భారత స్వాతంత్య్ర సమరయోధుల్లో బిర్సా ముండా ప్రత్యేక స్థానం కలిగిన వ్యక్తి. 1875 నవంబర్ 15న జార్ఖండ్ లోని చోటానాగపూర్ ప్రాంతంలో జన్మించిన ఆయన, బ్రిటీష్ సామ్రాజ్యవాద దోపిడీకి వ్యతిరేకంగా పోరాడి 1900 జూన్ 9న రాంచీ జైల్లో 25 ఏళ్లకే అమరుడయ్యారు. ఈ నవంబర్ 15న ఆయన 151వ జయంతి. ఆయన నిజమైన పోరాట స్ఫూర్తి, ''భూమి, అడవి, ఆదివాసీ అస్తిత్వ రక్షణ''.
ఆదివాసీ సమాజాన్ని మతపరంగా విభజించే ప్రయత్నాలు వేగవంతమయ్యాయి. ఈ ఏడాది మే 24న ఢిల్లీ ఎర్రకోట మైదానంలో జరిగిన ''జనజాతి సాంస్కృతిక సంగమం''లో క్రైస్తవ, ముస్లిం మతాలకు మారిన గిరిజనులను ఎస్టీ జాబితా నుంచి తొలగించాలనే డిమాండ్ ముందుకు వచ్చింది. ఆర్‌ఎస్‌ఎస్ అనుబంధ జనజాతి సురక్షా మంచ్ నిర్వహించిన ఈ సభలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా పాల్గొన్నారు. సభ అనంతరం జనజాతి సురక్షా మంచ్ ప్రతినిధి బృందం ప్రధాని మోడీని, రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలిసి, రాజ్యాంగం లోని ఆర్టికల్ 342కు సవరణ లేదా స్పష్టీకరణ కోరిందని వనవాసి కళ్యాణ్ ఆశ్రమ్ ప్రకటించింది. సెప్టెంబర్ 19న ఢిల్లీలో జరిగిన ఒక కార్యక్రమంలో కేంద్ర గిరిజన వ్యవహారాల సహాయ మంత్రి దుర్గాదాస్ ఉయికే, మత మార్పిడుల అంశాన్ని గిరిజన సమాజాల రక్షణ కోణంలో చూడాలన్నారు. అంటే ఇది ఒక్క రోజు సభతో ముగిసిన అంశం కాదు. ఇది కొనసాగుతున్న రాజకీయ ప్రచారం. ఆదివాసీ సమాజ ఐక్యతపై నేరుగా జరుగుతున్న దాడి.
రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమైన డిమాండ్
ఇటీవలి సుప్రీంకోర్టు తీర్పును ఉదహరిస్తూ జనజాతి సురక్షా మంచ్ ఆదివాసులను షెడ్యూల్డ్ కులాల (ఎస్సీ) వలె చూస్తోంది. ఎస్సీలు హిందూ, సిక్కు, బౌద్ధ మతాల్లో ఉంటేనే ఆ హోదా ఉంటుందనే నిబంధన ఉంది. ఇదే సూత్రాన్ని ఎస్టీలకూ వర్తింపజేయాలని వనవాసి కళ్యాణ్ ఆశ్రమ్ కోరుతోంది. కానీ ఎస్టీల విషయంలో అలాంటి నిబంధన లేదు. భారత రాజ్యాంగం షెడ్యూల్డ్ ట్రైబ్స్‌ను మతం ఆధారంగా గుర్తించలేదు. ఆదివాసీ గుర్తింపు మతం కాదు. అది చరిత్ర, భాష, సంస్కృతి, జీవన విధానం, సామాజిక-భౌగోళిక పరిస్థితులపై ఆధారపడి ఉంటుంది.
ఈ విషయాన్ని సుప్రీంకోర్టే స్పష్టం చేసింది. మార్చి 24న చింతాడ ఆనంద్ కేసులో తీర్పు ఇస్తూ, మత మార్పిడి మాత్రమే ఎస్టీ హోదాను రద్దు చేయదని, గిరిజన గుర్తింపు మతం కంటే సాంస్కృతిక, సామాజిక కొనసాగింపుపై ఆధారపడుతుందని పేర్కొంది. గిరిజన జీవన విధానంతో ''పూర్తిగా సంబంధం తెగిపోయి'', సమాజం గుర్తింపు కోల్పోయినప్పుడు మాత్రమే హోదా ప్రశ్నార్థకమవుతుందని, ఇది ప్రతి కేసులో వాస్తవాల ఆధారంగా నిర్ణయించాలని చెప్పింది. అంటే ఒక ఆదివాసీ క్రైస్తవుడైనా, హిందువైనా, సర్నా ఆరాధకుడైనా అతని తెగ గుర్తింపు మారదు. ఇదే విషయాన్ని 1963లో డేవిడ్ ముంజ్ని వర్సెస్ కార్తీక్ ఒరావ్ కేసులో పాట్నా హైకోర్టు కూడా చెప్పింది. కాబట్టి జనజాతి సురక్షా మంచ్ డిమాండ్ రాజ్యాంగ సమానత్వ స్ఫూర్తికి, ఆదివాసీల ఐక్యతకు విరుద్ధం.
