రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలకు రంగం సిద్ధమైంది. ఇప్పటికే షెడ్యూలు వెలువడిన నేపథ్యంలో రాజకీయ పార్టీల్లో ఎన్నికల సందడి మొదలైంది. ఈ ఎన్నికలు స్వేచ్ఛాయుతంగా, శాంతియుతంగా, పారదర్శకంగా జరిగేలా పటిష్టమైన ఏర్పాట్లు చేయాల్సిన బాధ్యత రాష్ట్ర ఎన్నికల సంఘంపై ఉంది. తాగునీరు, పారిశుధ్యం, రహదారులు, వీధి దీపాలు, వంటి సమస్యల నుంచి మౌలిక సదుపాయాల కల్పన వరకు స్థానిక సంస్థల పాత్ర కీలకం. ఎన్నికల నిర్వహణలో నిర్లక్ష్యం, హింసకు ఏమాత్రం అవకాశం ఉండకూడదు. అధికార యంత్రాంగం పక్షపాతంతో వ్యవహరిస్తోందనే అనుమానాలకు తావు లేకుండా చర్యలు తీసుకోవాలి. ఫిర్యాదులు అందినప్పుడు వాటిని రాజకీయ కోణంలో చూడకుండా, వాస్తవాలను పరిశీలించి నిష్పక్షపాతంగా పరిష్కరించాలి. గత స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి. నామినేషన్లు దాఖలు చేయకుండా అభ్యర్థులను అడ్డుకోవడం, నామినేషన్ పత్రాలను చించివేయడం, ప్రత్యర్థులపై దాడులు చేయడం, ఓటర్లను భయభ్రాంతులకు గురిచేయడం వంటి ఘటనలు ఎన్నికల స్వేచ్ఛను ప్రశ్నార్థకం చేశాయి. ఆయా సందర్భాలు, ఘటనల్లో ప్రధానంగా ఆ నాటి ప్రతిపక్షాలు టార్గెట్ అయ్యాయి. వారిలోనూ దళితులు, గిరిజనులు, బలహీన వర్గాల వారే ఎక్కువగా నష్టపోయారు. ఇప్పుడు కూడా రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో అధికార, ప్రధాన ప్రతిపక్ష పార్టీల మధ్య ఉప్పు- నిప్పు మాదిరి పరిస్థితి ఉంది. స్థానిక ఎన్నికల సందర్భంగా గ్రామీణ ప్రాంతాలతో పాటు, కొన్ని పట్టణాల్లోనూ ఈ పరిస్థితి మరింత తీవ్రం అయ్యే ప్రమాదం ఉంది. కొన్ని చోట్ల అభ్యర్థుల భద్రత అంశం తెరమీదకు వస్తోంది. అధికార బలాన్ని ఉపయోగించి ప్రత్యర్థులను పోటీ నుంచి తప్పించాలనే ధోరణి ప్రజాస్వామ్యానికి విరుద్ధం. ఎన్నికల్లో గెలుపు ప్రజల విశ్వాసంతో సాధించాలి తప్ప, భయంతోనో, బెదిరింపులతోనో, అధికారం అండతోనో కాదు. కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికే ప్రతిపక్ష పార్టీలకు చెందిన వారికి కుల దృవీకరణ పత్రాలు జారీ చేయడంలో ఉద్దేశపూర్వకంగా జాప్యం చేస్తున్నారంటూ వార్తలు వస్తున్నాయి. రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్వహించిన సమావేశంలో ప్రతిపక్ష రాజకీయ పార్టీలు ఈ తరహా ఫిర్యాదులు చేశాయి. ఇటువంటి సంఘటనలు చోటు చేసుకోకుండా ప్రత్యేక చర్యలు తీసుకోవాలి. నామినేషన్లు దాఖలు చేయకుండా అడ్డుకునే అవకాశం ఉందంటూ భయాందోళనలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో ఆన్లైన్ ద్వారా నామినేషన్లను స్వీకరించాలని ప్రతిపక్షాలుచేసిన విజ్ఞప్తిని పరిగణలోనికి తీసుకోకపోవడం సబబుకాదు.
