శుక్రవారం, 31 జులై 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionఅన్నదాత ఆక్రందన

1 గంట క్రితం

farmar
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 31, 2026, 05:45 పూర్వాహ్నం | 3 నిమిషాల చదవడం

రైతు దేశానికి వెన్నెముక అని వేదికనెక్కిన ప్రతిసారీ ప్రసంగాలు దంచే పాలకులు ఆచరణలో అలాంటి స్పృహనూ, విజ్ఞతనూ చూపకపోవటం శోచనీయం. ఫలితంగా దేశంలో రైతులు పొలంలో కంటే రోడ్డుపైనే ఎక్కువగా కనిపించే దుస్థితి నెలకొంది. పంట పండించిన రైతు గిట్టుబాటు ధర కోసం ఆందోళన చేయాల్సి వస్తోంది. అభివృద్ధి పేరుతో భూమి కోల్పోయిన రైతు పరిహారం కోసం కార్యాలయాల చుట్టూ తిరగాల్సి వస్తోంది. వివిధ ప్రాజెక్టుల పేరుతో వేల ఎకరాల భూమిని సేకరిస్తున్న ప్రభుత్వాలు, ఆ భూములపై ఆధారపడి బతుకుతున్న రైతులు, గిరిజనుల భవిష్యత్తు గురించి మాత్రం మౌనం పాటిస్తున్నాయి. ప్రకృతి వైపరీత్యాలు, పెరుగుతున్న సాగు వ్యయం, అప్పులు, విత్తనాలు, ఎరువుల ధరల పెరుగుదల ఒకవైపు వేధిస్తుంటే, ప్రభుత్వ నిర్లక్ష్యం, నిర్లిప్తత, రైతు వ్యతిరేక విధానాలు మరోవైపు బాధిస్తున్నాయి.

​మన రాష్ట్రంలో ప్రకాశం జిల్లా వర్జీనియా పొగాకు రైతుల ఆందోళన కొన్ని నెలలుగా సాగుతూనే ఉంది. ఈ ఏడాది సుమారు 23.2 కోట్ల కిలోల పొగాకు ఉత్పత్తి కాగా, 14.2 కోట్ల కిలోలు మాత్రమే కొనుగోలు చేస్తామని కంపెనీలు ప్రకటించాయి. దీంతో దాదాపు 9 కోట్ల కిలోల పొగాకుకు మార్కెట్ అనిశ్చితి ఏర్పడింది. కిలోకు కనీసం రూ.250 ధర ఉంటేనే గిట్టుబాటు అవుతుందని రైతులు విన్నవిస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవటం లేదు. కిలోకు రూ.20 ఆర్థిక సహాయం చేస్తామని ప్రకటించినా, అది కంటితుడుపు చర్య తప్ప పరిష్కారం కాదని రైతు సంఘాలు పేర్కొంటున్నాయి. పంటకు గిట్టుబాటు ధర, కొనుగోలు హామీ, సమర్థమైన మార్కెటింగ్ వ్యవస్థ కావాలి తప్ప కొసరు పరిహారాలు కాదు. మధ్యప్రదేశ్‌లో మార్కెట్‌కు వచ్చిన పెసర పంట కొనుగోలుపై పరిమితులు విధించడం, మార్కెట్ ధరలు కుప్పకూలడం వల్ల రైతులు రోడ్డెక్కాల్సిన పరిస్థితి దాపురించింది. నానా ఇబ్బందులు ఎదుర్కొని పంట పండిస్తే దానికి న్యాయమైన ధర దక్కకపోవటం, కొనుగోలు హామీ లేకపోవటం పాలకుల వైఫల్యానికి అద్దం పడుతోంది.

