ఢిల్లీలో విద్యార్థుల శాంతియుత ప్రదర్శనపై ప్రభుత్వ దౌర్జన్యకాండ గురించి పట్టించుకునేంత తీరిక తమకు లేదని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి వ్యాఖ్యానించడం విచారకరం. లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తుతో ముడిపడి ఉన్న నీట్ పరీక్షల్లోని అవకతవకలపై ప్రశ్నిస్తున్న గొంతులను మోడీ ప్రభుత్వం అణచివేస్తున్న తీరు, కనీసం పట్టించుకోని నిర్లక్ష్యం కళ్లముందు కనిపిస్తున్నా స్పందించడానికి సిద్ధపడకపోవడం ఆందోళనకరం. విద్యార్థుల శాంతియుత ఆందోళనను, ప్రదర్శనను భగ్నం చేయడానికి, బలహీనపర్చడానికి ప్రభుత్వం నానా ప్రయత్నాలూ చేసింది. ర్యాలీలో పాల్గొన్న వేలాది మంది విద్యార్థులపై క్రూరమైన హింసాకాండ సాగించింది. పైగా వారి మీదే అక్రమ కేసులు బనాయించడానికి పూనుకుంది. ఇలాంటి నేపథ్యంలో ఇది ప్రజాస్వామిక చర్య కాదని ప్రభుత్వానికి ఎవరు చెబుతారు? కార్యనిర్వాహక, ప్రజాప్రాతినిధ్య వ్యవస్థలు పగబట్టినట్టు వ్యవహరిస్తుంటే వాటికి రాజ్యాంగ స్ఫూర్తిని గుర్తు చేయాల్సింది న్యాయవ్యవస్థ కాక మరెవరు?
భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 19(1)(ఎ), (బి), (సి) ప్రకారం భావప్రకటన స్వేచ్ఛ, శాంతియుతంగా సమావేశమయ్యే హక్కు, సంఘాలు ఏర్పాటు చేసుకునే హక్కు పౌరులకు ఉన్నాయి. ప్రభుత్వ విధానాలను ప్రశ్నించడం, వ్యతిరేకించడం, శాంతియుతంగా నిరసన తెలపడం ప్రజాస్వామ్యానికి ప్రాణవాయువు లాంటిదని భారత న్యాయవ్యవస్థ అనేక సందర్భాల్లో స్పష్టం చేసింది. 1962లో కామేశ్వర్ ప్రసాద్ వర్సెస్ స్టేట్ ఆఫ్ బీహార్ కేసులో శాంతియుత నిరసన కూడా భావప్రకటన స్వేచ్ఛలో భాగమేనని సుప్రీంకోర్టు పేర్కొంది. 2012లో రామలీలా మైదాన్ కేసులో "శాంతియుత నిరసన ప్రజాస్వామ్యానికి జీవనాడి" అని వ్యాఖ్యానించిన ధర్మాసనం, నిరసనలను చెదరగొట్టేందుకు పోలీసులు అవసరానికి మించిన బలప్రయోగం చేయరాదని హెచ్చరించింది. 2018లో మజ్దూర్ కిసాన్ శక్తి సంఘటన్ కేసులో ప్రభుత్వ విధానాలను విమర్శించడం, నిరసన తెలియజేయడం ప్రజాస్వామ్య వ్యవస్థలో అంతర్భాగమని మరోసారి నొక్కిచెప్పింది.
