శుక్రవారం, 31 జులై 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionడేటా సెంటర్లు - ప్రజా ప్రతిఘటన

54 నిమిషాల క్రితం

Vizag data center
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 31, 2026, 05:30 పూర్వాహ్నం | 6 నిమిషాల చదవడం

​ప్రపంచవ్యాప్తంగా డేటా సెంటర్లకు వ్యతిరేకంగా ప్రజా నిరసనలు, ఆందోళనలు తీవ్రతరమౌతున్న ఈ కాలంలో భారతదేశంలోనూ, ముఖ్యంగా మన రాష్ట్రంలో డేటా సెంటర్లపై బిజెపి, దాని మిత్రబృందం ప్రచార హోరు సాగిస్తున్నాయి. దేశంలో ప్రస్తుతమున్న డేటా సెంటర్ల సామర్థ్యం (1.5 గిగావాట్లు. ఒక గిగావాట్‌ అంటే 1000 మెగా వాట్లకు సమానం) 2030 నాటికి అయిదింతలు పెరిగి 12 గిగావాట్లకు చేరుతుందని టిడిపి కూటమి సర్కారు గొప్పగా చెబుతున్నది. గూగుల్‌ డేటా సెంటర్‌తో దేశంలో ఏ రాష్ట్రం సాధించలేనిది ఈ రాష్ట్రం సాధించిందని తెగ ప్రచారం చేస్తున్నారు. ఈ డేటా సెంటర్లతో రాష్ట్రంలో లక్షల ఉద్యోగాలొస్తాయని, టెక్‌ ఎకో చైన్‌ సిస్టమ్‌ ఏర్పడుతుందని ప్రజలను నమ్మిస్తున్నారు.

వాస్తవానికి డేటా సెంటర్లకు వ్యతిరేకంగా ప్రపంచంలో ప్రజా ఉద్యమాలు జరుగుతున్నాయి. ముఖ్యంగా టెక్‌ బహుళజాతి సంస్థల పుట్టిల్లు అమెరికాలో డేటా సెంటర్లకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ప్రజలు ఆందోళనలు, తిరుగుబాట్లు చేస్తున్నారు. దీంతో జార్జియా, న్యూయార్క్‌, పెన్సిల్వేనియా, మిచిగన్‌, వర్జీనియా, ఇల్లినాయిస్‌, దక్షిణ కరోలియా, టెక్సాస్‌... తదితర అమెరికన్ రాష్ట్రాల్లో మున్సిపల్‌ పట్టణాలు, కౌంటీలు, కొత్త డేటా సెంటర్ల అనుమతులపై నిషేధాలు (మారటోరియం) విధించాయి. న్యూయార్క్‌ రాష్ట్రంలో పూర్తిగా డేటా సెంటర్లపై నిషేధం విధించాయి. కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు డేటా సెంటర్లకు ఇస్తున్న పన్ను రాయితీలను రద్దు చేస్తూ ప్రకటనలు కూడా చేశాయి. కొత్తగా ఆర్టిఫీషియల్‌ ఇంటెలిజెన్స్‌ డేటా సెంటర్ల ఏర్పాటు నిషేధమే కాదు, ఉన్న డేటా సెంటర్ల విస్తరణను కూడా అడ్డుకుంటున్నారు. కొన్ని పట్టణాల్లో డేటా సెంటర్ల ఏర్పాటును నిషేధిస్తూ పట్టణ జోనింగ్‌ నిబంధనలను కూడా మార్చేస్తున్నారు.

డేటా సెంటర్లపై అమెరికాలో ప్రతిఘటనకు కారణాలేమిటి?

