పెద్ద మొత్తంలో అప్పుల పాలైన దేశాలు సంక్షేమ పథకాలకు కోత పెట్టాలని, రిజర్వు బ్యాంకులు కఠిన వైఖరులు తీసుకోవాలని అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐ.ఎం.ఎఫ్) అధిపతి క్రిస్టాలినా జార్జియేవా కోరారు. థాయ్లాండ్ రాజధాని బాంకాక్లో అక్టోబరు 12-18 తేదీలలో జరుగుతున్న ప్రపంచ బ్యాంక్-ఐ.ఎం.ఎఫ్ వార్షిక సమావేశాల సందర్భంగా గత బుధవారం నాడు సింగపూర్లో ఆమె మీడియాతో మాట్లాడారు. ఇరాన్పై అమెరికా దాడితో ఇంథన షాక్ ఎలా తగిలిందో అదే మాదిరి పొదుపు చర్యలు ఉండాలన్న సంకేతాన్ని ఆమె ఇచ్చారంటే అతిశయోక్తి కాదు. వేగంగా అభివృద్ధి చెందాలంటే ప్రభుత్వాలు అప్పులను అదుపులో ఉంచుకోవాలని ''ఖర్చు క్రమశిక్షణ'' పాటించాలని క్రిస్టాలినా చెప్పారు. ద్రవ్య సమస్యలను పరిష్కరించేందుకు కేవలం అధిక వృద్ధిరేటు మీదనే ఇంకేమాత్రం ఆధారపడటం తగదని ఆమె హెచ్చరించారు.
పొదుపు పేరుతో సంక్షేమ చర్యలకు కోత పెట్టాలంటున్న ఐ.ఎం.ఎఫ్ నిరంతరం అదే చేస్తున్నది. ఆక్స్ఫామ్ సంస్థ 2019-25 సంవత్సరాల మధ్య 54 దేశాలలో ఐ.ఎం.ఎఫ్ కార్యక్రమాలను సమీక్షించింది. వాటిలో 25 దేశాల్లో సంక్షేమ చర్యలకు చేసే ఖర్చును జిడిపి లో రెండు శాతానికి పైగా కోత పెట్టాలని ఐ.ఎం.ఎఫ్ ఆదేశించింది. అంతకు ముందు 2012-17 సంవత్సరాల్లో కేవలం మూడో వంతు దేశాల్లో మాత్రమే ఇలాంటి కోతలు అమలు జరిగాయి. దీన్ని మరింత సులభంగా చెప్పుకోవాలంటే పొదుపు కోతలు జిడిపిలో 0.21 నుంచి 0.85 శాతానికి ఈ కాలంలో పెరిగాయి. గతంలో అనేక దేశాల్లో ఒకేసారి భారీ కోతలు విధించాలన్న షరతులు పెట్టటంతో ప్రజల నుంచి ప్రతిఘటన ఎదురైంది. దాంతో ఒక్కసారే విష గుళికలను మింగించటానికి బదులు మెల్లగా పనిచేసే విషం మాదిరి కొన్ని సంవత్సరాల్లో అమలు జరిపే పద్ధతులను అనుసరిస్తున్నారు. జనం కోతలకు అలవాటు పడిపోతారు. అయితే ఇప్పుడు తిరిగి పాత పద్ధతులకే పోవాలని ఐ.ఎం.ఎఫ్ చెబుతున్నది. దాని 2026 నివేదిక సారమిదే. ఇప్పటికే హానికరమైన విషాన్ని చిన్న చిన్న మోతాదుల్లో మింగిస్తున్నది, దానికి బదులు మొత్తం సీసాను ఒకేసారి తాగించాలని చూస్తున్నదని ఆక్స్ఫామ్ విధాన సీనియర్ సలహాదారు నబిల్ అబ్డో వ్యాఖ్యానించారు. పైన ప్రస్తావించుకున్న సంవత్సరాల మధ్య ఐ.ఎం.ఎఫ్ చెప్పిన మధ్యగత సామాజిక ఖర్చు 25 నుంచి 11 శాతానికి పడిపోయింది.
