శుక్రవారం, 06 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionప్రమాదకరం..

1 గంట క్రితం

voter and aadhaar.jpg
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 06, 2026, 05:55 పూర్వాహ్నం | 3 నిమిషాల చదవడం

సంక్షేమ పథకాల ప్రయోజనాలు పొందేందుకు ఆధార్‌కు బదులుగా ఓటరు గుర్తింపు కార్డుతోపాటు బయోమెట్రిక్‌ ధ్రువీకరణను తప్పనిసరి చేస్తామని కేంద్ర పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి రాజీవ్‌ రంజన్‌ సింగ్‌ ప్రకటించడం గోరుచుట్టుపై రోకలిపోటులా ఉంది. ఒకవైపు ఓటరు జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్‌) పేరుతో కోట్లాది మంది ఓటు హక్కుకు ముప్పు తెస్తూ, మరోవైపు అదే ఓటరు కార్డును సంక్షేమ పథకాల అర్హతకు ప్రాతిపదికగా మార్చాలనుకోవడం దారుణం. ఓటరు జాబితాలో పేరులేని వారికి సంక్షేమ పథకాలను నిలిపివేయాలనుకోవడం ప్రమాదకరమైన ఆలోచన. ఆధార్‌ను దేశంలోని ప్రతి పౌరుడికీ విశ్వసనీయమైన గుర్తింపుగా గతంలో మోడీ ప్రభుత్వమే ఊదరగొట్టింది. బ్యాంకు ఖాతాలు, రేషన్‌, పింఛన్లు, ఇతర సంక్షేమ పథకాలతో దాన్ని అనుసంధానించింది. ఆధార్‌ తప్పనిసరి కాదని సుప్రీంకోర్టుకు హామీ ఇచ్చినప్పటికీ, ఆచరణలో అనేక సంక్షేమ సేవలకు దాన్నే కీలక ఆధారంగా మార్చింది. ఇప్పుడు అదే ఆధార్‌ను పక్కనపెట్టి ఓటరు కార్డును ముందుకు తేవడం ప్రజల ప్రయోజనాలతో ఆటలాడే క్రూరమైన చర్య.

బయోమెట్రిక్‌ విధానం వల్ల గ్రామీణ పేదలు ఇప్పటికే అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కఠినమైన శారీరక శ్రమతో వ్యవసాయ, నిర్మాణ రంగ కార్మికుల వేలిముద్రలు అరిగిపోవడం, వృద్ధుల వేలిముద్రలు యంత్రాలకు సరిగా చిక్కకపోవడం, కొందరి కనుపాపలను ఐరిస్‌ స్కానర్లు గుర్తించలేకపోవడం వల్ల అర్హులకు అందాల్సిన ప్రయోజనాలు నిలిచిపోతున్నాయి. ఇ-కెవైసీకి అవసరమైన స్మార్ట్‌ఫోన్లు అనేక గ్రామీణ కుటుంబాలకు అందుబాటులో లేవు. దేశంలో 8,985 గ్రామాలకు మొబైల్‌ నెట్‌వర్క్‌ సౌకర్యం లేదని కేంద్ర ప్రభుత్వ గణాంకాలే వెల్లడిస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో బయోమెట్రిక్‌ను తప్పనిసరి చేయడం మూలిగే నక్కపై తాటిపండు పడినట్టే అవుతుంది. కాకినాడ జిల్లా కొవ్వూరు సమీపంలో మే 16న జరిగిన రోడ్డు ప్రమాదం డిజిటల్‌ విధానాల దుష్పరిణామాలకు నిదర్శనం. పని ప్రదేశంలో మొబైల్‌ సిగ్నల్‌ లేకపోవడంతో ఉపాధి హామీ కూలీలు బయోమెట్రిక్‌ నమోదు కోసం నెట్‌వర్క్‌ అందుబాటులో ఉన్న రహదారి ప్రాంతానికి వెళ్లారు. ఆ క్రమంలో లారీ ఢీకొని నలుగురు మహిళా కూలీలు అక్కడికక్కడే మరణించగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. పని ప్రదేశంలోనే హాజరు నమోదు చేసుకునే సదుపాయం ఉంటే వారు రహదారిపైకి వెళ్లాల్సిన అవసరం వచ్చేది కాదు. గ్రామీణ ప్రాంతాల్లో బయోమెట్రిక్‌ నమోదు ఇంతటి తీవ్ర సమస్యగా ఉన్నప్పటికీ ఇప్పుడు ఓటరు కార్డును కూడా జోడించి, మరింత కఠినతరం చేయాలనుకోవడం బాధ్యతారాహిత్యం.