నామినేషన్ల దాఖలు నుంచి ఓట్ల లెక్కింపు వరకు ప్రతి దశలోనూ పారదర్శకత పాటించాలి. అభ్యర్థులకు అవసరమైన కుల ధ్రువీకరణ, నో-డ్యూస్ సర్టిఫికెట్లను సకాలంలో జారీ చేయాలి. సమస్యాత్మక ప్రాంతాల్లో పటిష్టమైన పోలీసు బందోబస్తు, పోలింగ్ కేంద్రాల్లో సిసి టివి నిఘా ఏర్పాటు చేయాలి. మద్యం, డబ్బు పంపిణీ ద్వారా ఓటర్లను ప్రలోభపెట్టే చర్యలను అరికట్టాలి. దసరా, దీపావళి పండుగలను కూడా అధికార యంత్రాంగం దృష్టిలో ఉంచుకోవాలి. నిజానికి ఎన్నికల సన్నాహాలకు ముందే అఖిలపక్ష పార్టీలతో ఎన్నికల సంఘం సమావేశం కావడం, షెడ్యూల్తో పాటు వివిధ అంశాలపై వారి సలహాలు, సూచనలు తీసుకోవడం సాంప్రదాయంగా వస్తోంది. కారణాలు ఏవైనాకానీ, ఈ సారి రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఆ ముందస్తు సన్నాహాలను విస్మరించింది. దాదాపుగా షెడ్యూల్ ఖరారు చేసుకుని తూతూ మంత్రంగా సమావేశాన్ని నిర్వహించారు. స్థానిక ఎన్నికల షెడ్యూల్ విడుదలైనప్పటి నుండి కౌంటింగ్ ప్రక్రియ ముగిసిన కొద్ది రోజుల వరకు అనేక ప్రాంతంలో పరిస్థితి నివురుగప్పిన నిప్పులా ఉంటుంది. పరిస్థితి అదుపు తప్పడానికి ఏ చిన్న సంఘటనైనా చాలు! అందువల్ల మున్సిపాల్టీలు, ఎంపిటిసి, జడ్పిటిసి, గ్రామ పంచాయతీలు ఇలా గొలుసుకట్టు తరహాలో ఒకదాని తరువాత మరొకటి జరుగుతాయి. పోలింగ్ ఆయా దశల వారీగా నిర్వహించి, ఫలితాలను ఒకేసారి ప్రకటిస్తే ఉద్రిక్తతలకు అవకాశం తగ్గుతుంది. ఆయా దశల్లోనే ఎన్నికల ఫలితాలు వెల్లడిస్తే ఆ తరువాత పోలింగ్కు వెళ్లే వాటిపై ప్రభావం పడే అవకాశం కూడా ఉంటుంది. ఈ రీత్యా పోలింగ్ను దశలవారీగా నిర్వహించి, ఫలితాలన్నింటిని ఒకేసారి ప్రకటిస్తే బాగుండేది. కానీ షెడ్యూల్ ఆ విధంగా లేదు.
భారత రాజ్యాంగంలోని 73, 74వ సవరణలు గ్రామీణ, పట్టణ స్థానిక సంస్థలకు రాజ్యాంగబద్ధమైన గుర్తింపునిచ్చాయి. 243జి, 243డబ్ల్యూ అధికరణలు పంచాయతీలు, మున్సిపాలిటీలకు అధికారాలు, బాధ్యతలు అప్పగించేందుకు ప్రాతిపదిక కల్పించగా, 243కె, 243జెడ్ఏ అధికరణలు వరుసగా పంచాయతీ, పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణలో రాష్ట్ర ఎన్నికల సంఘం పాత్రను నిర్దేశిస్తున్నాయి. అందువల్ల స్థానిక సంస్థల ఎన్నికలను కేవలం రాజకీయ ఆధిపత్య పోరుగా చూడటం సరికాదు. పాలన వికేంద్రీకరణకు, గ్రామ స్వరాజ్యానికి ఇవి పునాదులు. ఆ స్ఫూర్తితోనే అధికార యంత్రాంగం నిష్పక్షపాతంగా వ్యవహరించాలి. అన్ని పార్టీలకు, పోటీలో ఉన్న అందరు అభ్యర్ధులకు సమాన అవకాశాలు కల్పించాలి. ప్రతి పౌరుడికి స్వేచ్ఛగా ఓటు వేసే హక్కు కల్పించినప్పుడే ప్రజాస్వామ్య స్ఫూర్తి నిలబడుతుంది. ప్రజలకు అత్యంత చేరువగా ఉండే పాలనా వ్యవస్థను నిర్మించే కీలకమైన ప్రకియ విజయవంతంగా సాగుతుంది.





కామెంట్లు (0)