మెకెన్సీ తాజా నివేదిక ప్రకారం ప్రపంచ సంపద 2024లో 1.7 నుంచి 1.8 క్వాడ్రిలియన్ (వెయ్యి లక్షల కోట్లు) డాలర్లకు పెరిగింది. గృహస్తుల సంపద 570 లక్షల కోట్ల డాలర్లకు చేరి రికార్డు నెలకొల్పగా దీనిలో అత్యధికం కార్పొరేట్ కంపెనీల్లో తెగబలిసిన ధనికుల వాటాల రూపంలో ఉంది. మరోవైపు జెన్ జి యువతరం ప్రపంచవ్యాపితంగా విద్య, వైద్యం వంటి సేవా రంగాల్లో మరింతగా పెట్టుబడులు పెట్టాలని ఉద్యమిస్తోంది. తాజాగా ఫ్రాన్సులో విద్యార్థుల ఆందోళన అదే. ధనికుల మీద మరింతగా పన్నులు విధించాలన్న డిమాండ్ సైతం గతం కంటే ఎక్కువగా ముందుకు వస్తోంది. ఐ.ఎం.ఎఫ్ ఎన్నడూ ఇలాంటి సలహాలు లేదా షరతులను దేశాల మీద రుద్దలేదు. ఎందుకంటే అది ధనికుల ప్రయోజనాలను కాపాడేందుకు ఏర్పాటు చేసిన సంస్థలలో ఒకటి. ఆ సంస్థ చరిత్ర మొత్తం సామాజిక సంక్షేమానికి ఎలా కోతలు పెట్టాలి, జనం మీద భారాలు ఎలా మోపాలి అన్నదాని మీదే కేంద్రీకరణ. తాజాగా ఈనెల ఏడున పాకిస్తాన్కు మరో 121 కోట్ల డాలర్ల రుణం ఇచ్చేందుకు ఆ సంస్థ అంగీకరించింది. దానికిగాను అది పెట్టిన షరతులేమంటే చమురు సబ్సిడీలను ఎత్తివేయాలి, విద్యుత్ సంస్కరణలు చేపట్టాలి, ఎక్కువ మంది జనాలను పన్నుల పరిధిలోకి తేవాలి. గతంలో తీసుకున్న రుణాల షరతులకు వ్యతిరేకంగా అక్కడి జనం ఆందోళన చేశారు. ఇప్పుడు మరికొన్ని కోతల మీద ఎలా స్పందిస్తారో చూడాల్సి ఉంది.
అంతర్జాతీయ మానవ హక్కుల సంస్థ గతంలో విడుదల చేసిన ఒక నివేదిక ప్రకారం ఐ.ఎం.ఎఫ్ నిబంధనలు కనీసం ఒక మానవ హక్కును హరించే విధంగా ఉన్నాయని పేర్కొన్నది. అది రూపొందించిన 39 కార్యక్రమాల్లో 32ను సమీక్షించింది. ఇరవై రెండు కార్యక్రమాల్లో ప్రభుత్వ సిబ్బంది వేతన బిల్లు తగ్గింపు జరిగింది. కొత్త నియామకాల నిలిపివేత, వేతనాలపై పరిమితులు లేదా తగ్గింపు వంటి వాటిని 2007 లోనే ఐ.ఎం.ఎఫ్ షరతులుగా ముందుకు తెచ్చింది. రెండు తెలుగు రాష్ట్రాలలో ఖాళీలు నింపకపోవటం, కాంట్రాక్టు ఉద్యోగుల నియామకం, వారికి ఇవ్వాల్సిన వేతనాలను నిరాకరించటం తెలిసిందే. అయితే కొన్ని ప్రత్యేక సడలింపులు కూడా ఇచ్చింది. ఉద్యమాలకు దిగిన జనాల వీపులు పగలగొట్టేందుకు అవసరమైన పోలీసు లు, ఇతర సిబ్బంది నియామకాలు మాత్రం ఆగవు. ఇరవై మూడు కార్యక్రమాలను చూస్తే పైకి కనిపించని వాట్ పన్నుల రూపంలో రాబడి పెంచుకోవాలని చెప్పింది. వీటిని ముక్కు పిండి వసూలు చేయటంలో పేద, ధనిక తేడాలు ఉండవు. వినియోగంపై ఆధార పడిన సబ్సిడీలు అంటే నరేంద్ర మోడీ అధికారానికి వచ్చిన తరువాత పెట్రోలు, డీజిలు, గ్యాస్ సబ్సిడీలను రద్దు చేసి చమురుపై లక్షల కోట్ల రూపాయలను సెస్ల పేరుతో వసూలు చేస్తున్న మాదిరి ఇరవై కార్యక్రమాల్లో అలాంటి షరతులు విధించింది. బ్రెట్టన్ ఉడ్ కవలల ఆదేశాలు లేదా మార్గదర్శకాల మేరకు వాటిని రద్దు చేసినట్లు మోడీ ఎప్పుడైనా జనానికి చెప్పారా? ఇలాంటి భారాలన్నీ మానవ హక్కులకు భంగం కలిగించేవే అని మానవ హక్కుల సంస్థ చెప్పింది.
