ఇది ఏ ఒక్క రాజకీయ పార్టీ గొంతుకో కాదు. కేవలం రాజకీయ నేతల గొంతు కూడా కాదు. ఇది ఈ దేశంలోని యువత గొంతు. రైతుల గొంతు. కష్టజీవుల గొంతు. మొత్తానికి మొత్తంగా ఇది ఈ దేశ ప్రజల గొంతు. ఈ దేశ రాజ్యాంగానికి దెబ్బ తగలకుండా కాపాడుకునేందుకు ముందుకొచ్చిన ఈ దేశ పౌరుల గొంతు. కేంద్రంలోనే కాదు, ప్రతి రాష్ట్రంలోనూ ఓట్ చోరీ జరిగింది. అన్ని సాక్ష్యాలూ, అన్ని ఆధారాలూ ముందుకొచ్చాయి. కొంత కాలంగా దేశంలోని మేధావులంతా వాటిని ప్రజలకు వివరిస్తూనే ఉన్నారు. బాధ్యత గల ప్రభుత్వం ఎప్పటికప్పుడు, ఎక్కడికక్కడ వివరణలు ఇవ్వాలి కదా? ఇవ్వలేదు. జవాబుదారీతనం లేని ప్రభుత్వం అవసరమా? ఆ పనిలో భాగంగానే ఊహించని రీతిలో ఈ దేశ పౌరులు నవంబర్ 1న ఢిల్లీ-రామ్‌లీలా మైదాన్‌లో గుమిగూడారు. తమ హక్కులను దొంగిలించిన ప్రభుత్వం మీద విరుచుకుపడ్డారు.
2024 ఎన్నికల తర్వాత దేశంలోని 13.5 కోట్ల మంది ఓట్లు మాయం చేసింది ఈ ఆర్.ఎస్.ఎస్, బిజెపి ప్రభుత్వం! అంటే, ఈ దేశ జనాభాలో 15 శాతం మంది ఓటు హక్కు కోల్పోయారు. ప్రజలు నాయకులను ఎన్నుకోవడం చూశాం. కాని, ఇక్కడ నాయకులు ప్రజలను ఎన్నుకుంటున్నారు. ఇది ఎప్పుడూ, ఎక్కడా లేని విచిత్రమైన పరిస్థితి. ఈ నరేంద్ర మోడీ ప్రభుత్వం 'ఓట్ చోరీ' చేసి, దొంగతనంగా అధికారాన్ని ఆక్రమించింది. విషయాలన్నీ సామాన్య ప్రజలకు అర్థమయ్యీయి. అందుకే న్యాయం కావాలంటున్నారు. అక్రమ మార్గంలో ఎన్నికలు జరిపించిన జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయడమే కాదు, జైలుకు కూడా వెళ్లాల్సి వుంటుంది. జ్ఞానేష్ కుమార్‌ను ఉపయోగించుకుని అధికారం దక్కించుకున్న మోడీ, అమిత్ షా, వారి మంత్రి వర్గంలోని వారంతా దోషులే. ఎవరూ తప్పించుకుని పోలేరు. చేసిన దుర్మార్గాలకు శిక్షలు అనుభవించాల్సిందే! ఇది మామూలు దొంగతనం కాదు, పౌరుల ప్రాథమిక హక్కులను దొంగిలించడం. భావ ప్రకటనా స్వేచ్ఛను దొంగిలించడం. పౌరులు సజీవంగా వున్నారు. కానీ, ఓట్ చోరీ వల్ల వారంతా చనిపోయిన వాళ్ల కిందే లెక్క! ఓటు హక్కు లాగేయడమంటే మాటలు కాదు. సజీవంగా ఉంచుతూనే హత్య చేయడం. ఇది కూడా ఒకరకంగా గుజరాత్, మణిపూర్ మారణకాండ లాంటిదే- ఈ హత్యలకు పాల్పడింది మోడీ, అమిత్ షా, జ్ఞానేష్ కుమార్. వీరిని మించిన దేశద్రోహులు మరెవ్వరూ లేరు.
