ప్రధాని మోడీ ఒక్కసారిగా మీడియా కీలక పాత్రనూ, ఆర్‌ఎస్‌ఎస్ కార్యకర్తగా ఒకప్పుడు వారికి తాను కుర్చీలు వేసిన రోజులను గుర్తు చేసుకోవడం ఒకింత ఆసక్తి కలిగించింది. మీడియా విభిన్న కోణాలు ముందుకు తేవడం అవసరమంటూనే భారత దేశ సంక్లిష్టతనూ విజయ గాథలనూ బాగా ప్రచారంలో పెట్టాలని కోరడంతో మోడీ ఉద్దేశం స్పష్టమైపోయింది. హఠాత్తుగా గుజరాత్ వెళ్లి ‘దీపావళి మిలన్’ పేరిట ఎంపిక చేసిన మీడియా మిత్రులను కలవడం యాదృచ్ఛికంగా జరిగిందని ఎవరూ అనుకోవడం లేదు. పుష్కరంపైన గడచిన పాలనా కాలంలో ఇంతవరకూ ఒక్కసారి కూడా పూర్తి స్థాయి మీడియా గోష్టి నిర్వహించని ప్రధాని...2024 ఎన్నికల ముందు మాత్రం చిన్న చిన్న చానళ్లకు కూడా ఇంటర్వ్యూలు గుప్పించి ఎన్నికల ప్రమోషన్ చేసుకున్నారు. అన్ని పాట్లు పడినా మెజార్టీ తెచ్చుకోలేకపోయారు. తర్వాత జరిగిన ఎన్నికలకు ‘సర్’ కావలసి వచ్చింది. కోట్ల ఓట్లు తొలగించినా గెలుపులే ఇప్పుడు ప్రశ్నార్థకమై కూర్చున్నాయి. ఇలాంటి తరుణంలో తన్నుకొస్తున్న గుజరాత్, ఉత్తరప్రదేశ్ శాసనసభ సమరాలు మోడీకే గాక మొత్తం బిజెపి-ఆర్‌ఎస్‌ఎస్ లకు జీవన్మరణ సమస్యలుగా తయారైకూర్చున్నాయి. మొన్న ఇందుకు నాందిగానే 'దీపావళి మిలన్' ముచ్చట. మీడియాను మళ్లీ మంచి చేసుకునే ప్రయత్నం. గోడీ మీడియా లేదా మోడియా ఎప్పుడూ సిద్ధం సుమతి అన్నట్లు ఆయన భజనకు రెడీగా వుంటుంది. కాకపోతే యూ ట్యూబ్ వగైరాలతో కూడిన విస్తారమైన కొత్త మీడియానే కొరకరాని కొయ్యలా తయారైంది ఆయనకు. దాన్ని కూడా 2013 ఎన్నికల కోసం బాగా వాడుకున్నారు. మత పరమైన రచ్చలు ముందుకు తెచ్చారు. అసలు దాని స్వభావాన్నే మార్చేలా దుర్వినియోగం చేశారు. ఇదంతా కొంత కాలం పనిచేసిందిగానీ ఇప్పుడు అదే ఎదురుతిరిగి కూర్చుంది. మరీ ఇటీవల జెన్ జీ ఉద్యమాలూ సాంకేతిక సామర్థ్యంగల యువత రంగ ప్రవేశం మోడీని జంతర్ మంతర్‌లో నిలదీశాయి. కనుకనే మీడియాతో మిలన్‌లు అవసరమైనాయి. కాకుంటే ఇక్కడ ఇలాంటి తియ్యటి మాటలతో చేదు మాత్రలు మింగించే ప్రయత్నం చేస్తుంటే ఖండాంతరాల నుంచి అసలు సత్యం బయిటకు రానే వచ్చింది. నార్వే గోష్టిలో తన ప్రశ్నలతో పలాయనం పాడించిన హెల్లే లింగ్ హైదరాబాద్‌లో జరుగుతున్న భారత్ సమిట్‌కు తనను రాకుండా అడ్డుకోవడంపై నిరసన ప్రకటించడం ప్రపంచ వార్తగా మారింది. మొత్తం 115 మందికి ఆ విధంగా వీసాలు నిరాకరించినట్టు నిర్వాహకులైన కాంగ్రెస్ నేతలు ప్రకటించారు. ఇదే గుజరాత్‌లో వైబ్రంట్ గుజరాత్, ఫ్రెండ్స్ ఆఫ్ గుజరాత్ పేరిట నిరంతర