ప్రపంచ బ్యాంక్, ఐ.ఎం.ఎఫ్ కూడా తియ్యటి కబుర్లు చెబుతూ ఆకర్షణీయమైన ఇతివృత్తాలతో సమావేశాలు జరుపుతుంటాయి. కానీ అందుకు విరుద్ధమైన షరతులను రుద్దుతాయి. ఉదాహరణకు 2025లో ''ఉపాధి-ఐశ్వర్యం కోసం బాట'' ఇతివృత్తంతో ఒక సమావేశం జరిపింది. రాజకీయ అస్థిరత, అసమానతల పెరుగుదల, జీవన ఖర్చుల పెరుగుదల అన్ని చోట్లా కనిపిస్తోంది. కరోనా సమయంలో ఈ సంస్థల వైఖరి మారిందని అనేక మంది అనుకున్నారు, కానీ ఇప్పుడు అలాంటిదేమీ లేదని తేలిపోయింది. మన దేశంలో లేబర్ కోడ్ల పేరుతో పెద్ద దాడికి రంగం సిద్ధమైంది. తాజాగా పూర్వపు సోషలిస్టు దేశమైన హంగరీకి ఐఎంఎఫ్ చికిత్స ప్రారంభమైంది. ఉద్యోగ విరమణ వయస్సును పెంచాలని చెప్పింది (రెండు తెలుగు రాష్ట్రాలలో అమలు చేసిన సంగతి తెలిసిందే). సబ్సిడీలను తగ్గించాలని చెప్పింది (ముందే చెప్పుకున్నట్లు మోడీ సర్కార్ అమలు చేసింది). పన్నుల పెంపుదల, క్రమంగా గృహ నిర్మాణ రుణాల నిలిపివేత, వేతన స్థంభనకు ఆదేశాలు ఇచ్చింది.
ప్రపంచబ్యాంకు ఆదేశాలను ఉమ్మడి రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు తన విధానాలుగా చెప్పుకొని విద్యుత్ సంస్కరణలకు తెర లేపిన సంగతి తెలిసిందే. కేంద్రంలో మన్మోహన్ సింగ్ ఉన్నా నరేంద్ర మోడీ ఉన్నా చేసింది, చేస్తున్నదీ అదే. పొదుపు చర్యలకు బదులు 2014 నుంచి ఆర్థిక సమగ్రత (ఫిస్కల్ కన్సాలిడేషన్) అనే ముద్దు పేరు పెట్టారు. కోట్లాది మంది రైతులకు ఇస్తున్న సబ్సిడీల విషయాన్ని చూస్తే అర్ధం అవుతుంది. ఈ మొత్తాలను ఎలా తగ్గించాలనేదానిపై ప్రధాన కేంద్రీకరణ ఉంది. ఉదాహరణకు ఎరువులకు 2006-07లో రూ.25,952 కోట్లు సబ్సిడీ ఇచ్చారు. అది 2008-09 నాటికి రూ.75,849 కోట్లకు చేరింది. నరేంద్ర మోడీ అధికారానికి వచ్చే నాటికి రూ.67,339 కోట్లు. తరువాత 2018-19కి రూ.70,605 కోట్లు. యుపిఏ-ఎన్డిఏ పాలనా కాలంలో 70 వేల కోట్లకు అటూఇటూగానే ఉంది తప్ప పెరిగిన ధరలు, వ్యవసాయ ఖర్చులకు అనుగుణంగా సబ్సిడీని పెంచలేదు. ఎరువుల సబ్సిడీ కోత చర్యల్లో భాగంగా యూరియా మినహా ఇతర ఎరువులకు చెల్లించే సబ్సిడీని న్యూట్రియంట్ (పోషకాల) ప్రాతిపదికన ఒక కిలోకి ఇంత అంటూ నిర్ణీత మొత్తానికి పరిమితం చేస్తూ 2010 నుంచి ఎరువుల ధరలపై నియంత్రణను ఎత్తివేశారు. జనానికి అర్ధంకాని పద్ధతుల్లో అనేక విధాలుగా సబ్సిడీలకు కోతపెట్టి భారాలు పెంచారు. మోడీ అధికారానికి వచ్చినపుడు బడ్జెట్లో 15.5 శాతం మొత్తం సబ్సిడీలకు కేటాయిస్తే తాజా బడ్జెట్లో అది తొమ్మిది శాతానికి కోత పెట్టారు. ఎప్పుడైనా తగ్గించినట్లుగానీ, కారణం ఏమిటో ఎవరైనా చెప్పారా? ఇదంతా ప్రపంచ బ్యాంకు, ఐ.ఎం.ఎఫ్ షరతుల పుణ్యమే అని మన జనాలకు తెలుసా!

ఎం. కోటేశ్వరరావు





కామెంట్లు (0)