ఆదివారం, 15 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

స్క్రీన్ల మాయలో బాల్యం

12 నిమిషాల క్రితం

smart
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 15, 2026, 05:30 పూర్వాహ్నం | 3 నిమిషాల చదవడం

నేటి ఆధునిక కాలంలో సాంకేతికత వేగంగా అభివృద్ధి చెందుతున్న కొద్దీ, మన జీవితాల్లో దాని జోక్యం విపరీతంగా పెరిగిపోతోంది. అయితే, ఈ డిజిటల్ విప్లవం అత్యంత ప్రమాదకరమైన రీతిలో పసిపిల్లల లేత మనసులను కబళిస్తోంది. దేశంలో ‘పిల్లవాడు’ లేదా ‘పిల్లలు’ అనే పదానికి అర్థమే మారిపోయింది; కాలేజీలు, విశ్వవిద్యాలయాల్లో చదివేవారిని కూడా "బచ్చే" అని పిలిచే సంస్కృతిలో, అసలైన పసిపిల్లల విద్య, సంక్షేమం తీవ్ర నిర్లక్ష్యానికి గురవుతున్నాయి. ‘స్క్రీన్ వెనుక ఉన్న మేధస్సు పిల్లలకు దగ్గరవుతున్న కొద్దీ, ఇంటి గోడల మధ్య ఉన్న బంధాలు దూరమవుతున్నాయి’ అంటారో విద్యావేత్త. పిల్లలు బడి నుంచి ఇంటికొచ్చిన తర్వాత తమ తల్లిదండ్రులతో ప్రతి విషయాన్నీ పంచుకునే కాలం ఒకప్పుడు ఉండేది. స్నేహితులతో జరిగిన గొడవ నుంచి నచ్చని ఉపాధ్యాయుల వరకు, మాట్లాడటానికి ఎప్పుడూ ఏదో ఒక విషయం ఉండేది. కానీ, ఇప్పటి పిల్లలు తల్లిదండ్రులకు బదులుగా ఏ.ఐ ని ఆశ్రయించవచ్చు. ఎలాంటి భయం లేకుండా ప్రశ్నలు అడగవచ్చు, తమ ఆందోళనలను పంచుకోవచ్చు. తమకు ఇబ్బందికరంగా అనిపించే విషయాల గురించి కూడా ఏఐతో మాట్లాడవచ్చు. ఏ.ఐ అందుబాటులో ఉండే సహచరుడిగా మారుతున్న కొద్దీ, పిల్లలు క్రమంగా తమ తల్లిదండ్రులతో మాట్లాడటం కంటే ఏ.ఐ తో గడిపేందుకే మొగ్గు చూపుతున్నారు. పాలకులు స్మార్ట్‌ఫోన్లను అభ్యసన సాధనాలుగా ప్రచారం చేస్తున్నారు. దీనివల్ల పిల్లల మేధో వికాసం దెబ్బ తింటోందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నప్పటికీ, ప్రభుత్వాలు కళ్లు తెరవకపోవడం విచారకరం.

