డుకోవడమంటే కేవలం పిల్లల నోరు మూయించడమే కాదు; సమాజం తన భవిష్యత్తు గొంతును వినకుండా చెవులు మూసేసుకోవడం.

తమ జీవితాలను ప్రభావితం చేసే విషయంలో అభిప్రాయాలు వ్యక్తం చేసే హక్కు పిల్లలకు ఉందని ​ఐక్యరాజ్యసమితి బాలల హక్కుల సదస్సు లోని ఆర్టికల్‌ 12 స్పష్టం చేస్తుంది. భారత రాజ్యాంగం, విద్యా హక్కు చట్టం కూడా పిల్లలను కేవలం పథకాల లబ్ధిదారులుగా కాకుండా హక్కులు కలిగిన పౌరులుగా చూస్తున్నాయి. ​అయితే మన రోజువారీ ఆచరణలో మాత్రం పిల్లలు “మౌనంగా చదువుకునే వారు”గానే ఉండాలని కోరుకుంటున్నారు!

బడి నుంచి వీధిలోకి వచ్చిన ప్రశ్నలు

2026లో దేశంలోని కొన్ని ప్రాంతాల్లో పాఠశాల విద్యార్థులు తమ పాఠశాలల్లోని సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఆందోళనలకు దిగిన ఘటనలు వెలుగులోకి వచ్చాయి. ఉత్తరప్రదేశ్‌ లోని ఫతేపూర్‌లో విద్యార్థులు పాఠశాలలో ఫ్యాన్లు, తాగునీరు, మరుగుదొడ్లు, బెంచీలు వంటి కనీస సౌకర్యాల కోసం ఆందోళన చేశారు. బీహార్‌లోని గయాలో విద్యార్థులు తమ సమస్యను అధికారుల దృష్టికి తీసుకెళ్లేందుకు నడిచారు. రాజస్థాన్‌లో విద్యార్థులు ఉపాధ్యాయుల కొరతను ప్రశ్నించారు. మధ్యప్రదేశ్‌లో విద్యార్థినులు తమ పాఠశాల తరలింపునకు సంబంధించిన నిర్ణయంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. హమీర్‌పూర్‌లో విద్యార్థులు పాఠశాలకు వెళ్లే రహదారి కోసం అధికారులను ఆశ్రయించారు. ఇవి దేశవ్యాప్తంగా జరుగుతున్న పరిణామాలన్నింటినీ ప్రతిబింబిస్తాయని చెప్పలేం. కానీ ఒక విషయం మాత్రం స్పష్టం చేస్తున్నాయి. పిల్లలకు సమస్య కనిపిస్తే వారు ప్రశ్నించగలరు, ప్రశ్నిస్తారు. ఆ ప్రశ్నను పాఠశాల గోడల మధ్య వినిపిస్తే సమస్య అక్కడే పరిష్కారమయ్యే అవకాశముంది. కానీ అది బయటకు వచ్చి ధర్నాగా మారే వరకూ పెద్దలకు ఆ ప్రశ్న ఎందుకు వినిపించలేదో ఆలోచించాలి.

సోషల్ మీడియా పిల్లల గొంతును పెంచుతోంది

ఇప్పటి పిల్లలు డిజిటల్ ప్రపంచంలో పెరుగుతున్నారు. తమ చుట్టూ జరిగే విషయాలను సోషల్ మీడియాలో వ్యక్తం చేయడం కూడా వారి సామాజిక అనుభవంలో భాగంగా మారుతోంది. పిల్లవాడు తన జీవితాన్ని ప్రభావితం చేస్తున్న విషయాల గురించి మాట్లాడటం సహజం. తన చుట్టూ కనిపిస్తున్న నిరుద్యోగం, పోలీసు చర్యలు, విద్యా సమస్యలు, సామాజిక అసమానతలను గురించి ప్రశ్నించడం కూడా ఆ అనుభవంలో భాగమే. అయితే ఇక్కడ సమాజానికి ఒక బాధ్యత ఉంది. పిల్లల గొంతును రక్షించాలి. దాన్ని రాజకీయ నినాదంగా మార్చకూడదు. తల్లిదండ్రులు పిల్లలను తమ రాజకీయ ప్రయోజనాల కోసం ఉపయోగించకూడదు. మీడియా పిల్లలను సంచలనానికి సాధనంగా మార్చకూడదు. అధికారులు లేదా పోలీసులు “భద్రత” పేరుతో పిల్లలను బెదిరించకూడదు. పిల్లల మాటలలోని రాజకీయాన్ని వెతకడం కంటే, ఆ మాట వెనుక ఉన్న వారి అనుభవాన్ని వినాలి.

ఈ తరం ఎలా ఉండాలి?

మనకు కావాల్సింది మౌనంగా ఉండే పిల్లలు కాదు. ప్రశ్నించే పిల్లలు. అయితే ప్రశ్నించడం అంటే కేవలం వ్యతిరేకించడం కాదు. పిల్లలు స్పష్టంగా, ధైర్యంగా, నిజాలతో, గౌరవంతో ప్రశ్నించాలి. సంఘటితం కావాలి. కానీ గుంపు మనస్తత్వంతో కాదు. తమ అభిప్రాయాలను సమాచారంపై ఆధారపడి నిర్మించుకోవాలి. ఒక రీల్‌, ఒక మీమ్‌, ఒక సోషల్ మీడియా పోస్టుతోనే అభిప్రాయం ఏర్పడితే అది స్వతంత్ర ఆలోచన కాకపోవచ్చు. అందుకే డిజిటల్‌ పౌరసత్వాన్ని కూడా పిల్లలకు నేర్పాలి.

