విభజిత ఆంధ్రప్రదేశ్‌లో 27,750 పైగా ఆలయాలు, దాన ధర్మ సంస్థలు, మఠాలు ఉన్నట్లు అధికారిక లెక్కలు తెలియజేస్తున్నాయి. సుమారు 4.67 లక్షల ఎకరాల భూమి దేవాలయాల కింద ఉంది. సుమారుగా లక్ష మందికి పైగా కౌలు రైతులు ఎంతో కష్టపడి ఆ భూములను సాగు చేస్తున్నారు. వీరి కష్టానికి ప్రతిఫలం రాకపోగా నష్టాలు వచ్చి అప్పుల పాలవుతున్నారు. ఎ.పి కౌలు రైతుల సంఘం రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో ఇటీవల విజయవాడలో జరిగిన సదస్సులో కౌలు రైతులు అనేక సమస్యలను చర్చకు తెచ్చారు.
ముందుగానే కౌలు చెల్లించి దేవాలయ భూముల సాగు ప్రారంభించాలని ఇటీవల రాష్ట్ర ప్రభుత్వాలు కొత్త చట్టాలు తెచ్చాయి. ఇది భూస్వాములు చేసే దోపిడిని మించినదిగా భావించాలి. అంటే ఒక హెక్టార్ భూమిని లక్ష రూపాయల కౌలుకు వేలంపాట ద్వారా దక్కించుకుంటే...పంట చివరకు ఆ లక్ష రూపాయలకు వడ్డీ కలిపితే లక్షా పాతిక వేలు అవుతుంది. అంటే కౌలుదారుడు అదనంగా మరో రూ. పాతిక వేలు భరించాల్సి వస్తుంది. గణనీయమైన సంఖ్యలో కౌలుదారులు దేవాలయాలకు కౌలు ముందుగానే చెల్లించారు. కానీ ఈ సంవత్సరం ఎల్‌నినో ప్రభావంతో రాష్ట్రంలో 500 మండలాలకు పైగా పంటలు సాగు చేయటం సాధ్యం కాలేదు. కృష్ణా జిల్లా, శ్రీకాకుళం తదితర అనేక ప్రాంతాల్లో దేవాలయ భూములను 22-ఎ కింద పెట్టారు. ఈ భూములు సాగు చేస్తున్న వారికి, కౌలు రైతులకు ఈ-క్రాప్ చేయరు. పంట రుణాలు ఇవ్వరు. ప్రభుత్వ కొనుగోల సంస్థల ద్వారా ఈ భూముల్లో పండించిన పంటను మద్దతు ధరకు కొనరు. తగిన ఆధారాలు ఉన్నప్పటికీ ప్రభుత్వం కాలయాపన చేయడంతో ఈ రైతాంగం తీవ్రంగా నష్టపోతున్నారు.
ఆలయ భూముల వేలంపాటకు పాటదారులు డిపాజిట్ కట్టాలి. ఆ డబ్బులు మూడు సంవత్సరాల తర్వాత తిరిగి ఇస్తారు. అది కూడా వడ్డీతో కాకుండా అసలు మాత్రమే తిరిగి ఇస్తారు. కౌలు రైతులు డబ్బు దొరక్క, డిపాజిట్ కట్టిన డబ్బుకు వడ్డీ లేక రెండు విధాలా నష్టపోతున్నారు.
ఆలయ భూములు సాగు చేస్తున్న కౌలు రైతులకు ‘అన్నదాతా సుఖీభవ’ దక్కటం లేదు. దేవాలయ భూములు సాగు చేసే వారందరికీ కౌలు గుర్తింపు కార్డులు ఇవ్వాలని కౌలు రైతుల సంఘం 2013లో దేవాదాయ ధర్మాదాయ శాఖకు చేసిన విజ్ఞప్తి మేరకు రాష్ట్రంలో ఉన్న అన్ని దేవాలయాలకు రాతపూర్వకంగా ఆదేశాలు ఇచ్చారు. కానీ నేటికీ 60 నుండి 70 శాతం కౌలు రైతులకు గుర్తింపు కార్డులు అందలేదంటే అధికారుల ఆదేశాలు ఏ మేరకు అమలు జరుగుతున్నాయో అర్థం చేసుకోవాలి. కౌలు గుర్తింపు కార్డు రాలేదనే మరో కారణంతో దేవాలయం భూములను పూర్తి స్థాయిలో ఈ-పంట కింద నమోదు చేయటం లేదు. ఫలితంగా వారికి నష్టపరిహారాలు అందక అన్యాయానికి గురవుతున్నారు. వ్యవసాయ సంబంధ సమస్యల పరిష్కారానికి వ్యవసాయ శాఖ అధికారులు చొరవ చూపించాలని కౌలు రైతులు కోరుతున్నారు.
