తన కుటుంబంతో వివక్షపూరితంగా వ్యవహరించారని ఆరోపణ
శ్రీలంక : శ్రీలంక మాజీ క్రికెట్ జట్టు కెప్టెన్ కుమార సంగక్కరకు ఐర్లాండ్‌లో చేదు అనుభవం ఎదురైంది. డబ్లిన్ విమానాశ్రయంలో ర్యాన్‌ఎయిర్ సంస్థ గేట్ సిబ్బంది తనతోపాటు తన కుటుంబ సభ్యుల పట్ల వివక్షపూరితంగా వ్యవహరించారని ఆరోపించారు. సిబ్బంది ప్రవర్తన, బెదిరింపుల ధోరణి తనను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేశాయని సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు.
డబ్లిన్‌లోని ర్యాన్‌ఎయిర్ గేట్ సిబ్బంది నుంచి ఎవరైనా ఇలాంటి వివక్షను ఎదుర్కొన్నారా ? అంటూ సంగక్కర ప్రశ్నించారు. సిబ్బంది మాట్లాడిన తీరు, నిబంధనలను సక్రమంగా పాటించకపోవడం, బెదిరింపులకు పాల్పడే ధోరణి ఏ ప్రయాణికుడికీ ఆమోదయోగ్యం కాదని పేర్కొన్నారు. డబ్లిన్‌లో తమకు తొలిసారిగా ఇలాంటి చేదు అనుభవం ఎదురైందని తెలిపారు. సంగక్కర చేసిన పోస్టుపై సాఫ్ట్ వేర్ సంస్థ డబ్ల్యూఎస్‌ఓ 2 సిఇఒ సంజీవ వీరవరణ స్పందిస్తూ.. పాశ్చాత్య దేశాల్లో వివక్ష ఒక భాగంగా మారిందని వ్యాఖ్యానించారు. దీనిపై సంగక్కర స్పందిస్తూ ... వివక్షను ఎదుర్కొన్నప్పుడు కలిగే అనుభవం అత్యంత దారుణంగా ఉంటుందని పేర్కొన్నారు. ఐర్లాండ్‌లోని కౌంటీ డబ్లిన్‌కు చెందిన ర్యాన్ ఎయిర్ సంస్థ యూరప్‌లోనే అతిపెద్ద విమానయాన సంస్థగా గుర్తింపు పొందింది. అలాంటి సంస్థ సిబ్బందిపై సంగక్కర చేసిన ఆరోపణలు చర్చనీయాంశంగా మారాయి.








కామెంట్‌లు (0)