అబద్ధాలను పంచకుండా ఉండడం, ఇతరులను హేళన చేయకుండా మాట్లాడడం, తన సమస్యను స్పష్టంగా చెప్పడం, భిన్నాభిప్రాయాన్ని గౌరవించడం ఇవన్నీ ప్రజాస్వామ్య పౌరసత్వంలోని భాగాలే. ఉపాధ్యాయుడిని ప్రశ్నించవచ్చు. అధికారిని ప్రశ్నించవచ్చు. కానీ అవమానించడం, విధ్వంసం చేయడం హక్కులు కావు. తెగువ అంటే ఎప్పుడూ పెద్ద పోరాటమే కాదు. తరగతిలో ఉపాధ్యాయుడు ఎందుకు లేరని అడగడం కూడా తెగువే. ​అన్యాయాన్ని డైరీలో రాయడం కూడా తెగువే. తోటి విద్యార్థిని కాపాడటం కూడా తెగువే.

ఆరేళ్ల పిల్లవాడి ప్రశ్న మనకు చెప్పేది ఏమిటి?

పిల్లలు చిన్నవాళ్లే కావచ్చు. కానీ వారి అనుభవాలు చిన్నవి కావు. తమ చుట్టూ జరిగే విషయాలను వారు గమనిస్తారు. వాటి గురించి ఆలోచిస్తారు. తమ భాషలో ప్రశ్నిస్తారు. ఒక చిన్న పిల్లవాడు పరీక్షలు, నిరుద్యోగం, పోలీసు చర్యలు వంటి విషయాల గురించి మాట్లాడితే మనం ముందుగా “ఈ వయసులో ఇవన్నీ ఎలా తెలుసుకున్నాడు?” అని ఆశ్చర్యపడవచ్చు. కానీ మరో ప్రశ్న కూడా మనం వేసుకోవాలి. “చిన్నారి చుట్టూ ఉన్న ప్రపంచం తనకు ఈ ప్రశ్నలు ఎందుకు నేర్పింది?” ఈ ప్రశ్న చాలా ముఖ్యమైనది. పిల్లల్లో ధైర్యం, సామాజిక స్పృహ, ప్రశ్నించే తత్వం, భవిష్యత్తు పట్ల బాధ్యత ఇవన్నీ సహజంగా మాత్రమే రావు. కుటుంబం, పాఠశాల, సమాజం వాటిని పెంచాలి. మన చుట్టూ కూడా ఇలాంటి పిల్లలే ఉన్నారు. వారిలో చైతన్యం నింపాలి. సామాజిక స్పృహ పెంచాలి. మాట్లాడే ధైర్యాన్ని ఇవ్వాలి. ప్రశ్నించే తత్వాన్ని ప్రోత్సహించాలి.

వినని సమాజం ఏమవుతుంది?

పిల్లల అభిప్రాయాన్ని గౌరవించని విద్యా వ్యవస్థ ఒక తరాన్ని మాత్రమే బలహీనపరచదు. భవిష్యత్తు ప్రజాస్వామ్యాన్ని కూడా ప్రభావితం చేయగలదు. కనీస సౌకర్యాలు లేని పాఠశాలలు, ఖాళీ ఉపాధ్యాయ పోస్టులు, పరీక్షల్లో అక్రమాలపై మాట్లాడుతున్నారంటే వాటి ద్వారా పిల్లలు మనకు సంకేతాలు ఇస్తున్నారు. “చదువుకో... మాట్లాడకు” అంటూ వాటిని నొక్కిపెడితే, పిల్లలు మరో వేదికను వెతుక్కుంటారు. అప్పుడు వారు వీధిలో కనిపించినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. పిల్లలు సమాజంలో భాగం. వారికీ గొంతుంది. వారు తమ సమస్యలను చెప్పాలి. ​పెద్దలు వినాలి. ​పాఠశాలలు వినాలి.​ వ్యవస్థ వినాలి.​ రాష్ట్రం వినాలి.​ దేశం వినాలి.

ఎందుకంటే పిల్లల గొంతులోంచి వచ్చే ప్రశ్న....రేపటి సమాజం ఎలా ఉండబోతుందో చెప్పే సంకేతం. అన్నే ఫ్రాంక్‌ డైరీ... మలాలా, గ్రెటా వంటి వారి ప్రశ్నలు ప్రపంచానికి ఒక విషయం నేర్పాయి. ఒక పిల్లవాడి అనుభవాన్ని నిజాయితీగా వినడం కొన్నిసార్లు ఒక సమాజం తనను తాను చూసుకునే అద్దంగా మారుతుంది. ​మన పిల్లలకు అలాంటి గొంతు అవసరం.​వారికి మౌనం కాదు - స్వేచ్ఛ కావాలి. ​భయం కాదు - భద్రత కావాలి.​ ఆజ్ఞాపాలన మాత్రమే కాదు - ఆలోచించే అవకాశం కావాలి. ​ప్రశ్నలకు శిక్ష కాదు-సమాధానాల కోసం సంభాషణ కావాలి.​ గొంతు లేని తరం లేదు-వినని సమాజం ఉంది. ​ఆ గొంతును వినడం మొదలుపెట్టడమే నిజమైన సామాజిక పురోగతి.

ramaprabha

వ్యాసకర్త -డా. కె. రమాప్రభ
సామాజిక కార్యకర్త, సెల్: 9492348428

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్