ఆదివారం, 25 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

మంటల్లోనే మణిపూర్!

8 గంటల క్రితం

manipur.jpg
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 25, 2026, 05:55 పూర్వాహ్నం | 3 నిమిషాల చదవడం

దేశ ఈశాన్య సరిహద్దు రాష్ట్రమైన మణిపూర్ గత మూడేళ్లుగా నిరంతరాయంగా రగులుతుండటం తీవ్ర ఆందోళనకరం. సహజ సౌందర్యానికి, విభిన్న సంస్కృతులకు నెలవైన ఆ రాష్ట్రం భయానక యుద్ధ భూమిగా మారడం బాధాకరం. మూడేళ్లుగా సాగుతున్న తెగల ఘర్షణలు కేవలం శాంతిభద్రతల సమస్య కాదు. ప్రజల దైనందిన జీవితాలను, ప్రాథమిక హక్కులను తుంగలో తొక్కిన మానవీయ సంక్షోభం. ఒకప్పుడు కలిసిమెలిసి బతికిన మనుషులు నేడు ఒకరినొకరు అనుమానంతో చూసుకొనే విషాద దృశ్యం. భయం నీడలో కాలం వెళ్లదీస్తున్న మణిపూర్ ప్రజల ఆర్తనాదాలు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల రాతి గుండెలను కరిగించలేకపోతున్నాయి. 2023 మే నెలలో మెయితీ, కుకీ-జో వర్గాల మధ్య ప్రారంభమైన జాతి వైరం, నేడు నాగా తెగలను కూడా వివాదంలోకి లాగుతూ రాష్ట్ర సమగ్రతకు ప్రశ్నార్థకంగా మారింది. తాత్కాలిక శాంతి చర్చలు, అదనపు బలగాల మోహరింపు వంటి అరకొర చర్యలు ఈ రగిలే గాయాన్ని నయం చేయలేవని గత అనుభవాలు పదే పదే హెచ్చరిస్తున్నా, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మాత్రం నిద్రమత్తులోనే జోగుతుండటం అత్యంత విచారకరం. ఒక రాష్ట్రంలో శాంతిభద్రతలను కాపాడటం, ప్రజల మాన, ప్రాణాలకు రక్షణ కల్పించడం ప్రభుత్వ ప్రాథమిక బాధ్యత. కానీ, ఆ బాధ్యతను నెరవేర్చడంలో ప్రభుత్వాలు వరుసగా విఫలమైతే ప్రజలు ఎవరిని నమ్మాలి?

తాజాగా అక్టోబర్‌ 19న అడవిలో కట్టెలు సేకరించేందుకు వెళ్లిన మెయితీ గ్రామస్థులపై సాయుధులు జరిపిన కాల్పుల్లో ముగ్గురు మరణించగా, మరికొందరు గాయపడ్డారు. ఈ ఘటనతో ఇంఫాల్‌ లోయలో ఆగ్రహావేశాలు పెల్లుబికాయి. మృతదేహాలను ముఖ్యమంత్రి నివాసం వద్దకు తీసుకొచ్చి ప్రజలు నిరసన తెలిపారు. అనంతరం జరిగిన 48 గంటల బంద్‌తో సాధారణ జనజీవనం స్తంభించింది. అక్టోబర్‌ 24న వేలాది మంది ప్రజలు చారిత్రక 'కాంగ్లా కోట' వద్దకు చేరుకుని, గిన్నెలు వాయిస్తూ, వాహనాల హారన్లు మ్రోగిస్తూ తమ నిరసనను వ్యక్తం చేశారు. రాష్ట్రంలో హింస ముగిసిందని, సాధారణ పరిస్థితులు తిరిగి వచ్చాయని చెబుతున్న తరుణంలో తాజా ఘటనలు మళ్లీ భయాందోళనలు రేకెత్తించాయి. ముఖ్యమంత్రి ఖేమ్‌చంద్‌ సింగ్‌ ప్రభుత్వం ముందున్న సవాళ్లు ఎంత తీవ్రమైనవో ఈ పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి. అధికారిక నివేదికల ప్రకారం...2023 నుంచి ఇప్పటివరకు 300 మందికి పైగా అమాయక పౌరులు ప్రాణాలు కోల్పోగా, సుమారు 70,000 మందికి పైగా ప్రజలు నిరాశ్రయులై కాందిశీకుల శిబిరాల్లో దుర్భర జీవితం గడుపుతున్నారు. సొంత రాష్ట్రంలోనే ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి వెళ్లలేని దయనీయ స్థితి నెలకొంది. గణాంకాల్లో కనిపించే ఈ సంఖ్యల వెనుక ఒక్కొక్క మనిషికి ఒక్కో విషాదగాథ ఉంది. కుటుంబ సభ్యులను కోల్పోయినవారు, ధ్వంసమైన ఇళ్లను చూసి కన్నీరు పెట్టుకునేవారు, చదువుకు దూరమైన పిల్లలు, ఉపాధి కోల్పోయిన కార్మికులు, భవిష్యత్తుపై ఆశలు సన్నగిల్లిన యువత.. వీరందరి బాధలకు పరిష్కారం చూపాల్సిన పాలకులు మాత్రం శాంతి ప్రకటనలకే పరిమితమవుతున్నారు.