అసలు లక్ష్యం: దృష్టి మళ్లింపు - విభజన
ఆదివాసీలు ఎదుర్కొంటున్న అసలు సమస్యలపై జనజాతి సురక్షా మంచ్ లాంటి సంస్థలు ఏనాడూ గట్టిగా స్పందించలేదు. ఆదివాసీ భూములను కార్పొరేట్లకు అప్పగించడంపై ఎందుకు మౌనం? 1/70 చట్టం అమలు కాకపోవడంపై ఎందుకు ఉద్యమం లేదు? అటవీ హక్కుల చట్టం 2006 అమలులోని లోపాలపై ఎందుకు సభలు లేవు? ఉద్యోగ ఖాళీల భర్తీ, ఉపాధ్యాయ రిజర్వేషన్లు, విద్య-ఆరోగ్య సదుపాయాల కొరతకు సంబంధించి ప్రభుత్వాలపై ఎందుకు ఒత్తిడి లేదు? ఈ అసలు సమస్యల నుంచి దృష్టి మళ్లించడానికి, ఆదివాసీలను మతం పేరుతో విభజించడానికి ఈ కార్యక్రమాలు ఉపయోగపడుతున్నాయి. ''సర్నా- సనాతన'' సిద్ధాంతంతో ఆదివాసీ దేవతలను హిందూ దేవతలతో ముడి పెట్టి, స్థానిక సంస్కృతులను విలీనం చేసే ప్రయత్నం జరుగుతోంది. ఇది సాంస్కృతిక ఆక్రమణ. ఆదివాసీలను హిందూ-క్రైస్తవ చట్రంలో అర్థం చేసుకోలేము. వారు తమ ప్రాచీన, స్వదేశీ విశ్వాస సంప్రదాయాలను నేటికీ కొనసాగిస్తున్నారు.
బిర్సా ముండా నిజమైన పోరాటం ఏమిటి?
ఉల్గులాన్ (మహా తిరుగుబాటు) ద్వారా బ్రిటీష్ వలసవాదం, జమీందారీ వ్యవస్థ, దోపిడీకి వ్యతిరేకంగా బిర్సా ముండా పోరాడారు. ఆయన ప్రధాన లక్ష్యం భూమి-అడవి- ఆత్మగౌరవం. ఆయన పోరాటం కేవలం మతం గురించి కాదు; అది దోపిడీకి, వలస పాలనకు వ్యతిరేకం. నేడు ఆ దోపిడీ రూపం మారింది. వలస పాలకుల స్థానంలో కార్పొరేట్లు, బహుళజాతి కంపెనీలు వచ్చాయి. అడవులు నరికివేయబడుతున్నాయి, గనులు తవ్వబడుతున్నాయి, ఆదివాసీలు నిర్వాసితులవుతున్నారు. అందుకే గ్రామసభల అనుమతి హక్కు, అటవీ హక్కుల చట్టం, 1/70 వంటి భూ రక్షణ చట్టాల అమలే ఆయనకు ఇచ్చే నిజమైన నివాళి. మత విభజన ఆదివాసీల ఐక్య పోరాట శక్తిని బలహీనపరుస్తుంది. కార్పొరేట్-హిందుత్వ కుట్రలకు వ్యతిరేకంగా, సమగ్ర హక్కుల సాధన కోసం అందరం ఐక్యమవ్వడమే నేటి ప్రధాన కర్తవ్యం.
(నేడు బిర్సా ముండా 151వ జయంతి, *జన జాతీయ గౌరవ్ దివస్ సందర్భంగా...)
వ్యాసకర్త : పి. అప్పలనర్స
ఆదివాసీ గిరిజన సంఘం జాతీయ కార్యవర్గ సభ్యులు,
సెల్ : 9490300917







కామెంట్‌లు (0)