శుక్రవారం, 31 జులై 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionప్ర... దక్షిణ!

1 గంట క్రితం

Adani Setaire
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 31, 2026, 05:15 పూర్వాహ్నం | 3 నిమిషాల చదవడం

" గోవా రాజు గారు జెండా ఊపేశారు.."-- గట్టిగా ఓ కేక!

"పదండి..పదండీ!.. విజయనగరం రాజుల వంశ పారంపర్య ధర్మకర్తే! కానీ, ఇప్పుడు గోవా గవర్నర్ కదా! ఇంకా, రక్తనాళాల్లో ఇంకిపోని రాజవంశ భక్తజనం.. వారి ముచ్చట వారిదీ.. మనమెందుకు కాదనాలి?"--అని, కొందరు ముచ్చటించుకుంటున్నారు.

కదిలింది దివ్య పుష్ప రథం..రంగు, రంగుల పూల ముస్తాబు! సంప్రదాయ రకాలు..సంకర జాతులు..అందాలెక్కువ! గంధాలు తక్కువ!. ఆనందపురం, సింహాచలం బంతి, చామంతి, గులాబీ, మల్లెలు, సంపెంగలను ఈసారి విదేశీ కార్నేషన్లు, జెర్సెవాలు డామినేట్ చేశాయి. మొత్తానికి కనుల పండగే!

రథానికి ముందూ, వెనకా వేలాది భక్తజనం గోవిందా..గోవిందా! అని ఎక్కువమంది.. అప్పన్నా.. సింహాద్రప్పన్నా! అని తక్కువ మంది.. హోరెత్తిన నామస్మరణలు. పైనుంచి మేఘాలు దీవిస్తున్నట్టు అక్షతల్లా చినుకులు!

పాత అడవివరం చేరగానే, చినుకులు.. జల్లులుగా మారాయి. గ్రామీణులు తలపాగాలు బిగించారు. పట్టణీయులు టోపీలు వేశారు. అక్కడక్కడ రెయిన్ కోట్ల మధ్యన గొడుగు మొగ్గలు వికసించాయి.

" ఈ పట్నపోళ్లు కనీసం వరద పాశం పొయ్యరు.. వరుణయాగం చెయ్యరూ! వద్దంటే, వర్షం వీళ్ళకు."-- దశుమంతు నాయుడి బృందంలోని కసింకోట సిద్ధాంతి వ్యాఖ్యానించారు. వారి వెనుక నడుస్తున్న గ్రామీణ భక్తుల్లో ఒకరు విని--" పట్ట బుర్రకేలా! తట్టెడు పూలు? అనేవోడు మా నాయన "-- అందరికీ వినబడేటట్టు అన్నాడు నవ్వుతూ. కొందరు నవ్వారు కూడా!

" మనం అక్కడ కుండలతో నీళ్లు మోసి, నారుమళ్లు తడుపుతుంటే, సిటీల్లో వర్షాలు! హైదరాబాదులో రోడ్లు కాలవలయ్యాయనీ, బొంబాయిలో కార్లు కొట్టుకుపోయాయనీ, మరింక ఎక్కడో, ఏరూ, ఊరూ ఏకమైపోయిందని! ఇలాంటి వార్తలు వింటే, సిరాకేస్తాది!"-- విసవిసలాడాడు మరొకడు.

" ఏ ఊరయ్యా!"-నవ్వుతూ మాట కలిపాడు నాయుడు."

అప్పలగ్రహారమండీ.. రాజాం దగ్గిర ..సంతకవిటి మండలం".

" అప్పన్న స్వామి పేరుతో మనుషులకే కాదు, చాలా గ్రామాలకు పేర్లు ఉన్నాయండి.. ప్రత్యేకంగా, మన ఉత్తరాంధ్ర వారికి వారంటే, ఎంత గొప్ప భక్తీ, విశ్వాసం. వ్యవసాయంలో మిషన్లు చొరబడినా, ఇంకా, కోడె దూడల మొక్కుల చెల్లింపుల ఆచారం ఉంది."-- సిద్ధాంతి గొప్ప గర్వంగా చెప్పాడు.

" సింహాద్రి.. అప్పన్న.. వరాహ నరసింహ పేర్లు పెట్టుకున్న చాలామంది, పెద్ద పెద్ద పదవులు చేశారు. శ్రీకాకుళం అప్పయ్య దొర గారు, భోగాపురం అప్పడు దొరగారు, పెందుర్తి అప్పల నరసింహం గారు నుంచి.. ఇలా, ఎన్ని పేర్లు చెప్పగలం?"--పక్క వరుసలో ఉన్న ఒకాయన మాటల్లో మాట కలిపాడు.

" ఇప్పుడు లేరేటండీ! ఎమ్మెల్యే, ఎంపీ, మంత్రి పదవులు చేసినోళ్ళు.. తాత, తండ్రులు ఇలాంటి పేర్లు పెట్టేసారని, నామోషీగా భావించే తరం వచ్చేసింది!"--బాధపడ్డాడు ఆ వ్యక్తి. ఈలోగా మాటల్లోనే ముడసర్లోవ వచ్చేసింది. అక్కడ ఓ కొండ దిగువన పొడవాటి దళసరి తెరలు కట్టేసి ఉన్నాయి. నడకలు ఆపేసి, ఆసక్తిగా అక్కడ చాలామంది గుమిగూడారు. నాయుడి బృందం కూడా ఆగింది.