నేడు భారత పాలకులు ప్రచారం చేస్తున్నట్లు డేటా సెంటర్ల ప్రారంభం కాలంలో వీటి వల్ల లక్షల్లో ఉద్యోగాలు వస్తాయని, అభివృద్ధి వేగంగా జరుగుతుందనే ప్రచారం ప్రపంచంలో అనేక దేశాలతో పాటు అమెరికాలో కూడా చేశారు. ప్రజలు దీన్ని నమ్మారు. కానీ ఆచరణలో ఆ మాటలన్నీ వొట్టి బూటకమని తేలిపోయింది. స్థానిక ప్రజలకు కనీస స్థాయిలో కూడా ఏ విధమైన ప్రయోజనం కల్పించలేకపోయాయి. ఉపాధి, అభివృద్ధి లేకపోగా అనేక ప్రమాదకర సామాజిక, పర్యావరణ విపత్తులను సృష్టించాయి. ముఖ్యంగా విద్యుత్‌ సమస్య తీవ్రంగా ముందుకు వచ్చింది. ఎందుకంటే డేటా సెంటర్ల నిర్వహణకు నిరంతరాయంగా విద్యుత్‌ సరఫరా చేయాల్సిరావడంతో భారీగా విద్యుత్‌ వినియోగం అవసరం. డేటా సెంటర్లకు వాణిజ్య, పరిశ్రమల, గృహ విద్యుత్‌ చార్జీలకంటే చాలా తక్కువ చార్జీలకు విద్యుత్‌ సరఫరా ఒప్పందాలు రాష్ట్రాలు చేసుకోవడంతో విద్యుత్‌ నిర్వహణా వ్యయం ఎక్కువగా పెరిగింది. ఆ భారాన్ని ప్రజల నుంచి వసూలుచేస్తున్నారు. ఫలితంగా ప్రతి ఏడాది గృహ విద్యుత్‌ చార్జీలు పెంచుతున్నారు. గత ఏడాది అమెరికాలో కొన్ని రాష్ట్రాల్లో సగటున నెలకు 10 నుండి 27 డాలర్లు వరకు విద్యుత్‌ చార్జీలు పెరిగాయి. దీనికి తోడు తరచూ విద్యుత్‌ కోతలు కూడా గృహ వినియోగదారులు ఎదుర్కోవాల్సి వస్తున్నది. భారీ గ్రిడ్ల అనుసంధానంతో హై టెన్షన్‌ పవర్‌ ట్రాన్స్‌మిషన్ లైన్లతో శబ్ద సమస్య బాగా పెరిగింది. ఉష్ణోగ్రతలు కూడా పెరిగాయి.

రెండోది డేటా సెంటర్లు అపరిమిత నీటి వినియోగంతో ప్రజలకు నీటి కొరత పెరిగింది. భూగర్భ జలాలు కూడా తగ్గడంతో ప్రజల తాగునీటి కొరత సామాజిక సమస్యగా తయారైంది. డేటా సెంటర్ల కంటే గృహ వినియోగదారులపై నీటి చార్జీల భారం ఎక్కువ మోపబడింది. ఒక నగరంలో 4 వేల లీటర్ల నీటికి డేటా సెంటర్‌ 6 డాలర్లు చెల్లిస్తుండగా, గృహ వినియోగదారుడు అదే నీటి పరిమాణానికి 10 డాలర్లు చెల్లిస్తున్నారు. మూడోది డేటా సెంటర్లలో వినియోగించే కూలింగ్‌ ఫ్యాన్లు, డీజిల్‌ బ్యాకప్‌ జనరేటర్ల నుండి వెలువడే శబ్ద కాలుష్యం, డీజిల్‌ పొగ వల్ల కలిగే వాయు కాలుష్యంతో ప్రజలు అనేక ఆరోగ్య సమస్యలకు గురవుతున్నారు. డేటా సెంటర్ల ప్రాంతాల్లో భూమి ధరలు బాగా పడిపోయాయి.. ఇవన్నీ ప్రజలను డేటా సెంటర్లకు వ్యతిరేకంగా పోరాడాల్సిన అనివార్య పరిస్థితిని సృష్టించాయి.

