రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన ఆర్థిక రంగ ప్రగతి నివేదిక (ప్రోగ్రెస్ రిపోర్టు)కు వాస్తవాలకు పొంతన లేని పరిస్థితి నెలకొంది. నివేదికను పరిశీలించినా, ఆ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పిన వివరాలను విన్నా రాష్ట్రం అన్ని రంగాల్లో శరవేగంగా అభివృద్ధి చెందుతోందనే భ్రమ కలుగుతుంది. జిఎస్‌డిపి 11.3 శాతం వృద్ధి, లక్షల కోట్ల పెట్టుబడులు, భారీ సంక్షేమ కార్యక్రమాలు, పెద్ద ఎత్తున తరలి వస్తున్న పెట్టుబడి లెక్కలతో నివేదిక నిండిపోయింది. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలలో రెండు తప్ప అన్ని నెరవేర్చేసినట్లుగా, చెప్పినవే కాకుండా చెప్పనవి కూడా అమలుచేస్తున్నట్లుగా సిఎం ప్రకటించేశారు. అదే సమయంలో ప్రభుత్వ బడ్జెట్ పత్రాలు, కేంద్ర ప్రభుత్వ అధికారిక గణాంకాలు, రాష్ట్ర ఆదాయ లెక్కలు పూర్తిగా భిన్నమైన చిత్రాన్ని చూపుతున్నాయి.
2025-26 బడ్జెట్ ప్రకారం రాష్ట్ర అప్పులు లక్ష కోట్ల రూపాయలు దాటాయి. రెవెన్యూ లోటు రూ.33,185 కోట్లు, ద్రవ్య లోటు రూ.79,926 కోట్లుగా నమోదయ్యాయి. అప్పుల భారం పెరుగుతుండగా, కేంద్రం నుంచి వచ్చే రెవెన్యూ డెఫిసిట్ గ్రాంట్లు దాదాపు లేకపోవడం, ఇతర పథకాలకు ఇచ్చే నిధుల్లోనూ కోతలు పెడుతుండటం రాష్ట్ర ఆర్థిక స్థితిని ఒత్తిడిలోకి నెడుతోంది. అభివృద్ధి గురించి ప్రభుత్వం ఎంత గొప్పగా చెబుతున్నా, రాష్ట్ర సొంత ఆదాయం ఆశించిన స్థాయిలో పెరగకపోవడం గమనార్హం. అధికారిక లెక్కల ప్రకారమే 2023-24తో పోలిస్తే, 2024-25లో రాష్ట్ర సొంత పన్నుల ఆదాయ వృద్ధి నామమాత్రంగానే ఉంది. 1.97 శాతానికే ఇది పరిమితమైనట్లు కంప్ర్టలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) నివేదిక పేర్కొంది. వివిధ రాష్ట్రాల్లో నమోదవుతున్న వృద్ధి లెక్కలతో దీనిని పోల్చలేం. ఆదాయ వనరుల శాఖలపై ముఖ్యమంత్రి నిర్వహించే సమీక్షా సమావేశాల్లోనూ ఆదాయాన్ని ఎలా పెంచుకోవాలన్న అంశంపైనే ప్రధానంగా చర్చ జరుగుతుండటం గమనార్హం. వివిధ పేర్లతో కార్పొరేట్లకు రాయితీల వర్షం కురిపిస్తున్న ప్రభుత్వం, అదే సమయంలో సామాన్య ప్రజలపై ప్రత్యక్షంగానూ, పరోక్షంగానూ భారాలు మోపడానికి సిద్ధమవుతుండటం గమనార్హం. మరోవైపు రాష్ట్ర సొంత పన్నుల ఆదాయంలో దాదాపు 96 శాతం ఉద్యోగుల జీతభత్యాలకే పోతున్నదని పేర్కొనడం తన ఉద్యోగ, ఉపాధ్యాయ వ్యతిరేక స్వభావాన్ని తేటతెల్లం చేస్తోంది.
