ఔషధ ధరల నియంత్రణ వ్యవస్థ మొత్తం తయారీ సంస్థలకు తోడ్పాటునందించేలా పని చేస్తున్నట్లుందని సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్య ప్రజారోగ్య రంగంలో నెలకొన్న దుస్థితికి నిదర్శనం. దేశంలో ఔషధాల ధరలను నియంత్రించేలా ఆదేశాలివ్వాలని, రోగులకు జనరిక్ మందులను సిఫార్సు చేయని వైద్యులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ దాఖలైన రెండు పిటిషన్లపై మంగళవారం జరిపిన విచారణ సందర్భంగా జస్టిస్ విక్రమ్‌నాథ్, జస్టిస్ సందీప్ మెహతా ధర్మాసనం పలు కీలకాంశాలను లేవనెత్తింది. మందుల ధరల విషయంలో రోగుల ప్రయోజనాల కంటే కంపెనీల వాణిజ్య ప్రయోజనాలకే ప్రాధాన్యం దక్కుతున్న తీరుపై విస్మయం వ్యక్తం చేసిన న్యాయస్థానం దానిని నిరభ్యంతరంగా కొనసాగిసస్తున్న ప్రభుత్వ తీరుపై వ్యక్తం చేసిన ఆగ్రహం పూర్తిగా సమర్ధనీయం. చిల్లర వ్యాపారికి రూ.15కే అందుతున్న మందుపై గరిష్ఠ చిల్లర ధర రూ.250గా ఉండటాన్ని, కొన్ని ఔషధాల విషయంలో చిల్లర ధరకు, రిటైలర్‌కు సరఫరా చేసే ధరకు మధ్య 300 నుంచి 400 శాతం లేదా అంతకంటే ఎక్కువ వ్యత్యాసం ఉండటాన్ని ఎలా సమర్థిస్తారు? ఆ వ్యత్యాసం వల్ల లబ్ధి పొందుతున్నదెవరు, రోగులపై ఇంతటి భారం ఎందుకు వేస్తున్నారంటూ న్యాయస్థానం వేసిన ప్రశ్నలకు ప్రభుత్వం నుండి స్పష్టమైన సమాధానం రాకపోవడం విస్మయకరం.
ఔషధాల ధరలపై అత్యున్నత న్యాయస్థానం చేసిన ఈ వ్యాఖ్యలు, లేవనెత్తిన ప్రశ్నలు ప్రభుత్వానికి, ధరల నియంత్రణ సంస్థలకు కనువిప్పు కావాలి. ప్రాణాలను నిలబెట్టే మందులను కేవలం వాణిజ్య సరుకుగా చూడలేం. రోగికి మందు కొనడం ఐచ్ఛికం కాదు. అత్యవసరం. అలాంటప్పుడు కంపెనీల లాభాలు, మార్కెట్ పోటీ పేరుతోఅధిక ధరలను నిర్ణయించడం, వాటిని ప్రభుత్వం సమర్థించడం అన్యాయం. ప్రభుత్వ విధానం ప్రజల ప్రాణాలు, ఆరోగ్యం, కొనుగోలు శక్తిని దృష్టిలో పెట్టుకోవాలి తప్ప ఔషధ పరిశ్రమ ప్రయోజనాలను కాదు. ప్రస్తుతం ధరల నియంత్రణలో ఉన్న షెడ్యూల్డ్(అత్యవసర) మందులు ధరల గణనలో 16 శాతం రిటైలర్ మార్జిన్‌ను పరిగణనలోకి తీసుకుంటుండగా, షెడ్యూల్ పరిధిలో లేని మందుల విషయంలో ఇటువంటి పరిమితి లేకపోవడం ధరల వ్యత్యాసాలకు అవకాశం కల్పిస్తోంది. ఈ నాన్ షెడ్యూల్ మందులలో కూడా కొన్ని అత్యవసర, ప్రాణాధార మందులు ఉండటం గమనార్హం. కాన్సర్ మందులపై 30 శాతం ట్రేడ్ మార్జిన్ పరిమితి విధించినట్లు ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ధర్మాసనం దృష్టికి తీసుకువచ్చింది. అదే సమయంలో, కొన్ని కాన్సర్ మందుల విషయంలో రిటైలర్‌కు సరఫరా ధర రూ.2,700 ఉండగా గరిష్ఠ చిల్లర ధర రూ.27,000గా ఉన్న విషయాన్ని న్యాయస్థానమే ప్రస్తావించడంతో పాటు, ఈ దోపిడి కొనసాగాల్సిందేనా అని ప్రశ్నించడం పరిస్థితి తీవ్రతకు నిదర్శనం. నిజానికి మన దేశంలో ఏటా కేన్సర్ కారణంగా పెద్ద సంఖ్యలో మరణిస్తున్నారు. రాన్నున్న ఏళ్లలో కాన్సర్ రోగుల సంఖ్య భారీగా పెరగనుందన్న అంచనాలు ఉన్నాయి. పేద ప్రజలు పెద్ద సంఖ్యలో ఈ వ్యాధి బారిన పడుతున్నారు. ఈ నేపధ్యాన్ని పరిశీలించనప్పుడు కాన్సర్ ఔషధాల ధరలు ఎంత తగ్గితే అంత మేలన్న విషయం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇతర ప్రాణాంతక వ్యాధులదీ ఇదే స్థితి.
