ఆదివారం, 06 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

‘నిర్భయ’ కాండ

1 గంట క్రితం

attack
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 06, 2026, 06:00 పూర్వాహ్నం | 3 నిమిషాల చదవడం

సమాజం సహించలేని, భరించలేని ఎన్నో ఘటనలు ఆవేదన కలిగిస్తాయి... ఆగ్రహంతో రగిలిపోయేలా చేస్తాయి. చట్టాలెన్ని చేసినా ఆగకుండా సాగుతున్న అకృత్యాలను చూస్తూ... ఏమీ చేయలేమా అన్న ఆక్రోశం కలచివేస్తుంటుంది. ఒక ‘నిర్భయ’ ఘటన... దేశాన్ని కదిలించింది. కానీ ఆ తర్వాత వచ్చిన వేలాది ‘నిర్భయ’ల అరుపులు ఈ దేశం చెవులకు ఎందుకు వినిపించలేదు? 2012లో ఢిల్లీలో ‘నిర్భయ’పై జరిగిన దారుణం తర్వాత దేశం కన్నీరు పెట్టుకుంది. వీధుల్లోకి వచ్చింది. చట్టాలు కఠినతరం చేసింది. మహిళలకు భద్రత కల్పిస్తామని పాలకులు హామీ ఇచ్చారు. అయినా, పసిపిల్లల నుంచి బాలికల వరకు, యువతుల నుంచి వృద్ధ మహిళల వరకు అత్యాచారాలు, హత్యలు, లైంగిక వేధింపులు దేశవ్యాప్తంగా నిరంతరం జరుగుతూనే ఉన్నాయి. పన్నెండేళ్ల క్రితం దేశాన్ని కుదిపేసిన ‘నిర్భయ’ ఘటన తర్వాత కూడా ఢిల్లీలో ఇటీవల జరిగిన సామూహిక అత్యాచార ఘటన...మహిళల భద్రత విషయంలో మనం ఎక్కడున్నామో కళ్లకు కడుతోంది. నాటి ‘నిర్భయ’ నుంచి నేటి ‘నిర్భయ’ వరకూ... కాలం మారుతోంది, ప్రభుత్వాలు మారుతున్నాయి, చట్టాలు మారుతున్నాయి... కానీ ఆడపిల్లల భయం మాత్రం మారడం లేదు. నిర్భయ ఘటన తర్వాత ‘ఇకపై ఇలాంటివి జరగకూడదు’ అని దేశం చేసిన ప్రతిజ్ఞలు ఏమయ్యాయి? కఠిన చట్టాలు, నిర్భయ నిధులు, మహిళా భద్రతా పథకాలు ఉన్నా...ఎందుకు భయంతోనే బతకాల్సి వస్తోంది? ఇది నేరస్తుడి వికృతిపై తీర్పు చెప్పే సందర్భం మాత్రమే కాదు; మహిళకు రాజ్యాంగం హామీ ఇచ్చిన జీవించే హక్కు, గౌరవం, స్వేచ్ఛను కాపాడటంలో పాలనా వ్యవస్థ, పోలీసు యంత్రాంగం, న్యాయవ్యవస్థ, సమాజం విఫలమవుతున్నాయా అన్నదే అసలు ప్రశ్న.