సమైక్య రాష్ట్ర విభజన తరువాత రాష్ట్రం వ్యవసాయ ఆధారితంగా మారిపోయిందని ముఖ్యమంత్రి చెప్పారు. ఆ స్థాయిలో వ్యవసాయ రంగ సమస్యలు పరిష్కరించారా అంటే ఒక్కటీ కనిపించదు. పోలవరం ప్రాజెక్టు పనులు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ ప్రాజెక్టుకు సంబంధించి అత్యంత కీలకమైన పునరావాస సమస్య ఎప్పటికి పరిష్కారమవుతుందో అర్థం కాని పరిస్థితి నెలకొంది. పోలవరమే కాదు. రాష్ట్ర విభజన తరువాత నూరు శాతం పనులు పూర్తి చేశామని చెప్పుకునే ప్రాజెక్టు ఒక్కటి కూడా లేకపోవడం వ్యవసాయ రంగానికి లభిస్తున్న ప్రాధాన్యతకు నిదర్శనం. పెరుగుతున్న సాగు ఖర్చులు, గిట్టుబాటు ధరలు లేకపోవడం, కొనుగోలు వ్యవస్థలో లోపాలు రైతును సంక్షోభంలోకి మరింతగా నెట్టివేస్తున్నాయి. ముఖ్యంగా పొగాకు, మొక్కజొన్న, మిర్చి, ఉల్లి రైతుల పరిస్థితి దారుణంగా ఉంది. రైతు ఆదాయం పెరగకపోతే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలపడదు; గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలపడకపోతే రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు స్థిరత్వం రాదు. ఎల్‌నినో హెచ్చరికలు ఏడాది కాలంగా వస్తున్నప్పటికీ, ప్రస్తుత సీజన్ సాగుపై తగినంత కసరత్తు జరగకపోవడం, ప్రత్యామ్నాయాలపై రైతాంగాన్ని పూర్తిస్థాయిలో అప్రమత్తం చేయకపోవడం కూడా రైతు సంక్షేమం పట్ల ప్రభుత్వం అనుసరిస్తున్న ధోరణికి నిదర్శనంగా నిలుస్తుంది.
ఇక పారిశ్రామిక రంగంపై ప్రభుత్వం చెబుతున్న గణాంకాలదీ ఇదే పరిస్థితి! పెట్టుబడిదారుల సదస్సులు, వేల కోట్ల రూపాయల పెట్టుబడుల ఒప్పందాలు, లక్షల ఉద్యోగాల హామీలు తరచూ వినిపిస్తున్నాయి. కానీ ప్రకటించిన పెట్టుబడులకు, వాస్తవంగా వచ్చిన పెట్టుబడులకు మధ్య భారీ అంతరం ఉంటోంది. ఆమోదం పొందినట్లు ప్రకటించిన ప్రాజెక్టుల్లో చాలా వరకు ఇంకా గ్రౌండ్ కాలేదు. పెట్టుబడుల ప్రకటనలను అభివృద్ధి సూచికగా చూపుతున్న ప్రభుత్వం, ఎన్ని పరిశ్రమలు నిజంగా ఉత్పత్తి ప్రారంభించాయి? ఎన్ని స్థిర ఉద్యోగాలు సృష్టించాయి? ఎంత పెట్టుబడి మొత్తాన్ని ఖర్చు చేశారు? అనే ప్రశ్నలకు స్పష్టమైన లెక్కలు చెప్పడం లేదు. మరోవైపు టెక్స్‌టైల్, స్పిన్నింగ్, ఫెర్రో ఎల్లాయిస్, జూట్, ఫుడ్ ప్రాసెసింగ్, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు విద్యుత్ చార్జీల పెరుగుదల, ముడిసరుకు ధరలు, రుణాల భారం, మార్కెట్ మందగమనం వంటి సమస్యలతో మూతపడుతూనే ఉన్నాయి. రాష్ట్రంలో మూతపడుతున్న పరిశ్రమలు, వివిధ కారణాలతో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కోల్పోతున్న కార్మికుల గణాంకాలు ఈ నివేదికలో కనిపించవు.
సంక్షేమ రంగంలోనూ ప్రచారానికి, ఆచరణకు మధ్య స్పష్టమైన వ్యత్యాసం కనిపిస్తోంది. అర్హతల పునఃపరిశీలన పేరుతో చేనేత కార్మికులు, మత్స్యకారులు, ఇతర వృత్తిదారుల సహాయ పథకాలలో కొంతమందివి నిలిపివేయడం తీవ్ర వివాదానికి దారితీసింది. నిజమైన అర్హులు కూడా పెన్షన్లు కోల్పోయారని విస్తృతంగా ఆరోపణలు వచ్చాయి. రాష్ట్రవ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తిన తర్వాత ఆందోళనల ప్రభావంతో ప్రభుత్వం పలువురి పెన్షన్లను తిరిగి పునరుద్ధరించాల్సి వచ్చింది. యువతకు స్థిరమైన ఉద్యోగ, ఉపాధి అవకాశాలు దొరకడం లేదు. ప్రజల కొనుగోలు శక్తి పెరగడం లేదు. చిన్న వ్యాపారాలు, సంప్రదాయ వృత్తులు ఒత్తిడిలోనే ఉన్నాయి. విద్య, వైద్యం వంటి ప్రాథమిక అవసరాలు సామాన్యుడికి అందుబాటులో లేకుండాపోతున్నాయి. క్షేత్రస్థాయిలోని ఈ సమస్యలను పరిష్కరించకుండా జిఎస్‌డిపి లెక్కలను ఏకరువు పెట్టడమంటే తిమ్మిని బమ్మి చేసే ప్రయత్నమే!







కామెంట్‌లు (0)