ప్రపంచ ప్రఖ్యాత సాహితీవేత్త గాబ్రియేల్ గార్సియా మార్క్వెజ్ రచించిన ‘ది ఆటమ్ ఆఫ్ ది పేట్రియార్క్’ నవల దాదాపు అర్ధ శతాబ్దం క్రితం ప్రచురితమైంది. ఈ నవలలో ప్రధానంగా అధికార కేంద్రీకరణ, ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తూ అణచివేయడం, అధికార దుర్వినియోగం వంటి అంశాలను చిత్రించారు. ఇవి ప్రజాస్వామ్య వ్యవస్థలను ధ్వంసం చేయడంతోపాటు పాలకుడు వాస్తవాలను గుర్తించలేని స్థితికి చేరుకుని ప్రజలకు దూరమవడానికి దారితీస్తాయని ఈ నవల వివరిస్తుంది. అధికారం ఒక వ్యక్తి చేతిలో అతిగా కేంద్రీకృతమైనప్పుడు ప్రభుత్వమే పాలకుడి వ్యక్తిగత ప్రయోజనాలకు ఉపయోగపడే సాధనంగా మారుతుందని మార్క్వెజ్ తన నవల ద్వారా చూపించారు.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యవహారశైలి ఈ నవలలోని నియంతృత్వ పాలకుడిని పోలి ఉంది. రెండోసారి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి మొత్తం అధికారాన్ని తన గుప్పిట్లో ఉంచుకోవడానికి, ఎలాంటి ఆలోచన లేకుండా దానిని వినియోగించడానికి ట్రంప్ ప్రయత్నించాడు. ఈ ధోరణే నేడు ప్రపంచాన్ని, అమెరికాను, చివరికి ట్రంప్‌ను కూడా ప్రస్తుత పరిస్థితికి తీసుకొచ్చింది.
ఇతర దేశాలతో యుద్ధాలకు వెళ్లకుండా, ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసి అమెరికాను తిరిగి శక్తిమంతమైన దేశంగా తీర్చిదిద్దుతాననే ‘మాగా’ (మేక్ అమెరికా గ్రేట్ అగైన్) నినాదంతోనే ట్రంప్ రెండోసారి అధికారంలోకి వచ్చాడు. అందుకే అమెరికాలోని సంపన్న వర్గాలు, మధ్యతరగతి ప్రజలు, సామాన్యులు సైతం ఆయనకు ఓటు వేసి భారీ విజయాన్ని అందించారు. మొదటిసారి ట్రంప్ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఆయనను వ్యతిరేకించిన లాటిన్ అమెరికన్, ఆఫ్రికన్-అమెరికన్, ఆసియా ఓటర్లలో అత్యధికులు గత ఎన్నికల్లో ఆయనకు మద్దతు పలికారు.
అరబ్ సంతతికి చెందిన వారిలో కూడా మెజారిటీ ప్రజల మద్దతు ట్రంప్‌నకే లభించింది. అయితే అధికారంలోకి వచ్చిన తరువాత ఆయన ఇచ్చిన హామీలన్నింటినీ మరిచిపోయాడు. తన గొప్పతనాన్ని నిరంతరం ప్రకటించుకోవడం, కుటుంబ ఆర్థిక ప్రయోజనాలను కాపాడుకోవడంపైనే ట్రంప్ ఎక్కువ దృష్టి పెట్టాడు. అమెరికా ప్రజలకు ఎలాంటి ప్రయోజనం కలిగించని అనవసర యుద్ధాల్లో పాల్గొనడం మొదలెట్టాడు. దీంతో అమెరికా ఆర్థిక వ్యవస్థ మాత్రమే కాకుండా ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కూడా ప్రమాదంలో పడింది. దీంతో రిపబ్లికన్ పార్టీలోని ‘మాగా’ వర్గం కూడా ట్రంప్‌నకు దూరం కావడం ప్రారంభించింది. టక్కర్ కార్ల్సన్ వంటి పాత్రికేయులు కూడా ఈ కారణంగానే ట్రంప్‌నకు దూరమయ్యారు.
తాను ప్రారంభించి ఎనిమిది నెలలు గడిచినా ఇరాన్ యుద్ధాన్ని ఆపలేని ట్రంప్, భారతదేశం–పాకిస్తాన్ ఘర్షణతో సహా ఎనిమిది యుద్ధాలను ముగించానని, అందుకు తనకు నోబెల్ శాంతి బహుమతి ఇవ్వాలని అవార్డు కమిటీని కోరారు. తన గొప్పతనాన్ని చాటుకోవడానికి మాజీ అధ్యక్షుల స్మారక కేంద్రంలో తన పేరును కూడా రాయించుకున్నారు. ఇటీవల అట్లాంటిక్ మహా సముద్రం పేరును ‘ట్రంప్ మహా సముద్రం’గా మార్చాలని కూడా ప్రతిపాదించారు.