విద్యా రంగం, వైద్య రంగం, సిబిఐ, ఇ.డి, న్యాయ వ్యవస్థ, పోలీసు యంత్రాంగం, అధికార గణం - ఇవన్నీ ఎవరివీ? ఈ దేశ పారులవి ! ఎవరి కోసం పని చేయాలీ? ఈ దేశ ప్రజల కోసం పని చేయాలి! కానీ, ఇవన్నీ అధికారంలో ఉన్న ఒకరిద్దరి స్వార్థ ప్రయోజనాల కోసం పనిచేస్తున్నాయి. ఈ వ్యవస్థలన్నీ భవిష్యత్ తరాలవారివి. యువతకు వీటి మీద అధికారం ఉంది. కానీ, ఈ వ్యవస్థలన్నీ ఏం చేస్తున్నాయీ? అన్యాయంగా వారిని అణచివేస్తున్నాయి.
వ్యవసాయ రంగానికి న్యాయం జరగడం లేదు. యువతకు ఉపాధి లేదు. విద్యా రంగాన్ని భ్రష్టు పట్టించారు. కనీసం రోజుకూలీల శ్రమకు తగిన ఫలితం దక్కడం లేదు. మరి డబ్బంతా ఎటుపోతోంది? అదానీ, అంబానీలకు పోతోంది. విద్యుత్ వ్యవస్థ అదానీది, మొబైల్ అదానీది, డ్రోన్ అదానీది, ఆయుధం అదానీది. మొత్తానికి మొత్తం దేశమంతా అదానీదేనా? వారికి వేల వేల కోట్ల రుణ మాఫీ లభిస్తోంది. సామాన్యులు మాత్రం నరకయాతన పడాల్సి వస్తోంది.
నిరంతరం కష్టించి పనిచేస్తున్న రైతుకు శ్రమ ఫలితం దక్కనవసరం లేదా? రోజూ పద్దెనిమిది గంటలు కష్టపడి చదువుకుంటున్న విద్యార్థికి ఇంత జ్ఞానం సంపాదించుకునే అవకాశం అక్కరలేదా?
ఈ పరిస్థితిని మార్చుకోవడానికి మనమంతా అప్రమత్తతతో ఉండాలి. ప్రభుత్వ దుష్ట ప్రయత్నాలను అడ్డుకుంటూ ఉండాలి. ఈ దేశాన్ని మళ్ళీ గాడిలో పెట్టాలి. అది జ్ఞానేష్ కుమార్ రాజీనామాతో ప్రారంభం కావాలి! ‘‘నరేంద్ర మోడీ ఎక్కడికీ పోవడం లేదు కదా?’’ అని అమిత్ షా ప్రతిపక్షాల్ని ఎద్దేవా చేస్తూ మాట్లాడారు. అతను ఒకటి గుర్తు పెట్టుకోవాలి. ప్రతిపక్షాలు కూడా ఎక్కడికీ పోవడం లేదు. ఈ దేశ ప్రజలూ ఎక్కడికి పోవడం లేడు. ప్రస్తుత పరిస్థితుల నుండి తప్పించుకోవడానికి మోడీ-షాలు ఎటైనా పారిపోవాలని ప్రయత్నించినా లాభం లేదు. ఈ దేశ ప్రజలు కాపలా కాస్తున్నారు. ప్రతిపక్షాలు కాపలా కాస్తున్నాయి. యువత అంతా కాపలా కాస్తోంది. వీరు చేస్తూ వచ్చిన అరాచకాలకు ఈ దేశంలోనే శిక్ష అనుభవించక తప్పదు. తప్పదు- దేశాన్ని కార్పొరేట్లకు అమ్మిన నేరానికి, ఓట్ చోరీకి శిక్ష తప్పడు.

- వ్యాసకర్త-ప్రొ. దేవరాజు మహారాజు
కేంద్ర సాహిత్య అకాడెమీ అవార్డు గ్రహీత, జీవ శాస్త్రవేత్త /







కామెంట్లు (0)