ఏకపక్షంగా, అస్తవ్యస్తంగా సాగిన ఎస్‌ఐఆర్‌ ప్రక్రియ దేశవ్యాప్తంగా 13.5 కోట్ల మందికి ఓట్లు లేకుండా చేసింది. గోవాలో ఓటు కోల్పోయిన వారిలో 97 మంది తిరిగి ఓటు పొందడానికి సాంకేతిక, అధికార కేంద్రీకరణ లోపాలు ఎలా అడ్డంకిగా మారాయో చూశాం. పశ్చిమ బెంగాల్‌లో తుది జాబితా నుంచి 63.66 లక్షల పేర్లను తొలగించారు. తొలగింపులను సవాలు చేస్తూ దాఖలైన అప్పీళ్లలో ఆగస్టు 7 నాటికి పరిష్కారమైన కేసుల్లో 91 శాతానికి పైగా ఓటర్లను తిరిగి జాబితాలో చేర్చాల్సి వచ్చింది. తొలగింపు ప్రక్రియలోని లోపాలకు ఇవి కొన్ని ఉదాహరణలు మాత్రమే! ఎస్‌ఐఆర్‌పై దేశవ్యాప్తంగా అభ్యంతరాలు, ఆందోళనలు కొనసాగుతుండగానే ఎన్నికల సంఘం మరో ఆరు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఎస్‌ఎస్‌ఆర్‌ను ప్రకటించింది. ప్రజల ఆందోళనలను పట్టించుకోని మోడీ ప్రభుత్వ నిరంకుశ వైఖరికి ఇది నిదర్శనం. ఆరునూరైనా తన మాటే చెల్లుబాటు కావాలని, తాను చేస్తున్నదంతా సరైనదేనని చెప్పుకునే ధోరణిలో కేంద్ర ప్రభుత్వం వ్యవహరించటం దారుణం.

పౌరసత్వ సవరణ చట్టం (సిఎఎ), జాతీయ పౌరసత్వ నమోదు (ఎన్‌ఆర్‌సి) ప్రతిపాదనలపై గతంలో దేశవ్యాప్తంగా తీవ్ర ఆందోళనలు వ్యక్తమయ్యాయి. పౌరసత్వాన్ని మత ప్రాతిపదికన వర్గీకరించడం, పౌరులు తమ పౌరసత్వాన్ని పత్రాలతో నిరూపించుకోవాల్సిన పరిస్థితి కల్పించడంపై నిరసనలు వెల్లువెత్తాయి. ఆ చట్టాల దురుద్దేశాలే ఎస్‌ఐఆర్‌లో స్పష్టంగా కనిపిస్తున్నాయి. మైనారిటీలు, పేదలు, వలస కార్మికులు పెద్ద సంఖ్యలో ఓటు హక్కును కోల్పోయారు. ఇప్పుడు వారికే సంక్షేమ పథకాలను నిలిపివేయాలనే ప్రతిపాదన అమానవీయమైనది మాత్రమే కాదు; హక్కుల ఉల్లంఘన కూడా! ఇప్పటికే కొన్ని రాష్ట్రాల్లో ఎస్‌ఐఆర్‌లో పేర్లు తొలగించారనే సాకుతో రేషన్‌, ఇతర సంక్షేమ ప్రయోజనాలను నిరాకరిస్తున్నారు. ఓటు హక్కు, ఆహారం పొందే హక్కు, ఉపాధి, పింఛను, వైద్యం వంటి సామాజిక భద్రతా హక్కులు వేర్వేరు. బయోమెట్రిక్‌ ధ్రువీకరణ విఫలమైనంత మాత్రాన అర్హులకు సంక్షేమ ప్రయోజనాలు నిరాకరించరాదని ఆధార్‌ చట్టం కూడా స్పష్టం చేస్తోంది. సాంకేతిక వైఫల్యానికి పరిష్కారం చూపాల్సిన ప్రభుత్వాలే ఆ వైఫల్యాన్ని ప్రజల అనర్హతగా పరిగణించడం దుర్మార్గం. గుర్తింపు కార్డులు ప్రజలకు సేవలు అందించడానికి ఉపయోగపడాలి తప్ప, సేవలను నిరాకరించడానికి ఆయుధాలుగా మారకూడదు. ఓటరు గుర్తింపును సంక్షేమానికి తప్పనిసరి షరతుగా మార్చే ప్రతిపాదనను కేంద్ర ప్రభుత్వం తక్షణమే ఉపసంహరించుకోవాలి. ఎలాంటి సాంకేతిక ఆంక్షలు లేకుండా అర్హులైన ప్రజలందరికీ సంక్షేమ ప్రయోజనాలు అందించాలి.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్