" అప్పన్న కొండలని విడదీసి, అదానీకి రాసిచ్చేసిన కొండ ఇదేనండీ! ఎకరా! సకరా? ఏకంగా నూటా, అరవై ఎకరాలు.. ఎవడబ్బ సొమ్ము?"-- ఒకాయన పెద్ద, పెద్ద కేకలు వేస్తూ, చెబుతున్నాడు.

" ఇంతకూ, మీదేవూరయ్యా?"--అడిగారు ఎవరో!

" ఏ ఊరయితేటి! అడగవలసిన బాధ్యత భక్తులకి లేదా?"-- పరదేశి గొంతు కలిపాడు.

"భూ ప్రదక్ష‍ిణ చేసినంత పుణ్యం వస్తదని కదా! మీరంతా వచ్చేసారు. తొలి పావంచా నుంచి 32 కిలోమీటర్లు ప్రదక్షిణ చేయాలని పండితులు, పెద్దలే చెప్పారు కదా! ప్రభుత్వం వారు కూడా ఏర్పాట్లు చేశారు కదా! దీని అర్థమేంటి? ఈ 32 కిలోమీటర్లు నడిమిలో (మధ్యలో) ఉన్న కొండంతా, సింహాచలమే కదా! లక్షల మంది భక్తులు, ఇంత కష్టపడి పుణ్యం కోసం కాలి నడకతో, భక్తి విశ్వాసాలతో ప్రదక్షిణ చేస్తుంటే, ఈ కొండల్లో ఒక కొండని విడదీసి, అదానీకి ఎలా ఇచ్చేస్తారు?"--అతడు బాగా ఆవేశపడినా, వాస్తవమే చెప్పాడనిపించింది అందరికీ!

"నాయనా! అప్పన్న బాబూ.. ఎంత అన్నేయం..ఎంత ఘోరం? ఆ ఇరణ్యకశిపుడ్ని ఇరిసి, పారీసినట్టుగా.. కడుపు సీరీసినట్టుగా .. మళ్లా అవతారమెత్తలేవా? నాయనా! "-- అప్పలగ్రహారం నుంచి వచ్చిన వాళ్లలోని ఒక వృద్ధుడు నేల మీద దొర్లుతూ, గగ్గోలు పెట్టడం ప్రారంభించాడు.

" కలియుగంలో శిలారూపుడైన దేవుడు, మరేమీ చెయ్యలేడయ్యా! ఆయన అంశ ఉంటే, ప్రతి భక్తుడూ, ఉగ్ర నరసింహ స్వామిగా మారిపోయి, ఈ అకృత్యాన్ని ఆపాలి"-- సిద్ధాంతి పిలుపునిచ్చాడు. వాతావరణం ఉద్రిక్తమయ్యింది.

" ముందు ఈ తెరల్ని సింపీద్దుమూ.. పదండి "--ఎవరో అరిచారు. ఇంతలో సైరన్ మోగించుకుంటూ, సమాచారం ఎవరిచ్చారో గానీ.. పోలీస్ బస్సు వచ్చి ఆగింది. లాఠీలను తాటిస్తూ, విజిల్స్ ఊదుతూ, బస్సు దిగిన వెంటనే హడావుడి ప్రారంభించారు పోలీసులు. అయితే, వాళ్లంతా ట్రాఫిక్ డ్యూటీ యూనిఫారాల్లో ఉన్నారు.

" ఏమయ్యా! పుణ్యం కావాలా! పాపం కావాలా! ఎవుడు అగ్గిపుల్ల ఎలిగించాడు? ఇదేటి, జంతర్ మంతర్ అనుకుంటున్నారా? పదండి.. పదండి.. ఈ దారిలోనే సెంట్రల్ జైలు.. పెద్ద పెద్ద హాస్పిటళ్లూ! సదుపాయాలు బాగుంటాయి..మరి!"-- వెటకారంగా, అన్నాడు వెనక నుంచి ముందుకు వచ్చిన ఎస్.ఐ. వర్షం ఎక్కువైంది.. జనం పల్చబడ్డారు.

పరదేశి ధైర్యం చేసి, ఎస్.ఐ దగ్గరకు వచ్చి " సారూ.. అప్పన్న కొండని ఏ కోటీశ్వరుడికో, కట్టబెట్టడం అన్యాయం కదా!"-- బాధతో అడిగాడు.

పరదేశి అమాయకత్వానికి జాలిపడి--

" దేముడూ, ధర్మకర్తలే ఏమీ సెయ్యలేకపోతే, మన బతుకులు ఏపాటి బాబూ? పైనున్నోడికి దక్షిణ.. మనకి ప్రదక్షిణ!" నిర్లిప్తంగా అన్నాడు.

" ఏటి! పైన.. అప్పన్న బాబుకు దక్షిణా?"

" ఏ బాబుకో లేవయ్యా! నీకెందుకు? వెళ్లండి..కదలండీ! " చిరాకు పడుతూ, లాఠీని గాల్లోకి ఎత్తాడు ఎస్.ఐ. భక్తులంతా, ప్రదక్షిణ ప్రారంభించారు. మొదట హడావుడి చేసిన వ్యక్తి ముఖం, నీరు తగ్గిపోయి, పూడిక పెరిగిపోయి, కుదించుకుపోయిన ముడసర్లోవలా మారిపోయింది. పోలీస్ బస్సు బయలుదేరుతుండగా దగ్గరకు వచ్చి, ఎస్.ఐ జేబుకు తగిలించిన నేమ్ ప్లేట్ చూసి, కంటతడి పెట్టుకున్నాడు. అతని పేరు .. ఎస్. అప్పలనాయుడు.


- ' నల్లి ' కుట్టు

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్