ఈ డేటా సెంటర్లకు ఇస్తున్న పన్నుల రాయితీలు, సబ్సిడీలు అమెరికా రాష్ట్ర ప్రభుత్వాల ఆర్థిక పరిస్థితిపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తున్నాయి. రాష్ట్రాలకు పన్ను రాబడి తగ్గిపోవడంతో పాటు, చేసుకున్న ఒప్పందం ప్రకారం చెల్లించాల్సిన సబ్సిడీలు రాష్ట్రాల ఖజానాకు భారంగా మారాయి. ప్రజల సంక్షేమంపై చేసే ఖర్చులో కోత పెట్టాల్సిన దుస్థితి కల్పిస్తున్నాయి. దీంతో అనేక రాష్ట్రాలు పన్ను రాయితీలు, సబ్సిడీలు ఇవ్వలేమని తేల్చి చెబుతున్నాయి.

డేటా సెంటర్లు సృష్టిస్తున్న భయంకరమైన ఈ సామాజిక, పర్యావరణ విపత్తుల నేపథ్యంలో అమెరికాలోనే కాదు ప్రపంచమంతా ఒక దేశం తరువాత మరో దేశానికి ప్రజా ప్రతిఘటనోద్యమాలు అల్లుకుపోతున్నాయి. రెండో వైపు గూగుల్‌, మెటా, యాపిల్‌, మైక్రోసాఫ్ట్‌, అమెజాన్‌ వంటి టెక్‌ దిగ్గజ కంపెనీలు ఎ.ఐ డేటా సెంటర్ల రంగంలో పెద్ద ఎత్తున పెట్టుబడులను విస్తరించుకు పోయేందుకు తీవ్ర ప్రయత్నం చేస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో టెక్‌ బహుళజాతి సంస్థలు డేటా సెంటర్ల స్థాపనకు భారతదేశ బాట పట్టాయి. మన రాష్ట్రానికి గూగుల్‌ డేటా సెంటర్‌ ఆగమేఘాలపై రావటానికి ఇదే కారణం. కేంద్ర బిజెపితో పాటు చంద్రబాబు కూటమి ప్రభుత్వం విశాఖపట్నం చుట్టూ విచ్చలవిడిగా డేటా సెంటర్ల స్థాపనకు ఎగబడుతున్నాయి. ఇప్పటికే 6.5 గిగావాట్ల సామర్థ్యం కలిగిన గూగుల్‌, అదానీ, అంబానీ, ఇఫ్సీ, టాటా వంటి సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకుంది. మరికొన్నింటితో ఒప్పందాలు చేసుకోబోతున్నది. 2030 నాటికి దేశంలో ఏర్పడబోయే డేటా సెంటర్ల సామర్థ్యంలో సగానికి పైగా విశాఖపట్నం కేంద్రంగానే నిర్మాణం కాబోతున్నాయి. ఇవన్నీ జనావాసాల మధ్యే... వీటికి కావలసిన వేల ఎకరాల భూములను రైతుల నుండి బలవంతంగా సేకరించి కారుచౌకగా కార్పొరేట్లకు ధారాదత్తం చేస్తున్నది. భూమితో పాటు పన్ను రాయితీలు, సబ్సిడీలు పెద్ద ఎత్తున ఇస్తున్నది.