దేశ రాజధాని ఢిల్లీ...దేశానికి దిశానిర్దేశం చేయాల్సిన నగరం. రాజ్యాంగ విలువలకు, చట్ట పాలనకు, ప్రజాస్వామ్యానికి ఒక చిహ్నం. కానీ అదే నగరంలో కదులుతున్న స్లీపర్‌ బస్సులో 16 ఏళ్ల మైనర్‌ బాలికపై డ్రైవర్‌, కండక్టర్‌ సామూహిక అత్యాచారానికి పాల్పడిన ఘటన వెలుగులోకి రావడం దేశం మొత్తం తలదించుకునే విషాదం. ఆగస్టు 4వ తేదీ రాత్రి జరిగిన ఈ దారుణం ఆలస్యంగా వెలుగులోకి రావడం మరింత ఆందోళన కలిగించే అంశం. 2012 నాటి నిర్భయ ఘటన దేశాన్ని కుదిపేసింది. చట్టాలను కఠినతరం చేయాలని, మహిళలకు సురక్షిత వాతావరణం కల్పించాలని దేశం నినదించింది. సంవత్సరాలు గడిచాయి. కానీ ఆడపిల్లల్లో భయం మాత్రం ఎందుకు తొలగడంలేదు? ఇది ఒక బాలికపై జరిగిన అత్యాచారం కాదు.... సమాజపు మనస్సాక్షిపై జరిగిన అత్యాచారం. ‘ఒక మహిళ అర్ధరాత్రి ఒంటరిగా భయపడకుండా తిరగగలిగిన రోజే నిజమైన స్వాతంత్ర్యం వచ్చినట్లని’ గాంధీ అంటారు. కానీ నేడు పట్టపగలు కూడా మహిళలు భయం లేకుండా రహదారులపై నడవగలుగుతున్నారా? ఒంటరిగా ప్రయాణాలు చేయగలుగుతున్నారా? ఉద్యోగానికి, చదువుకు, ఇంటికి తిరిగి వెళ్లే మార్గంలో తమ శరీరం, తమ గౌరవం సురక్షితంగా ఉంటుందనే నమ్మకం వారికి ఉందా? ఈ ‘నిర్భయకాండ’కు అంతం ఎక్కడ? ‘యత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవతాః’ అని గొప్పగా చెప్పుకునే దేశం... తన ఆడబిడ్డలకు భద్రత ఇవ్వలేకపోతే, ఆ దేశం అభివృద్ధి గణాంకాలను చూసుకొని గర్వపడటంలో అర్థమేముంది? సమాజంలో పెరుగుతున్న పురుషాధిక్య భావజాలం, స్త్రీని వస్తువుగా చూసే సంస్కృతి, లైంగిక హింసను సాధారణీకరించే దృశ్య సంస్కృతి, అశ్లీలతను వినోదంగా మార్చే మార్కెట్‌, దాన్ని సొమ్ము చేసుకునే కార్పొరేట్‌ మీడియా, మత్తు పదార్థాల వ్యాప్తి, నేరగాళ్లపై చట్ట భయం తగ్గడం - ఇవన్నీ కలిసే ఒక ప్రమాదకర వాతావరణాన్ని సృష్టిస్తున్నాయి. ఒక మహిళ స్వేచ్ఛగా, నిర్భయంగా నడవలేని దేశంలో స్వాతంత్ర్యం ఎవరిది?

రాచరికాల నుండి నేటి ఆధునిక ప్రజాస్వామ్య సమాజం వరకు స్త్రీ అనేక అసమానతలకు, వివక్షలకు, స్వేచ్ఛా రాహిత్యానికి గురవుతూనే ఉంది. విద్యకీ, భావప్రకటనా స్వేచ్ఛకు, నిర్ణయాధికార హక్కులకు, తన శరీరంపై తన హక్కులకు, పునరుత్పత్తి హక్కులకు, ఉపాధి అవకాశాలకు, ఆర్థిక, రాజకీయ హక్కులకు మొత్తంగా సామాజిక జీవితానికి దూరమవుతూనే ఉంది. ‘ఆధునిక స్త్రీ చరిత్రను పునర్లిఖిస్తుంది’ అని గురజాడ వారు అన్నట్టుగా- ఈ ఆధునిక యుగంలో బాలికలు, యువతులు చదువుకుంటున్నారు, ఉద్యోగాలు చేస్తున్నారు, తమను తాము నిరూపించుకుంటున్నారు. ఒకవైపు ‘వికసిత్‌ భారత్‌’ అని ప్రపంచ దేశాల్లో నినాదాలు చేస్తూనే, మరోవైపు బెయిల్‌పై వచ్చే అత్యాచార నిందితులను మేళతాళాలతో ఊరేగించడం, మహిళల వస్త్రధారణపై నీలాపనిందలు మోపుతూ, వారి స్వేచ్ఛకు సంకెళ్లు వేసే సంస్కృతిని ప్రోత్సహిస్తున్నారు. కనుకనే దేశ రాజధాని సహా మారుమూల గ్రామాల వరకు రాత్రి వేళల్లోనే కాదు, పట్టపగలు కూడా మహిళలు ఒంటరిగా ప్రయాణించలేకపోతున్నారన్నది కఠోర వాస్తవం. ఆమె భద్రత కోసం భయపడే తల్లిదండ్రుల దేశం ఇది కాకూడదు. బాలురకు చిన్నప్పటి నుంచే సమానత్వం, సమ్మతి, గౌరవం నేర్పాలి. పాఠశాల విద్యలో లింగ సమానత్వాన్ని భాగం చేయాలి. బాధితురాలిపై నిందలు మోపే సంస్కృతిని తుడిచిపెట్టాలి. నేరస్తుడి సామాజిక, రాజకీయ, ఆర్థిక స్థాయి ఏదైనప్పటికీ చట్టం ముందు ఒకే విధంగా నిలబెట్టాలి.

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్