జాతరలు జరిపే బిజెపికి హైదరాబాద్ సమిట్‌కు మాత్రం ఆటంకాలు పెట్టడం కన్నా విపరీతం ఏముంటుంది? పైగా ఇది దేశ వ్యతిరేక సమావేశమని కేంద్రమంత్రులు కిషన్‌రెడ్డి, బండి సంజయ్‌లు ప్రకటించడం, నిరసనకు సిద్ధం కావడం కూడా అప్రజాస్వామికమే. ఇవన్నీ బిజెపి శిబిరాన్ని ఆవరించిన ఆందోళనకు, కంగారుకు అడ్డం పడతాయి. ఇందుకోసమే రెండు రోజుల పాటు ప్రత్యేకంగా ఉన్నత స్థాయి సమావేశం జరిపి ప్రతిపక్షాలు సిజెపి, జెన్ జి సాగిస్తున్న ఉద్యమాలకు పోటీగా ఏం చేయాలన్నది మధిస్తామంటున్నారు. కాయకల్ప చికిత్సలో భాగంగా కేంద్ర మంత్రివర్గంలోనూ సంస్థాగతంగా బిజెపి, ఆర్.ఎస్.ఎస్ లలోనూ కొన్ని తలలు తొలగించాలని కొన్ని పదవులలోకి కొత్తవారిని తేవాలని మల్లగుల్లాలు పడుతున్నారు. దీంతోపాటే ఆఘమేఘాల మీద యు.పి, గుజరాత్‌లలో ప్రచార పర్వం ప్రారంభించడం, జాతీయంగానూ కొత్త వ్యూహాలకు తెర లేపడం జరుగుతున్నది.
భయపెడుతున్న యు.పి
403 అసెంబ్లీ స్థానాలున్న ఉత్తర ప్రదేశ్‌లో 2027 ప్రారంభంలోనే ఎన్నికలు జరగాలి. బిజెపి 2022 లోనే అంతంత మాత్రంగా గెలిచింది. కాంగ్రెస్, సమాజ్‌వాది, వామపక్షాలు కలిసి పోటీ చేసినా సీట్ల సర్దుబాటు పెద్దగా పనిచేయలేదు. కాంగ్రెస్ ఎక్కువ స్థానాలు తీసుకుని నామమాత్రంగానే గెలవగలిగింది.111 స్థానాలు తెచ్చుకున్న ఎస్.పి 32.76 శాతం ఓట్లు రాబట్టింది. అదే కాంగ్రెస్ కేవలం రెండు సీట్లు మాత్రమే తెచ్చుకుని 2.33 శాతం ఓట్లతో సరిపెట్టింది. కానీ 2024 లోక్‌సభ ఎన్నికలలో బిజెపి పరిస్థితి తలకిందులైంది. 78 లోక్‌సభ స్థానాలలోనూ కేవలం 33 మాత్రమే ఆ పార్టీ తెచ్చుకోగలిగింది. అది కూడా చాలా పొత్తులతో అదే ఎస్.పి 37 సీట్లు తెచ్చుకోగా కాంగ్రెస్ ఆరు, ఇతర మిత్రపక్షాలు మూడు స్థానాలు పొందాయి. మోడీ మెజార్టీ తెచ్చుకోలేక పోవడానికి ప్రధాన కారణం యు.పి ఫలితాలే. తర్వాతి కాలంలోనూ అక్కడ పరిణామాలు బిజెపి కి మరింత అప్రతిష్ట తెచ్చిపెట్టాయి. అవినీతి, అనైక్యత, మత రాజకీయాలకు తోడు ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ నడిపించిన బుల్డోజర్ సంస్కృతిని సుప్రీం కోర్టు కూడా తీవ్రంగా ఖండించింది. అయితే అదే పెద్ద గొప్ప లాగా చాటుకున్న ఆ పార్టీ ఈ ఎన్నికలలోనూ బల్డోజర్ తమ ఎన్నికల చిహ్నమని చెప్పుకుంది. 2027 ఎన్నికల ముందు కూడా ఆ మాటే అనడం చివరకు బిజెపి ముఖ్య నేతలే జీర్ణించుకోలేక పోతున్నారు. మోడీకి ఒక ప్రత్యామ్నాయంగా యోగి ఆదిత్యనాథ్‌ను చూపించడం వారిలో వారికి తగాదాలు పెంచింది.