​రైతులను ఆవేదనకు గురిచేస్తున్న మరొక ఉత్పాతం ప్రభుత్వాల భూసేకరణ తతంగం. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం కోసం సుమారు 2,200 ఎకరాల భూమిని సేకరించారు. వెయ్యిమందికి పైగా రైతులు తమ భూములను కోల్పోయారు. భూమి తీసుకోవడంలో పాలకులు చూపించిన వేగం, శ్రద్ధ, ఒత్తిడి; పరిహారం ఇవ్వడంలో, రైతు జీవితాన్ని పునర్నిర్మించడంలో కనిపించలేదు. అలాంటి పరిస్థితుల్లోనే విమానాశ్రయ ప్రారంభోత్సవాన్ని ఘనంగా నిర్వహించడానికి ప్రయత్నం చేయటం రైతుల కన్నీళ్లపై సంబరం తప్ప మరొకటి కాదు. ఉత్తరప్రదేశ్‌లోని జేవర్ అంతర్జాతీయ విమానాశ్రయం పరిధిలోనూ భూమి ఇచ్చిన రైతులు జీవన భద్రత కోసం ఇప్పటికీ పోరాడుతున్నారు. మన రాష్ట్రంలో పోలవరం నిర్వాసితుల సమస్య కూడా ఏళ్ల తరబడి ఇలాగే కొనసాగుతోంది. ఇదిలా ఉండగానే, అనేక రాష్ట్రాల్లో గనులు, పారిశ్రామిక కారిడార్లు, పోర్టులు, విద్యుత్ ప్రాజెక్టులు, రహదారుల పేరుతో భూసేకరణలు కొనసాగుతున్నాయి. ఒడిశా, ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్ వంటి రాష్ట్రాల్లో రైతులు, గిరిజనులు భూములు కోల్పోతామనే భయంతో ఉద్యమిస్తున్నారు. అనేక ప్రాంతాల్లో మహిళలే ఈ ఉద్యమాలకు నాయకత్వం వహిస్తున్నారు. పాలకులు మాత్రం నయానా, భయానా రైతులను లొంగదీసుకొని, కార్పొరేట్లను సంతోషపెట్టడానికే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తుండడం విచారకరం.

​పంట పండించినా గిట్టుబాటు ధర లేకపోవడం, భూములు కోల్పోయి పరిహారం కోసం, పునరావాసం కోసం కొట్టుమిట్టాడడం, అభివృద్ధి పేరుతో భూములను బలవంతంగా కోల్పోవాల్సి రావటం వంటివి రైతులను తీరని ఆవేదనకు గురి చేస్తున్నాయి. గత మూడు దశాబ్దాలుగా అమలవుతున్న నయా ఉదారవాద ఆర్థిక విధానాలే ఈ దుష్పరిణామాలకు, రైతు దుఃఖానికి కారణం. ప్రభుత్వాల పాత్ర ప్రజల సంక్షేమం నుంచి కార్పొరేట్లకు ప్రోత్సాహం వైపు మళ్లటం అనేక ఇక్కట్లను తెచ్చిపెడుతోంది. వ్యవసాయం, గ్రామీణ జీవనాధారాల కంటే ప్రైవేటు పెట్టుబడుల విస్తరణకు ప్రాధాన్యం పెరుగుతుండటం దేశంలోని రైతులు, గిరిజనులు, వ్యవసాయ కార్మికుల భవిష్యత్తును అగాధంలోకి నెడుతోంది. అభివృద్ధి అంటే కేవలం విమానాశ్రయాలు, పోర్టులు, ఎక్స్‌ప్రెస్‌వేలు, పారిశ్రామిక పార్కులు నిర్మించడం కాదు. వాటి కోసం భూములు కోల్పోయిన ప్రజలకు న్యాయం చేయడం, స్థిరమైన జీవనాధారం కల్పించడం కూడా అభివృద్ధిలో భాగమే! లేకపోతే సంపద కొద్దిమంది చేతుల్లో కేంద్రీకృతమవుతూ, సామాజిక అసమానతలు పెరిగి, రైతు ఉద్యమాలు మరింత తీవ్రమవుతాయి.

​రైతు పొలంలో చెమటోడ్చితే దేశం బతుకుతుంది. రైతులు రోడ్డుపైకి వస్తే అది కేవలం వారి అసంతృప్తే కాదు; దేశ ఆర్థిక, వ్యవసాయ, భూసేకరణ విధానాలపై ప్రజలు ఇస్తున్న స్పష్టమైన హెచ్చరిక. ఆ హెచ్చరికను పట్టించుకోకుండా ఉద్యమాలను శాంతిభద్రతల సమస్యగా మాత్రమే చూస్తే పరిష్కారాలు దొరకవు. రైతు గౌరవంగా జీవించేలా వ్యవసాయ, మార్కెట్, భూసేకరణ విధానాలను పునర్నిర్మించాలి. రైతు రోడ్డెక్కాల్సిన అవసరం లేని దేశమే నిజమైన అభివృద్ధికి కొలమానం. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆ దిశగా ఆలోచించాలి. అలా ఆలోచించేలా మేధావులు, ప్రజాసంఘాలు, ప్రజానీకం పాలకులపై ఒత్తిడి తేవాలి.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్