ఇలాంటి చరిత్ర ఉన్న దేశంలో ఢిల్లీలో విద్యార్థులపై జరిగిన పోలీసు దౌర్జన్యం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. సామాజిక మాధ్యమాలు, వార్తా సంస్థలు ప్రసారం చేసిన అనేక వీడియోల్లో మహిళా విద్యార్థులను ఈడ్చుకెళ్లడం, వారి పట్ల అవమానకరంగా ప్రవర్తించడం, లాఠీలతో గుచ్చడం, కాలు అడ్డుపెట్టి కిందపడేయడం, నేలపై పడిన వారిని పలువురు పోలీసులు కలిసి కొట్టడం వంటి దృశ్యాలు కనిపిస్తున్నాయి. మేకులు పొదిగిన లాఠీలు, పెల్లెట్లు ప్రయోగించడం, రాళ్లు విసరడాలు పోలీసులు చేయాల్సిన పనేనా? యూనిఫాం లేకుండా, పోలీసు గుర్తింపు లేకుండా కొందరు వ్యక్తులు కూడా విద్యార్థులపై దాడుల్లో పాల్గొన్నట్లు వీడియోలు సూచిస్తున్నాయి. వారు ఎవరు? వారికి ఆ అధికారం ఎవరిచ్చారు? ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే. అమానుషంగా, చట్టవిరుద్ధంగా సాగిన పోలీసు హింసాకాండను నిలదీసి, ప్రశ్నించడంలో న్యాయవ్యవస్థ పాత్ర ఎంతో కీలకం. మన కోర్టులు ఎన్నోసార్లు ఈ బాధ్యతను ధైర్యంగా నిర్వర్తించాయి. 1983లో షీలా బార్సే రాసిన ఒక లేఖ ఆధారంగా మహిళా ఖైదీల హక్కులను పరిరక్షించేందుకు సుప్రీంకోర్టు జోక్యం చేసుకుంది. 1984లో బంధువా ముక్తి మోర్చా కేసులో ఒక ఫిర్యాదు లేఖను ప్రజాప్రయోజన వ్యాజ్యంగా స్వీకరించి వేలాది బానిస కార్మికుల విముక్తికి మార్గం సుగమం చేసింది. 1997లో డి.కె. బసు కేసులో కస్టడీ హింసను అరికట్టేందుకు ఇప్పటికీ అమలులో ఉన్న అరెస్టు నియమాలను నిర్దేశించింది. ఇలాంటి చొరవ, చర్యలే భారత న్యాయవ్యవస్థ పట్ల ప్రజల్లో గౌరవాన్ని పెంచాయి. పెంచుతాయి.
అందుకే విద్యార్థులపై సాగించిన దౌర్జన్యకాండ ఘటనలో సుప్రీంకోర్టు అత్యవసర విచారణను నిరాకరించిన తీరు, ఆ సందర్భంగా ప్రధాన న్యాయమూర్తి చేసిన వ్యాఖ్యలు తీవ్ర నిరాశను, దిగ్భ్రాంతిని కలిగించాయి. విద్యార్థులు శాంతియుతంగా ర్యాలీ చేస్తుంటే, పోలీసులు అమానుషంగా ప్రవర్తించారని, నిలువరించే పేరుతో తీవ్ర హింసకు, లాఠీచార్జీకి పాల్పడ్డారని, దానిపై తక్షణం విచారణ జరపాలని నరేంద్ర మిశ్రా అనే న్యాయవాది ధర్మాసనాన్ని కోరారు. అయితే ప్రధాన న్యాయమూర్తి "మా సమయం వృథా చేయొద్దు, మీ సమయం వృథా చేసుకోవొద్దు" అంటూ వ్యాఖ్యానించారు. పోలీసుల హింసను సూచించే వీడియోలు తమ వద్ద ఉన్నాయని, వాటిని వీక్షించాల్సిందిగా కోరగా, వాటిని చూసే తీరిక తమకు లేదని అన్నారు. న్యాయవాది వివరణ కొనసాగించే ప్రయత్నం చేయగానే "థ్యాంక్యూ" అంటూ వినటానికి నిరాకరించారు. బాధితుల తరఫున వినిపిస్తున్న వాదనను సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఈ విధంగా పక్కనపెట్టడం దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. దీనికి భిన్నంగా వీడియోలు, సీసీ టీవీ ఆధారాలను భద్రపరచాలని ఢిల్లీ హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించడం, నిరసనలో పాల్గొనడానికి వెళ్తున్న వ్యక్తిని ముందుగానే నిర్బంధించడంపై ఉత్తరాఖండ్ హైకోర్టు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేయడం న్యాయవ్యవస్థ బాధ్యతను గుర్తుచేశాయి.
న్యాయవ్యవస్థ రాజ్యాంగానికి చివరి కాపలాదారుగా ఉండాలంటే ఇలాంటి సందర్భాల్లో మరింత చురుకుగా వ్యవహరించాలి. ఘటనకు సంబంధించిన అన్ని వీడియోలు, సాక్ష్యాలను స్వతంత్రంగా పరిశీలించాలి. చట్టవిరుద్ధంగా వ్యవహరించిన పోలీసు అధికారులపై చర్యలకు ఆదేశించాలి. గుర్తింపు లేని వ్యక్తులు దాడులకు పాల్పడడంపై స్వతంత్ర విచారణ జరగాలి. విద్యార్థులు, మహిళలు, పౌరుల రాజ్యాంగ హక్కులకు సంపూర్ణ రక్షణ కల్పించాలి. సంభాషణకు, సంయమనానికి అనువైన వాతావరణాన్ని కల్పించేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలి. న్యాయవ్యవస్థ తన రాజ్యాంగ విహిత బాధ్యతను నిర్వర్తించాలి.







కామెంట్‌లు (0)