మణిపూర్ సంక్షోభం కేవలం తెగల మధ్య ఘర్షణ మాత్రమే కాదు; ఇది పూర్తిగా రాజకీయ, పరిపాలనా వైఫల్యానికి పరాకాష్ట. బీరేన్ సింగ్ హయాంలో పెరిగిన ఘర్షణలు, ఆ తర్వాత రాష్ట్రపతి పాలన విధించినా, కొత్త ప్రభుత్వం బాధ్యతలు చేపట్టినా పరిస్థితిలో ఎలాంటి మార్పు రాకపోవడం పాలకుల అసమర్థతను ఎత్తిచూపుతోంది. ఈ క్రమంలోనే దేశ రాజధాని ఢిల్లీలో గళమెత్తిన జెన్‌-జీల నిరసనలను అణచివేయడానికి కేంద్రప్రభుత్వం చూపించిన క్రియాశీలత... ప్రాణ, మానాలు కోల్పోతున్న మణిపూర్‌ ప్రజలను రక్ష‍ించడంలో చూపలేదనే వాదనలు కూడా బలంగా వినిపిస్తున్నాయి. మరోవైపు మణిపూర్ కొండ ప్రాంతాల్లో విస్తారంగా ఉన్న ఖనిజ సంపద, అటవీ నిధులను కార్పొరేట్లకు కట్టబెట్టాలనే కుటిలత్వం దాగివుందని, గిరిజనులను వారి ఆవాసాల నుంచి వెళ్లగొట్టడానికే ఈ ఘర్షణలను తెరవెనుక ప్రోత్సహిస్తున్నారన్న అనుమానాలు కూడా వ్యక్తమౌతున్నాయి. మెయితీ, కుకీ-జో, నాగా తెగల ప్రతినిధులతో ఎలాంటి ముందస్తు షరతులు లేకుండా శాంతి చర్చలు జరపాలి. మణిపూర్‌లోని ప్రతి బిడ్డ నిర్భయంగా పాఠశాలకు వెళ్లాలి. ప్రతి మహిళ స్వేచ్ఛగా ప్రయాణించగలగాలి. ప్రతి రైతు తన పొలానికి, ప్రతి కార్మికుడు తన పనికి, ప్రతి కుటుంబం తన ఇంటికి నిర్భయంగా వెళ్లగలగాలి. ఏ జాతికి చెందినవారైనా తమ గుర్తింపును దాచుకోవాల్సిన అవసరం లేని పరిస్థితి వుండాలి. అదే నిజమైన సాధారణ స్థితి. దేశంలోని యువత నిరసనలను అణచివేయడానికి ప్రభుత్వం చూపే బలప్రదర్శన కంటే, ప్రజల కన్నీళ్లు తుడవడానికి చూపే చొరవే ప్రజాస్వామ్యానికి నిజమైన కొలమానం. ప్రజల మధ్య కుల, మత గోడలు కట్టి పాలించడం సులభం కావచ్చు; ఆ గోడలను కూల్చి ప్రజల్లో విశ్వాసాన్ని నింపడమే నిజమైన నాయకత్వం. అప్పుడే భారత ప్రజాస్వామ్యం నిజంగా గెలిచినట్లు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్