గురువారం, 15 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionగోదావరి, కావేరి అనుసంధానం - కొన్ని అంశాలు

1 గంట క్రితం

godavari kaveri linking.jpg
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 15, 2026, 05:29 పూర్వాహ్నం | 4 నిమిషాల చదవడం

గోదావరి, కావేరి అనుసంధానం పలు మలుపులు తిరుగుతోంది. ప్రధాని మోడీ మనసెరిగిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇదివరకే ఈ అంశాన్ని తన తలకెత్తుకున్నారు. తాజాగా ఆంధ్ర ప్రదేశ్ పర్యటనకు వచ్చిన తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్‌ గోదావరి కావేరి అనుసంధానంలో పెద్దరికం తీసుకొని ఈ అనుసంధానం అమలుకు కృషి చేయాలని కోరారు. ఇందులో భిన్న కోణాలున్నాయి. కావేరి జల వివాదంతో సతమతమయ్యే తమిళనాడుకు గోదావరి జలాల ఆవశ్యకత వుంది. మరోవైపు గత ఏడెనిదేళ్లుగా తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో రాజకీయంగా లబ్ధి పొంది తిష్ట వేసేందుకు ప్రధాని మోడీ ఇన్నాళ్లూ తను వెనుక వుండి ఈ నదుల మంత్రాంగం నడిపేవారు. ప్రస్తుతం తెర మీదకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వచ్చారు.

అయితే రాజకీయ చాణుక్యం వేరు. సాంకేతిక సమస్యలతో కూడిన అంతర్ రాష్ట్ర సాగునీటి ప్రాజెక్టులు వేరు. ఇప్పటికే బనకచర్ల అనుసంధానం అంశంలో తప్పులో కాలేశారు. ఇప్పుడు గోదావరి, కావేరి అనుసంధానం తలకెత్తుకున్నారు. దీని ద్వారా ఆంధ్ర ప్రదేశ్ కు పెద్దగా లాభించేది లేదు. కాని గోదావరి, కావేరి అనుసంధానం పోలవరం నుండి మొదలు పెట్టేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆశిస్తున్నారు. వాస్తవంలో ఈ అనుసంధానం అమలుకు ఎన్నో వైతరణి నదులు దాటవలసి వుంది. పైగా ప్రస్తుతం పరిస్థితుల్లో తెలంగాణ నుండి అమలు చేయాలన్నా కీలకమైన నికర జలాలు ఛత్తీస్‌‌గఢ్‌ అంగీకరిస్తేనే అమలు జరుగుతుంది.

తెలంగాణ నుండి మొదలు పెట్టకపోతే ఈ అనుసంధానానికి తాము అంగీకరించేది లేదని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇది వరకే స్పష్టం చేశారు జాతీయ జల అభివృద్ధి సంస్థ కూడా సమ్మక్క సాగర్ వైపే మొగ్గుతోంది. తెలంగాణ లోని సమ్మక్క సాగర్ నుండి అమలు జరిగితే ఆంధ్ర ప్రదేశ్ కు దక్కేది నలభై యాభై టియంసిల లోపే.

దక్షిణాదిలో నదుల అనుసంధానానికి 1989లో శ్రీకారం చుట్టారు. జాతీయ జల అభివృద్ధి సంస్థ 1989లో గోదావరిలో శ్రీరామ్ సాగర్ నుండి ఇచ్చంపల్లి వరకు నీటి లభ్యతపై సర్వే చేసింది. 75 శాతం నీటి లభ్యత ఆధారంగా 2337 టియంసిలు వున్నట్లు ఇచ్చంపల్లి వద్ద మిగులు దాదాపు 711 టియంసిలు మిగులు వున్నట్లు ప్రకటించి దీని ఆధారంగానే తొమ్మిది అనుసంధానాల మహా నది కావేరి అనుసంధానం ప్రకటించింది. కాగా తర్వాత కాలంలో మరొక సర్వే జరిగింది. 1901-02 నుండి 2010-11 సంవత్సరాల మధ్య కాలంలో శ్రీరామ్‌ సాగర్ ఇచ్చంపల్లి మధ్య 75 శాతం కింద నీటి లభ్యత లెక్కిస్తే 2106 టియంసిలు వున్నట్లు తేలింది. 231 టియంసిలు గతంకన్నా తగ్గిపోయాయి. తదుపరి కూడా పలు సర్వేలు జరిగినా ఒక దానికి మరొక సర్వేకు సంబంధం లేని పరిస్థితి ఎదురైనది. ఈ నేపథ్యంలోనే తాజాగా గోదావరి యాజమాన్య బోర్డు గోదావరిలో ఎంత నీరు వుందో తేల్చాలని నిర్ణయించింది. వాస్తవంలో ప్రాణహిత, ఇంద్రావతి, శబరి నదుల్లో నీళ్లు వుంటేనే గోదావరిలో వరద వుంటుంది. ఆంధ్ర ప్రదేశ్ కు శబరి ఒక్కటే దిక్కు. ప్రాజెక్టుల నిర్మాణం సందర్భంలో గాని ట్రిబ్యునల్స్ నీటి వాటాలు కేటాయించే సమయంలో గాని 75 శాతం నీటి లభ్యత పరిగణన లోనికి తీసుకొంటారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు భావిస్తున్నట్లు వరద జలాలను పరిగణనలోకి తీసుకోరు. పైగా ఏ నదీలోయ నుండైనా మరొక నదీ లోయకు నీళ్లు తరలించాలంటే ఆ నదీ లోయ అవసరాలు పూర్తిగా తీరాలి. అంతేకాదు. ఆ నదీలోయ భాగస్వామ్య రాష్ట్రాల వాటాలు నిర్ణయింపబడి వుండాలి. ఇవన్నీ పూర్తైన తర్వాత మిగులు నీళ్లు వుంటే మరొక నదీ లోయకు తరలించాలనేది జాతీయ అంతర్జాతీయ న్యాయ సూత్రం.