ఈ డేటా సెంటర్లపై ప్రజల నుండి వ్యతిరేకత రావడంతో రాష్ట్ర ప్రభుత్వం అనేక అవాస్తవాలను ప్రచారం చేస్తున్నది. ఈ డేటా సెంటర్లతో ప్రజలకు విద్యుత్‌ కొరతలు రావు, విద్యుత్‌ చార్జీలు పెరగవని చెబుతున్నాయి. గూగుల్‌ ప్రకటించిన విశాఖలోని తర్లువాడ, అడవివరం, రాంబిల్లి లోని మూడు హైపర్‌ స్కేల్‌ ఎ.ఐ డేటా సెంటర్లకు సుమారు 2138 మెగావాట్ల విద్యుత్‌ అవసరం. ఇది విశాఖ జిల్లాలో ప్రస్తుతం వినియోగించబడుతున్న విద్యుత్‌ వినియోగానికి రెట్టింపు. అలాగే మొత్తం 6.5 గిగావాట్ల డేటా సెంటర్లకు ఉత్తరాంధ్ర జిల్లాలు వినియోగిస్తున్న విద్యుత్‌ కంటే రెట్టింపు కావాలి. ఇంత విద్యుత్‌ రాబోయే మూడేళ్లలో ఎక్కడనుండి వస్తుంది? సోలార్‌ వంటి పునరుత్పతి విద్యుత్‌ అందుబాటులోకి వస్తుంది, కనీసం 50 శాతం ఈ విద్యుత్‌ను వినియోగించాలని డేటా సెంటర్లకు నిబంధన పెడుతున్నామని ప్రభుత్వం అంటున్నది. ఒక గిగావాట్‌ డేటా సెంటర్‌కు కనీసం 4 గిగావాట్ల పునరుత్పతి విద్యుత్‌ అవసరం అవుతుంది. దీనిప్రకారం 6.5 గిగావాట్లకు 50 శాతం పునరుత్పత్తి విద్యుత్‌ సరఫరా అనుకున్నా కనీసం 15 గిగావాట్ల పునరుత్పత్తి విద్యుత్‌ అవసరం. ఒక గిగావాట్‌ సోలార్‌ విద్యుత్‌ ఉత్పత్తికి 5 వేల ఎకరాల భూమి కావాలి. ఈ లెక్కన 15 వేల గిగావాట్ల సోలార్‌ విద్యుత్‌ ఉత్పత్తికి కనీసం 75 వేల ఎకరాల భూమి కావాలి. కేవలం డేటా సెంటర్ల కోసం ఇన్ని వేల ఎకరాల రైతుల భూమిని బలిపెట్టడం అవసరమా? ఇప్పటికే డేటా సెంటర్ల కోసం అరకు, మన్యం గిరిజన ప్రాంతంలో పంప్డ్‌ స్టోరేజ్‌ విద్యుత్‌ పేర అదానీ, నవయుగ వంటి సంస్థలకు వేలాది ఎకరాల అటవీ గిరిజన భూములను సంతర్పణ చేస్తున్నారు. ఈ చర్యల వల్ల గిరిజనుల జీవనానికి ముప్పు ఏర్పడుతుంది. విశాఖ ప్రజల మంచినీటి సమస్యతో పాటు ఉత్తరాంధ్ర వ్యవసాయ రిజర్వాయర్ల పై తీవ్ర ప్రమాదం పడుతుంది. అంతేగాక ప్రైవేట్‌ డిస్కంలకు కూడా తెరలేపింది. కేవలం రూపాయికే విద్యుత్‌ సరఫరాకు అంగీకరించింది. ఈ చర్యలన్నీ ప్రజలపై తీవ్రమైన విద్యుత్‌ చార్జీల భారమే గాక, తీవ్ర విద్యుత్‌ కొరతలు, విద్యుత్‌ ప్రైవేటీకరణతో పాటు వేలాది మంది రైతులు, గిరిజనులు భూములు కోల్పోయే ప్రమాదం ఏర్పడుతున్నది. అంతేగాక కొవ్వాడ అణువిద్యుత్‌ ను మళ్ళీ తెరపైకి తీసుకురాబోతున్నారు.