భూమి లేని నిరుపేద ధృవీకరణ పత్రం ఉన్న రైతులకు వేలం పాటలను నిర్వహించరాదని, దేవాలయ భూమి కౌలు పెంచకుండా వారికే ఇవ్వాలని, సుప్రీం కోర్టు ఆదేశాలు ఉన్నాయి. కానీ రాష్ట్రంలో గతంలో ఈ సర్టిఫికెట్ వున్న వారందరినీ తొలగించారు. నేడు ఒక్కరికి కూడా ల్యాండ్ లెస్ పూర్ సర్టిఫికెట్ విధానం అమలు కాకపోవటం శోచనీయం.
భూమిపై వేసిన ప్రతి పంటను ఈ-పంట కింద నమోదు చేస్తామని అధికారులు చెప్తున్నారు. అయితే, ఈ-క్రాప్ చేయమని రాష్ట్ర వ్యవసాయ శాఖ అధికారుల నుండి తమకు స్పష్టమైన ఆదేశాలు లేవు కనుకనే చేయలేకపోతున్నామని అనంతపురం జిల్లా విడపనగల్లు వజ్రకరూరు తదితర మండలాల్లో చెప్పారు. దేవాలయ భూమి దేవాదాయ శాఖ స్వంతం. ఆ భూమి అభివృద్ధి కోసం పెట్టే ఖర్చులన్నీ కౌలు రైతులే భరించాల్సి రావటం సరి కాదు. భూమి అభివృద్ధికి అయ్యే ఖర్చులను దేవాదాయ శాఖ పెట్టాలని రైతులు కోరుతున్నారు.
అనేక ప్రాంతాల్లో దేవాలయం చుట్టుపక్కల వారు ఆక్రమించుకుంటున్నారు. రాజకీయ నాయకులయితే కబ్జా చేస్తున్నారు. కాబట్టి దేవాలయ భూములను ఆక్రమణదారుల చెర నుండి విడిపించి ఆలయ ఆస్తులను కాపాడాలని కౌలు రైతులు కోరుతున్నారు. ఆలయంలో వేలంపాట సందర్భంగా భూమి ఎంతుందో కొలిచి కౌలు రైతులకు అప్పచెప్పడం లేదు. భూమి విస్తీర్ణం డాక్యుమెంట్లలో ఒకరకంగానూ వాస్తవంగా మరోరకంగానూ ఉంటుంది. ఈ తేడాను సరిచేసి డాక్యుమెంట్లలో ఉన్నంత భూమి కొలిచి తమకు అప్పచెప్పమంటే ‘ఆ తేడాను మేం సరి చేయలేం. దానిని బట్టే మీరు వేలంపాటలో పాల్గొనండి’ అని అధికారులు సర్ది చెబుతున్నారు. దేవాలయ భూముల కౌలు ముందుగా చెల్లిస్తేనే సిసిఆర్ కార్డు ఇస్తామని ఇబ్బంది పెడుతున్నారు. దీనిని సరళీకరించాలి. కౌలు కార్డులు ఇచ్చి పంట రుణాలు, మిగతా ప్రభుత్వ పథకాలు అందేలా దేవస్థానం అధికారులు, ప్రభుత్వం చొరవ చేయాలని సదస్సులో పాల్గొన్న రైతులందరూ చెప్పారు.
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మార్గదర్శకాల ప్రకారం కౌలు రైతులకు ఎటువంటి హామీలు, షూరిటీలు లేకుండా రూ.రెండు లక్షల వరకు పంట రుణాలు ఇవ్వవచ్చు. అది అమలు జరపటం వల్ల కౌలు రైతులు వడ్డీ దోపిడి నుండి, అప్పుల ఊబి నుండి బయటపడే అవకాశం కొంతైనా ఉంటుంది. తద్వారా కౌలు రైతులకు రుణాలతో పాటు దేవస్థానానికి కూడా డైరెక్ట్‌గా డబ్బులు బ్యాంకు ఖాతాలో జమ చేయవచ్చు. ఇది రెండు వర్గాలకూ ఉపయోగంగా ఉంటుంది. పంట వేసిన ప్రతి మొక్కకు ఎరువులు అందించే విధంగా ప్రభుత్వం యాప్ ను సరళీకరించి ప్రతి రైతుకు ఎరువులు అందించేట్లు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ఆలయ భూములు సాగు చేసే కౌలు రైతుల ఇతర సమస్యలు పరిష్కరించడానికి ప్రభుత్వం, అధికారులు ప్రయత్నించాలి.

వ్యాసకర్త : ఎ.పి. కౌలు రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యం. హరిబాబు






కామెంట్లు (0)