గోదావరి, కావేరి అనుసంధానం విషయంలో ఇందులో ఏ ఒక్క అంశమూ పరిష్కరింపబడలేదు. బచావత్ ట్రిబ్యునల్ గోదావరిలో నీటి వాటాలు కృష్ణా నది లాగా ప్రాజెక్టుల వారీగా పంపకాలు చేయ లేదు. గంప గుత్తగా 1480 టియంసిలు కేటాయింపులు చేసింది. ఇందులో తమ వాటా 968 టియంసిలని, ఆంధ్ర ప్రదేశ్ వాటా 510 టియంసిలని తెలంగాణ చెబుతోంది. ఆంధ్ర ప్రదేశ్ మాత్రం తమ వాటా 776 టియంసిలంటోంది.

కొసమెరుపు ఏమంటే తెలంగాణ వాదననే కేంద్ర జల సంఘం ఇటీవల ఖరారు చేసింది. ఈ లోపు వాటాలు తేల్చేందుకు ట్రిబ్యునల్ వేయమని కేంద్ర ప్రభుత్వాన్ని ఆంధ్ర ప్రదేశ్ కోరుతోంది. ఇందుకు తెలంగాణ అడ్డుచెబుతోంది ఈ పంచాయతీ ఇంకా పూర్తికాలేదు. కేంద్ర ప్రభుత్వం మౌనంగా వుంది.

విచారకరమైన అంశమేమంటే ఆంధ్రప్రదేశ్ కు చెందిన నికర జలాలకు కూడా నిర్థారణ కాని పరిస్థితుల్లో దాన్ని వదిలి పెట్టి గోదావరి, కావేరి అనుసంధానం గురించి ముఖ్యమంత్రి ప్రధాని దగ్గర ప్రస్తావించడం ఒకింత ఆశ్చర్యమే. ముఖ్యమంత్రి అభిప్రాయ పడుతున్నట్లు గోదావరి వరద జలాలతోనే గోదావరి, కావేరి అనుసంధానం అమలు జరిగేట్టుగా వుంటే కేంద్ర ప్రభుత్వం ఎప్పుడో అమలు చేసేది. తను ప్రతిష్టాత్మకంగా చేపట్టిన బనకచర్ల అనుసంధానానికి డిపిఆర్ ఆమోదానికి నికర జలాలు లేవని చెప్పినట్లే గోదావరి, కావేరి అనుసంధానం చేపట్టేందుకు గోదావరిలో మిగులు నీళ్లు లేవని కేంద్ర జల సంఘం ఎప్పుడో నివేదిక ఇచ్చింది. అందుకే జాతీయ జల అభివృద్ధి సంస్థ గాని నదుల అనుసంధానం టాస్క్ ఫోర్స్ కమిటీ గాని ఛత్తీస్ గఢ్‌ వాడుకోని 147 టియంసిల గోదావరి నీటి కోసం ఇంత వరకు వెంపర్లాడారు. తమ వాటా నీళ్లు ఇచ్చేందుకు వ్యతిరేకిస్తున్న ఛత్తీస్ గఢ్‌ తాజాగా ఇంద్రావతి నదిపై 29 వేల కోట్ల రూపాయలు వ్యయంతో భోద్ ఘాట్ బహుళార్థ సాధక ప్రాజెక్టును చేపట్టింది. గోదావరి, కావేరి అనుసంధానానికి ఆ ఆశ పోయింది.

తాజాగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మహానది గోదావరి అనుసంధానం ప్రస్తావన తెచ్చారు. ఈ అనుసంధానం జరిగితే గోదావరి, కావేరి అనుసంధానం సులభంగా పరిష్కారమౌతుంది. కాని పట్నాయక్ ముఖ్యమంత్రిగా వుండే వరకు అంగీకరించలేదు. తమ ప్రాంతంలో ముంపు ఎక్కువగా వుంటుందని తిరస్కరించారు. పైగా ఒడిషా, ఛత్తీస్ గఢ్‌ రాష్ట్రాల మధ్య అంతర్ రాష్ట్ర జల వివాదం తీవ్రంగా వుంది. ఈ వివాదం ట్రిబ్యునల్ విచారణలో వుంది.

గోదావరి జలాల అంశంపై లెక్కనేనన్ని వివాదాలు, అంతర్ రాష్ట్ర సమస్యలు అంతకు మించి గోదావరిలో మిగులు జలాలు లేవని కేంద్ర జల సంఘం చెప్పడం మరో పక్క గోదావరిలో ఎన్ని నీళ్లు వున్నాయో తేల్చాలని యాజమాన్య బోర్డు నిర్ణయించిన నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కోరుతున్నట్లు గోదావరి, కావేరి అనుసంధానం ఎలా సాధ్యం?

v sankaraiah jpg.jpg

వ్యాసకర్త : విశ్రాంత పాత్రికేయుడు వి. శంకరయ్య


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్