అన్నిటినీ మించి అయోధ్య రామమందిరం నిధుల చౌర్యం కేసు పరివార్‌ను పూర్తిగా రచ్చకెక్కించింది. అందులోనూ ఆదిత్యనాథ్ అయోధ్య ఉద్యమానికి నాయకత్వం వహించిన, గోరఖ్‌పూర్ మఠానికి ప్రతినిధిగా వచ్చిన నేత. మందిరం ట్రస్టు ఏకంగా ప్రధాని కార్యాలయ మాజీ బాధ్యుడితో ఇప్పటి సిఇసి జ్ఞానేష్ కుమార్ సూచనలతో ఏర్పాటైంది. అన్ని దశల్లోనూ స్వయంగా మోడీనే పాల్గొంటూ వచ్చారు. ఇంత చేసి ఇప్పుడు దొంగతనాలు పట్టుకోకపోవడం, వచ్చాక కూడా ఉన్నత స్థాయి దర్యాప్తు జరిపించకుండా సిట్‌లతో సరిపెట్టడం అక్కడేగాక దేశమంతటా వారి విశ్వసనీయతకు విఘాతంగా పరిణమించింది. భక్తిలో రాజకీయ కుయుక్తులను తటస్థులు కూడా బలపర్చలేకపోయారు. ఫలితంగానే కౌన్సిల్ ఎన్నికల్లో మోడీ స్వంత నియోజకవర్గమైన వారణాసిలోనూ ఆర్‌ఎస్‌ఎస్ కేంద్ర పీఠమైన నాగ్‌పూర్‌లోనూ అధ్యక్షుడు నితిన్ నవీన్ ఎన్నోసార్లు గెలిచిన పాట్నాలోనూ విద్యాధికులు బిజెపి ని ఓడించారు. ఓట్ చోరీ పోరుతో పాటు ఈ ఓటమి ఆదిత్యనాథ్‌కు అశనిపాతమైంది. దాంతో ఆయన కూడా మాట మార్చి తమ రాష్ట్రంలో కోటిన్నర హిందూ ఓట్లు తొలగించారని పాట ఎత్తుకున్నారు. దేశంలో సాధారణంగా ముస్లింలు, మహిళలు, దళితుల ఓట్లు తొలగించినట్టు వచ్చిన నివేదికలను తికమక పెట్టేందుకే యోగి వర్యులు ఈ పాచిక వేశారన్నమాట. అయితే అదీ బెడిసికొట్టింది. ఎస్.పి నేత అఖిలేష్ యాదవ్ హిందువుల ఓట్లే తొలగించారని మీకెలా తెలిసిందని ఎదురు సవాలు విసిరారు. నాలుగు సర్వేలు జరిపితే దేంట్లోనూ బిజెపి కి అనుకూలంగా రాకపోవడంతో ఫీడ్ బ్యాక్ గా పేరు మార్చారు. ఈ దశలో ఇదే ఫీడ్ బ్యాక్‌ను కారణంగా చూపుతూ ఆర్‌ఎస్‌ఎస్ నేరుగా రంగంలోకి దిగి అభ్యర్థులు, నినాదాలు అన్నిటా తనదే తుది మాటని శాసిస్తున్నది. 51 నియోజకవర్గాలలో 500 నుంచి 5000 లోపు ఓట్ల తేడాతోనే గతంలో గెలిచినందువల్ల ఇప్పటి వాతావరణంలో ఎదురీత తప్పదనేదే బలమైన అభిప్రాయంగా వినిపిస్తున్నది.