నవంబర్ 2న వాషింగ్టన్ లోని లింకన్ స్మారక చిహ్నం వద్ద పునరుద్ధరించిన సరస్సును ప్రారంభించే సమయంలో కూడా ట్రంప్ సరదాగా మాట్లాడుతూ, ఆ స్మారకానికి తన పేరు పెట్టాలని ఆలోచిస్తున్నట్లు చెప్పాడు. తాను సృష్టించిన సంక్షోభాల కారణంగా అమెరికాతో పాటు ప్రపంచ ప్రజలు కూడా ఇబ్బందులు పడుతున్న సమయంలో, తనను తాను గొప్పవాడిగా చూపించుకోవడానికి ట్రంప్ ఈ విధమైన హాస్యాస్పద ప్రయత్నాలు చేయసాగాడు.
ట్రంప్ ప్రభుత్వ అసమర్థత కారణంగా ఇంధన ధరలు పెరిగాయి. అదుపు చేయలేనంతగా నిత్యావసరాల ఖర్చులు పెరుగుతున్నాయి. ఇళ్ల అద్దెలు అధికమవుతున్నాయి. ఆదాయాలు మాత్రం పెరగడం లేదు. ఇలా సామాన్య అమెరికన్లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న సమయంలో అమెరికాలో మధ్యంతర ఎన్నికలు జరిగాయి.
అమెరికా పార్లమెంటుగా పిలిచే ‘కాంగ్రెస్’లోని 435 మంది సభ్యుల ప్రతినిధుల సభకు, 100 మంది సభ్యుల సెనేట్ లోని 35 ఖాళీ స్థానాలకు, 50 రాష్ట్రాల్లోని 36 రాష్ట్రాల గవర్నర్ పదవులకు, అనేక నగరాల మేయర్ పదవులకు ఎన్నికలు జరిగాయి. నవంబర్ 3న జరిగిన ఈ మధ్యంతర ఎన్నికలు అమెరికా రాజకీయ పటాన్ని కీలకంగా మార్చనున్నాయని ట్రంప్ మినహా మరెవరికీ సందేహం లేదు.
అందుకే డెమోక్రటిక్ పార్టీ నాయకుడు, వర్జీనియా రాష్ట్ర మాజీ గవర్నర్ టెర్రీ మెక్ ఆలిఫ్ ఈ మధ్యంతర ఎన్నికలను ‘ఆర్మగెడాన్’ అనే మహా యుద్ధంతో పోల్చారు. ఈ ఎన్నికలు రిపబ్లికన్ పార్టీకి భారీ నష్టం కలిగించే రాజకీయ సునామీని సృష్టిస్తాయని అమెరికాలో వెలువడే ‘పొలిటికో’ మ్యాగజైన్ వీడియో కార్యక్రమం అంచనా వేసింది.
నవంబర్ 3వ తేదీకి ముందే దాదాపు ఆరు కోట్ల మంది ప్రజలు ప్రత్యక్షంగా, పోస్టల్ బ్యాలెట్ ద్వారా తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ట్రంప్‌నకు మరిచిపోలేని ఓటమిని అందించాలనే ఉద్దేశంతోనే వారు పెద్ద సంఖ్యలో ఓటు వేశారు. ట్రంప్‌ను విమర్శించే పోప్ లియో14 కూడా చరిత్రలో తొలిసారిగా పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు వేశారు. సాధారణంగా మధ్యంతర ఎన్నికల్లో ఓటింగ్ శాతం తక్కువగా ఉంటుంది.
కానీ ఈసారి ఆ సంప్రదాయాన్ని తలకిందులు చేసే స్థాయిలో ప్రజల భాగస్వామ్యం కనిపించింది. గత అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్‌నకు 10 శాతానికి పైగా మెజారిటీ ఇచ్చిన సౌత్ కరోలినా (17.9), కాన్సాస్ (17.1), టెక్సాస్ (13.7), అయోవా (13.2), అలాస్కా (13.1), ఒహాయో (11.2) రాష్ట్రాలన్నిట్లోనూ డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థులు భారీ మెజారిటీతో విజయం సాధించారు.
కాన్సాస్‌లో గతంలో ఒక డెమోక్రటిక్ అభ్యర్థి విజయం సాధించింది 1932లో కాగా, టెక్సాస్‌లో డెమోక్రటిక్ అభ్యర్థి చివరిసారిగా గెలిచింది 1988లో. ఈ రెండు రాష్ట్రాల్లో ఈసారి డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థులు ఆడమ్ హామిల్టన్, జేమ్స్ తలారికో విజయం సాధించారు.
గత ఎన్నికల్లో ట్రంప్ గెలిచిన స్వింగ్ రాష్ట్రం మిషిగన్‌లో డాక్టర్ అబ్దుల్ ఎల్ సయీద్ విజయం సాధించారు. డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థిత్వం కోసం జరిగిన ప్రైమరీ ఎన్నికల్లో సయీద్ చేతిలో ఓడిపోయిన హేలీ స్టీవెన్స్ ఎన్నికలకు రెండు రోజుల ముందు రిపబ్లికన్ అభ్యర్థికి మద్దతు ప్రకటించినప్పటికీ మిషిగన్‌లో సయీద్ విజయం సాధించడం విశేషం.