ేటా సెంటర్లకు అవసరమైన నీటి వినియోగాన్ని ప్రభుత్వం చాలా తక్కువగా చూపుతున్నది. ఎ.ఐ డేటా సెంటర్ల అధునాతన సర్వర్లు వినియోగిస్తాయని, అందువల్ల వీటికి నీటి అవసరం చాలా తక్కువని చెప్తున్నారు. ఇది వాస్తవం కాదు. నమూనాలు ఎంత ఆధునికంగా ఉంటే అంత ఎక్కువగా వేడిని ఉత్పత్తి చేస్తాయి. వీటిని చల్లబర్చటానికి భారీగా నీరు అవసరం. ఒక మెగావాట్‌ డేటా సెంటర్‌కు కనీసం రోజుకు 67,500 లీటర్లు నీరు అవసరమౌతుంది. ఆ లెక్కన విశాఖలో గూగుల్‌ ఏర్పాటు చేయబోతున్న 2512 మెగావాట్ల డేటా సెంటర్లకు సుమారు 42 ఎంజిడిల నీరు అవసరం. ఇది విశాఖ నగర ప్రజలకు ప్రస్తుతం సరఫరా చేస్తున్న మంచినీటికి సమానం. ఇక 6.5 గిగావాట్ల డేటా సెంటర్లకు ఎంత నీరు అవసరమోతుందో అర్థం చేసుకోవచ్చు. ఈ నీటిని కూడా విశాఖ ప్రజలు మంచినీటి చార్జీల కంటే 25 శాతం తగ్గించి 20 ఏళ్లు సరఫరా చేస్తామని ఒప్పందం చేశారు. దీనివల్ల ప్రజల మంచినీటి చార్జీలు పెరగటమే కాక, మొత్తం విశాఖ ప్రజలు, ఉత్తరాంధ్ర సాగు నీటి వినియోగంపై దుష్ప్రభావం పడుతుంది.

ఈ డేటా సెంటర్లన్నిటినీ జనావాసాల మధ్య ఏర్పాటుచేయడంతో అవి వినియోగించే భారీ డీజిల్‌ జనరేటర్లు, వాటివల్ల వచ్చే పొగతో ఆ చుట్టూ ఉన్న ప్రాంతాలు వాయు, శబ్ద కాలుష్యానికి గురవుతాయి. ప్రజలు తీవ్రమైన ఆరోగ్య సమస్యలకు గురవుతారు. ముఖ్యంగా ఉష్ణోగ్రతలు పెరుగుతాయి. ఇప్పటికే డేటా సెంటర్ల కోసం కొండల అటవీ చెట్లను ధ్వంసం చేస్తున్నారు. ఇవన్నీ కలిసి చుట్టూ హానికరమైన పర్యావరణ సమస్యలు సృష్టిస్తాయి.

ఈ డేటా సెంటర్లకు రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న పన్ను రాయితీలు, సబ్సిడీలు, పెట్టుబడిపై 10 శాతం చెల్లింపు వంటివి రాష్ట్ర ప్రభుత్వ ఖజానాను లూటీ చేస్తాయి. ఉదాహరణకు గూగుల్‌కు 1000 మెగావాట్ల డేటా సెంటర్‌కు రూ.22 వేల కోట్ల రాయితీలు ఇచ్చేందుకు టిడిపి కూటమి ప్రభుత్వం అంగీకరించింది. ఇపుడు గూగుల్‌ నిర్మాణం తలపెట్టిన 2512 మెగావాట్ల డేటా సెంటర్లకు కనీసం రూ. 55 వేల కోట్లు రాష్ట్ర ఖజానా నుండి చెల్లించాల్సి వస్తుంది. అయినా, వీటిలో వచ్చే ఉద్యోగాలు 1925 మాత్రమే. అందువల్ల ఈ డేటా సెంటర్లు ఉత్తరాంధ్రను అన్ని విధాలా దోచేస్తాయి. సామాజిక, పర్యావరణ విధ్వంసం సృష్టిస్తాయి. కనుక వీటికి వ్యతిరేకంగా ప్రపంచవ్యాప్తంగా సాగుతున్న ప్రజా ప్రతిఘటన రాష్ట్రమంతటా వ్యాపించనుంది.

Gangarao garu

వ్యాసకర్త -డా. బి. గంగారావు

సెల్ : 9490098792

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్