కాంగ్రెస్ షరామామూలుగా తమకు వందకు పైగా స్థానాలు కావాలని పట్టు పట్టడమేగాక క్ష్రేత్ర స్థాయిలోనూ తన వాదనను అమలులో పెట్టేందుకు హడావుడి పెంచుతున్నది. గతంలో యు.పి, బీహార్ లలో దానికిచ్చిన స్థానాలు గెలవలేకపోవడమే బిజెపి-ఎన్‌డిఎ ల విజయానికి ప్రధాన కారణమనే అభిప్రాయం బలంగా వున్నందువల్ల ఇది చివరకు ఎలా ముగుస్తుందో చూడాలి. మరోవైపున మజ్లిస్ అసదుద్దీన్ ఒవైసీ, చంద్రశేఖర్ ఆజాద్ నాయకత్వంలోని ఆజాద్ సమాజ్ పార్టీ కలిసి సామాజిక్ పరివర్తన్ మొర్చాగా ప్రకటించుకున్నారు. తామే బిజెపి ని ఓడిస్తామని వారంటుంటే ఓట్ల చీలికకే ఇది కారణమవుతుందనే అంచనా కూడా వుంది. మాయావతి బిఎస్‌పి కూడా గతంలో వలె ప్రభావశీలంగా లేదు గనక చివరకు ఏం చేస్తుందో చూడాలి. కానీ ఎన్నికల్లో ఎస్.పి తో మాత్రం వారు కలిసే అవకాశం వుండకపోవచ్చు. రామ్‌లీలా ర్యాలీ వంటివి యు.పి ఎన్నికలపై ప్రభావం చూపిస్తాయనే అభ్రిపాయం కూడా వుంది.
మళ్లీ ఢీ లిమిటేషన్
ఈ స్థానిక వ్యూహాలను మించి పార్లమెంటు ప్రత్యేక సమావేశం జరిపి నియోజకవర్గాల పెంపు పునర్వభజనకు ఆమోదం పొందాలనేది మోడీ అసలు వ్యూహంగా వుంది. గత ఏప్రిల్ నెలలో ఇందుకోసం చేసిన ప్రయత్నం ఫలించలేదు. సభలో వున్న 543 మంది సభ్యులలోనూ 561 మంది బలపరిస్తేనే ఆ స్థానాలను 850కి పెంచడమనే ఆలోచనకు అడుగు పడుతుంది. డి.ఎం.కె, బి.ఆర్.ఎస్, ఎస్.పి మద్దతుతో ఆ పని చేయగలమని అమిత్ షా వంటి వారు ఊదరగొడుతున్నారు గానీ ప్రతిపక్షంతో అసలు చర్చ చేసింది లేదు. ఉన్న సీట్ల నిష్పత్తి తగ్గబోదనే హామీతో మద్దతు పొందవచ్చని ఆశ. 91 రోజులుగా సభను ప్రోరోగ్ చేయకపోవడం వల్ల ఇది జరుగుతుందనే అనుకుంటున్నారు. ప్రత్యేక సమావేశం రెండు రోజుల నోటీసు సరిపోతుంది గనక ఏదైనా సాధ్యమే. వరుసగా ఎదురు దెబ్బలు తింటున్న బిజెపి-ఎన్‌డిఎ ఈ చివరి ఆయుధంతో తనదే పైచేయి అని చూపించుకోవడం ఒకటైతే రేపు ఏది ఎలా పోయినా తమకు బలం వున్న ఉత్తరాదిన సీట్లు బాగా పెంచేసుకోవాలన్నది మరింత లోతైన పథకం. అతి కొద్ది రోజుల్లోనే దాని పూర్తి చిత్రం ఆవిష్కృతం కావచ్చు.
- తెలకపల్లి రవి







కామెంట్‌లు (0)