విద్యారంగంలో జరుగుతున్న పరిణామాలు ఆందోళనకరంగా ఉన్నాయి. సిబిఎస్‌ఇ మూడో తరగతి నుంచే ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (ఏ.ఐ)ను ప్రవేశపెట్టాలని నిర్ణయించింది. పంజాబ్ లాంటి రాష్ట్రాలు మొదటి తరగతి నుంచే ఏ.ఐ నేర్పించాలని ఉత్సాహం చూపుతున్నాయి. కనీసం అక్షరం ముక్క రాని నర్సరీ, యుకెజి చిన్నారుల చేతుల్లో కూడా డిజిటల్ పరికరాలు పెట్టే పాఠశాలలు పుట్టుకొస్తున్నాయి. చిన్నతనంలోనే పిల్లలపై ఈ రకమైన సాంకేతికతను రుద్దడం వల్ల వారిలో సహజసిద్ధంగా అంకురించే ఆలోచనా శక్తి, సృజనాత్మకత కుంటుపడుతున్నాయి. విద్య అనేది కేవలం సమాచారాన్ని సేకరించడం కాదు, జీవితాన్ని అర్థం చేసుకోవడానికి సహాయపడే ఒక సృజనాత్మక ప్రక్రియ. కానీ నేడు మనం ఇస్తున్న డిజిటల్ విద్య పిల్లలను సృజనాత్మకతకు దూరం చేసి, కేవలం యంత్రాల మీద ఆధారపడేలా చేస్తోంది. కొన్ని సంవత్సరాల క్రితం బ్రిటన్ వంటి దేశాల్లో డిజిటల్ ఉత్సాహం ఎక్కువై పాఠశాలల్లో డిజిటల్ యాప్‌లను తప్పనిసరి చేశారు. కానీ, దాదాపు పదేళ్ల అనుభవం తర్వాత ఉపాధ్యాయులు అసలు నిజం గ్రహించారు. పిల్లలను నిజమైన పుస్తకాలకు దూరం చేయడం ఎంత పెద్ద తప్పిదమో వారికి అర్థమైంది. దీంతో చాలా పాఠశాలలు తిరిగి కాగితం, పెన్సిల్ ఆధారిత విద్యా విధానానికే మళ్లీ మళ్లుతున్నాయి. ‘యతో హస్తః తతో దృష్టిః’- అంటే ‘చేత్తో రాస్తేనే దృష్టి అక్కడ నిలుస్తుంది’ అని అర్థం. రాయని చదువు నిరర్థకం అని పెద్దలు చెబుతారు. కానీ మన దేశంలో మాత్రం ప్రభుత్వ, ప్రైవేట్ రంగాలలో పాఠశాలలను డిజిటలీకరించడమే గొప్ప పురోగతిగా భ్రమిస్తున్నారు.

నిజమైన విద్య అంటే మనిషిలోని శారీరకమైన, మానసికమైన ఉత్తమ గుణాలను వెలికితీయడమే. కానీ నేడు స్క్రీన్ల ముందు గంటల తరబడి కూర్చోవడం వల్ల పిల్లల్లో ఏకాగ్రత లోపించడం, మానసిక ఉద్వేగాలు దెబ్బతినడం, శారీరక శ్రమ తగ్గిపోవడం వంటి సమస్యలు పెరుగుతున్నాయి. చిన్నతనంలోనే అనేక అనారోగ్యాలకు గురవుతున్నారు. అక్షరాలు, కథలు, కవితలు, ప్రకృతితో మమేకమై ఆడుతూ, పాడుతూ పెరగాల్సిన వయస్సులో పిల్లలు యాప్‌లకు బందీలుగా మారిపోతున్నారు. సాంకేతిక పరిజ్ఞానం అవసరమే, కానీ అది వారి మెదడును నాశనం చేసే వయస్సులో కాదు. మానసికంగా, ఉద్వేగభరితంగా ఎదిగేందుకు వారికి ఒక 'రక్షణ కవచం' అవసరం. ఏఐ పిల్లల ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వగలదు, కానీ తల్లిదండ్రుల ఆప్యాయత మాత్రమే వారి గాయాలను మాన్పగలదు. ఏ దేశ భవిష్యత్తు అయిన చిన్నారుల ఆరోగ్యాన్ని, వారి సహజ బాల్యాన్ని కాపాడుకోవడంపైనే ఆధారపడి వుంటుంది. జాతీయ బాలల హక్కుల పరిరక్షణ సంస్థలు, ప్రభుత్వాలు ఈ డిజిటల్ ఆక్రమణపై ఇప్పటికైనా మేల్కొనాలి. ప్రాథమిక పాఠశాలల గడపల వద్దే ఈ డిజిటల్ సునామీని నిరోధించి, చిన్నారులకు వారి సహజమైన, సంతోషకరమైన బాల్యాన్ని తిరిగి ఇవ్వాలి. పిల్లలకు కావాల్సింది తక్షణ సమాధానాలు ఇచ్చే ఆల్గారిథమ్స్ కాదు, వారి మౌనాన్ని కూడా చదవగల అమ్మనాన్నల ప్రేమ. ‘మీదే, మీదే సమస్త విశ్వం/ మీరే లోకపు భాగ్య విధాతలు’ అని మహాకవి శ్రీశ్రీ అన్నట్టుగా... స్వచ్ఛమైన బాల్యాన్ని అందించడం తల్లిదండ్రులతో పాటు ప్రభుత్వం బాధ్యత కూడా!!

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్