జాతీయ ఔషధ ధరల నిర్ణయ సంస్థ (ఎన్.పి.పి.ఎ) క్రియాశీలతను కూడా సుప్రీంకోర్టు ప్రశ్నించింది. ధరలను పర్యవేక్షించి, అధిక ధరలపై చర్యలు తీసుకోవాల్సిన సంస్థ నిర్వీర్యంగా ఎందుకు మారిందన్న ధర్మాసనం ప్రశ్నను తేలికగా తీసుకోవడానికి వీలు లేదు. మందుల గరిష్ఠ చిల్లర ధరలు, రిటైలర్‌కు సరఫరా ధరలు, తయారీదారులు నిర్ణయిస్తున్న ధరలు, ఆసుపత్రులు వసూలు చేస్తున్న ధరల మధ్య వ్యత్యాసాలను ఎన్.పి.పి.ఎ నిరంతరం పరిశీలించాలి. నిబంధనలను ఉల్లంఘించే సంస్థలపై చర్యలు తీసుకోవడంతోపాటు, అధికంగా వసూలు చేసిన మొత్తాలను రికవరీ చేయాలి. ఔషధ కంపెనీల నుంచి వివరాలు సేకరించడం, ధరల నిర్ణయానికి సంబంధించిన లెక్కలను ప్రజలకు అందుబాటులో ఉంచడం, అవసరమైన చోట ధరలను నియంత్రించడం వంటి బాధ్యతలను ఆ సంస్థ సక్రమంగా నిర్వర్తించాలి. ధరల వ్యత్యాసాలపై రూ.8,700 కోట్ల మేర ఔషధ సంస్థల నుంచి రికవరీలు పెండింగ్‌లు ఉన్నా, వాటిని వసూలు చేసుకోలేకపోవడం ఎన్.పి.పి.ఎ పని తీరుకు నిదర్శరనం. రోగుల అవసరాన్ని ఆసరాగా చేసుకుని లాభాలు ఆర్జించే పరిస్థితికి అడ్డుకట్ట వేయడం ప్రభుత్వానికీ, ఎన్.పి.పి.ఎ కూ తప్పనిసరి బాధ్యత. అన్ని మందులపై పారదర్శకమైన, సమర్థమైన ధరల నియంత్రణను కేంద్ర ప్రభుత్వం ఇప్పటికైనా తీసుకురావాలి. కంపెనీల లాభాల పరిరక్షణ పేరుతో రోగులపై భారం మోపడానికి ఎంత మాత్రం వీల్లేదు. ఔషధ పరిశ్రమ అభివృద్ధి చెందాలి. కానీ ఆ అభివృద్ధికి రోగులు మూల్యం చెల్లించకూడదు. ధరల నియంత్రణ వ్యవస్థకు కంపెనీల లాభాలు కొలబద్ద కాకూడదు. ప్రజల ప్రాణాలు, రోగుల ప్రయోజనాలే ప్రభుత్వానికి ప్రాధాన్యత కావాలి! సుప్రీం వ్యాఖ్యల సారాంశం ఇదే!








కామెంట్లు (0)