సయీద్‌ను ‘జిహాదీ’, ‘ఉగ్రవాది’ అని ట్రంప్ అభివర్ణించాడు. అంతేకాకుండా, డెమోక్రటిక్ ప్రైమరీ ఎన్నికల్లో సయీద్‌తో పోటీ చేసిన హేలీ స్టీవెన్స్‌కు, సెనేట్ ఎన్నికల్లో సయీద్‌పై పోటీ చేసిన మైక్ రోజర్స్‌కు ఇజ్రాయిల్ లాబీ నుంచి భారీగా ఆర్థిక సహాయం అందింది. ఎట్టి పరిస్థితుల్లోనూ సయీద్ అమెరికా పార్లమెంటులోకి అడుగు పెట్టకూడదన్నదే వారి లక్ష్యం. అయినప్పటికీ ఆ అడ్డంకులన్నింటినీ అధిగమించి మిషిగన్ ప్రజలు సయీద్‌ను గెలిపించారు.
చివరకు వెలువడిన నివేదికల ప్రకారం డెమోక్రటిక్ పార్టీ సెనేట్‌లో 54 స్థానాలు, ప్రతినిధుల సభలో 228 స్థానాలు గెలుచుకుని మెజారిటీని ఖాయం చేసుకుంది.
ఒక అమెరికా అధ్యక్షుడు తన పదవీ కాలంలో రెండు సంవత్సరాలు పూర్తి చేసుకున్న తరువాత మధ్యంతర ఎన్నికలు జరుగుతాయి. ఆ ఎన్నికల్లో అధికారంలో ఉన్న అధ్యక్షుడి పార్టీ ‘కాంగ్రెస్’ లోని రెండు సభల్లోనూ మెజారిటీ కోల్పోతే, అలాంటి అధ్యక్షుడిని ‘లేమ్ డక్’ అధ్యక్షుడు అని పిలుస్తారు.
ఎందుకంటే అమెరికా పాలనా వ్యవస్థలో చట్టాల రూపకల్పన, ఆర్థిక వ్యవహారాలు వంటి కీలక అంశాల్లో అధికారం ఎక్కువగా ‘కాంగ్రెస్’ చేతుల్లోనే ఉంటుంది. ‘కాంగ్రెస్’లో మెజారిటీ సాధించిన పార్టీ ప్రతినిధులే వివిధ పార్లమెంటరీ కమిటీలకు అధ్యక్షత వహిస్తారు. అధ్యక్షుడు చేసే నియామకాలను అడ్డుకోవడం, ఆలస్యం చేయడం, అధ్యక్షుడు, మంత్రుల పని తీరుపై విచారణ జరపడం వంటి అధికారాలు కూడా ‘కాంగ్రెస్’కు ఉంటాయి. ఎప్స్టీన్ కేసులో ట్రంప్‌ను అభిశంసించే ప్రయత్నాలు కూడా జరగవచ్చు. మొత్తానికి ట్రంప్ రెండో పదవీ కాలంలోని మిగిలిన భాగం తీవ్రమైన రాజకీయ ఘర్షణలతో సాగనుంది.
దేశ భవిష్యత్తును నిర్ణయించే ఎన్నికల ప్రచారం ముగిసిన రోజున వాషింగ్టన్లో ట్రంప్ 25 నిమిషాల పాటు ప్రసంగించాడు. ఆ ప్రసంగంలో 20 నిమిషాలు లింకన్ స్మారక చిహ్నం వద్ద పునరుద్ధరించిన సరస్సు గురించి, దాని చుట్టూ ఏర్పాటు చేసిన పచ్చిక బయళ్ల గురించి మాట్లాడాడు.
దేశంలోని తీవ్రమైన జీవన సమస్యలపై చర్చ జరగాల్సిన జాతీయ ఎన్నికల ప్రచారం చివరి రోజున, ఆ దేశ అధ్యక్షుడి మనసులో ఏముందో ఈ సరస్సు, పచ్చిక బయళ్ల గురించి చేసిన సుదీర్ఘ ప్రసంగం స్పష్టం చేసింది.
రోమ్ నగరం తగలబడుతున్నప్పుడు నీరో చక్రవర్తి ఫిడేలు వాయిస్తూ కూర్చున్నాడనే కథను మనకు గుర్తుచేసే వికృత మనస్తత్వం కలిగిన ట్రంప్ వంటి పాలకుడికి ప్రజలు కనీసం ఈ మాత్రం శిక్ష విధించకూడదా?
అయితే, ఈ ఓటమి నుంచైనా ట్రంప్ పాఠం నేర్చుకుంటాడా?

-వ్యాసకర్త : డా. జోసెఫ్ ఆంటోనీ
రిటైర్డ్ ప్రొఫెసర్, కేరళ యూనివర్సిటీ /







కామెంట్లు (0)