పార్వతీపురంలో స్ట్రాంగ్ రూమ్ తాళాలు మాయం.. కౌంటింగ్ లో జాప్యం!-- టీవీలో బ్రేకింగ్ న్యూస్.
" పాపం! జరగబోయే ఘోరం ముందే తెలిసి, తాళం తీయకపోతే కౌంటింగ్ ఆగిపోతుందని అనుకుని ఉంటాడు అమాయకుడు ఎవరో!"-పరదేశి జాలిపడ్డాడు.
" తలలు పగలగొట్టినోళ్ళు ఉండగా, తాళం కప్పలు ఒక లెక్కా"-పోలిపల్లి గొణిగాడు. దశుమంత నాయుడు మిత్ర బృందం కౌంటింగ్ నాడు ఒకే దగ్గర ఉండి, ఎంజాయ్ చేద్దామని ప్లాన్ చేసుకొని వైజాగ్ రాజు గారి రిసార్ట్ లో ముందు రోజు రాత్రి వాలిపోయారు.
అర్నబ్ తుఫాను, రాయలసీమ నామినేషన్ల ఘట్టంలో పోలీస్ లాఠీల్లాగా ఇష్టానుసారం నాట్యం చేసేస్తుంది.
" తొమ్మిది సార్లు రీకౌంటింగ్.. మారని ఫలితం.. కూటమి నాయకుల ఒత్తిడితో ప్రకటించని అధికారులు"-బ్రేకింగ్ న్యూస్.
" ఎన్నిసార్లు అటు ఇటు తిప్పినా, వంద నోటు అంకె మారిపోతుందా? మనోళ్ళ మరీ ఓవరాక్షన్ గాని!"-నారాయణమూర్తి చిరాకు.
" పోస్టల్ బ్యాలెట్ లలో కనిపిస్తున్న ఉద్యోగుల అసంతృప్తి"-టీవీలో స్క్రోలింగ్.
"పిల్లి శాపానికి ఉట్లు తెగిపోతాయా?"-బుస్సీ వెటకారం. ఫలితాల ప్రకటనలో ఆలస్యానికి అందరిలోనూ అసహనం. మధ్యాహ్నం పన్నెండు దాటింది. ఎందుకైనా మంచిదని, రౌండ్ టేబుల్ సిద్ధం చేశాడు పరదేశి. విశాఖ డివిజన్ల ఫలితాలు మెల్లగా వస్తున్నాయి.
" సింహాచలం డివిజన్లో ఇండిపెండెంట్ గెలుపు"-బ్రేకింగ్. షాకయ్యారందరూ! ఆశ్చర్యంగా ముఖాలు చూసుకున్నారు.
" అదానీ విషయంలో దొందూ దొందే అని, ఇలాగా నిర్ణయానికి ఒచ్చీసినట్టున్నారు ఓటర్ మహాశయులు"-గాజు సామాన్లు సర్దుతూ అన్నాడు పరదేశి.
" మేయర్ సంగతి తేలిపోతే, ఇతగాడి సంగతి తేలిపోతుంది"-తాపీగా ఒపీనియన్ ఒదిలాడు నాయుడు. బయట తుఫాను తగ్గినట్టుంది. వినిపించడం లేదు. టీవీలో మేయర్ కు భారీ మెజార్టీ కనిపించగానే-" ఇక, వొయిజాగులో ఏ కొండ కొట్టేసీనా.. ఎవుడూ అడగడు.. ఓటర్లు కుండ బద్దలు గొట్టేసీనట్టే!"-పరదేశి అనగానే, నారాయణ మూర్తి లో గొప్ప ఉత్సాహం తన్నుకొచ్చింది.
" నిజమేన్రా!ఈ వేడిలోనే ఫైలు మూవ్ చేయించాలా!"
ఇంతలో.. టీవీలో జగన్ కనిపించాడు. మూర్తి మొహంలో ఓల్టేజీ తగ్గిపోయింది. పరదేశి గమనించి-
" ఇతనిదో గోల! ఎమ్మెల్యేగా గెలిపించి, ఒక్కడైతే ఎల్లడానికి ఎనకా, ముందు అవుతాడేమోనని మరో పది మందిని తోడిస్తే.. అసెంబ్లీకి ఎల్లననీసినోడూ.. ఇతగాడికేలా! మేయర్లూ.. చైర్మన్లు. ఒకలికి కోటు దండుగా! మరొకలికి సీటు దండుగా?
" సెంట్రల్ ఎలక్షన్ కమిషనర్నే తప్పించాలని, అపోజిషన్ పార్టీలన్నీ ఢిల్లీలో కిందా,మీదా పడుతుంటే.. స్టేట్ కమిషనర్ సరైనోడు కాదని, ఈయన ఇక్కడ ధర్నా చేస్తాడేటీ?"-నాయుడు చిరాకుపడ్డాడు.
" సబ్ స్టేషన్ కే కరెంటు లేదంటే, మా వీధి ట్రాన్స్ ఫార్మర్ పనిచేయలేదని కంప్లైంట్ చేసినట్టుంది.. యవ్వారం!"-పరదేశి జోక్ పనిచేసి, అందరం మొహాల్లో చిన్న నవ్వు కనిపించింది.
" కూటమి ఇక్కడ ప్రజాస్వామ్యాన్ని కుమ్మేస్తుందని దేశానికి తెలియాలని ఆయన ఆరాటం.. ఏజెంట్లను కూర్చోబెట్టుకొని రానివ్వడం లేదని ధర్నా చేయడం ఏంటీ!"-లాజిక్ చెప్పాడు బుస్సీ.
" నామినేషన్ ఏసిన్నాడే నాలుగు మెతుకులు లేవు.. పోలింగ్ నాడు పప్పన్నం అంటే ఎవడు పెడతాడు?"- పరదేశి వెటకారం.
విజయవాడ మేయర్ మంచి మెజారిటీతో ఉన్నట్టు టీవీలో బ్రేకింగ్ రాగానే, నారాయణమూర్తికి గొప్ప హుషారొచ్చేసింది.
" కృష్ణ లంక కేసు సిబిఐ నుంచి తప్పించి, సి బి సి ఐ డి కి ఇవ్వాలని, తొలి మీటింగ్ లోనే తీర్మానం సేయించీయాలా! లేకపోతే, కూటమి పరువు ఏటై పోవాల!?"-పరదేశికీ పూనకం వచ్చేసింది.
సాయంత్రం అయ్యేసరికి, ఏకపక్షంగా రిజల్ట్ వచ్చేస్తుంది.
" తుఫాన్.. తుఫాన్ "- అని నారాయణమూర్తి గంతులేస్తూ, టేబుల్ వైపు చూశాడు. అప్పటికే రంగం సిద్దం చేశాడు పరదేశి. ఇంతలో ఏదో ఫోన్.. మూర్తికి.. అటునుంచి ఎవరో గానీ.. ఇటు నుంచి మూర్తి..పడి, పడీ నవ్వుతూ "సార్! పోలింగ్ ఫెయిల్.. బట్, కౌంటింగ్ సక్సెస్"!
ఇక్కడ నవ్వులతో హాల్ దద్దరిల్లింది. దూరంగా, సముద్రం వెనక్కి తగ్గింది.. సిగ్గు పడిందేమో!?
- ' నల్లి ' కుట్టు







కామెంట్లు (0)